Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

బాబు ఇండైరెక్టు స్పీచ్: ఎన్టీఆర్ కంటె నేనే గ్రేట్!

బాబు ఇండైరెక్టు స్పీచ్: ఎన్టీఆర్ కంటె నేనే గ్రేట్!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు ఓ అద్భుతమైన వాక్యము సెలవిచ్చారు. ఈ రాష్ట్రంలో తనను మించిన మహానుభావుడు లేనేలేడని తనకు తానే కితాబు ఇచ్చుకున్నారు. తన భుజాలు తానే చరుచుకున్నారు. తనకు తానే భుజకీర్తులు తగిలించుకున్నారు. తనకు తానే కిరీటం పెట్టేసుకుని పట్టాభిషేకం చేసేసుకున్నారు. తనకు తానే సన్మానం చేసేసుకున్నారు. అవును మరి ఆయన దృష్టిలో ఆయనను మించిన వారు తెలుగునాట లేనే లేరని తెగేసి చెప్పేశారు. 

చూడబోతే చంద్రబాబులో హెల్యూసినేషన్స్ కాస్త ఎక్కువ మోతాదులోనే ఉన్నట్లుగా ఉంది. ఆయనకు ఇప్పుడు మద్యం సేవించే అలవాటు కూడాలేదు. కానీ డ్రగ్స్ సేవించే వారికంటె ఎక్కువగానే హెలూసినేషన్స్ లో గడుపుతున్నట్లున్నారు. అయినా.. ఖజానాలో పైసా లేకుండా వేలకోట్ల రూపాయల మాయ మాటలు చెప్పాలంటే, ప్రజలు తన మాయను గుర్తిస్తారనే భయం లేకుండా.. అబద్ధపు ప్రకటనలు చేయాలంటే.. డ్రగ్స్ మాత్రమే అందించగల అలాంటి హైపర్ కాన్ఫిడెన్స్ అవసరమే ఏమో అనిపిస్తోంది. 

ఎందుకంటే-

చంద్రబాబునాయుడు రెండు రోజులుగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రప్రజలు నాకు ఇచ్చిన గౌరవం మరెవ్వరికీ ఇవ్వలేదు.’’ అని తేల్చి చెప్పేశారు. నా తెలివితేటలు అన్నీ ఉపయోగించి, రాష్ట్రాన్ని తిరుగులేకుండా మార్చేస్తానని కూడా సెలవిచ్చారు. అయితే ఆయన కీలక డైలాగు విషయానికి వస్తే.. గత డెబ్భయ్యేళ్లలో తనకు దక్కిన గౌరవం ఈ రాష్ట్రంలో మరొక నాయకుడికి దక్కనే లేదనేది ఆయన మనోగతంగా కనిపిస్తోంది. 

అయితే ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా సరే... నందమూరి తారక రామారావు, ఆ తరువాత వైఎస్ రాజశేఖర రెడ్డి స్థాయిలో ప్రజాదరణ పొందిన నాయకులు మరొకరు లేరనే అంటుంటారు. ఏమాత్రం రాజకీయానుభవం లేకుండానే, కొత్త రాజకీయ పార్టీని స్థాపించి, కేవలం 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌కు ఈ రాష్ట్రప్రజలు పట్టిన బ్రహ్మరథం కూడా తనముందు దిగదుడుపే అన్నట్లుగా చంద్రబాబు మాటలు ఉన్నాయి. వైఎస్సార్ కు ఉన్న ప్రజాదరణను ఆయన ఆమోదించలేకపోవచ్చు. కానీ.. తన సొంత మామ, తన ప్రస్తుత రాజకీయ మనుగడకు మూల పురుషుడు అయిన ఎన్టీఆర్ గొప్పదనాన్ని కూడా ఆమోదించలేకపోతే హెలూసినేషన్స్ కాకమరేమిటి?

2004లో నక్సలైట్ల మందుపాతర దాడిలో గాయపడిన తర్వాత, ఆ సానుభూతిని క్యాష్ చేసుకోవాలనుకుని ముందే ఎన్నికలకు వెళ్లినప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజాదరణ ముందు చతికిలపడిన సంగతి బహుశా ఆయనకు గుర్తున్నదో లేదో? సుదీర్ఘకాలంగా ప్రజలు పట్టంకడుతూ వస్తున్న కుప్పం నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో మెజారిటీ భారీగా తగ్గిన సంగతిని ఆయన మరచిపోయారో ఏమో? అదే కుప్పం ప్రజల ముందు.. సాహసించి.. స్వాతంత్ర్యం తర్వాత ఈ రాష్ట్రంలో తనను మించిన నాయకుడు మరొకడు లేనే లేడనే స్టేట్‌మెంట్ ఆయన ఇవ్వగలిగారని అనిపిస్తోంది. 

-  కపిలముని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?