Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

చంద్రబాబు చుట్టూ ఆత్మలే!

చంద్రబాబు చుట్టూ ఆత్మలే!

నారాచంద్రబాబునాయుడు అభినవ రాజకీయ కృష్ణుడు. అందుకే ‘కస్తూరీతిలకం.. లలాటఫలకే ...’ శ్లోకం నడకలో కీర్తించడానికి ఆయన అర్హుడు. కాకపోతే.. ‘..గోపస్త్రీ పరివేష్ఠితౌ’ అని అందరూ ఆ గోపాలకృష్ణుని ఆరాధిస్తుంటారు. ఈ చంద్రబాబు నాయుడు మాత్రం.. పేరుకు రాజకీయ నాయకుడు మరియు ఈ రాష్ట్రాన్ని (సారీ ఇదివరకు కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని) అతి సుదీర్ఘ కాలం పరిపాలించిన ముఖ్యమంత్రి అయినప్పటికీ.. కార్పొరేట్‌ దురాత్మల నీలినీడల్లో పార్టీ వ్యవహారాలను నడిపిస్తుంటారు. 

వైఎస్‌ రాజశేఖరరెడ్డి బతికి ఉన్న రోజుల్లో కేవీపీ రామచంద్రరావు తన ఆత్మ అని ఆయన చెప్పుకునే వారు. చంద్రబాబు అలా ఏ ఒక్కరికీ తన దృష్టిలో ప్రాధాన్యం ఉన్నట్లుగా తన నోటమ్మట చెప్పరు గాక చెప్పరు. కానీ ఈ కార్పొరేట్‌ ఆత్మలన్నీ.. ఆయనను చుట్టుముట్టి, ఆవహించి.. ఆయన సకల నిర్ణయాలను ప్రభావితం చేస్తుంటాయి. ఆయన నిండా అశక్తుడు. వాటికి లోబడి.. అవి చెప్పినట్టల్లా ఆడుతుంటాడు. బయటకు మాత్రం నేను మోనార్క్‌ని అన్నట్లుగా బిల్డప్‌ ఇస్తుంటాడు. చంద్రబాబును, ఏతత్‌రూపేణా తెలుగుదేశం పార్టీని లెక్కకు మిక్కిలిగా ఆవహించిన ఈ ఆత్మలపై గ్రేట్‌ ఆంధ్ర ప్రత్యేక కథనం... 

xxxxxx

వందరూపాయలు పెట్టి ఒక్క చొక్కా కొంటూ ఉంటే ఓ మిత్రుడిని వెంట తీసుకెళ్లి.. ‘ఎలా ఉంది బాసూ’ అంటూ ఒపీనియన్‌ అడుగుతాం.  పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం వంటి కీలక విషయాల్లో పదిమందిని సంప్రదించి పది రకాల అభిప్రాయాలు సేకరించి.. రంగరించి నిర్ణయం తీసుకుంటాం. వీటి అర్థం మనకు నిర్ణయాత్మక శక్తి ఉండదని కాదు. నలుగురి సలహాలు కలిస్తే మరింత ‘మంచి’ని ఎన్నుకున్నట్లవుతుందని అంతే!

రాజకీయాల్లో కూడా ఇది కొత్త సంప్రదాయం కాదు. ప్రత్యేకించి ఎన్నికల వేళ తీసుకునే నిర్ణయాలు ఆయా పార్టీల భవితవ్యాన్ని నిర్ణయిస్తుంటాయి గనుక అందులో ఏకవ్యక్తి నిర్ణయాల కంటె నలుగురితో కలిఇ చేసే నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి. వారిని సలహాదారులని, పోలిట్‌ బ్యూరో అని, సెంట్రల్‌ కమిటీ అని.. ఇలా రకరకాల పేర్లతో వ్యవహరిస్తుంటారు. 

ఇంకా చెప్పాలంటే ‘ఆత్మ’ అని కూడా అంటుంటారు. అవును  తన సలహాదారుకు తాను ఇచ్చే ప్రాధాన్యం తనకు మించి ఉన్నప్పుడు.. గతంలో  ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి` కేవీపీ రామచంద్రరావు గురించి వాడిన మాట అది. నిజానికి రాజకీయ నాయకులు తమ నిర్ణయాల వెనుక తెలివితేటలు ఎవరివైనా సరే.. దాన్ని మబ్బులో పెట్టి కీర్తి తమకు మాత్రమే దక్కేలా చూసుకోవాలని ఆశిస్తారు. కానీ వైఎస్సార్‌.. తన ఆత్మ అంటూ కేవీపీని కూడా ప్రొజెక్టు చేశారు. ఆ ‘ఆత్మ’ అనే పదాన్ని పట్టుకుని వైఎస్‌ నిర్ణయాల వెనుక కేవీపీ ఉంటారనే వ్యవహారాన్ని ఆయన వ్యతిరేక శక్తులు ఎన్ని రకాలుగా ప్రచారం చేసి భ్రష్టు పట్టించాలని చూశారో అందరికీ తెలిసిన సంగతే.

కానీ తాను ఏకధ్రువ వ్యవస్థగా పార్టీని నడుపుతున్నానని, తన పార్టీలో ఏకస్వామ్య వ్యవస్థ మాత్రమే ఉంటుందని.. సకల నిర్ణయాలు తన ఒక్కడి నిర్ణయానుసారమే జరుగుతుంటాయని..  భ్రమలో బతుకుతూ ఉండే చంద్రబాబు చుట్టూ ఇప్పుడు అనేక ఆత్మలు సంచరిస్తున్నాయి. చంద్రబాబు తన నిర్ణయాల సమస్త కీర్తి ప్రతిష్టలు తనకే (లేదా తన పుత్రరత్నానికే) దక్కాలనుకుంటారు. అందువల్ల తన చుట్టూ ఆత్మలను ‘తన ఆత్మ’లుగా ఆయన ఒప్పుకోకపోవచ్చు. అందువల్ల వాటిని మనం బహుశా ప్రేతాత్మలుగా పరిగణించాల్సి ఉంటుంది. 

ఈ ఆత్మలే ఇవాళ పార్టీని నడిపిస్తున్నాయి. అధినేత నామమాత్రావశిష్టంగా మారిపోయారు. ఆయన పార్టీకి ముఖచిత్రంగా మాత్రమే ఉన్నారు. ప్రెస్‌మీట్‌లు పెట్టడం, ఎదురు ప్రశ్నలు వేసిన విలేకర్లపై గుడ్లురుముతూ ‘నువ్వు ఏ పేపరో నాకు తెలుసులే’ అనే జనాంతిక వాక్యంతో జవాబులు దాటేయడం... రెండు రకాల డైలాగులను వల్లించగల నాలుకలను సిద్ధంగా ఉంచుకుని, తన ‘రెండు కళ్ల’ పరిధిలో జరిగే సభల్లో ప్రసంగాలు చేయడం మాత్రమే ఆయన చేస్తున్న పని. మరో రకంగా చెప్పాలంటే.. ఈ ఆత్మలన్నీ కలిపి ఆయనకు మిగిల్చిన పని...!! తతిమ్మా పార్టీ నిర్వహణ చేరికలు, పోకలకు పొగపెట్టడం, నిధుల సమీకరణ` తరలింపు,  ఆశావహులను తూకం వేయడం ఇత్యాది బాధ్యతలన్నీ ఆత్మలు చేసే, చేస్తున్న  పని! 64 ఏళ్ల వార్ధక్యంలో చంద్రబాబు ప్రజల ఎదుట ఎంత డాంబికంగా కనిపిస్తున్నప్పటికీ వాస్తవంగా.. ఆయన పార్టీ నిర్వహణ పరంగా నిస్తేజం అయిపోయారు. చురుకుదనం అవసరమైన పనులన్నీ ఈ ఆత్మల చేతుల్లో పెట్టేశారు. 

ఆత్మల ‘చతుష్టయం’

చంద్రబాబు చుట్టూ పరిభ్రమించే ఆత్మలు ‘మూడు’ అని పార్టీలో ఎవర్ని అడిగినా చెబుతారు. సుజనా చౌదరి, సీఎం రమేష్‌, నామా నాగేశ్వరరావు ఈ మూడు ఆత్మలన్నమాట. మరి ముగ్గురే కదా.. చతుష్టయం అంటున్నారేమిటి అని మీకు సందేహం కలగొచ్చు. ఆ నాలుగో ఆత్మ త్రివేణీ సంగమం వంటి చోట్ల ఉండే అంతర్వాహిని వంటిది. ఈ మూడు ఆత్మల పనిలోనూ ఆ ఆత్మ కలగజేసుకుంటూనే ఉంటుంది. కానీ పైకి మాత్రం కనిపించదు. ఆ ఆత్మ పేరు లోకేష్‌ అని మనం సరిపెట్టుకోవాలి. 

ఇంతకూ ఈ ఆత్మల బాధ్యతలు.. చేస్తున్న పనులు ఏమిటో కాస్త గమనించాలి. 

ప్రధానంగా వ్యక్తులు ` వనరుల సమీకరణ వీరి బాధ్యత. తెలుగుదేశం పార్టీ గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నది. అధికారమే ఊపిరిగా బతికే వ్యక్తికి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఆర్థిక వనరులు అనివార్యంగా మారిపోయిన ఎన్నికల సినేరియోలో... తెలుగుదేశం పార్టీకి కష్టకాలమే అని చెప్పుకోవాలి. అందుకే చంద్రబాబు` మామ ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీని ఒక వ్యాపారం కింద మార్చేసి ఈ కార్పొరేట్‌ ఆత్మ ల చేతుల్లో పెట్టేసారని పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తుంటారు. 

ఈ ఆత్మలన్నీ కార్పొరేట్‌ కల్చర్‌కు అలవాటు పడినవి. నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ యొక్క ‘అసలైన ఆత్మ (సోల్‌)’ ఏమిటో ఎరిగినవి కాదు. ఏ పేద ప్రజల గుండె చప్పుడుగా, ఏ పేదవాడి కన్నీళ్లను తుడవడానికి తెలుగుదేశం పార్టీ పుట్టినదో ఆ మూలాల్లో ఉండే అంకితభావాన్ని నిబద్ధతను వీరు ఎరిగిన వారు కాదు. వీరే కేవలం వ్యాపారులు. కాపు సారా వ్యాపారం దగ్గరినుంచి, అంతర్జాతీయ స్థాయి కాంట్రాక్టుల వరకు వీరికి అన్ని రకాలుగానూ లబ్ధి పొందగల వ్యాపార చరిత్ర మాత్రమే తెలుసు. 

తెలుగు ప్రజలకు పట్టిన ఖర్మం ఏంటంటే.. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒకటి.. ఇటువంటి ఫక్తు వ్యాపారుల నిర్వహణలో నడుస్తుండడం. ఈ ఆత్మలకు తెలిసినదెల్లా లబ్ధి! ఎరవేయడం` లబ్ధి పొందడం.  పార్టీ అధినేత ఆశించే ఎలాంటి పనినైనా వీరు చక్కబెట్టేయగలరు! ప్రత్యర్థి పార్టీలో కొమ్ములు తిరిగిన నేత ఒకడుంటే.. అంతటి వాడిని కూడా , అవసరం అనుకుంటే, తమ పార్టీలోకి కొమ్ములు విరిచి లాక్కు రావడానికి వీరు పావులు కదపగలరు. వీరికి తెలిసినదెల్లా ఒక్కటే. ప్రతి పనికీ ఒక రేటు ఉంటుంది. చిన్న లబ్ధికి చిన్ని ధర. పెద్ద లబ్ధికి పెద్ద ధర. వీరు ప్రయోజనాలకు ధర కడతారు! వ్యక్తులకు ధర కడతారు!! చివరికి ప్రజలకు కూడా ధర కట్టగలరు!! వారి అభిప్రాయాలకు కూడా ధర కట్టగలరు!! పార్టీ అధినేత కోరుకున్నది నెరవేర్చడానికి డబ్బు వెదజల్లి కార్యం చక్కబెట్టుకు రాగల సమర్థులు. అందుకే వారు అధినేతను మించి పార్టీని తమ గుప్పెటలో పెట్టుకున్న ఆత్మలు కాగలిగారు. 

డబ్బులు సమీకరించడం, అంతర్జాతీయస్థాయి మనీలాండరింగ్‌ వ్యవహారాలు, నిధులను విరాళాలు ఇతర సాంప్రదాయ మార్గాల్లో తరలించి` పార్టీ కోసం ఖర్చు చేయించడం, ప్రత్యర్థి పార్టీల వ్యక్తుల్తో నేతల్తో లాబీయింగ్‌` వారికి రకరకాల ప్రలోభాలు పెట్టి తమకు అవసరమైన చోట్ల అవసరమైన రీతిలో ఒప్పందాలు చేసుకోవడం.. ఇలాంటివన్నీ వీరు కార్పొరేట్‌ ఉగ్గుపాలతో నేర్చుకున్న విద్యలు. ఈ విద్యలే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్నాయి. 

అచ్చంగా చెప్పాలంటే ప్రజల ఖర్మ అదే. అచ్చంగా పేద ప్రజల కోసం పుట్టిన ఒక పార్టీ.. అసలు పేదలు అంటే నిర్వచనమే తెలియని, ‘పని`లబ్ధి’ అనే వ్యాపార సూత్రం మాత్రమే తెలిసిన వ్యక్తుల కబంధ హస్తాల్లో నడుస్తుండడమే!  ఈ మూడు ఆత్మలు మూడు వైపుల నుంచి ముప్పిరిగొని పార్టీని తమకు తోచిన వ్యాపారాత్మక రీతిలో నడుపుతోంటే.. కనిపించని నాలుగో ఆత్మ లాగా నడిపించేవాడు నారా లోకేష్‌. 

ఆ నడుమ పార్టీ ఆఫీసులో ఒక గుసగుస వినిపించింది. పార్టీ కార్యాలయ నిర్వహణకు కొన్ని పార్టీ పరమైన అవసరాలకు కొంత మొత్తంలో నిధులు అవసరం అయ్యాయి. ఆ సమయానికి పార్టీ ఖాతాలో డబ్బు లేవు. లోకేష్‌కు పురమాయింపు వెళ్లింది. పార్టీలో ఎంత డబ్బుంటే అంతే ఖర్చు చేసుకోవాల్సిందేనని, హెరిటేజ్‌ నుంచి ఒక్కరూపాయి కూడా రాదని ఆయన ‘తన’ కంపెనీ ఖాతాలను బిగదీసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. 

ఇలాంటి వారి నిర్వహణలో నడిచే పార్టీ.. ప్రజల కోసం, లాభాపేక్ష లేకుండా తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో ఎలా వ్యవహరిస్తుందన్నదే ఇప్పుడు  తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో చెలరేగుతున్న ఆందోళన. 

ఆత్మలందు పరమాత్మలు వేరయా!

పైన చెప్పుకున్నది ఆత్మలైతే... తెలుగుదేశం పార్టీని అనుగ్రహించే, అవధరించేందుకు అవతరించిన పరమాత్మలు కూడా వేరే ఉన్నాయి. సదరు పరమాత్మలుగా ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, ఆంధ్రజ్యోతి సంస్థ ఎండీ రాధాకృష్ణల గురించి చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర అధికారాన్ని కట్టబెట్టడం తమ కర్తవ్యంగా భావించే పరమాత్మలు వీరు. అందుకు ఈ పరమాత్మల వద్ద రకరకాల మాయోపాయాలు ఉంటాయి. తమాషా ఏంటంటే.. చంద్రబాబుకు తామంటే తామే అధికారపీఠం అందించాలనే తపన, పోటీ ఈ ఇద్దరు పరమాత్మల మధ్య ఉంటుంది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పోకడ యావత్తూ బురద చల్లడమే. చంద్రబాబు ప్రత్యర్థుల మీద, అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర లేకుండా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మీద తనకు చేతనైనంతగా తాను బురద చల్లుతూ ఆ పార్టీ పట్ల ప్రజల్లో భ్రష్టాభిప్రాయాల్ని నిర్మించడం ఒక్కటే వారి పని! ఇదే కాకుండా రాజకీయ లాబీయింగ్‌ లలో పై పేర్కొన్న ఆత్మలకు సహకరించడం అదనపు బాధ్యత అని పార్టీ ఆఫీసులో అనుకుంటూ ఉంటారు. 

రామోజీరావు తీరు వేరు. ఆయన పోకడలో ఒక విలక్షణత, విశిష్టత ఉంటాయి. ఆయన తెరవెనుక మంత్రాంగాన్ని నడపడంలో సిద్ధహస్తులని చరిత్ర ఎరిగిన వారు అంటుంటారు. ఎన్టీఆర్‌ శకం ముగిసి తెలుగుదేశం చంద్రపరం అయ్యే సంధి సమయంలో జరిగిన రంధి మొత్తం రామోజీ మేథోజనితమే అన్నది అప్పటి పరిణామాలు చెప్పగలిగిన వారు అనే మాట. అలాంటి ప్రత్యేకమైన సేవలను రామోజీ ఇప్పటికీ చంద్రబాబుకు అందిస్తుంటారని ఒక ప్రచారం. 

ఉదాహరణకు లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్‌ నారాయణ్‌.. ఈ రాష్ట్రంలో చంద్రబాబునాయుడును అత్యంత దుర్మార్గమైన పాలకుడిగా అభివర్ణిస్తుండేవారని.. ఆయన పార్టీ  పెట్టకముందునుంచి ఎరిగిన వారు, ఆయనతో ప్రెవేటు సంభాషణల అనుభవం ఉన్నవారు చెబుతుంటారు. అయితే  అదే లోక్‌సత్తా పార్టీ.. ఇప్పుడు చంద్రబాబుతో పొత్తులకు ప్రయత్నించే స్థాయికి తీసుకురావడం వెనుక మేథోయత్నం రామోజీదే అన్నది అందరూ చెప్పేమాట. అలాగే పవన్‌కల్యాణ్‌ పార్టీ స్థాపన వెనుక కూడా రామోజీ ఉన్నారని కొందరు అంటుంటారు. (ఈ విషయాన్ని తొట్టతొలుత గ్రేట్‌ ఆంధ్ర కథనమే బయటపెట్టింది. ఆ తర్వాత రెండు నెలలకు అది కార్యరూపం దాల్చింది). రామోజీరావు విడతలుగా పవన్‌కల్యాణ్‌ను ఫిలిం సిటీకి పిలిపించుకుని మంతనాలు సాగించి.. పార్టీ పెట్టేలా, తదనంతరం.. ఆ పార్టీ తెలుగుదేశం కు అనుకూలంగా వ్యవహరించేలా ఒక స్కెచ్‌ ప్రకారం నడుచుకోవాల్సిందిగా ఆయనకు స్ఫూర్తి ఇచ్చారని అంటుంటారు. నిజానికి స్థానిక పార్టీ నాయకత్వం ఎంత దారుణాతి దారుణంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ భాజపాతో పొత్తు కుదరడంలో కూడా రామోజీ ప్రమేయం ఉన్నదనే వాదన కూడా ఒకటి ఉంది. 

ఇలా కొన్ని ఆత్మలతో పాటూ, కొందరు పరమాత్మలు కలిపి చంద్రబాబునాయుడును అధికార పీఠం పై కూర్చోబెట్టడానికి అహరహం శ్రమిస్తున్నారన్నమాట. 

తప్పేమిటంటే.. ఆత్మద్రోహమే!

మరి నాయకుడు వార్ధక్యం ఒడిలో పడుతున్నప్పుడు.. వీరి సలహాల మీద ఆధారపడితే.. పార్టీకి పునర్‌వైభవం తీసుకురావడానికి మరొకరి మేథోశక్తిని వాడుకుంటే తప్పేమిటని వాదించవచ్చు. కానీ ఇలాంటి వాదన ఆత్మద్రోహం అవుతుందే తప్ప మరోటి కాదు. 

ఎందుకంటే.. వీరందరూ ప్రజల వాసన, కష్టాల వాసన, త్యాగాల వాసన తెలిసిన వారు కాదు. సేవ వ్యాపకంగా ఉన్న వారు వీరిలో ఒక్కరు లేరు. ఇలాంటి ఫక్తు వ్యాపారుల చేతిలో పార్టీని, ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే గనుక.. ప్రభుత్వాన్ని పెడితే గనుక.. వారు సాంతం తమ వ్యాపార ప్రయోజనాల కింద ప్రజల జీవితాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేస్తారు. కానీ చంద్రబాబు వారినే నమ్ముతున్నాడు. ఆయనకు కావాల్సింది అధికారం ఒక్కటే. ఆ అధికారం అందించగల వారికి ఏమైనా దఖలు పెట్టగలడు.

ఇలాంటి వ్యాపార బంధాల పునాదుల మీద.. అశక్త నేత.. ఆత్మలు పరమాత్మల ఆవాహనలో సాగించే పాలన ఎలా ఉంటుంది? ఈ ఆలోచన ఇవాళ ప్రజలకు అవసరం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?