Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

దొరలా? దొంగలముఠాలా?

దొరలా? దొంగలముఠాలా?

ఇంట్రో : దొంగలు దొంగలు ఊళ్లు పంచుకోవడం అంటే ఏమిటి? 'నువ్వు ఆ ఊరిని దోచుకో, నేను ఈ ఊరిని దోచుకుంటా' అని పెద్దమనుషుల్లాగా ఒప్పందాలు చేసుకోవడం. ఇలాంటి ఒప్పందాలను బహిరంగంగా చెప్పరు. గ్రామాలను దత్తత తీసుకున్నట్లుగా ప్రకనటలు చేయరు. కానీ ఇది 'దోపిడీకి దత్తత'! శ్రీమంతుడు మహేష్‌బాబు చెప్పినట్లుగా 'నిన్నూ వాణ్నీ, వాణ్నీ.. ఎవ్వర్నీ విడిచిపెట్టేదిలేదు.. అందర్నీ' దోచేసుకుంటా.. అని వారు ఒక ఒప్పందానికి వస్తారు. అమరావతి నగరం విషయంలో అదే జరుగుతోందా అని సందేహాలు కలుగుతున్నాయి. ఇవాళ ఉన్న రైతుల ఏడుపులు, విలాపాగ్నులు కొన్నాళ్లకు సమసిపోతాయేమో.

కానీ అన్నీ అనుకున్నట్లు జరిగితే తెలుగుజాతికి ఒక గొప్ప నగరం తయారవుతుంది. అంతవరకు సంతోషం. కానీ... దాని పునాదుల నిండా దొంగలముఠాల అరాచకదోపిడీ నిండిపోయి ఉంటే... అది ఎప్పటికీ మచ్చగానే మిగిలిపోతుంది. అమరావతి శంకుస్థాపనకు అయిన ఖర్చుల విషయంలో అందరూ చందాలేసుకున్నారు.. అని చెబుతున్న చంద్రబాబు అన్ని కోట్ల రూపాయల భారీ ఖర్చును పంచుకున్న వదాన్యులైన మహనీయులు ఎవరెరవరు? ఎంతెంత సొమ్మును భరించారు? అనే మర్మం ఎందుకు దాచిపెడుతున్నారు. ఆయన ఆ వివరాల్ని ఆయన దాచిపెట్టినంత వరకు అమరావతి నగరాన్ని దొంగలముఠాలు పంచుకుంటున్నట్లుగానే భావించాల్సి ఉంటుంది. 

ఉపోద్ఘాతం : 

పదేళ్ల సుదీర్ఘమైన కాంగ్రెస్‌ పరిపాలన తుది అంకంలో రాష్ట్రం రెండుముక్కలైన తరువాత.. కొత్త ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని నారా చంద్రబాబునాయుడు దక్కించుకున్నారు. గద్దె ఎక్కిన తర్వాత రోజుల వ్యవధిలోనే.. ప్రభుత్వంలోని ఒక్కొక్క శాఖలో పరిస్థితులు ఏమిటో రాష్ట్ర ప్రజలకు వివరిస్తూ ఆయన శ్వేతపత్రాలు విడుదల చేశారు. కాంగ్రెస పాలనలో ఏయే శాఖ ఎలా భ్రష్టు పట్టిపోయిందో.. ఎంతటి అరాచకత్వం ప్రబలిపోయిందో.. నిధుల కొరత ఎంత ప్రబలంగా ఖజానాకు ప్రమదకరంగా తయారై ఉన్నదో.. సదరు శ్వేతపత్రాల ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పడాన్ని ముఖ్యమంత్రి తన బాధ్యతగా పరిగణించారు. 

ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని అతి సుదీర్ఘ కాలం ఏలిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మోనార్క్‌ పోకడలకు మారు పేరు. అలాంటి చంద్రబాబు ఇంత విపులంగా.. ప్రజలకు శ్వేతప్రతం ద్వారా.. ప్రభుత్వ  ఆర్థిక స్థితిని తెలియజేయడం అనేది చాలా గొప్ప పరిణామం అని జనం అనుకున్నారు. నిజానికి ఆ శ్వేతపత్రాలన్నీ కాంగ్రెస్‌ పాలనను విమర్శించడానికి మాత్రమే ఉద్దేశించినవి అని చాలా మంది అనుకున్నారు. 

ప్రభుత్వం వద్ద నిధులు, పరిస్థితి గొప్పగా లేదు... కనుక.. మేం ఏమీ చేయలేకపోయినా మమ్మల్ని తప్పు పట్టవద్దు పాత  పాలకుల పాపాల వల్లనే ఇలాంటి స్థితి వచ్చింది.. అని ప్రజలను మాయ చేయడానికి ఈ శ్వేతపత్రాలు ఒక ముసుగు అని కొందరు మాత్రం గ్రహించారు.

మొత్తానికి తెలుగుదేశం అభిమానులు, తాము తటస్థులం అని చెప్పుకునే వారు అనేకమంది.. ప్రభుత్వంలో పారదర్శకతకు చంద్రబాబునాయుడు పెద్దపీట వేస్తున్నాడనడనికి ఇదే నిదర్శనం అంటూ పదేపదే కీర్తించారు. 'అవును కాబోలు' అనుకోవడం సామాన్యుల వంతయింది. 

ఆ తర్వాత చంద్రబాబునాయుడు పరిపాలన మొదలైంది. ఇప్పటికి పదిహేను నెలలు గడిచాయి. అమరావతి నగరానికి శంకుస్థాపన వరకు వ్యవహారం వచ్చింది. ఇప్పటిదాకా ఖర్చులు ఎలా జరుగుతున్నాయి. ఎంతెంత వ్యయం చేస్తున్నారు. పుష్కరాలకు అయిన ఖర్చు ఎంత? ప్రభుత్వం సాధించిన రాబడి ఎంత? చంద్రబాబు నాయుడు విదేశీ టూర్లకు చార్టర్డ్‌ విమానాలను తీసుకువెళ్తుండడానికి అవుతున్న ఖర్చు ఎంత? మామూలు విమానాల్లో వెళ్లి ఉంటే అయ్యేఖర్చుకు దానికి వ్యత్యాసం ఎంత? చంద్రబాబు హైదరాబాదు సెక్రటేరియేట్‌లోని కార్యాలయానికి, ప్రస్తుత విజయవాడ క్యాంప్‌ ఆఫీసుకు సెలవు చేసిన రొక్కమెంత? ఏడాదిలోగా రెండు ఆఫీసులు రెడీ చేయడానికి ఎన్ని కోట్లు వృథా అయ్యాయి. ఇలాంటి అనేక డబ్బు పరమైన లెక్కల విషయంలో ప్రజలకు సందేహాలు ఉన్నాయి. ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. అది వారి హక్కు. వారు ఓట్లు వేస్తే గెలిచి... వారి సేవ చేయడానికి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన వ్యక్తిగా.. వారు తెలుసుకోగోరిన సమాచారాన్ని చెప్పడం చంద్రబాబు నాయుడు మీద ఉన్న బాధ్యత. ఆ బాధ్యతను ఆయన నెరవేర్చలేకపోతే.. అంతా దొంగలముఠాకు పంపకాలు జరుగుతున్నాయని.. సాంతం ముంచేసే వరకు ఇలా గుంభనంగానే గుట్టుచప్పుడు కాకుండా.. పనులు నడిపిస్తారని ప్రజలు సందేహిస్తారు. 

రుణమాఫీ మొత్తాలకు టముకేస్తుంటారే?

చంద్రబాబు అంటే పారదర్శకతకు పర్యాయపదం అని మీడియా తన గురించి ప్రచారం చేయాలని ఆయన ఆశపడుతుంటారు. తరచూ గణాంకాలు వెల్లడిస్తూ.. తాను ఏయే పథకాలు ఎంతెంత సొమ్ములు ఖర్చు పెట్టానో.. ఎంత ఘనంగా ప్రజా సంక్షేమాన్ని నిర్వర్తిస్తున్నానో చెప్పడానికి ఆయన చాలా ప్రెస్‌మీట్‌లు నిర్వహిస్తూ ఉంటారు. దాన్ని సరిగ్గా ప్రచారంలో పెట్టించేందుకు కోట్ల రూపాయల వ్యయంతోనైనా 'గోబెల్స్‌' ను నియమించుకుంటూ ఉంటారు. రైతుల రుణమాఫీకి ఇప్పటిదాకా ఎన్నివేల కోట్లరూపాయలు ఖర్చు పెట్టారో..? డ్వాక్రా రుణాల మాఫీకి ఎన్ని కోట్లు ఖర్చయ్యాయో? ఇవన్నీ ఆయన పదేపదే ప్రస్తావిస్తూ ఉంటారు. 

'ఇరవైవేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేశాం. ఆ సొమ్ము ఉంటే రాజధాని నిర్మాణం ఒక దశ వరకు పూర్తయిపోయి ఉండేది..' అనే సంగతిని చంద్రబాబు ఎన్నిసార్లు ప్రస్తావించారో లెక్కలేదు. నిజానికి ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన ధోరణికి నిదర్శనం. 'మంచానపడ్డ ముసలి తల్లికి అన్నం పెట్టి, మందులు కొంటే.. అందుకు ఎంత ఖర్చయిందో లెక్కలేసి.. మందులు, తిండికి పదివేలు ఖర్చు పెట్టాను చూశారా.. ఆ ఖర్చుతో ఆమెకు మంచి సమాధి కట్టించి ఉండేవాడిని'' అని వ్యాఖ్యానిస్తే ఎంత హేయంగా ఉంటుందో... ఇది కూడా అలాంటిదే! రైతులకు రుణమాఫీ కోసం ఇచ్చిన సొమ్ము గురించి చంద్రబాబు మైలేజీ కక్కుర్తితో చాటుకోవాలని చూడడం.. ఆయన భావదారిద్య్రానికి నిదర్శనం. రుణమాఫీ అనే పాట పాడినందుకు మాత్రమే.. దాన్ని నమ్మి మెజారిటీ రైతులోకం పార్టీ అభిమానాలకు అతీతంగా ఓటు వేసినందుకు మాత్రమే.. ఆయన ఈరోజున ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఏలుతున్నారు తప్ప.. అదే లేకపోతే.. రాజకీయంగా సర్వభ్రష్టత్వం చెంది ఉండేవారనే సంగతి ఆయనకు తెలుసు!

ఇదేనా పారదర్శక నీతి!

రైతులంటే చంద్రబాబుకు ఎంత చులకన అనే సంగతి ప్రతిసారీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోట్లు దండిపెట్టే పారిశ్రామికవేత్తలు, దళారీలు తప్ప ఆయన వద్ద అగ్రపూజ పొందగల వారు మరొకరు ఉండరు. వ్యవసాయం దండగనే వ్యాఖ్యలతో జనం తనను ఛీత్కరించుకునే పరిస్థితిని సృష్టించుకున్న చంద్రబాబు.. ఇటీవల కూడా.. 'వ్యవసాయం లాభ సాటి కాదు.. కోళ్లూ ఆవులూ పెంచుకుంటే తప్ప బతకలేరు' అంటూ తన చులకన భావాన్ని వ్యక్తీకరించడం మనకు తెలియని సంగతి కాదు. అయితే రైతుల విషయంలో చంద్రబాబు ఓ పారదర్శకతకు తెరతీశారు. ప్రతి గ్రామంలోనూ ఏయే రైతుకు ఎంత రుణం మాఫీ చేశారో.. గ్రామంలో బహిరంగంగా బోర్డులు ఏర్పాటుచేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. అంటే 'తన ద్వారా ఎవరు.. ఎంత.. ఆర్థిక లాభం పొందారో' ఊరందరికీ తెలిసేలా.. వారి మెడల్లో మూర్ఛబిళ్లలు వేసినట్లుగా.. ఈ బోర్డులుంటాయన్నమాట. ఈ వ్యవహారానికంతా ఆయన పారదర్శకత అని ముసుగు వేశారు. మరి అదే సమయంలో అమరావతి ఖర్చులో ఏయే ధర్మాత్ములు ఎంతెంత విరాళాలు ఇచ్చారు.. మొత్తం ఎన్ని వందల కోట్ల రూపాయలు తగలేశారు.. అనే సంగతిని కూడా ఇంతే పారదర్శకంగా రాష్ట్రమంతా బోర్డులు ఏర్పాటు చేయించాలనే ఆలోచన ఆయనకు ఎందుకు కలగడం లేదు. వ్యవహారాన్ని మొత్తం పరిపాలకుల్లాగా కాకుండా.. దొంగలముఠాలాగా నడిపిస్తున్నారనడానికి ఇంతకంటె ఉదాహరణ ఇంకేం కావాలి. 

అమరావతికి సంబంధించిన విషయంలోనే మరో మంచి ఉదాహరణను కూడా ఖచ్చితంగా ప్రస్తావించుకోవాలి. 

'మైబ్రిక్‌ మై అమరావతి' అంటూ మరో అద్భుతమైన పథకాన్ని చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఒకవైపు రాజధానిలో ప్రభుత్వభవనాలు అన్నింటికీ కేంద్రమే నిధులు ఇస్తుందని అంటూనే, మిగిలిన రాజధాని అభివృద్ధి మొత్తం సింగపూర్‌ జపాన్‌లు పెట్టుబడి పెడతాయని మభ్యపెడుతూనే... మళ్లీ ప్రజలను విరాళాలు ఇవ్వమని, ఇటుకలు కొనుగోలు చేయమని.. ఏ ఖర్చులకోసం అడుగుతున్నారో సామాన్యుల బుర్రలకు అర్థం కాని సంగతి. 

ఏది ఏమైనప్పటికీ..  'మైబ్రిక్‌' అనే పదం ద్వారా.. 'నా రాష్ట్ర రాజధాని నిర్మాణంలో నాది అనదగిన ఒక ఇటుక కూడా ఉన్నది...' అని రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి కూడా ఒక భావోద్వేగపు అనుబంధం ఏర్పడాలని చంద్రబాబు సర్కారు ఈ పథకాన్ని ప్రారంభించారని అనుకోవచ్చు. అంతా పారదర్శకంగా గనుక జరుగుతూ ఉంటే దీనిని చాలా అద్భుతమైన విరాళాల సేకరణ కార్యక్రమంగా భావించాలి. తలో చెయ్యీ వేస్తేనే రామసేతువైనా నిర్మాణం అవుతుంది. మంచిదే.

కాకపోతే.. ప్రస్తుతాంశం ఏంటంటే.. ఈ 'మైబ్రిక్‌' వెబ్‌సైట్‌నుంచి ఎవరైనా సరే.. ఇటుకలను కొనడానికి విరాళం ఇవ్వవచ్చు. ఒకఇటుకు పది రూపాయల వంతున ఆన్‌లైన్‌లో చెల్లిస్తే సరిపోతుంది. వెయ్యి, రెండు వేలు ..ఇలా పెద్దసంఖ్యలో కొన్నవారి ఫోటోలను కూడా ఆన్‌లైన్‌లో ప్రదర్శిస్తారు. చివరికి ఒకటి, రెండు ఇటుకలు కొన్నప్పటికీ కూడా వారి పేర్లను ఆ సైట్‌లో పొందుపరచి గౌరవిస్తారు. అంటే.. అమరావతి కోసం విరాళంగా అందే ప్రతి రూపాయినీ పారదర్శకంగా ఆ జాబితాలను ప్రజలకు ఆనలైన్‌లో అందుబాటులో ఉంచుతున్నాం అని చంద్రబాబు చాటదలచుకున్నారు. నిజంగా ఈ ప్రయత్నాన్ని అభినందించాలి. 

ఇంత పారదర్శకత ఉన్న నేత శంకుస్థాపన విషయంలో మాత్రం ఎందుకు దాచిపెడుతున్నారు. రాజధాని శంకుస్థాపన పేరుతో 400 కోట్ల రూపాయలు తగలేస్తున్నారంటూ ప్రతిపక్ష నేత జగన్‌ విమర్శించారు. ఆయన తప్పు చెబుతున్నారంటూ తెదేపా మంత్రులు విరుచుకుపడ్డారు. జగన్‌ తప్పే చెప్పారనుకుందాం. మరి ఒప్పు ఏమిటో తెదేపా మంత్రులు చెప్పాలి కదా? కృష్ణాజిల్లా కలెక్టరుకు 2 కోట్లు, గుంటూరు కలెక్టరుకు 7 కోట్లు తప్ప మరేం ప్రభుత్వపు ఖర్చు లేదని.. మంత్రి నారాయణ సెలవిచ్చారు. మిగిలిన మొత్తం ఖర్చు స్పాన్సర్లు పెడుతున్నారని చెప్పారు. 

ప్రజలు అడుగుతున్నది కూడా అదే! ఆ స్పాన్సర్లు ఎవరు? ఎంతెంత పెట్టారు? మొత్తం ఎంత ఖర్చయింది? అనే సంగతి ఆ ప్రజలకు చెబితే మీ సొమ్మేం పోయింది. అన్ని వందల కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చిన సదరు స్పాన్సర్లకు తెలుగుజాతిమొత్తం జై కొడుతుంది కదా! పది ఇటుకలు కొన్నవారి పేర్లు ఆన్‌లైన్‌ లో పెట్టి దాతల కింద చూపిస్తూన్నప్పుడు పది కోట్లు ఇచ్చిన మహాదాతల పేర్లు ఎందుకు చెప్పడం లేదు అనేదే అందరి సందేహం.

'దొంగలముఠా' ఎందుకంటే..

'ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే' అని ఆర్యోక్తి. ఫలితం ఆశించకుండా ఎవ్వరూ ఏ పనీ చేయరు..! స్పాన్సర్ల రూపంలో ఉదారంగా దానంగా పెట్టుబడులు పెట్టేవారు అమరావతి మీద భక్తితో పెడుతున్నారా? లేదా, చంద్రబాబు మీద ప్రేమతోనా? అనేది మీమాంస! అమరావతి మీద భక్తితో అయితే.. ఆ నగరంలో ఒక భవనాన్ని నిర్మించడానికో, ఒక నిర్దిష్ట రూపానికో డబ్బు వెచ్చిస్తారు గానీ.. శంకుస్థాపనకు ఎందుకు తగలేస్తారు? అదే చంద్రబాబు మీద ప్రేమతోనా అయ్యేట్లయితే ఆయన మనవడి బారసాలకు ఖర్చు చేస్తారు గానీ.. అమరావతి మట్టిలో డబ్బెందుకు పోస్తారు!? ప్రజలకు ఉన్న ఇలాంటి సందేహాలు అన్నీ నివృత్తి కావాల్సి ఉంది. 

ఆరంభంలో చెప్పుకున్నట్లుగా.. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకోవడం అంటే ఇలాగే జరుగుతుంది. అమరావతి నిర్మాణాల కాంట్రాక్టులు దక్కించుకోడానికి.. తద్వారా చాలా భారీగా లబ్ధి పొందదలచుకున్న వారు మాత్రమే.. ఇప్పుడు స్పాన్సర్ల రూపంలో ఎరలాగా ముష్టిలాగా కొంత డబ్బు ఖర్చు పెడుతున్నారనేది జనం అనుమానం. ఈ అనుమానాన్ని నివృత్తి చేయడం ముఖ్యమంత్రి బాధ్యత. అందుకే పేర్లు బయటపెట్టేస్తే.. భవిష్యత్తులో అక్కడి పనుల కాంట్రాక్టులను అప్పగించేప్పుడు.. ఇప్పుడు ఎరలు వేసిన వారికే పనులు దక్కాయా? లేదా, టెండర్లు సక్రమంగా పాడుకున్న వారికే దక్కుతున్నాయా అనేది ప్రజలే పరిశీలించుకోవడం సాధ్యమవుతుంది.  చంద్రబాబు పారదర్శకంగా.. కేవలం అమరావతి ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారో లేదో.. తన వర్గం, తన కోటరీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో ప్రజలు తమ స్వబుద్ధితో బేరీజు వేసుకుంటారు. 

జరుగుతున్న పరిణామాల గురించి ప్రజలు తమ సొంత వివేచనతో నిర్ణయం తీసుకునే అవకాశాన్ని చంద్రబాబు ఇవ్వడం లేదు. తాను ఏం చెబితే అదే కరెక్టు అని, తాను చేసినదంతా నిజాయితీ అని భావించమని ఆయన ప్రజలను నిరంకుశంగా నిర్దేశిస్తున్నట్లుగా పాలన సాగిస్తున్నారు. పరిపాలనలో పారదర్శకత అనే పదానికి పాతర వేస్తున్నారు. 

మార్కెటింగ్‌ ద్వారా ఏం బిజినెస్‌ అయింది!

శంకుస్థాపనకు భారీగా నిధులు ఖర్చు అవుతున్నాయనే విమర్శలు వచ్చినప్పుడు చంద్రబాబు ఒక మాట చెప్పారు. ఎవరిని వారే మార్కెటింగ్‌ చేసుకోవాలి. ఇదంతా మార్కెటింగ్‌ స్ట్రాటెజీ.. ఎంత మార్కెటింగ్‌ బాగుంటే అంత లాభం ఉంటుంది అని సెలవిచ్చారు. నిజమే ఏమో అనుకున్నారు జనం. ఒకప్పట్లో 'ఏపీ సీఈవో' అని పిలిపించుకోడానికి ముచ్చటపడ్డ ఈ ముఖ్యమంత్రి, ఇప్పుడు మార్కెటింగ్‌ సేల్స్‌మ్యాన్‌లాగా ఎత్తు వేశారేమో అనుకున్నారు. పెద్ద వేడుకలాగా హడావిడిచేస్తే.. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయేమో అనుకున్నారు. మోడీకి ఈ భారీ ఆర్భాటాన్ని రుచిచూపిస్తే.. ఆయన మరిన్ని ఎక్కువ వరాలు కురిపిస్తారేమో..అని ఆశించారు. కానీ మార్కెటింగ్‌ పేరుతో భారీగా తగలేయడం అయితే జరిగింది గానీ.. సేల్స్‌ మాత్రం హళ్లికి హళ్లి.. సున్నకు సున్న. ఏమీ జరగలేదు, ఒరగలేదు. చివరికి ఆఫ్రికా వారు పిలిస్తే వెళ్లిన ఫంక్షన్‌లోనూ భారీ వరాలిచ్చిన ప్రధాని మోడీ.. తెలుగు జాతి ఆశల మీద మాత్రం అత్యంత కిరాతకంగా నీళ్లు చల్లి వెళ్లిపోయారు. 

మరి చంద్రబాబు మార్కెటింగ్‌ స్ట్రాటెజీ ఏమైనట్లు? ఏదో సాధించేస్తానని తగలేసిన డబ్బుకు ఎవడు జవాబుదారీ? నిన్నటి సీఈవో , ఇవాళ సేల్స్‌మ్యాన్‌ గాకూడా ఫెయిలైనట్లుగానే ఈ మొత్తం ఎపిసోడ్‌ నిరూపిస్తోంది.

ప్రభుత్వం ఒకరి సొత్తు కాదు. జనం గెలిపించిన మామ నుంచి తాను దక్కించుకున్నప్పుడూ, జనాన్ని నిర్లక్ష్యం చేసి కోల్పోయినప్పుడూ, పొత్తులు, కుల సమీకరణల పుణ్యమాని తిరిగి గద్దె ఎక్కినప్పుడూ.. చంద్రబాబుకు ఈ విషయం స్పష్టంగానే తెలిసి ఉంటుంది. పాలన సాగిస్తున్నప్పుడు పారదర్శకంగా ఉండడం అనేది.. ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ప్రజాదరణను పెంచుతుంది. ఆయన గుప్పిట మూసుకుని ఉన్నంత వరకు ప్రజల్లో ఉన్న అనుమానాలు చిలవలు పలవలుగా ముదిరి పెనుభూతాలుగా పరిణమిస్తూనే ఉంటాయి. ప్రజల్లోని ఆ అనుమానాలు ఏదో ఒకనాటికి ప్రభుత్వానికి, పాలకులకు బుద్ధి చెబుతాయి. పరిస్థితి అంతవరకు రాకుండా చంద్రబాబునాయుడు తన తీరు మార్చుకోవాలి. 

- సురేష్‌

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?