Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

కాసులు తప్ప మోదీ సర్కారుకు మరోటి పట్టదా?

కాసులు తప్ప మోదీ సర్కారుకు మరోటి పట్టదా?

మోదీ ప్రభుత్వం ఏ విషయాలను సీరియస్ గా పట్టించుకుంటున్నది? వేటిని తేలిగ్గా పరిగణిస్తుంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రకటిస్తున్న ఆలోచనలు, చేస్తున్న ప్రతిపాదనలు అన్నీ ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి. ఒక కోణంలోంచి చూసినప్పుడు.. మోదీ సర్కారు కాసుల వ్యవహారాలు తప్ప మరోటి పట్టించుకోవడం లేదనే అభిప్రాయం కలుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా డబ్బుకు సంబంధించి మాత్రమే తప్ప ప్రజాసంక్షేమం దిశగా ఉండడం లేదు. బేటీ బచావో లాంటి పడికట్టు ఓటు బ్యాంకు జనాకర్షక పథకాల సంగతి పక్కన పెట్టండి. నిర్దిష్టంగా చూస్తే ఈ మూడేళ్లలో ఈ ప్రభుత్వం చేసిన కీలక నిర్ణయాలు రెండే. 

ఒకటి నోట్ల రద్దు. రెండోది జీఎస్టీ. రెండూ కూడా ప్రజల జీవితాల్ని ఛిద్రం చేసేసి, అయోమయానికి గురి చేసిన, డబ్బుతో ముడిపడిన వ్యవహారాలు మాత్రమే. మహా అయితే భాజపా వారు స్వచ్ఛ భారత్ పేరు చెప్పుకోవచ్చు. అసలు స్వచ్ఛభారత్ అనేది పెద్ద మాయ. ఆ ముసుగులో ఏదో కొన్ని పనులు చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూ.. దానికి సంబంధించి సెస్సు పేరిట దేశంలో జరిగే ప్రతి లావాదేవీ మీదా.. ప్రతి ఒక్కరినుంచీ కోట్లాది రూపాయలను దోచుకుంటున్నారు. ఇలా గుట్టుచప్పుడు కాకుండా జనాన్ని నిలువుదోపిడీ చేస్తున్న, డబ్బు వ్యవహారాలు తప్ప మరోటి ఆలోచించకుండా సాగుతున్న నరేంద్రమోడీ సర్కారు అలాంటి మరో కీలక నిర్ణయానికి ఇప్పుడు తెగబడుతున్నది. 

రాజకీయ పార్టీలు తీసుకునే విరాళాలకు సంబంధించి బాండ్లు ఉండాలని, ఎన్నికల బాండ్లు తప్పక తీసుకువస్తాం అని అరుణ్ జైట్లీ అంటున్నారు. నిజానికి ఎన్నికల బాండ్లు మంచివే. పార్టీలు నిధులు సేకరించుకోవడంలో ఇవి పారదర్శకతకు కారణం అవుతాయి. ఎందుకంటే పార్టీలు అడ్డగోలు అవినీతి పూరిత నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రత్యుపకారాన్ని పార్టీలకు విరాళాలుగా పొందుతున్న దుర్మార్గమైన పోకడ మనవద్ద ఉంది. దీనిని అరికట్టడానికి 2000 రూపాయలకు మించిన ప్రతి విరాళమూ బాండ్లరూపంలోనే ఇచ్చేలా విధానాన్ని మార్చడం, పార్టీల ఆర్థిక లావాదేవీలపై జవాబుదారీతనం పెంచడం దీని ఉద్దేశం. ఇంతవరకూ బాగానే ఉంది.

కానీ, ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్న చింత ఏమిటంటే.. ఈ ప్రభుత్వం అన్నీ కూడా ఇలాంటి డబ్బు వ్యవహారాలు ఆలోచిస్తున్నదే తప్ప.. ప్రజల కోణంలో ఆలోచించడం లేదు. ప్రజలతో సంబంధంలేని, వారి కష్టాలు తెలియని, వారి ఓట్లతో ఎన్నికయిన అనుభవం లేని, ప్రజల అవసరంలేని అరుణ్ జైట్లీ లాంటి అహంకార పూరిత సంపన్న, కమర్షియల్ కుబేరులను తన కోటరీలో పెట్టుకుని, వారి తెలివితేటల మీదనే ఆధారపడుతూ నరేంద్రమోడీ పాలన సాగించినంత కాలమూ బహుశా ఇలాంటి పాలనే ఉండవచ్చు. డబ్బుకు జవాబుదారీ తనాన్ని పెంచడమూ, ప్రతి లావాదేవీ నుంచి ప్రభుత్వం పస్నులరూపేణా దోచుకునే ప్రయత్నం చేయడమూ ఒక ఎత్తు. అది ఎలాపోయినా సరే.. నాయకులు ప్రజలకు చేస్తున్న వాగ్దానాల జవాబుదారీతనం గురించి కూడా చట్టంచేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన ప్రజలకు కలుగుతోంది. 

సాక్షాత్తూ ఈ ప్రధాని నరేంద్రమోడీనే.. ఎన్నికలకు ముందు ప్రచారసభల్లో ఎన్ని కల్లబొల్లి కబుర్లు చెప్పాడో అందరికీ కనిపిస్తోంది. పార్టీకి రెండువేల రూపాయల విరాళం అంటేనే, జవాబుదారీ తనం ఉండాలని చట్టంతెస్తాం అంటున్నారే. దాదాపు వందకోట్ల మంది జనాన్ని మోసంచేస్తూ చెప్పిన మాయ మాటల సంగతేమిటి? రాష్ట్రాల్లో తిరుగుతూ.. అక్కడి కోట్లాది జనానికి చేసిన ప్రమాణాల సంగతి ఏమిటి? వాటికి జవాబుదారీతనం ఎవరు వహిస్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా రికార్డెడ్ గా దొరికేవే. మరి వాటి ఆధారంగా.. మాట తప్పినందుకు, నాయకులకు శిక్ష వేసి కొన్నాళ్లు రాజకీయాలకు దూరంపెట్టే చట్టం తేలేరా? బహుశా అలాంటి చట్టం అంటూ ఒకటివస్తే.. తమ యూపీఏ సర్కారు సాంతం ఖాళీ అయిపోతుందని భయపడుతున్నారేమో!!

- కపిలముని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?