Advertisement

Advertisement


Home > Articles - Chanakya

రెండున్న చోట మూడోది అవసరమా?

రెండున్న చోట మూడోది అవసరమా?

ఏమయిందీ వెంకయ్య నాయకుడికి..ఎవరూ నోరు మెదపరేం? విజయవాడ..విజయవాడ..గుంటూరు..గుంటూరు అంటూ ఈ బస్ కండక్టర్ కేకలేమిటి? అంటే ప్రభుత్వం మారగానే కమిటీలు, అధికారుల పర్యటనలు, సమగ్ర పర్యటనలు, పరిశీలనలు..అన్నీ గాలికిపోయాయా ఏం..ఇలా మట్లాడడం.. ఎంత హానికరం..గుర్తించరేం? ఇలాంటి వ్యవహారాలకు చెల్లించక తప్పదు భారీ మూల్యం.

అసలు సిసలు పాపం. యుపిఎ ది. రాజధాని అన్నది నిర్ణయించి, ఆపై విభజన చేసి వుంటే బాగుండేది. విధివిధానాలు పట్టించుకోకుండా బాబు, కేసిఆర్ రుణ మాఫీ హామీ ఇచ్చేసి, ఆ తరువాత కమిటీలు వేసి, కాలయాపనకు పూనుకున్నట్లు, ముందు విభజించేసి, రాజధాని రగడను జనానికి వదిలేసింది. దానికో కమిటీ, దానికి నిధులు..ఇలా వదిలేస్తే, జనం యుపిఎను వదిలేసారు. ఇప్పుడు మనకు కావాలి మోదీ ప్రభుత్వం అని ఎఫ్ ఎమ్ రేడియోలు తెగ ఊదరగొట్టడంతో, జనం ఆశగా ఎన్నుకున్నారు. 

యుపిఎ విభజనను సక్రమంగా చేయలేదని విమర్శించిన వారిలో సదురు భాజపా వాదులు కూడా వున్నారు. మరి వారు అధికారంలోకి వచ్చిన తరువాత రాజధానిపై ఇలాంటి మాటలు వినిపిస్తుంటే, సర్కారు ఏం చెప్పాలి. రాజధాని నిర్ణయం పై మా విధి విధానం ఇది. లేదా యుపిఎ నిర్ణయించిన కమిటీనే పనిచేస్తుంది. అదీ కాదంటే కొత్త కమిటీ వేస్తాం..ఇలా ఏదో ఒకటి చెప్పకుండా, వదిలేస్తే, చంద్రబాబు నాయకుడు, వెంకయ్య నాయకుడు కలిసి, విజయవాడ గుంటూరు ల నడుమ మూడో నగరాన్ని నిర్మించాలని ఫిక్సయిపోయారు. 

ఎక్కడో వుండాలి..రాయలసీమ టైగర్ అని..టి జి వెంకటేష్ గారు. ఆయన యపిఎ, కాంగ్రెస్ హయాంలో ఒంటికాలి మీద లేచేవారు. ఎవరు ఏ ఊరు పేరు చెప్పకున్నా, రాజధాని అంటే చాలు..మా రాజధాని మాకివ్వండి..అంటూ గాండ్రించేవారు. పాపం, ఇప్పుడు తెలుగుదేశం బోనులోకి దూరిపోయిందా టైగర్..దాంతో నోట మాట రావడం లేదు. ఇంకా సీమ హక్కుల పరిరక్షణ కోసమే పుట్టాము..మొలతాడు కట్టాము అనే వాళ్లు కొందరుండేవారు..వారంతా ఇప్పుడు ఎక్కడున్నారో అసలు మాట్లాడడమే లేదు. రాజధానిని ఎక్కడ పెట్టండి అది తరువాతి సంగతి. ఈ ముందస్తు ప్రకటనలేమిటి అని అడగడమే లేదు. కర్నూలులో ఎయిమ్స్ అని ముందు రోజు పత్రికల్లో వస్తే, మర్నాడే వెంకయ్య నాయకుడు గారు..విజయవాడ, గుంటూరు మధ్యలో అని స్టేట్ మెంటు..మరి ఇప్పుడు ఈ సీమ టైగర్లు, లయన్లు గాండ్రించవేం?

ఇక ఉత్తరాంధ్ర వాసుల సంగతి చెప్పనక్కరే లేదు. ఇప్పుడు అక్కడ వలస రాజకీయవాదులదే రాజ్యం. అది గంటా అయినా, మరొకరైనా..అందరూ ప్రకాశం, కృష్టా, గోదావరి నుంచి ఆ ఒడ్డుకు చేరుకుని, తెడ్డు తమ చేతిలోకి తీసుకుని, నడిపేస్తున్నవారే. అందువల్ల వారికి ఉత్తరాంధ్ర ప్రయోజనాలు ఏం పడతాయి. పట్టవు కాక పట్టవు. పేరుకు మాట్లాడేవారు గతంలో. ఇప్పుడు అదీ మాట్లాడరు..మంత్రి పదవి మూతికి అడ్డం పడుతుంది. 

ఇలా అంటే అదిగో ప్రాంతీయ విబేధాలు రెచ్చగోడతారేం..ఎప్పుడు మీకు కులాల గొడవేనా..కులాల ప్రస్తావన లేకుండా మీరు రాయలేరా అని విజ్ఞులైన పాఠకుల కామెంట్లు, కుల ప్రాతిపదికన ఆలోచించడం లేదని చంద్రబాబు, వెంకయ్య నాయుడులను గుండెలమీద చెయ్యి వేసుకుని చెప్పమనండి. చంద్రబాబు చుట్టూ, సుజన, కంభంపాటి, గరికపాటి, ఇలా ఒక వర్గం కోటరీనే ఎందుకు వుంది చెప్పమనండి. బాబు ఎంచుకుని మరీ తెచ్చుకునే అధికారులెవరు?  వెంకయ్య పోయి పోయి హరిబాబునే ఎందుకు భాజపా అధ్యక్షుడిని చేసారో అడగండి..ఇలా రాజకీయనాయకులు, వాళ్ల వ్యవహారాలు కులాల కంపు కొడుతుంటే, ప్రస్తావించకుండా వుండడం ఎలా సాధ్యం? ఇప్పుడు తన స్వంత ప్రాంతం నెల్లూరును కూడా మరిచిపోయి, వెంకయ్య కృష్ణ-గుంటూరు అని అరుస్తున్నది ఎందుకని? అప్పుడు కులాల ప్రస్తావన మానేద్దాం. 

సరే, ఇంతకీ రాజధాని అందరికీ అందుబాటులో వుండాలి. అది ముమ్మాటికీ మంచి మాటే. అయితే అలా అని అద్భుతంగా అభివృద్ధి చెందిన నగరం చెంతనే నిర్మించడమేమిటి? ఎక్కడ రాజధాని నిర్మిస్తే, అక్కడ అభివృద్ది ఆటోమెటీక్ గా వస్తుంది కదా.

అదీ కాక, పూర్తిగా ఖాళీ ప్రదేశంలో ప్లాన్డ్ గా నిర్మిస్తేనే మంచి నగరాలు తయారవుతాయని నయాఢిల్లీ, చండీగడ్ ఉదంతాలు నిరూపించాయి కదా.. అందువల్ల వేలాది బంజరు ఎక్కడవుందో, అటు ఇచ్చాపురం నుంచి ఇటు కర్నూలుకు సెంటర్ పాయింట్ ఎక్కడ వుంటుందో అక్కడ ప్లాన్డ్ గా నిర్మించాలి. వేలాలు,,డబ్బు చేసిన జనాలకు మేలు చేయడం కాకుండా, వేలాది ఫ్లాట్లు, వందలాది ఇళ్లు, అన్నీ నిర్మించి లాటరీ పద్దతిన పారదర్శకంగా కేటాయించాలి.

ప్రభుత్వ కార్యాలయాన్నీ ఒకే చోట కొలువు తీరి, సామాన్య జనానికి ఈ కొస నుంచి ఆ కొసకు తిరిగే సమస్య లేకుండా చూడాలి. ఓ మహా నగరాన్ని చూసేందుకు పర్యాటకులు బారలు తీరేంత అందంగా వుండాలి. బాబు చెబుతున్న సింగపూర్ తరహా సిటీగా వుండాలి. అంటే ఇటు రాజధాని, అటు లక్షలాది జనానికి ప్రణాళికా బద్ధమైన వసతి, పైగా పర్యాటక కేంద్రం, అందులోనే అంతర్జాతీయ విమానాశ్రయం. ఇంత అద్భుతమైన నగరాన్ని నిర్మించాలి ఏ నాయుడైనా..నాయకుడైనా. అంతే కానీ ముందుగానే విజయవాడ..గుంటూరు అంటూ బస్  కండక్టర్ ల మాదిరిగా కేకలు పెట్టడం కాదు. 

ఈ నాయకుల మాటలు పట్టుకుని కోట్లాది రూపాయిల రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిపోతోంది. రేపు ఏదన్నా తేడావస్తే చాలా కొంపు కుదేలవుతాయి. అందుకే మోడీ మహాశయా..మీరు తక్షణం కలుగజేసుకుకని,  ఈ నాయకుల మాటలు పక్కన పెట్టి, అసలు రాజధానిపై మీరు ఏం చేయదల్చుకున్నారో కాస్త చెప్పండి..ప్లీజ్.

చాణక్య

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?