Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

లవ్‌లెటర్‌ 2 కేసీఆర్‌ : ఇదేం పోరు బాట!

లవ్‌లెటర్‌ 2 కేసీఆర్‌ : ఇదేం పోరు బాట!

కేసీఆర్‌ అన్నయ్యా!

నవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించనున్న తమరికి గులాబీ సలాం. మీరు గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని పోరు సాగించారు. పలుమార్లు మీ పదవులకు రాజీనామాలు చేసి ఎన్నికలకు వచ్చారు. మీ కోరికను మన్నించి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. వారి కోరిక కూడా తెలంగాణే అని మీ గెలుపుద్వారా ప్రభుత్వాలకు తెలియజెప్పారు. చివరికి ఎలాగోలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీరు కోరిన తెలంగాణ రాష్ట్రం కలను సాకారం చేసింది. అయితే అప్పట్లోనే ప్రభుత్వం మరో కొత్త ఆర్డినెన్స్‌ను తయారుచేసి అట్టే పెట్టింది. దాన్ని రాష్ట్రపతి సంతకానికి పంపడానికి ఎన్నికల నిబంధనలను అడ్డుకావడంతో దాని ఆమోదానికి తాత్కాలికంగా తెరపడింది. తాజాగా మోడీ ప్రభుత్వం సదరు ఆర్డినెన్స్‌ను గమనించి, దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపడం, రాష్ట్రపతి ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. అదే పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలుపుతూ తీసుకున్న నిర్ణయం. దీన్ని వ్యతిరేకిస్తూ మీరు నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు... అంతా బాగుంది... 

కానీ కేసీఆర్‌గారూ ఒక విషయాన్ని విస్మరిస్తున్నారు... ఆర్డినెన్ప్‌ను ఎవరు తయారుచేశారు...? ఒకప్పుడు మీరు మీ పూర్తి మద్దతునిచ్చిన, స్తోత్రపాఠాలతో కీర్తించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం. మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని అప్పటి క్యాబినెట్‌ ఈ ఆర్డినెన్స్‌ను తయారుచేసింది. అప్పట్లో క్యాబినెట్‌ ఈ ఆర్డినెన్స్‌ను తయారుచేసిన సంగతి మీకు తెలియనిది కాదు. మరి అప్పుడే ఈ ఆర్డినెన్స్‌ కు వ్యతిరేకంగా పోరాడి ఉండాలి కదా! ఇప్పటిదాకా మడమ తిప్పకుండా ఉండి ఉండాలి కదా!! అలా చేయకుండా మిన్నకుండిపోయారు. అప్పటి మన్మోహన్‌ ప్రభుత్వం చక్కగా ఆర్డినెన్స్‌ను తయారుచేసి దాన్ని క్యాబినెట్‌ చేత ఆమోదింపజేసేసి అట్టేపెట్టేసింది. అంటే సదరు ఆర్డినెన్స్‌ చావకుండా జీవకళతో ఉండిపోయింది. తాజాగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం రూపొందించి అట్టే పెట్టేసిన ఆర్డినెన్స్‌ను గమనించి దాన్ని వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్రకోసం పంపించింది. అటు రాష్ట్రపతి కూడా ఈ ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర వేసేశారు. అంతా చకచకా జరిగిపోయాక మీరు ఇప్పడు ఇక్కడ బంద్‌ చేస్తామని చెబితే ఇది వినడానికే చాలా హాస్యాస్పదంగా ఉంది...

ఈ ఎపిసోడ్‌ ఒక ఎత్తు అయితే.. మీరు ప్రస్తుతం పిలుపు ఇచ్చిన బంద్‌ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజల జనజీవితాన్ని స్తంభింపజేయబూనడం మరో ఎత్తు! దాన్ని గురించి ఆలోచించాలి. 

ఆర్డినెన్స్‌ నిర్ణయం ఎవరు తీసుకున్నారు...? ఎప్పుడు తీసుకున్నారు...? ఎక్కడ తీసుకున్నారు...? మీరు నిర్ణయానికి వ్యతిరేకంగా ఎక్కడ బంద్‌ నిర్వహిస్తున్నారు...? బంద్‌ వల్ల ఎక్కడున్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు...? వీటన్నింటి గురించి మీరు ఒక్కసారి ఆలోచించాల్సి ఉంది. నిర్ణయాన్ని మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అప్పట్లో తీసుకుంది. ఈ విషయం మీకు తెలిసినా మీరు దాన్ని గురించి పెద్దగా పట్టించుకున్నట్టు లేదు... అలాగే నిర్ణయం ఆమోదం కూడా ఢిల్లీలో జరిగింది. కానీ మీరు నిర్ణయానికి వ్యతిరేకంగా ఇక్కడ తెలంగాణలో బంద్‌ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఢిల్లీలో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణలో బంద్‌ జరిగితే ఢిల్లీకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా...? తెలంగాణ ప్రజలే ఇక్కట్లు పాలవుతారు. మీకు చేతనయితే మీరు మీ ఎమ్మెల్యేలను, ఎంపీలను తీసుకుని ఢిల్లీకి వెళ్లండి. అక్కడి జనజీవనాన్ని స్తంభింపజేయండి. అప్పుడు ఢిల్లీలోని ప్రభుత్వం దిగివస్తుంది. మీరు ఎందుకు బంద్‌ చేస్తున్నారు అనే విషయాన్ని గురించి ఆలోచిస్తుంది. రాష్ట్రపతి చేసిన ఆర్డినెన్స్‌ను రద్దు చేయించడాన్ని గురించి ఆలోచిస్తుంది. ఈ మేరకు ఏదైనా హామీ ఇస్తుంది. అలా చేయకుండా... మీరు ఇక్కడి జనజీవనాన్ని స్తంభింపజేస్తూ బంద్‌కు పిలుపునివ్వడం ఎంతమాత్రం సమంజసం అనేది ఆలోచించాల్సివుంది. 

మీరు ఇక్కడ బంద్‌కు పిలుపునివ్వడం కారణంగా ఇక్కడి ప్రజలు ఎంతగా ఇబ్బందికి గురవుతున్నారో ఆలోచించాల్సివుంది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాల్సివున్న పలు పరీక్షలు నిలిచిపోయాయి. అవి వాయిదా పడ్డాయి. ఒక పరీక్ష రాయడానికిగానూ కష్టపడి చదివిన విద్యార్ధి ఆ పరీక్ష ఆగిపోయింది అని ‘ముందురోజు సాయంత్రం’ తెలిస్తే ఎంతగా బాధపడతాడో, మధనపడతాడో మీకు తెలియందికాదు... ఇలా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు నిలిచిపోయి ఎంతమంది అభ్యర్ధులు బాధపడుతున్నారో మీరు గమనించాల్సివుంది. ఒకప్పుడు మీరు ప్రజలకోసం పోరాటాలు సాగించారు. తమకోసం మీరు పోరుసాగిస్తారని ప్రజలు మిమ్మల్ని తమ నాయకుడిగా ఎంచుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్లీ మీరు ఇప్పుడు అదే ప్రజలను మళ్లీ పోరాటం అంటూ ఇబ్బందులకు గురిచేయడం అంత మంచిదికాదు. ఇప్పుడు పరీక్షలు రద్దయిన వారేకాదు... ఇతర ప్రజలు కూడా బంద్‌ కారణంగా అనేక ఇబ్బందులకు గురవుతారు. ఈ శాపనార్ధాలన్నీ ఎవరికి వస్తాయి...? ఇప్పటికైనా మీరు ఢిల్లీలో తీసుకున్న నిర్ణయాలకు ఇక్కడ బంద్‌లు చేయడం మానేసి ఢిల్లీ వెళ్లి అక్కడి జనజీవనాన్ని స్తంభింపజేయడానికి ప్రయత్నించండి. అలాకాకుండా ఇక్కడి ప్రజలనే ఇబ్బందులకు గురిచేస్తే... తలనొప్పి అంటే మోకాలికి మందు రాసినట్టే ఉంటుంది...! కాస్త ఆలోచించండిమరి...!

-ప్రేమతో మీ 

కపిలముని

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?