Advertisement

Advertisement


Home > Articles - Chanakya

తీర్పులందు స్థానిక తీర్పులు వేరయా!

తీర్పులందు స్థానిక  తీర్పులు వేరయా!

తెల్లవారితే మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ లెక్కలు ప్రారంభమవుతున్నాయి. మరోపక్క ఆ మర్నాడే ఎంపీటీసీ జాతకాలు వెల్లడి కానున్నాయ్. ఆ పైన మరో మూడు రోజులకు అసలు సిసలైన అసెంబ్లీ జాతకాలు వెల్లడవుతాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ప్రాతిపదికగా కోట్ల రూపాయిల బెట్టింగ్ నడుస్తోందని వార్తలు వినవస్తున్నాయి. ఇప్పుడు ఈ రెండు ఎన్నికల తీర్పులు ఆధారంగా అసెంబ్లీ ఫలితాలను అంచనా వేసే ప్రయత్నం కచ్చితంగా జరుగుతుంది. అప్పుడు ఈ బెట్టింగ్ లు మరింత జోరందుకుంటాయి. పైగా ఇదే సమయంలో వివిధ సంస్థలు చేసిన సర్వేలు, ఎగ్జిట్ ఫోల్ పలితాలు కూడా వెల్లడవుతాయి. అందువల్ల బెట్టింగ్ లు మరింత ఊపందుకునేది ఖాయం. 

కానీ మున్సిపల్  లేదా ఎంపీటీసీ ఫలితాల ఆధారంగా అసెంబ్లీ ఫలితాలను అంచనా కట్టగలమా? అలా కట్టే అంచనాలు వాస్తవానికి దగ్గరగా వుంటాయా అన్నది ఆలోచించాలి. ఈ రెండూ కూడా స్థానిక ఎన్నికలు. సవాలక్ష స్థానిక వ్యవహారాలు ఈ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ముందుగా అభ్యర్థి ఎవరన్నది కీలకంగా వుంటుంది. ఆపైన ఏదైనా పార్టీ దన్ను ఏ మేరకు వుందన్నది రెండో కీలకఅంశం. ఆపై సంప్రదాయంగా వస్తున్న పార్టీల పాకెట్ లు, అక్కడ వున్న స్థానిక నాయకుల ప్రభావం వంటివి కూడా కీలక పాత్ర పోషిస్తాయి. స్థానిక ఎన్నికలపై పార్టీల ప్రభావం ఎంత వుంటుందో స్థానిక సమస్యలు, రాజకీయాలు కూడా అంతే సమానమైన ప్రభావం కనబరుస్తాయన్నది వాస్తవం. 

సాధారణంగా ఎక్కడన్నా ఉపఎన్నికలు జరిగితే, (తెలంగాణ, జగన్ వంటి ప్రత్యేక పరిస్థితులు పక్కన పెడితే) అధికార పార్టీనే గెలుస్తుంటుంది. అదే అక్కడ స్థానిక ఎన్నికలు జరిగితే ప్రతిపక్షాలు గెలవడం జరుగుతుంది. అందునా మన రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు అంటే అధికార పార్టీకి ఎప్పడూ కాస్త వ్యతిరేకమే.అందుకే తెలుగుదేశం సకాలంలో ఎన్నికలు జరిపించడానికి చూసింది కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం కాదు. ఈ సారి స్థానిక ఎన్నికలు కూడా కోర్టు పుణ్యమా అని ముంచుకొచ్చాయి తప్ప, లేకుంటే మరో ఆరునెలలో, ఏడాదో దాటిన తరువాత జరిగేవి. 

స్థానిక ఎన్నికల్లో కూడా పట్టణ ప్రాంత ఓటర్ల తీర్పు ఒకలా వుంటుంది. పల్లెప్రాంత ఓటర్ల తీర్పు మరోలా వుంటుంది. అదీ కాక, ఈసారి స్థానిక ఎన్నికలను పార్టీలు సీరియస్ గా తీసుకునేంత వ్యవథి, అవకాశం లేకుండా పోయింది. అందువల్ల వాటి వ్యవహారాలను అధిష్టానాలు స్థానిక నేతలకు వదిలేసాయి. అభ్యర్థి మాత్రమే వున్న చొట, అతగాడితే ఎంపిక, అతగాడిదే పోటీ అన్నట్లు నడిచింది. అభ్యర్థులు వున్నచోట, స్థానికంగా వున్న పెద్దనాయకులు కలుగచేసుకున్నారు తప్ప, అటు కాంగ్రెస్, ఇటు వైకాపా కలుగచేసుకున్న దాఖలాలు లేవు. తెలుగుదేశం పార్టీ మాత్రం సంస్థాగతంగా బలంగా వుండడం, పార్టీ దగ్గర డేటా బేస్ వంటి వ్యవహారాలు బాగా వుండడంతో, కాస్త కలుగ చేసుకుంది.

ఇప్పుడు ఈ నేపథ్యంలో ఫలితాలు వెలువడనున్నాయి. వాటిలో తెలగుదేశానికి మొగ్గ రావచ్చు, లేదా వైకాపాకు రావచ్చు. కానీ అంత మాత్రం చేత అవే తరహా ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్ కావాలని కానీ కాకూడదని కానీ, లేదు. ఈ విషయాన్ని బెట్టింగ్ రాయళ్లు జాగ్రత్తగా గమించాలి. ఫలానా స్థానంలో ఫలానా పార్టీ ఎందుకు గెలిచిందన్నదాని వెనుక వున్న అసలు వ్యవహారాలు తెలుసుకున్నపుడు,. ఆ ఫలితానికి అనుగుణంగానే అసెంబ్లీ ఫలితం వుంటుందా లేదా అన్నది లెక్క వేసుకోవచ్చు,. అంతే కానీ దీని ఫలితాలను టోకుగా తీసుకుని లెక్కలు వేసుకుంటే మాత్రం బోర్లాపడడం ఖాయం.

ఈ సారి స్థానిక ఎన్నికల పలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వస్తాయని ఓ టాక్ వుంది. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఈ ఫలితాలపై ధీమాగానే వున్నారు. అయితే ఈ ఫలితాలు ఎలాగూ తమకు అనుకూలంగా వస్తాయని తెలుసని, అసెంబ్లీ ఎన్నికలు అలా వుంటాయా వుండవా అన్నదే తమ టెన్షన్ అని అంటున్నారు. అంటే స్థానిక ఫలితాలను అసెంబ్లీ ఫలితాలు ప్రతిబింబిస్తాయన్న నమ్మకం వారికి కూడా లేదని స్పష్టమవుతోంది. మరి పార్టీలకే స్పష్టత లేనపుడు బెట్టింగ్ రాయుళ్లు, కాలక్షేపం కబుర్లు చెప్పుకునే వారు ఈ ఫలితాల ఆధారంగా రెచ్చిపోవడం అనవసరమే కదా?

చాణక్య

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?