Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

కుప్పంలో కళ తగ్గిందేం బాబుగారూ!

కుప్పంలో కళ తగ్గిందేం బాబుగారూ!

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి హోదాలో తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించే ఫ్రీక్వెన్సీ గతంలో కంటె ఇప్పుడు పెరిగింది. ఇది మంచి పరిణామమే. ఎంత ముఖ్యమంత్రి అయినప్పటికీ... ఆయన ఒక సెగ్మెంటుకు ఎమ్మెల్యేనే! తన సొంత నియోజకవర్గాన్నే పట్టించుకోని వాడు... రాష్ట్రాన్నేం పట్టించుకుంటాడు.. అనే విమర్శలు సాధారణంగా వస్తుంటాయి. ఆ మేరకు చంద్రబాబు తనను గెలిపించిన మనుషుల్ని ఈసారి కాస్త ఎక్కువగా పట్టించుకుంటున్నందుకు అభినందించాలి. 

అయితే వాస్తవం ఏంటంటే.. ఆయనలో ఈ మార్పు అంత హఠాత్తుగా, సహజంగా వచ్చిన మార్పు కాదు. తన సొంత ఊరు ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో ఒకసారి ఓడిపోయిన తర్వాత.. చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లాలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అప్పట్లో అక్కడి నాయకుడు రంగస్వామినాయుడు పక్కకు తప్పుకుని చంద్రబాబుకు అవకాశం ఇచ్చారు.

అప్పటినుంచి కుప్పం నియోజకవర్గం చంద్రబాబుకు బ్రహ్మరథం పడుతూ వచ్చింది. ఎంత దారుణంగా కుప్పం ప్రజలు చంద్రబాబును ఆదరించారంటే... చిత్తూరు ఎంపీ నియోజకవర్గం పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో తెదేపా దారుణంగా ఓడిపోయినా.. కేవలం కుప్పంలో చంద్రబాబు సాధించే మెజారిటీ అక్కడ పడే ఓట్ల బలంతో చిత్తూరు ఎంపీస్థానాన్ని పార్టీ గెలుస్తూ ఉండేది. అయితే చంద్రబాబును అంతగా నెత్తిన పెట్టుకున్న కుప్పం ప్రజలు కూడా క్రమంగా వాస్తవాల్ని గ్రహిస్తున్నారు.

తమ నియోజకవర్గంలో చూసుకోడానికి పెద్ద పెద్ద ప్రభుత్వ కార్యాలయాల భవనాలు గట్రా తప్ప.. ప్రజలకు వాస్తవమైన అభివృద్ధి ఏదీ జరగలేదని వారు గ్రహించారు. చంద్రబాబు ప్రభ తగ్గుతూ వస్తోంది. గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు మెజారిటీ బాగా తగ్గింది. ఈ సంకేతం మోగించిన ప్రమాద ఘంటికల పుణ్యమే.. చంద్రబాబు తరచూ ఇక్కడకు వస్తుండడం.. సరికొత్త హామీలు ఇవ్వడం అని అంతా భావిస్తున్నారు. 

తాజా అబ్జర్వేషన్ ప్రకారం.. చంద్రబాబు పరిస్థితి అక్కడేం మెరుగుపడలేదు. కుప్పంలో ఆయన రెండు రోజులు జరిపిన పర్యటన కాస్త కళ తప్పి కనిపించిందని పలువురు అంటున్నారు. మరో సమాచారం ప్రకారం.. కుప్పం నియోజకవర్గం గురించి చంద్రబాబు చేయించుకున్న కొన్ని సర్వేలు మెజారిటీ పాతికవేలు తగ్గుతుందని అంచనా వేసినట్లు కొన్ని పుకార్లున్నాయి. ఆ దాఖలాలు ఈ పర్యటనలోనూ కనిపించాయి. 

ఇంతకూ ఈ పరిస్థితి ఎందుకువచ్చింది? చంద్రబాబునాయుడు ఇన్నాళ్లూ తన నియోజకవర్గానికి ఏమీ చేసుకోలేకపోయారా? అనేది ప్రజల్లో మెదిలే సందేహం. ముందే చెప్పుకున్నట్లు చంద్రబాబు చేసినదెల్లా.. ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి పెద్దపెద్దభవంతులు కట్టించారు. కానీ అక్కడి ప్రజల స్థితిగతులు ఇప్పటికీ దీనంగానే ఉన్నాయి. కుప్పం నుంచి బెంగుళూరుకు ఒక రైలు సర్వీసు ఉంది.

అది అక్కడి ప్రజలకు కల్పతరువు. ప్రతిరోజూ- దాదాపు రెండువేల మంది కుప్పం యువకులు పొట్ట చేత్తో పట్టుకుని బెంగుళూరుకు వెళ్తుంటారు. సాయంత్రం వరకు తమ స్థాయికి తగ్గ కూలిపనులు, ఉద్యోగాలు చేసుకుని తిరిగి వచ్చేస్తుంటారు. అంతగా దైనందిన వలసల పర్వమే వారికి ఆధరవు. నలభయ్యేళ్ల రాజకీయానుభవం ఉన్న నేత సొంత నియోజకవర్గంలో ఉండవలసిన పరిస్థితి అదేనా? అలాంటి పరిస్థితే కొత్తతరంలో కొత్త ఆలోచనల్ని పుట్టిస్తూ ఆయన వెలుగు, కళ తగ్గేలా చేస్తోంది. 

మరి చంద్రబాబునాయుడు కేవలం పర్యటనలు చేయడం, విమానాశ్రయం తెస్తా.. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పెట్టిస్తా లాంటి.. జనానికి ఏమాత్రం కిక్ ఇవ్వని హామీలతో ఊదరగొట్టడమేనా.. ప్రజలు నిజంగా తనను తిరిగి ప్రేమించగల రీతిలో నిర్దిష్టమైన పనులేమైనా చేసి మెప్పిస్తారో వేచిచూడాలి. 

- కపిలముని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?