Advertisement

Advertisement


Home > Articles - Chanakya

ఈ కాలీఫ్లవర్ నాయుళ్ల తోటలోది

ఈ కాలీఫ్లవర్ నాయుళ్ల తోటలోది

నేల సారవంతమై, మాంచి విత్తనం పడితే, పూలు విరబూస్తాయి. చెవులు పట్టనంతగా. ఇప్పుడు నాయళ్ల తోటలో ఇలాంటి పూలే విరబూసాయి. నిజానికి ఈ నాయుళ్లు మన నాయకులు. ఈ ముచ్చట వారే చెప్పారు. నాయుడు అంటే నాయకుడు అని అర్థమని. సరే ఆ అర్థం పరమార్థం సంగతి అలా వుంచితే, వీరు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పదవుల్లో కుదురుకున్నది మొదలు అయిదేళ్ల తరువాత ఆలోచించి, పదేళ్ల నాటికి పూర్తిచేసినా ఫరవాలేని రాజధానిపై దృష్టి పెట్టారు. నడిబొడ్డునే రాజధాని అంటూ ఊదర కొట్టారు. బస్ చక్కర్ల మాదిరిగా, విజయవాడ..విజయవాడ...గుంటూరు..గుంటూరు అంటూ పదే పదే కలవరించారు. యథా రాజా తధా మంత్రీ అని, మిగిలిన నాయకులు కూడా అదే రీతిగా కలవరించారు. మిగిలిన పనులన్నీ మానేసుకుని మరీ రాజధానిపైనే దృష్టి పెట్టారు. 

పదేళ్ల వరకు ఉమ్మడిగా హైదరాబాద్ ను వాడుకునే అవకాశం వుందన్న సంగతే విస్మరించారు. కేంద్రాన్ని కూడా కాస్త ప్రభావితం చేసే ప్రయత్నం ప్రారంభించారు. తాత్కాలిక రాజధాని అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ముఖ్యమైన కార్యదర్శుల ఆఫీసులు తరలిస్తామని ప్రకటించేసారు. మరోపక్క గుంటూరు, విజయవాడల నడుమ ఎంత భూమి వుందో దానిని ఏవిధంగా తీసుకోవచ్చో, రైతులకు కూడా బిల్డర్ల మాదిరిగా వాటాలు లెక్కలు కూడా కట్టేసారు. ఇంకోపక్క వివిధ సంస్థలు ఇదంతా చూసి, రాజధాని అంటే విజయవాడే అని ఫిక్సయిపోయి తమ తమ సంస్థలను అక్కడకు తరలించడం ప్రారంభించాయి. వీటిలో దూరదర్శన్ కూడా వుంది. ఎవరు చెప్పారని? ఎవరు అడిగారని. ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఇలాంటి సమయంలో  రాజధానిపై నియమించిన కమిటీ నివేదిక వచ్చింది. దక్షిణ కోస్తాలో చిన్న పిల్లలు కూడా చెప్పే సంగతి, తెలిసినా, ఇద్దరు నాయుళ్లు కమ్ నాయకులు ఉద్దేశపూర్వకంగా విస్మరించిన సంగతినే ఆ కమిటీ కూడా తేల్చి చెప్పింది. 

ఇంతటి సశ్యశ్యామలపైన పంట భూములను నాశనం చేయడం మంచిది కాదంది. దోనకొండ ప్రాంతంలో వేలాది ఎకరాలున్నాయి చూసుకోండి అంది. దీంతో రాష్ట్రాన్నేలే నాయుడుగారికి ఏమీ పాలుపోలేదు. ఆ సంగతి గమనించి మీడియా జనాలు ఊరుకోవచ్చు కదా..అబ్బే తెగ కెలికారు. దాంతో అనృతమే ఆడడమెరుగని వాడు...అన్న రీతిలో అసలు బెజవాడ-గుంటూరు రాజధాని అని ఎవరు అన్నారు..మీరే అనేసుకుని, మీరే రాసేసుకుంటే నేనేం చేస్తాను అని ముక్తాయించారు. తెల్లపోవడం మీడియా జనాల వంతయింది. ఇంకా నయం..అన్నీ మీరే చేసారు.. ఆఫీసులు కూడా మీరే తరిలించేసారు..అని కేసు పెట్టేయలేదు. చెవుల్లో పూలు పెట్టడంతో సరిపెట్టారు. అయినా నాయుళ్ల తోటలో పూసిన పూలు కదా..బాగా పెద్దవే వుంటాయి..చెవులకు నిండుగా.

చాణక్య

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?