Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

జగన్‌ 'తప్పు'టడుగులు

జగన్‌ 'తప్పు'టడుగులు

పాలకుల వైఫల్యాలు రాష్ట్రప్రజలకు కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తూనే ఉన్నాయి. 

-ఈ వైఫల్యాల నుంచి విముక్తి కల్పించే ఆధరవు ప్రజలకు కనిపించడం లేదు.

ప్రత్యామ్నాయంగా ఆశ పెట్టుకోవడానికి ఒకే ఒక ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌. కానీ వారి పనితీరు భయాన్ని పెంచుతోందా.. నమ్మకాన్ని పెంచుతోందా.. అనేది సందేహం. 'నేనున్నా' అనే భరోసాను ప్రజలకు కలిగించడంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రమాణాల మేరకు లేదు. ఎందుకని.. వైఫల్యపు జాడలు ఎక్కడ ఉన్నాయి? ఈ ప్రశ్నలు తటస్థులైన సామాన్యులనే కాదు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభిమానుల్ని కూడా ఆందోళనకు గురిచేసేవి.

జగన్‌ వ్యవహార సరళి గురించి చాలా ప్రతికూల వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని అక్కసుతో చేసేవి, కొన్ని అవగాహన లేక చేసేవి.. అనేకం. అయితే వాస్తవంగానూ ఆయన తన తీరును మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇది కేవలం నాయకుడిగా ఆయన అవసరమూ, పార్టీ అవసరమూ మాత్రమే కాదు. రాష్ట్ర ప్రజలకు, భవిష్యత్తుకు కూడా తప్పనిసరి అవసరం.

తన లోపాల విషయంలో జగన్‌ సాకులు చెప్పి తప్పించుకోలేరు. పరిణతి లేదని, అనుభవం తక్కువ అని మరికొంత కాలం వేచిచూడాలని నెపం చెప్పించి తప్పించుకోవడానికి వీల్లేదు. తన రాజకీయ ప్రస్థానంలో.. వైఎస్‌ జగన్మోహనరెడ్డి నడకలో ఏమైనా తడబాటు కనిపిస్తే దానిని బుడిబుడి నడకగా భావించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. అవి ఖచ్చితంగా తప్పటడుగులు.. ఇంకా సూటిగా చెప్పాల్సి వస్తే 'తప్పుటడుగులు'!!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అంతటి అచేతనమైన ప్రభుత్వం మూడున్నరేళ్లు పాలన సాగించిన తర్వాత కూడా.. నిర్దిష్టమైన పురోగతిని ఏమాత్రం చూపించలేని పరిస్థితుల్లో... ఎన్నికల గురించి విపరీతంగా ఒత్తిడికి గురవుతూ ఉండాలి. మూడున్నరేళ్లు ముందు పరిస్థితులకు, ఇవాళ్టి పరిస్థితులకు  తేడాలు లెక్కతీసి రాసుకుంటే.. ప్రభుత్వం ఎంత ఈసురోమని పనిచేస్తున్నదో ప్రతి ఒక్కరికీ అర్థం అవుతుంది. రాజధాని అమరావతి నగర నిర్మాణం అనేది రాష్ట్రానికి అత్యవసరమే! అయితే అదొక్కటే అవసరం అన్న స్థాయిలో దాని గురించి ఊదరగొడుతూ చంద్రబాబు సర్కారు అరచేతిలో అమరావతిని చూపిస్తోంది. మాయ చేస్తోంది.

పచ్చటి పొలాల్ని చదును చేసి మైదానాలుగా మార్చడం మినహా అక్కడ ఇప్పటిదాకా సాధించింది ప్రజలకు అర్థం కావడంలేదు. పోలవరం ఒక అడుగు ముందుకేస్తే.. నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతోంది. ఈ రెండింటి విషయంలో పురోగతి చూపించకుండా చంద్రబాబు మళ్లీ గెలవడం అసాధ్యం. కానీ ఆ వర్గం రాబోయే ఎన్నికల గురించి నిశ్చింతగానే, గెలుపు నమ్మకంతోనే ఉన్నారు. ఇక్కడ తమాషా ఏంటంటే.. ఒకే ఒక్క ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్మోహన్‌ రెడ్డి.. తాను స్వయంగా వారికి ఆ 'నిశ్చింత'ను ప్రసాదిస్తున్నాడు.

వాస్తవికమైన ప్రగతి పనులు చేయని, మాయా ప్రభుత్వాల వెన్నులో వణుకు పుట్టించాల్సిన పాత్రలో ఉన్న జగన్‌... అంత నిర్మాణాత్మకంగా వ్యవహరించడం లేదనే వాదనలు అనేకం ఉన్నాయి. 'బలమైన ప్రతిపక్షం ఉంటే తప్ప.. పాలన సరైన గాడిలో ఉండదు' అని నమ్మే తటస్థ విశ్లేషకుల నుంచి, జగన్‌ తమ ఆశాకిరణం అని నమ్ముకున్న అనుయాయుల వరకు అనేకమందిలో ఈ అభిప్రాయాలు ఉన్నాయి.

జగన్‌ విధిగా ఆత్మసమీక్ష చేసుకోవాల్సిన, ఆమోదించగలిగితే దిద్దుకోవాల్సిన లోపాల్లో కొన్నింటినైనా ప్రస్తావించడానికి గ్రేటాంధ్ర చేస్తున్న ప్రయత్నం ఇది.

'గుండె' సరిగా ఉందా? 

ఏ పార్టీకి అయినా అధినేత మీద సమస్య కార్యభారం నడుస్తుందని అనుకోవడానికి వీల్లేదు. అధినేతతో సమానంగా త్రికరణ శుద్ధిగా పార్టీకోసమే పనిచేసే కీలక వ్యక్తులు మరికొందరి చేతిలో నిర్ణయాధికారం ఉండాలి. వ్యవస్థ ఎన్నడూ అధినేత ఆమోదం కోసం 'ఆగే... నిరీక్షించే' పరిస్థితి ఉండరాదు. అధినేత అంతిమజోక్యం మాత్రమే ఉంటే... పనితీరులో వేగం పెరుగుతుంది.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అలాంటి- గుండెకాయ లాంటి- 'కోర్‌' అనదగిన కమిటీ ఏమైనా ఉందా? ఉదాహరణకు మోడీకి అమిత్‌ షా, అదానీ, ఆరెస్సెస్‌ లాంటి వారి దన్ను ఉంటుంది. చంద్రబాబుకు సుజనా, సీఎం రమేష్‌, నారాయణ లాంటి వారి సెటప్‌ ఒకటి పనిచేస్తుంటుంది. వైరిపక్షాల ఉదాహరణలు వద్దనుకుంటే.. వైసీపీకి ఆరాధ్యుడు అయిన వైఎస్‌ రాజశేఖర రెడ్డికి కేవీపీ, మరికొందరు వ్యక్తుల సహకారం ఇంతే కీలకంగా ఉండేది. ఇలాంటి కోర్‌ కమిటీ నిర్మాణంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ విఫలమౌతోందనే చెప్పాలి.

జగన్‌ ఎవ్వరినీ నమ్మడు- అనే ఆరోపణతో దీనికి ముడిపెట్టడం సరికాదు. ఆ మాటకొస్తే చంద్రబాబునాయుడు తన నీడను కూడా నమ్మని వ్యక్తి.. అని ఆయన హితులే గతంలో కితాబులిచ్చారు. జగన్‌ చాలా బెటర్‌. కానీ పార్టీకి తనను మించి కీలకంగా వ్యవహరించగల కోర్‌ కమిటీని నిర్మించడం గురించి ఆయన పట్టించుకోలేదు. డిజిగ్నేషన్ల పరంగా కమిటీలు ఉన్నప్పటికీ.. అంతా జగన్‌ కనుసన్నల్లో పనిచేసేవారే. ఇది కరెక్టు కాదు.

'నిర్ణయం- నిర్వహణ- అనుసరణ' ఇవి మూడు వేర్వేరు దశలు. వ్యాపారం, ఉద్యమం, పోరాటం, రాజకీయం ఏదైనా సరే ఈ మూడు వ్యవస్థలను సమీకతంగా అమలు చేయడం తప్పనిసరి. ఈ మూడూ చాలా గురుతరమైన బాధ్యతలు. ఈ భారాన్ని మోయడానికి వేర్వేరు వ్యవస్థలు ఉండాలి. ఈ వ్యవస్థలు స్వతంత్రంగానూ పనిచేయాలి. కానీ జగన్‌ బాధ్యతల వికేంద్రీకరణను విస్మరించి.. అన్నీ తనే చేయాలనుకున్నంత వరకు పార్టీకి న్యాయం జరిగే అవకాశం లేదు.

ఇన్నేళ్లుగా పార్టీని నడుపుతున్న జగన్‌.. తానుగా ఒక కొత్త నాయకుడిని తయారు చేయలేకపోయారు. తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అప్రతిహతమైన నాయకుడిగా వెలుగొందాడంటే అందుకు పునాది.. ఆయన తయారు చేసిన నాయకులు అనేకులు.. ఆయనకు విశ్వాసపాత్రులుగా విధేయులుగా ప్రవర్తించారు. జగన్‌- తానుగా తయారుచేసిన కొత్త నాయకులే లేకపోవడం కూడా ఒకలోపం. ఈ వ్యవస్థాగత నిర్మాణంపై శ్రద్ధ బాగాపెట్టాలి.

విపక్ష పాత్రలో 'రిలాక్సింగ్‌' తగదు.

ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ప్రతిపక్షం ఎలా వాడుకోవాలి అనే విషయంలో స్పష్టతలేదు. మూడున్నరేళ్లుగా నామమాత్రంగా కూడా రాష్ట్ర ప్రగతిని చూపించలేకపోతున్న చంద్రబాబునాయుడు సర్కారు మీద ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత తనకు లాభిస్తుంది లెమ్మనే ఆశతో జగన్‌ గడుపుతున్నట్లుగా కనిపిస్తోందే తప్ప.. ఆ వ్యతిరేకతకు తాను ఆసరాగా నిలబడాలనే బాధ్యతను ఆయన తెలుసుకోవడం లేదు. అలా నడుచుకోవడం లేదు.

ఎంతసేపూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును తిడుతూ ఉంటే చాలు.. అక్కడితో తన బాధ్యత తీరిపోయినట్లే అనుకోవడం విపక్షనేత లక్షణం కాకూడదు. నిజానికి ఏపీలో జగన్‌కు ఉన్నది ఒక అరుదైన అపూర్వమైన అవకాశం. మరోపార్టీ ఊసు కూడా లేకుండా.. ఇక్కడ ఏకైక ప్రతిపక్షంగా ఆయన వెలుగొందుతున్నారు. కానీ, ఆ ఎడ్వాంటేజీని ఆయన వాడుకోవడం లేదు. కేవలం చంద్రబాబును తిట్టడం ఒక్కటే ఫలితం ఇస్తుందనుకుంటే పొరబాటు.

అస్త్రాలన్నీ వాడేయడమేనా?

యుద్ధం పరాకాష్టకు చేరుకున్న తరువాతనే.. మన పురాణాల్లోని హీరోలు బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీస్తారు. అప్పటిదాకా కొన్నిరోజుల తరబడి యుద్ధం చేస్తూనే ఉంటారు. మామూలు ఆయుధాలు అస్త్రాలు వాడుతారు. మరి యుద్ధం మొదలవగానే బ్రహ్మాస్త్రం వేసేస్తే పనైపోతుంది కదా.. అనే అనుమానం మనకెప్పుడైనా వచ్చిందా? లేదు! అన్ని మార్గాలను అనుసరించిన తర్వాతనే.. చివరగా ప్రత్యర్థికి వ్యవధి కూడా లేని సమయంలో.. తమ తురుపుముక్కను బయటకు తీయాలి. కానీ జగన్‌ తీరు వేరుగా ఉంది. తన వద్ద ఉండగల ఎన్నికల అసలు వ్యూహాలేవో... ఆయన రెండేళ్ల ముందునుంచి వాటిని చాలా రహస్యంగా బహిర్గతం చేసుకుంటున్నారు!!

భారతీయ జనతా పార్టీతో జగన్‌ అంటకాగుతారా? లేదా, వైరిపక్షంగానే ఉంటారా? అనేది వేరే సంగతి. భవిష్యత్‌ పరిణామాలు దాన్ని నిర్ణయిస్తాయి. అయితే ఇప్పటినుంచి ఏదో భాజపాతో లాలూచీపడ్డ పార్టీగా ఒక ముద్రను తనకు తానుగా పార్టీ మీద వేయడం వలన.. జగన్‌ చాలా నష్టపోతున్నారనే సంగతిని గుర్తించాలి. 

ఇలాంటి ముద్ర వేసుకున్నంత మాత్రాన.. అటు కమలదళం నెత్తిన పెట్టుకుంటున్నది కూడా లేదు! కాకపోతే భాజపాయేతర పక్షాలన్నీ జగన్‌ను అంటరాని వాడిగా చూస్తున్నాయి. ఆయన ప్రత్యేకహోదా ఉద్యమం చేస్తే.. గతంలో కాంగ్రెస్‌ వామపక్షాల నుంచి కనీసం ప్రకటనల రూపంలోనైనా మద్దతు ఉండేది. ఈ తప్పుడు వ్యూహాల ఫలితంగా.. ఇప్పుడు వారిని కూడా జగన్‌ కోల్పోయారు.

సరిగ్గా ఎన్నికలకు కొంత వ్యవధి ముందు అమ్ముల పొదిలోంచి బయటకు తీయవలసిన వ్యూహాల అస్త్రాలను ఆయన రెండేళ్ల ముందునుంచి పదేపదే వాడేస్తూ.. పరోక్షంగా తన ప్రత్యర్థులు అప్రమత్తం కావడానికి తానే సహకరిస్తున్నారు. రెంటికి చెడ్డరీతిలో.. జగన్‌ చివరకు ఒంటరిగా మిగిలే ప్రమాదం కనిపిస్తోంది. వాస్తవంలో తన పార్టీని బలోపేతం చేసుకుంటే తప్ప.. ఎవ్వరూ తన మైత్రి కోసం ఎగబడరనే వాస్తవాన్ని జగన్‌ గుర్తుంచుకోవాలి. పార్టీని వ్యవస్థీకతంగా బలపరుచుకోవాలి. ఆ పని చేయకుండా.. ఇతరత్రా మార్గాలను ఆశ్రయిస్తే సత్ఫలితాలు ఉంటాయి.

కలాలకు విలువ ఇవ్వాలి

'మాన్యుఫాక్చరింగ్‌ కన్సెంట్‌' అనేది తీసివేయదగిన చిన్న అంశం ఎంతమాత్రమూ కాదు. మీడియా ద్వారా ప్రజామోదాన్ని 'తయారు' చేయవచ్చుననేది సార్వజనీనమైన సత్యం. ఈ విషయంలో నారా చంద్రబాబునాయుడు ఆరితేరిన ఉద్ధండుడు. ప్రభుత్వం ఏమీ చేయకపోయినా.. ఏదో చేసేస్తున్నట్టుగా ప్రజాభిప్రాయాన్ని నిర్మించడంలో తెలుగునేలపై ఉన్న యావత్‌ మీడియాను వాడుకుంటూ ఆయన చెలరేగుతుంటారు.

మీడియాను వాడుకుని 'మాన్యుఫాక్చరింగ్‌ కన్సెంట్‌' చేయవచ్చుననే నామ్‌చోమ్‌ స్కీ సిద్ధాంతం అక్షరసత్యం. అయితే జగన్‌కు ఈ విషయంలో చులకన అభిప్రాయం ఉన్నదనే సంగతి ఆయనను సన్నిహితంగా ఎరిగిన కొందరికి మాత్రమే తెలుసు. తనకు సొంత మీడియా ఉన్నది గనుక.. తాను మీడియా మీద ఆధారపడాల్సిన అవసరం లేదనేది ఆయన అభిప్రాయం.

జగన్‌ కాలు కదిపితే చాలు... సాక్షి పత్రిక, టీవీ దానిని బాగా హైలైట్‌ చేస్తూ ఉంటాయి. అయితే జగన్‌ అనుకూల మీడియా ముద్ర ఉన్నప్పుడు ఆ రెండూ ఎంత మంచి ప్రచారం చేసినా.. జగన్‌ అభిమానులకు మాత్రమే అది రీచ్‌ అవుతుంది తప్ప.. ఆయనకు కొత్త అభిమానుల్ని తయారు చేయదు.. అనే వాస్తవం ఆయన తెలుసుకోవాలి. సాక్షి ఒక్కటే ప్రజామోద నిర్మాణానికి జిందా తిలిస్మాత్‌ కాదని జగన్‌ అర్థం చేసుకోవాలి. ఇతర మీడియా గ్రూపులు సంస్థలతో కనీసం క్షేత్ర స్థాయిలోని పాత్రికేయులతో సత్సంబంధాలు కలిగి ఉండడం విధి అని వైసీపీ తెలుసుకోవాలి.

చిల్లర పొరబాట్లు...

వ్యూహాలను 'అవుట్‌ సోర్స్‌' చేసుకోవడం తప్పుకాదు. స్థానిక పరిస్థితులకు అనుగుణమైన వ్యూహరచన చేయగలిగిన వారిని నమ్మలేకపోయినప్పుడు.. ప్రశాంత్‌ కిషోర్‌ లాంటి వ్యూహాలకు బ్రాండ్‌ ఇమేజి ఉన్న వారిని దిగుమతి చేసుకోవడం తప్పుకాదు. కానీ.. తెరవెనుక ఉండాల్సిన వారిని తెరముందుకు తేవడం జగన్‌ చేసిన ఖచ్చితమైన తప్పిదాల్లో ఒకటి.

ఇవాళ పార్టీ అనుసరించే ఒక వ్యూహం ప్రజలకు నచ్చిందంటే గనుక.. వారు అందుకు జగన్‌ను అభిమానించాలా? లేదా, ప్రశాంత్‌ కిషోర్‌ తెలివితేటలేమో అనుకుని మురిసిపోవాలా? పార్టీ శ్రేణులు జగన్‌ నాయకత్వ పటిమ పట్ల విధేయులై ఉండాలా? లేదా, ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహచాతుర్యాలకు జై కొడుతుండాలా? ఇలాంటి సందిగ్ధానికి నాయకుడు అనేవాడు చోటివ్వకూడదు.

ప్రసంగాలు... ప్రెస్‌మీట్లు, అసెంబ్లీలో మాట్లాడ్డానికి, బహిరంగసభల్లో మాట్లాడ్డానికి చాలాతేడా ఉంటుంది. అసెంబ్లీలో, ప్రెస్‌మీట్‌లోచగణాంకాలు చెప్పి టేలెంట్‌ ప్రదర్శించవచ్చు.. కానీ సామాన్య జనం వేలల్లో గుమికూడిన సభలో.. గణాంక వివరాలను ఏకరవు పెట్టడం రక్తి కట్టించదు. తన తండ్రి వైఎస్సార్‌ కాలంనుంచి చంద్రబాబు దూషణకు వాడుతున్న సామెతలనే మళ్లీ మళ్లీ అరిగిపోయిన రికార్డులాగా వాడడంకాదు.. తన ప్రసంగాల్లో విలక్షణత, జనరంజకత ప్రధానంగా ఉండేలా ఆయన బహిరంగసభల ప్రసంగాలను ప్లాన్‌ చేసుకోవాలి.

బాడీ లాంగ్వేజ్‌... జగన్‌ శరీరభాష సబ్‌మిసివ్‌ తరహాలో ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. ఆయన కూర్చోవడం దగ్గరినుంచి, ప్రత్యేకించి.. యాత్రల్లో జనాన్ని పరామర్శించే వరకూ తన ప్రతిభంగిమను తాను వీడియోలు చూసుకుని జగన్‌ ఓసారి సమీక్షించుకోవాలి. ప్రధానంగా యాత్రల్లో జగన్‌ తనను పలకరించే వారి బుగ్గలు నిమురుతూ, ముద్దులు పెడుతూ.. పేదలతో కలివిడిగా ఉన్నానని అనుకోవచ్చు గానీ.. ఇవన్నీ.. మిషనరీ ఫాదరీల పరామర్శలను అంతర్లీనంగా జనం మెదళ్లలోకి స్ఫురింపజేస్తూ ఉంటాయంటే అతిశయోక్తి కాదు. నాయకుడిగా తన దఢచిత్తం, దఢవైఖరి తనలో సంపూర్ణంగా కనిపించేలా కొన్ని జాగ్రత్తలూ అవసరం.

పాదయాత్ర సదవకాశమే!

పాదయాత్ర అనేది జగన్‌ ఆశ్రయించిన ఒక మంచి మార్గం. దీనిని ఆయన ఎంతగా సద్వినియోగం చేసుకుంటారనే దానిపై భవిష్యత్‌ రాజకీయాలు ఆధారపడి ఉంటాయి. చంద్రబాబు సర్కారుపై జనంలో ఉన్న వ్యతిరేకతను ఆయన నేరుగా తన కళ్లు, తన చెవులతో ప్రజలనుంచి తెలుసుకుంటే.. తన పోరాటమార్గాన్ని నిర్దేశించుకోవడంలో ఆయనకు పరిణతి పెరుగుతుంది. పాదయాత్ర కంటె ముందు ఆయన ఈ సంసిద్ధతతో ఉండాలి. వైఎస్సార్‌ కూడా తన పాదయాత్రకు ముందు... తరువాత చాలా భిన్నమైన పరిణతిని కనబరిచారని మనకు తెలుసు. ఆ రకంగా జగన్‌ ఈ పాదయాత్రను వినియోగించుకోవాలి. 

చైతన్యమే దారి.. 

అచేతనత్వం నిండి చంద్రబాబు సర్కారు జగన్మోహన రెడ్డికి అధికారాన్ని అందించడానికి ద్వారములు తెరచియే యుంచినది... ఇది నిజం. అయితే జగన్‌ ఇప్పుడు మొదలెట్టబోతున్న పాదయాత్రకు ముక్తాయింపుగా.. ధీశాలిలా.. లోనికి నడుచుకుంటూ వెళతారా.. ఆ అధికారాన్ని అందుకుంటారా? లేదా, లోపాలను  దిద్దుకోకుండా.. సంశయాళువులాగా వ్యవహరిస్తూ ద్వారం వెలుపలే తచ్చాడుతూ ఆగిపోతారా? అనేది కాలం నిర్ణయిస్తుంది. 

ఒక్కమాట చెప్పాలి.

- కపిలముని

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?