Advertisement

Advertisement


Home > Articles - Chanakya

‘పవర్’ హానీమూన్ సాగేనా?

‘పవర్’ హానీమూన్ సాగేనా?

మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన సంస్థ రాజకీయ పార్టీగా మారింది.  ఆ మేరకు అధికారిక గుర్తింపు వచ్చేసింది. ఇన్నాళ్ల వ్యవహారం వేరు. ఇకపై వేరు. ఇన్నాళ్లు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టకపోయినా, కార్యవర్గం అంటూ లేకపోయినా, నడిచిపోయింది. ప్రజా సమస్యలపై స్పందించినా, స్పందించకున్నా గడిచిపోయింది. కానీ ఇప్పుడు ఇక పార్టీ నిర్మాణం. కార్యకర్తల సభ్యత్వాలు.. ప్రజాసమస్యలపై పోరాటాలు.. వెరసి 2019 ఎన్నికల దిశగా పయనం ఇవన్నీ అవశ్యం. వీలయితే అంతకు ముందే విశాఖ, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి దిగడం.

జనసేన సమావేశాల్లో పవన్ కళ్యాణ్ స్వచ్ఛమైన వారికే తన పార్టీలోచోటు వుంటుందని చెప్పారు. అలాంటివారి కోసం వెదుకుతామన్నారు. అందువల్ల ఇఫ్పుడు ఆయన స్వచ్ఛమైన రాజకీయ నాయకుల కోసం వేటాడాలి. పైగా పవన్ పార్టీకి వున్న సమస్య వైవిధ్యం. ఆయన ఆ స్పష్టమైన వైవిధ్యం కనబర్చకుంటే, జనసేన కూడా సవాలక్ష రాజకీయపార్టీల్లో ఒకటిగా మిగిలిపోతుంది.  మిగిలిన రాజకీయ పార్టీ వ్యవహారాలకు, నాయకులకు, జనసేనకు తేడా స్పష్టంగా చూపించాల్సి వుంది. పైగా నలుగుర్లోకి వస్తే ఏమైనా అంటాం అనే వ్యవస్థ మనది. దానికి సిద్ధం కావాల్సి వుంటుంది.

స్థానిక ఎన్నికలే తొలి టార్గెట్

జన సేన స్థానిక ఎన్నికల్లో దిగాలనుకుంటోంది. రాష్ర్ట ఎన్నికల సంఘాన్ని ఈ మేరకు అనుమతి కోరింది. అందువల్ల ఇక స్థానిక పోరులో జనసేన కూడా వుంటుందన్నది స్పష్టమైంది. అయితే స్థానిక పోరు ఏమీ అంత సులువుగా లేదు. ముఖ్యంగా హైదరాబాద్. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు భాజపా కత్తులు నూరుతోంది. దానికి అక్కడ పట్టు వుంది. విజయావకాశాలు కూడా ఈ సారి బాగానే వుండే అవకాశం వుంది. ఎందుకంటే మోడీని అభిమానించే రాజస్థాన్, గుజరాతీలు హైదరాబాద్‌లో కాస్త ఎక్కువ సంఖ్యలో వున్నారు.  

అలా అని తెలుగుదేశాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. సెటిలర్లు అనుబడే సీమాంధ్రుల ఓటు బ్యాంకు దానికి రక్షణ కవచం. ఇక కాంగ్రెస్ నిన్న మొన్నటి దాకా మజ్లిస్ తో కలిసి అధికారం పంచుకుంది. పాత బస్తీ మజ్లిస్ అడ్డా. ఇక అధికార తెరాస సంగతి చెప్పనక్కరలేదు. ఓట్ల పరంగా ట్విన్ సిటీస్ లో కాస్త బలహీనమే కానీ, అధికారం అండగా తన వ్యూహాలు తాను పన్నుతుంది.

అదే విధంగా విశాఖలో తెలుగుదేశం పార్టీ మాంచి ఊపు మీద వుంది. హుదూద్ గాలి వానకు ఆ పార్టీ బూర్లెగంపలో పడింది. అయినా అక్కడ వైకాపాను తక్కువ అంచనా వేయడానికి లేదు.

ఇలారెండు కార్పొరేషన్లలో వ్యవహారం వున్నపుడు జనసేన ఒంటరి పోరుకు దిగుతుందా అన్నది పెద్ద ప్రశ్న. విశాఖలో ఒంటరిపోరుకు దిగడానికి సాహసించవచ్చు. కానీ హైదరాబాద్‌తో ఆ పరిస్థితి వుంటుందా? పైగా ఒంటరిపోరుకు దిగితే గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే తదనంతర సమస్యలు చాలా వుంటాయి. ఇటు రాష్ర్టంలో తెలుగుదేశానికి, అటు కేంద్రంలో భాజపాకు పోటీగా నిలవాలి. కానీ ఇప్పటి వరకు పవన్‌కు ఆ రెండు పార్టీలతో సంబంధాలు బాగానే వున్నాయి.  

ఆ మేరకు భాజపా కావచ్చు, తేదేపా కావచ్చు, కొన్నిస్థానాలను జనసేనకు త్యాగం చేయచ్చు. అదే విధంగా కావాలంటే విశాఖలో డిప్యూటీ మేయర్ లాంటి పదవిని వదిలేసుకోవచ్చు. అంతే తప్ప, మేయర్ పదవిని ఇటు భాజపా కానీ, అటు తేదేపా కానీ జనసేనకు వదలడం అన్నది కల్ల. మరీ పంతాలకు పట్టుదలలకు పోతారు, పవన్ పార్టీతో తమకు చాలా పని వుంది అని చంద్రబాబు అనుకుంటే, అప్పుడు కూడా తనకు కావాల్సిన వారిని జనసేనలోకి పంపి, వారికి మేయర్ అభ్యర్థిత్వం కేటాయిస్తారు తప్ప, అంతకన్నా తగ్గరు.

ఇలాంటి అడ్జెస్ట్ మెంట్ రాజకీయాలకు అన్నింటికి  పవన్ తలవూపుతారా? లేక, ఈ సంప్రదాయ రాజకీయాలు కాదు జనసేన లక్ష్యం, గెలిచినా గెలవకున్నా, మార్పుకు చోటివ్వడం ముఖ్యం అంటూ నేరుగా పోటీకి దిగుతారా? అదే కనుక జరిగితే తెలుగుదేశం పరిస్థితి ఇరకాటంలో పడుతుంది. ఎందుకంటే ఎదురు ఎదురుగా నిల్చోవడం అన్నది ఈ ఎన్నికతో ఆగదు. ఎన్నికలన్నా ముందుగా ప్రజా సమస్యలపై స్పందించడం ఎక్కువగా వుంటుంది. వైకాపాను ఎంతసేపూ జగన్ అవినీతి అనే ఏకైక కారణంతో పక్కకు సులువుగా తోసేస్తున్న తెలుగుదేశం, పవన్ కళ్యాణ్‌ను అలా తోసేయజాలదు.

అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్‌తో నెయ్యాన్ని తెలుగుదేశం పార్టీ వదులుకోదనే భావించాలి. అదే విధంగా పవన్ తనంతట తాను భాజపాతో స్నేహాన్ని వదులుకోకపోవచ్చు. వదులుకోవడానికి పెద్దగా కారణాలు కూడాలేవు.

అంటే జనసేన.. తేదేపా.. భాజపా ట్రయాంగిల్ లవ్ స్టోరీ మరికొన్నాళ్లు, ముఖ్యంగా వచ్చే ఎన్నికల వరకు కొనసాగే అవకాశాలే ఎక్కువగా వున్నాయి.

 చాణక్య

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?