Advertisement

Advertisement


Home > Articles - Chanakya

ఇప్పుడూ అదే మొండితనమా?

ఇప్పుడూ అదే మొండితనమా?

కెసిఆర్..అంటేనే మొండితనానికి మారు పేరు. ఆ మొండితనమే తెలంగాణ ఉద్యమాన్ని చివరంటా ముందుకు నడిపించింది. ఆ మొండితనమే మిగిలిన పార్టీలకు చెమటలు పట్టించింది. కానీ ఇప్పుడు ఆ మొండితనమే టీఆర్ఎస్ పాలిట శాపంగా మారేలా కనిపిస్తోంది.

ముఖ్యమంత్రిగా కెసిఆర్ పాలన ప్రారంభించారు. ఆరంభంలో బాగానే కనిపించింది. కానీ రాను రాను కొన్ని సంస్కరణలు తీసుకువచ్చే ప్రయత్నం ప్రారంభించారు.  తాను ఇచ్చిన హామీలను పట్టీ పట్టనట్లు ఊరుకుంటున్నారు. అదే సమయంలో కరెంటు సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక సతమతమవుతున్నారు. ఇవన్నీ టీఆర్ఎస్ ను ఇప్పుడు ముప్పేట దాడికి గురిచేస్తున్నాయి. కెసిఆర్ పై ప్రతిపక్షాలు ఒంటి కాలిపై లేస్తున్నాయి. బస్సు యాత్రలు చేసాయి. ప్రజలను పలకరించాయి. రాను రాను జనం కూడా కెసిఆర్ పాలన పట్ల కాస్త ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. 

అయినా కూడా....కెసిఆర్ తనదైన మొండి వైఖరితోనే వున్నారు. ఏవీ పట్టనట్లు ముందుకు పోతున్నారు. సమస్యలు సద్దుమణిగేలా కనీసం మాట్లాడడానికి కూడా ఆయన పెద్దగా ఉత్సాహం చూపించడం లేదు.

అధికారంలో వున్నాక అనేక తలకాయనొప్పులు వుంటాయి. ప్రజలు సమస్యలు రాత్రికి రాత్రి పరిష్కారం కావాలనుకుంటారు. కానీ అన్నీ అలా సాధ్యం కాకపోవచ్చు. నిపుణులంతా ముందే హెచ్చరించారు..తెలంగాణ విడిపోతే కరెంటు సమస్యలు చుట్టుముడతాయని. అప్పట్లో కేసిఆర్ ...దాందేముంది,.చత్తీస్ ఘడ్ నుంచి కొనుక్కుంటాం..' అన్నారు.. కానీ ఇలా కొనాలంటే ఎలా? దాని ట్రాన్స్ మిషన్ ఎలా అనేవి ఆలోచించలేదు. ఇప్పుడు వంట మొదలెట్టాక,  సరుకులు ఎక్కడ దొరుకుతాయని వెదికిన చందంగా వుంది వ్యవహారం. హైదరాబాద్ లో కూడా నాలుగు నుంచి ఆరుగంటలు పవర్ కట్. 

విశాఖలో తుపాను వస్తే, ఐటి అనుకూలం కాదు అంటూ కథనాలు ప్రసారం చేసిన కెసిఆర్ స్వంత మీడియా ఇప్పుడు హైదరాబాద్ దేనికి అనుకూలమో ఎందుకు కథనాలు ప్రసారం చేయదు?

సరే ఈ సంగతి అలా వుంచితే, బాబుతో సమానంగా రుణమాఫీ ని తలకెత్తుకున్నారు. అది ఎంత కష్టమో బాబు మాదిరిగానే ఆయనకూ తెలుసు. ఓట్ల కోసం తప్పలేదు. కానీ అప్పటి నుంచి బాబు అక్కడ ఏదో ఒక కప్పదాటు వేసుకుంటూ,. గ్లోబెల్ ప్రచారాన్ని నమ్ముకుని కాలక్షేపం చేస్తున్నారు. ఆఖరికి ఓ కార్పొరేషన్ పెట్టి, అయిదువేల కోట్లతో పని కానిచ్చారు. బాండ్లు ఇస్తాం దాచుకొమంటున్నారు. ఇక్కడ కెసిఆర్ కానీ, ఆయన మంత్రులు కానీ ఇలా నమ్మబలికే పనీ చేయడం లేదు. బాబు బాటలో వెళ్లడమూలేదు. దీంతో రైతుల ఆత్మహత్యలు మళ్లీ ప్రారంభమయ్యాయి. 

మరోపక్క పింఛన్లు. ఇదో తేనెతుట్ట. రేషన్ కార్డుల మాదిరిగానే తోడుతూ కెసిఆర్ దీన్ని సంస్కరిద్దామని చూసారు. బాబు చాలా సులవుగా చకచకా కానిచ్చేసారు. తెలుగుదేశం శ్రేణులతో జాబితాలు తయారుచేయించి, కట్ చేసేవాళ్లకి కట్ చేసి, ఇచ్చేవాళ్లకి ఇచ్చారు. బాబు అదృష్టమేమిటంటే, ఆయనకు వ్యతిరేకంగా ఏ గొంతు లేచినా కూడా మీడియా పట్టించుకోదు. తొంభై శాతం మీడియా ఆయన కు గొడుగు పడుతూ వుంటుంది. సాక్షిలాంటి దాన్ని మిగిలిన వారు పట్టించుకోరు. కానీ ఇక్కడ కెసిఆర్ కు స్వంత మీడియా వున్నా, ఆంధ్ర మీడియాతో సున్నం పెట్టుకున్నారు. దాంతో వాళ్లు కెసిఆర్ వ్యతిరేకతను భూతద్దంలో చూపిద్దామనే చూస్తున్నారు. 

అయినా ఇన్ని సమస్యలున్నా, కేసిఆర్ సర్దుబాటు చేద్దామనో, చేస్తున్నట్లో కనీసం నటించరు. అస్సలు పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. ఎవరు ఎమనుకుంటేంనేం. తను తన కొడుకు, తన కూతురు. తమ వ్యవహారాలు అనే దోవనే పోతున్నారు. పెరుగుతున్న ప్రజల అసహనాన్ని గమనించడం లేదు. ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేస్తే తనను ఎదిరించేవారు వుండరనుకుంటున్నారు. కానీ అయిదేళ్ల తరువాత ప్రజల నాడి పసిగట్టి మళ్లీ పార్టీలన్నీ మొలకలేస్తాయని ఆయన మరిచిపోతున్నారు. అప్పుడు ఈ మొండితనం అస్సలు వర్కవుట్ అవ్వదు. బంగరు పళ్లెంలో పెట్టి అధికారాన్ని తానే చేజేతులా అప్పగించడం తప్ప.

ఆయన ప్రతిపక్ష పార్టీలను చంపేస్తున్నాను అనుకుంటున్నారు. కానీ మొండితనంతో, పట్టించుకోని వైఖరితో తన పార్టీ పట్ల జనం భావనను తానే వ్యతిరేకం చేసుకుంటున్నానని గమనించడం లేదు. కెసిఆర్ కే పట్టనపుడు, మంత్రులకు ఏం పడుతుంది. అందుకే వారు అస్సలు పెదవి విప్పడం లేదు. విప్పినా తెలుగుదేశం నేతలను తిట్టడానికే తప్ప. మరి అలాంటపుడు ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ఎవరు చల్లార్చే ప్రయత్నం చేస్తారు. అసలే తెలంగాణలో రాజకీయ చైతన్యం ఎక్కువ అన్న సంగతిని కూడా మరిచిపోతున్నారు. ఇలా అయితే అయిదేళ్ల తరువాత మరోసారి ప్రాంతీయ బేధాలు లేవనెత్తినా ఉద్యమం రోజులు కాదు జనం నమ్మడానికి. సమస్యల కాలం. పక్క రాష్ట్రాన్ని చూసి తమకు ఎవరు కావాలో డిసైడ్ చేసుకుంటారు. 

'చిత్ర'గుప్త

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?