Advertisement

Advertisement


Home > Articles - Chanakya

రుణమాఫీకి కార్పొరేట్ పథకం?

రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ వంటి వరాల భారాన్ని చంద్రబాబు చాలా తెలివిగా పంపకం చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఈ భారం ఇంతా అంతా కాదని ఆయనకు తెలుసు. అలా అని వెనుకంజ వేస్తే మరోసారి జనం ముందుకు ఓట్ల కోసం వెళ్లలేని పరిస్థితి. అంతవరకే అందరూ ఆలోచించేది. కానీ అలాగే ఆలోచిస్తే చంద్రబాబు ఎందుకవుతారు? వచ్చే ఎన్నికల ముందు మరే పార్టీ అయినా ఇదే హామీ ఇవ్వచ్చు. వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ ఇస్తామంటే బాబు వెక్కిరించారు. కానీ అయిదేళ్లు తిరిగేసరికి నేను కూడా ఇస్తా అన్నారు. అలాగే ఇఫ్పుడు బాబు రుణమాఫీ అంటే జగన్ నో అన్నారు. అయిదేళ్ల తరువాత జగన్ ఎస్ అనరని గ్యారంటీ ఏమిటి? అందుకే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పుడు ఈ రుణమాఫీ వ్యవహారాన్ని పదేళ్ల పాటు ప్రభుత్వంపై భారం వుండేలా చేయాలన్నది ఆయన ప్లాన్. దాని వల్ల ఈ అయిదేళ్లు తక్కువ భారం వుంటుంది. వచ్చే ప్రభుత్వం పై కూడా భారం వుంటుంది. ఆ భారం వుండగా మరోసారి రుణమాఫీ అనే ధైర్యం ఎవరికీ వుండదు. కానీ ఇక్కడ ఓ సంగతి వుంది. బాబు ఇచ్చిన హామీ బాబే తీర్చాలి. వచ్చే ఎన్నికల్లో బాబే అధికారంలోకి వస్తారనే గ్యారంటీ ఏమన్నా వుందా? బాబు ఇచ్చిన హామీని ఆ ప్రభుత్వం ఎందుకు మోయాలి? బాబు హామీని బాబు తన హయాంలోనే చెల్లు వేసుకోవాలి. కానీ ఈ మాట చెప్పే ప్రతిపక్షం ఏదీ కనిపించడం లేదు.

ఇదిలావుంటే  బ్యాంకులు ఈ విషయంలో అనుకూలంగా లేవు. అందుకే దానికి కూడా బాబు ఓ బృహత్తర ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆస్థులు ఏమేమి వున్నాయి....వీటన్నింటికి ఓ పేరెంటల్ కంపెనీని తయారు చేయాలని చూస్తునట్లు వినికిడి. ముఖ్యంగా ఖాళీగా వున్న విలువైన భూములు కూడా. ఈ పేరెంటల్ కంపెనీకి ప్రభుత్వం హామీగా వుండే అవకాశం వుంది. ఈ పేరెంటల్ కంపెనీ బ్యాంకులకు హామీ ఇవ్వడం లేదా, రుణం తీసుకోవడం, కాకుండా ప్రజలకు, ఆర్థిక సంస్థలకు బాండ్లు విడుదల చేయడం వంటి ఆప్షన్ల ద్వారా నిధులు సమీకరించాలని చూస్తున్నారు. 

ఈ బాండ్లు కానీ, రుణాలు కానీ, హామీ కానీ కూడా పదేళ్ల పాటే వుంటుంది. అంటే అక్కడ కూడా బాబు తన భారాన్ని వచ్చే ప్రభుత్వంపై కూడా వుంచుతారన్నమాట. మరి ఎవరైనా బాబు ఇచ్చిన హామీని ఆయన పదవీ కాలంలోనే అమలు చేయాలని, ఆ భారాన్ని వచ్చే ప్రభుత్వంపై వేయకుండా చూడాలని కోర్టుకు వెళితే పరిస్థితి ఎలా వుంటుందో? అందుకు అవకాశం వుంటుందో వుండదో? చూడాలి. మొత్తానికి ప్రభుత్వాన్ని కూడా బాబు కార్పొరేట్ స్టయిల్ లోకి దింపేస్తున్నారు. ఇప్పటికే పార్టీ వ్యవహారాలు అలాగే నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా రుణాలు, బాండ్లు, లాంగ్ టెర్మ్ వెసులు బాటు వంటి కార్పొరేట్ విధానాల బాటనే వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

చాణక్య

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?