Advertisement

Advertisement


Home > Articles - Chanakya

ఎవరేమనుకుంటే నాకేమిటి?

ఎవరేమనుకుంటే నాకేమిటి?

కెసిఆర్ స్టయిల్ కేసిఆర్ దే. అది ఉద్యమ సమయంలో కావచ్చు..అధికారంలోకి వచ్చాక కావచ్చు.. ఆకలికేకలతో అన్నదాత అలమటిస్తుంటే ఇచ్చిన రుణమాఫీ హామీని పావు మందమే పూర్తి చేసిన తెలంగాణ సర్కార్ కోట్లు ఖర్చుచేసి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచిన వారికి మాత్రం అడక్కుండానే లక్షల రూపాయలు ఇచ్చేందుకు రెడీ అయింది. 

ఏదో ఓ సారి నష్టపోయినందుకు ఒక్క ఏడాదికి మాత్రమే లక్ష రుణమాఫీ... అది కూడా రైతులు అడిగింది కాదు, ఓట్ల కోసం ఎన్నికల ముందు నాయకులు ఎత్తుకన్న పల్లవి. దాన్ని నెరవేర్చలేక కిందా మీదా పడుతూ, వాయిదా పద్దతిలో ముందుకెళ్తున్నారు. కాని ఇప్పుడు అడక్కుండానే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు బంపర్ లాటరీ ప్రకటించింది. 

వారు చేస్తున్న కష్టానికి, వస్తున్న ఆదాయానికి పొంతన లేదంటూ వారు బాగా బతికితే కాని వారిపై భారం వేసుకున్న ప్రజలు బాగుపడరని  భావించిన టీఆర్‌ఎస్‌ సర్కారు ఎమ్మెల్యేలకు నెలకు రెండు లక్షలు చొప్పున వేతనం ఇవ్వాలని భావిస్తోందట. దానికి కారణాలు చాలా అందంగా చెబుతున్నారు.

ప్రజాప్రతినిధులు నిజాయితీగా పనిచేయాలి.. నిజాయితీగా పనిచేయాలంటే వారికి సరిపడా ఆదాయం కావాలి.. ఆదాయం కావాలంటే వేతనాలు పెరగాలి.. అందుకే.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జీతాలు పెంచాలని ఆలోచన చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రజాప్రతినిధులు ప్రస్తుతం పొందుతున్న వేతనాన్ని ఏకంగా రెట్టింపు చేయాలని టీ-సర్కారు యోచిస్తోంది. 

ప్రస్తుతం వీరు 95 వేల రూపాయలు నెల జీతంగా అందుకుంటున్నారు. అయితే.. కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలో పెంచిన వేతనాలు.. ప్రస్తుత ఖర్చులకు ఏమాత్రం సరిపోవట్లేదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజాప్రతినిధులు నిజాయితీగా సేవ చేయాలంటే.. చాలినంత జీతం ఇవ్వాలని సర్కారు డిసైడ్‌ అయ్యింది. ఎమ్మెల్యేలు సొంత వాహనాల్లోనే నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. వివిధ కమిటీల్లో సభ్యులుగా ఉన్నవారంతా సమావేశాలకు హాజరవుతున్నారు. 

అయితే.. ఈ పనులకు ఖర్చు పెరుగుతోందని, దీన్ని అధిగమించేందుకు ప్రజాప్రతినిధులు పక్కదారి పట్టే అవకాశం ఉందని సర్కారు భావిస్తోంది. అందుకే సరిపడా జీతం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ప్రస్తుతం ప్రజాప్రతినిధులకు అందుతున్న 95 వేల వేతనాన్ని ఒకేసారి రెండు లక్షలకు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరిలో.. సీఎం, మంత్రులు, కేబినెట్‌ హోదా కలిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం 36 మంది ఉన్నారు. 

వీరుపోగా మిగిలిన 123 మందికి నెలకు 2 లక్షల చొప్పున వేతనాలు పెంచితే ప్రభుత్వంపై ఏడాదికి 30 కోట్ల భారం పడుతుంది. మరోవైపు.. మంత్రులకు సైతం జీతాలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. వీరితోపాటుగా.. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే పెన్షన్‌ కూడా పెంచాలని నిర్ణయించింది.

ఇక తెలంగాణ నుంచి ఎంపీలుగా ఉన్నవారికి సైతం రాష్ట్ర ప్రభుత్వం అలవెన్సులు ఇవ్వాలని దాదాపు డిసైడ్ అయింది. అయితే ఇవ్వాలన్న అంశంపై చర్చించాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. వేతనాల పెంపు యోచనపై అప్పుడే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ వైపు రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగ సమస్య, విద్యుత్ ఇలా ఎన్నింటినో వదిలేసి ఈ పనికి పూనుకుంటే ప్రజల రియాక్షన్  ఎలా ఉంటుందో చూడాలి.

ఏ రియాక్షన్ ఎలా వుంటే..కేసిఆర్ కు ఏమిటి? ఆయన యాక్షన్ ఆయన చేసుకుంటూ ముందుకు సాగిపోతారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?