Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

కపిలముని : తెలంగాణ అంతే!

కపిలముని : తెలంగాణ అంతే!

నమస్తే తెలంగాణ దినపత్రిక ఇవాళ ఒక బ్యానర్‌ కథనాన్ని ప్రచురించింది. ‘ఆంధ్రా అంతే’ అంటూ దానికి టైటిల్‌ పెట్టారు. ‘లాఠీ ఎత్తని పోలింగ్‌ ఇక్కడ.. తుపాకి మోతల ఎన్నికలక్కడ’ అంటూ సబ్‌ టైటిల్‌ కూడా పెట్టారు. 

ఈ సందర్భంగా తెలంగాణ నేల ఎంతటి పవిత్రమైనదో.. ఇక్కడి ప్రజలు ఎంత మంచి వారో.. పార్టీలు ఎంత అద్భుతమైనవి.. ఇక్కడ ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగాయో.. అభివర్ణిస్తూ.. సీమాంధ్రలో మనుషులు ఎంత దుర్మార్గులో.. అక్కడ ఎన్నికలు ఎంత ఉద్రిక్తంగా జరిగాయో, మావోయిస్టుల ప్రభావం ఎలా కనిపించిందో దెప్పి పొడిచారు. 

నిజానికి ఇది జర్నలిజం విలువలకు తిలోదకాలు వదిలేసిన అనైతికమైన కథనం. నమస్తే తెలంగాణ అనే పత్రిక ఉద్యమ నేపథ్యంలో పుట్టింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది. ఆ రాష్ట్ర సాధనకోసం పోరాడింది. పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచింది. పోరాటం యొక్క స్ఫూరి ్తని తెలంగాణ వ్యాప్తంగా జనసామాన్యంలోకి తీసుకువెళ్లడానికి ఒక ప్రచురణమాధ్యంగా దినపత్రికగా ఎంతో కృషి చేసింది. అందుకు వారికి , వారి కృషికి శిరసు వంచి ప్రణమిల్లాలి. నిజానికి పత్రిక ప్రారంభించిన చాలా కాలం వరకు నష్టాల్లోనే నడిచింది. అయినా సరే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన స్ఫూర్తి సడలకుండా పోరాడిన పత్రిక అది. స్వాతంత్రోద్యమ కాలంలో పత్రికలు ఎలాంటి పోరాటానికి దన్ను ఇచ్చే పాత్ర పోషించాయో.. అలాంటి పాత్రను ఇది కూడా  పోషించింది. అందుకు వారిని బహుధా శ్లాఘించాలి. 

కానీ ప్రస్తుతం వారేం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు వారు ఎలాంటి పాత్ర నిర్వర్తించదలచుకున్నారు. పొరుగున ఉన్న- జీవితం అంతా.. (ఎందుకంటే తెలంగాణ భూభాగాన్ని ఎత్తుకువెళ్లి హిమాచల్‌ ప్రదేశ్‌ పక్కన పెట్టుకోవడమూ, ఆంధ్రప్రదేశ్‌ భాగాన్ని గెంటేసి అండమాన్‌ పక్కన చోటు కల్పించడమూ సాధ్యం కాదు కాబట్టి) కలిసి మెలిసి ఇరుగు పొరుగుగా మాత్రమే ఉండవలసినవి ఈ రెండు రాష్ట్రాలు. అలాంటిది పొరుగు రాష్ట్ర ప్రజల గురించి ఒక విషపుభావనలను తమ పత్రిక ద్వారా వ్యాప్తి చేయించడానికి నమస్తే తెలంగాణ పూనుకున్నది. ఇది చాలా గర్హనీయమైన చర్య/ కథనం. సీమాంధ్ర ప్రజలు, పార్టీలు, నాయకులు అంతా ఇంతే- దుర్మార్గులు కొట్టుకుంటారు రచ్చలు చేస్తారు, నక్సలైట్లు కూడా అక్కడే ఉన్నారు అని చెబుతున్నట్లు ఈ కథనం ఉంది. ఇలాంటి విషప్రచారాలను బాధ్యతాయుతమైన  పత్రికగా వారు మానుకోవాలి. 

తెలంగాణలో ఎన్నికల్తో సీమాంధ్ర  ఎన్నికలను పోల్చిచూడడం శుద్ధ బుద్ధి హీనత అని చెప్పుకోవాలి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మచ్చుకు కొన్ని చూద్దాం. 

-) తెలంగాణలో పార్టీలన్నీ లోపాయికారీ పార్టీలు. అందరూ ఒకరి మూతులు ఒకరు తుడవడానికి ఎగబడుతున్న వారే! తెరాసతో చివరి దాకా బేరాలు తెగక కాంగ్రెస్‌ ఒంటరి పోటీచేసిందే తప్ప.. స్వతహాగా కాదు. అలాగే కేసీఆర్‌ సోనియమ్మ ముందు మోకరిల్లి వచ్చి... పార్టీ వారి వ్యతిరేకత వల్ల ఒంటరిపోటీకి దిగిన వారే. 

-) రేప్పొద్దున్న ఎలాంటి అవసరాలు వచ్చినా.. తెరాస ఎంపీలను కాంగ్రెసుకు కుదువపెట్టడానికీ, ప్రత్యుపకారంగా.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తన సీఎం కుర్చీకోసం కుదువ పెట్టించుకోవడానికీ కూడా ఆ పార్టీలు సిద్ధంగానే ఉంటాయి. 

-) మరోవైపు తెదేపాతో పొత్తు పెట్టుకునా భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కొంగుచాటునుంచి తెరాసకు తొలినుంచి కన్ను గీటుతూనే ఉన్నారు. అటు కేంద్రంలో తమకు ఎంపీల అవసరం ఏర్పడి, ఇక్కడ తెరాసకు ఎమ్మెల్యేల అవసరం ఏర్పడితే.. తెలుగుదేశంతో పొత్తుబంధాన్ని పుటుక్కు మనిపించేసి.. తెరాసకు జై కొట్టడానికి ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. 

-) తెదేపా అనేది ఇక్కడ ఆటలో అరటిపండులా ఉన్న పార్టీ. అసలు తన వారెవరో.. ప్రత్యర్థులతో కుమ్మక్కు అయి.. తన అమ్ములపొదిలో ఉన్నవారెవ్వరో తెలియనిస్థితిలో ఉన్న పార్టీ. 

-) ఇలా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క కుమ్మక్కు నేపథ్యం ఉంది. ఇవి ఎవ్వరూ కాదనలేని సత్యాలు. 

ఇప్పుడు విశ్లేషిస్తే..

ఇలా ఒకరి మూతులు ఒకరు తుడుచుకునే పార్టీలు ఎన్నికల్లో సీరియస్‌గా తలపడడం జరుగుతుందా? సాధ్యమేనా? చావో రేవో అన్నట్లుగా... ఎన్నికల పోలింగ్‌ను సీరియస్‌గా తీసుకుని తలపడడం అసలు ఊహించగలమా? మరి ఇలాంటి కుమ్మక్కు రాజకీయాలను స్ఫూర్తిమంతమైన రాజకీయాలుగా చాటుతూ.. సీమాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో జరిగిన చెదురుమదురు సంఘటనలను ‘ఆంధ్రా అంతే’ అంటూ ఎత్తిచూపించడం... నమస్తే తెలంగాణ వారి అనైతిక చర్య. 

మావోయిస్టుల విషయానికి వద్దాం...

సీమాంధ్రలో ఒక్కచోటనే రీపోలింగ్‌కు ఆదేశించారు. మావోయిస్టుల వల్ల అది జరిగింది. దాన్ని కూడా వీరు తప్పుపట్టారు. అయితే ఇక్కడ గుర్తించాల్సింది ఒకటుంది. తెలంగాణలో తెరాస పార్టీ ఏకంగా మావోల ఎజెండానే మా ఎజెండా అంటూ.. నిషిద్ధ పార్టీకి బాకా ఊదుతూ వారి కొమ్ముకాస్తున్నట్లుగా, వారి ముందు సాగిలపడుతున్నట్లుగా మాట్లాడుతూ ఉంటే.. ఇక మావోలు ఇక్కడ ఎన్నికలను అడ్డుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తారు. కాంగ్రెస్‌ నేతలు.. మావోలు దేశభక్తులు అని స్టేట్‌మెంట్లు ఇస్తూ ఉంటే.. ఇక వారి ప్రభావం ఇక్కడ చూపించాల్సిన అవసరం ఏమిటి? ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా  అది తమ తుపాకీ గొట్టానికి ప్రణమిల్లుతూ తమ పాదాల వద్ద పడి ఉంటుందనే.. నమ్మకం మావోయిస్టులకు ఉంది. అందుకే తెలంగాణ ఎన్నికలను డిస్టర్బ్‌ చేయలేదు. సీమాంధ్రలో కూడా ఒక్క బూత్‌లో తప్ప ఎక్కడా తమ ఉనికి చూపలేకపోయారు. దాన్ని కూడా ఎత్తిచూపించి.. చంకలు గుద్దుకోవడం అనేది ఇరుగుపొరుగుగా కలిసి బతికే పాజిటివ్‌ లక్షణం కాదు. 

ఇరు ప్రాంతాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడడానికి.. వీలైతే అందరూ పాజిటివ్‌ దృక్పథంతో మెలగడానికి తన వంతు కృషి ఏం చేయగలమో మీడియా ఆలోచించాలి. అంతే తప్ప.. నీలిసిరా రాతలతో నల్లటి కాలకూట విషం ప్రజల మెదళ్లలోకి చొప్పించడం సరికాదు. 

-కపిలముని 

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?