Advertisement

Advertisement


Home > Articles - Chanakya

బాబును వీడని నీడ కేసిఆర్

బాబును వీడని నీడ కేసిఆర్

పుష్కరకాలం క్రితం మంత్రి పదవితో పోయే దానికి చంద్రబాబు విభజన వరకు తెచ్చి, కెసిఆర్ ను ముఖ్యమంత్రి అయ్యేలా చేసారు. ఉద్యమం సాగినన్నాళ్లు, మధ్యలో పొత్తు పెట్టుకున్న కాసిన్ని రోజులు మినహా, తక్కిన కాలం అంతా కెసిఆర్ కు చంద్రబాబుకు మధ్య వైరం సాగుతూనే వుంది. పోనీ ఇప్పుడు రెండు రాష్ట్రాలైపోయాయి. చెరో చోట, చెరొకరికి అధికారం అందేసింది.. ఇక సమస్య లేదు అనుకోవడానికి లేదు. బాబును కెసిఆర్ నీడ ఇంకా వెన్నాడేలాగే కనిపిస్తోంది. 

ఎన్నికలు, ప్రజల అభిమానం వంటి విషయాల్లో కెసిఆర్ పూర్తిగా వైఎస్ మాదిరిగా సంక్షేమ బాటలోనే వెళ్లాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ చెంద్రబాబుకు ఇది ఒక్కటే అంటే సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ ఆంద్రప్రదేశ్ పునర్నిర్మాణం జరగాల్సి వుంది. ఇలాంటి సమయంలో తగులు బడ్జెట్ తో సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి అంటే కాస్త కష్టమే. అందునా రైతు, డ్వాక్రా రుణమాఫీ లాంటి పెద్ద వ్యవహారాలు వుండనే వున్నాయి. కానీ ఇక్కడ మరో సమస్య వచ్చి పడేలా వుంది. 

కెసిఆర్ అప్పుడే ఉద్యోగులకు తెలంగాణ ఆవిర్భావ ఇంక్రిమెంట్ ప్రకటించేసారు. ఇంక్రిమెంట్ అంటే చిన్న విషయం కాదు. ఏడాది పనిచేస్తే వచ్చేది. పైగా దాంతో పాటు డిఎ, హెచ్ ఆర్ ఎ తదితర అలవెన్సులు కూడా పెరుగుతాయి. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వంతో సమానంగా వేతనాలు వుండేలా చూస్తామన్నారు. త్వరలో వేజ్ బోర్డు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు ఇంటీరియమ్ రిలీఫ్ వుంది. నివేదిక అందగానే అమలు చేయాల్సి వుందిు అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సమానంగా వుండేలా సెటిల్ చేసినా చేయచ్చు. 

అప్పుడు కచ్చితంగా బాబుపై సీమాంధ్ర ఉద్యోగుల వత్తిడి పెరుగుతుంది. ఈ ఎన్నికల్లో తొలిసారి బాబుకు ఎన్జీవోలు మద్దతు ఇచ్చారు. ఈ అయిదేళ్లలో బాబు ఏ మాత్రం ఉద్యోగుల సంక్షేమం పట్ల వెనుకంజ వేసినా, వచ్చే ఎన్నికలకు ఆ మద్దతు మరొకరికి పోతుంది. పక్క రాష్ట్రంలో తమ సహచర ఉద్యోగులకు వరాలు వచ్చి, తమకు ఇక్కడ రాకుంటే సహజంగానే అసంతృప్తి వుంటుంది. అంతే కాదు లక్ష లోపు  రుణమాఫీ, ఫించన్లపై కూడా కేసిఆర్ అప్పుడే స్పష్టమైన వైఖరి ప్రకటించారు. ఇప్పుడు బాబు కూడా ఆ తోవన వెళ్లాల్సిందే. లేదంటే జనం పోల్చి చూసుకుంటారు. ఇలా బాబు ను ఇప్పట్లో కేసిఆర్ నీడ వీడేలా కనిపించడం లేదు. 

ఇదిలా వుంటే ఇప్పటికే బాబు అనుకూల మీడియా తన సీమాంధ్ర ఎడిషన్లలో రాష్ట్ర్రం కష్టాలు ఏకరవు పెట్టడం ప్రారంభించాయి,. కరెంటు సమస్య భయంకరంగా వుందని, డబ్బులు లేవని, ఇలా కథనాలు వండి వారుస్తున్నాయి. అంటే ఇవేవీ తెలియకుండానే బాబు తొమ్మిది గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తామని వాగ్దానం ఇచ్చేసారా? రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఫింఛన్లు వంటి భారీ హామీలు ఇచ్చారనుకోవాలా? లేక బాబు మాట తప్పితే ఆ తప్పు, ఆయనది కాదు అని చెప్పడానికి ఆయన అనుకూల మీడియా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోందనుకోవాలా?

చాణక్య

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?