Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

నాయకుడంటే ఎలా వుండాలి....?!

నాయకుడంటే ఎలా వుండాలి....?!

‘‘నాయకుడంటే కుర్చీలో కూర్చుని సిద్ధాంత చర్చ చేసేవాడు కాదు. నాయకుడంటే జనాన్ని ఊపేసే ఉపన్యాసాలు దంచేవాడు కాదు. సంవత్సరానికి రెండు ధర్నాలు, మూడు మీటింగులు, ఆరు సభలు నిర్వహించినంత మాత్రాన జనం నీ వెంట నడువరు, నువ్వు జనంలో కలిసిపోవాలి, నిత్య పోరాటమయంగా నీ జీవితాన్ని మలుచుకోవాలి, అనునిత్యం ఆదర్శప్రాయమైన జీవితాన్ని సాగించాలి.’’

ఈ మాటలు అన్నది ఎవ్వరో తెలుసా? కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. తెలుగు రాష్ట్రంలో.. కులమతాలకు ప్రాంతాలు పార్టీల తారతమ్యాలు, భావజాలాలకు అతీతంగా నిజమైన ప్రజల మనిషిగా, అసలు సిసలు పోరాటయోధుడిగా గుర్తింపు ఉన్న మనీషి పుచ్చలపల్లి సుందరయ్య. ఆయన తన జీవితకథ ‘విప్లవపథంలో నా పయనం’ పుస్తకంలోనిది పైన చెప్పిన నిర్వచనం. 

ఈ నిర్వచనాన్ని ఒకసారి కాదు, నాలుగైదు మార్లు చదవండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క అర్థం స్ఫురిస్తుంది.  ఒక్కొక్కసారి మన సమకాలీనుల్లో ఒక్కొక్క నాయకుడు మన కళ్ల ముందు మెదలుతారు. చివరి వాక్యాలకు వస్తే.. అలాంటి వాళ్లు వర్తమానంలో ఎవ్వరూ కనిపించడం లేదే అని మన బతుకుల మీద మనేక జాలి కలుగుతుంది. నాయకత్వం అంటే సుందరయ్య వారి భాష్యం ‘‘జనంలో కలిసిపోవడం’’! కానీ ఇక్కడ జరుగుతున్నదేమిటి?

చంద్రబాబు నాయకుడేనా?

చంద్రబాబునాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తనకు ఆ హోదా దక్కింది గనుక తనను మించిన వారు మరొకరు లేరు గనుక... బృహస్పతి సింహరాశిలో ప్రవేశించే పుణ్యఘడియలో తాను తన కుటుంబం గోదావరీ స్నానాలు చేయాలని ఆయన సంకల్పించడం మంచిదే. రాష్ట్రానికి అధిపతిగా, రాష్ట్రక్షేమాన్ని కాంక్షిస్తున్నానని, రాష్ట్రాభివ్రుద్దే కాక దేవుణ్ని ప్రార్థిస్తున్నానని చెప్పుకునే వ్యక్తిగా ఆయన తొలిస్నానాలు చేస్తే ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కానీ ఆ సమయానికి తాను, తన కుటుంబమూ తప్ప.. ప్రజలెవ్వరూ ఘాట్‌లో స్నానాలకు రాకూడదని నియంత్రణలు విధించడం .. ఎలాంటి ప్రజాస్వామ్య పోకడ. మనమేమైనా రాజరిక వ్యవస్థలో బతుకుతున్నామా? రాజుగారు స్నానం చేసి వెళ్లిన తర్వాత.. ఆ విసర్జనజలాన్ని నెత్తిన చల్లుకుని పునీతులు అయిపోవాలని అనుకుంటున్నామా?

జనం పెట్టిన ఓట్ల భిక్ష వల్లే ఇవాళ అధికారపదవిలో ఉన్నానని చంద్రబాబు విస్మరించారో ఏమో తెలియదు. ‘నాయకుడంటే జనంలో కలిసిపోవాలి’ అనే ప్రాథమిక నిర్వచనాన్ని విస్మరించి.. జనాన్ని అంటరానివాళ్ల లాగా.. సెకండ్‌గ్రేడ్ వ్యక్తుల్లాగా దూరం ఉంచి.. తాను మాత్రం ముహూర్తానికి పుణ్యస్నానాలు చేయడానికి ఆయన ఇచ్చిన ప్రయారిటీ చాలా నీతిబాహ్యమైనది. ఆ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ధోరణిని ప్రశంసించాలి. ఆయన తాను స్నానాలు ఆచరిస్తున్న సమయంలోనూ, ఘాట్‌లోకి భక్తులను అనుమతించడానికి ఏర్పాట్లు చేశారు. స్వయంగా అలా పోలీసుల్ని డైరక్ట్ చేశారు కూడా! కానీ చంద్రబాబు అహంకారం అడ్డొచ్చింది. లేదా, బహుశా తన షూటింగ్ మోజును ప్రజలందరూ గుర్తించడం ఆయనకు ఇష్టం ఉండకపోవచ్చు. 

తాను రాష్ట్రానికి నేత అని మరిచారేమో!

సీఎంగా చంద్రబాబునాయుడు తీరు కొంచెం విలక్షణంగా ఉంటుంది. ఆయనకు ‘సీజనల్ ఇంటరెస్టు’లు ఉంటాయి. అంటే ఏ సీజన్లో ఏ అంశాన్ని నెత్తిన పెట్టుకుంటే.. ఇక అదొక్కటే.. తతిమ్మా రాష్ట్ర పరిపాలన వ్యవహారాలేవీ ఆయన కంటికి ఆనవు. తాను 13 జిల్లాలకు ముఖ్యమంత్రినని, యావత్తు ప్రజల సంక్షేమానికి సారధినని ఆయన మరచిపోతారు. రాజధాని పాట ఎత్తుకున్నంత కాలమూ.. ఆ మిషమీద దేశాలు పట్టుకు తిరగడం తప్ప.. తతిమ్మా వ్యవహారాలన్నీ పక్కకు నెట్టేస్తారు. హుధుద్ వంటివి వచ్చినప్పుడు.. కూడా యంత్రాంగంతో పనులు చేయించాల్సిన స్థానే.. క్షేత్రస్థాయి వర్కర్ తానే అయినట్లుగా.. అక్కడే తిష్టవేసి.. అలా తిష్టవేయడమే మహద్భాగ్యం అని ప్రచారం చేసుకుంటూ దాన్ని మిగిలిన పనుల్ని విస్మరిస్తారు. ఎన్ని మర్చిపోయినా.. తాను ఏది పట్టుకు వేలాడుతున్నారో.. దానికి ప్రచారం మాత్రం మెండుగా లభించేలా ప్లాన్ చేసుకోవడమే ఆయన ‘సెక్సస్ మంత్ర’ అనుకోవాలి. అలాగే ఇప్పుడు... పుష్కరాలు ముగిసేవరకు రాజమండ్రిలోనే ఉంటా అంటున్నారు. 

‘11రోజులూ ఉండడం’ నాయకత్వ పటిమా?

సరే, ఒక దుర్ఘటన జరిగింది. బాధ్యులెవరో పక్కన పెడదాం. ఆ దుర్ఘటనకు చంద్రబాబు స్పందన ఏమిటి? ‘‘మిగిలిన 11 రోజులూ నేను ఇక్కడే ఉంటా? అన్ని ఏర్పాట్లు  పర్యవేక్షిస్తా’’ అని ఆయన సెలవిచ్చారు. ఒక నాయకుడు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ప్రజలకు తనకు కట్టబెట్టింది ముఖ్యమంత్రి పదవి అనుకుంటున్నారా? పుష్కరాల సూపర్‌వైజర్ పని అనుకుంటున్నారా? 

నాయకుడనేవాడు ఒక వ్యవస్థను నిర్మించిన తర్వాత.. ఆ వ్యక్తి ప్రమేయం అవసరమే లేకుండా ఆ వ్యవస్థ పనిచేసుకుంటూ పోవాలి. లోపాలు బయటపడినప్పుడు మళ్లీ నాయకుడు జోక్యం చేసుకుని వాటిని చక్కదిద్ది మళ్లీ గాడిలోపెట్టి వదిలేయాలి. అది స్థిరత్వం ఉన్న పరిపాలన పద్ధతి అవుతుంది. అలాంటి ఆలోచనే చేయకుండా.. ప్రజలకు కూడా అలాంటి ఆలోచన రానివ్వకుండా.. తానేదో ఉద్ధరించేస్తున్నట్లుగా ‘11రోజులూ నేను ఇక్కడే ఉంటా’ అని సీఎం అనడంలో ఔచిత్యం అర్థం కాని సంగతి. 

‘వ్యవస్థ’ ఒక ఉత్సవ విగ్రహమా?

ఈ వ్యాసం రాస్తున్న సమయానికి (గురువారం ఉదయం) టీవీ ఛానెళ్లలో బ్రేకింగ్‌న్యూస్‌లు చూస్తూ గుండెవడి పెరుగుతోంది. ‘కొవ్వూరు గోష్పాద క్షేత్రానికి పెరుగుతున్న భక్తుల రద్దీ’, ‘కొవ్వూరు రానున్న సీఎం చంద్రబాబు’, ‘సీఎం రాకతో అప్రమత్తమౌతున్న పోలీసులు’... ఈ మూడు వాక్యాలు చాలా గుబులు పుట్టిస్తున్నాయి. యావత్తు ప్రభుత్వ పరిపాలన తీరులోని సకల అవకతవకలను నిరూపించే వాక్యాలివి. అవును పైకి బ్రేకింగ్‌న్యూస్‌లాగానే ఉన్నా.. ఈ వాక్యాల మధ్య ప్రభుత్వం యొక్క చేతగానితనం మొత్తం దాగి ఉంది.

అవును మరి.. కొవ్వూరు గోష్పాద క్షేత్రం అనేది గోదావరి పరంగా విశిష్టమైన క్షేత్రం.. అక్కడ భద్రత, భక్తుల నియంత్రణ ఏర్పాట్లకు ఒక నిర్దిష్టమైన ఏర్పాట్లతో వ్యవస్థ ఇప్పటికే ఏర్పడి ఉండాలి. మరి దానిని మానిటర్ చేయడానికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి (అది కూడా రద్దీ పెరుగుతున్న సమయంలో) ఆ క్షేత్రానికి వెళ్లడం ఎందుకు? అంటే ఇక్కడ రెండు అంశాలున్నాయి. తాను ఏర్పాటుచేసిన నిర్వహణ వ్యవస్థ మీద చంద్రబాబుకు తనేక నమ్మకం లేకుండా ఉండాలి. లేదా, తాను స్వయంగా ఉండి పర్యవేక్షిస్తే తప్ప.. అక్కడ నియంత్రణ సవ్యంగా సాగదు అని ఆయన భయపడుతూ ఉండాలి. 

ఈ రెండింటిలో ఏది నిజమైనా.. అది పూర్తిగా నాయకుడిగా ఆయన ఫెయిల్యూర్ కిందికే వస్తుంది. నాయకుడనే వాడు ఎప్పుడూ వ్యవస్థను లోపేతంగా తీర్చిదిద్దాలి. వ్యక్తుల్ని కాదు. కానీ మన ఖర్మజాలక స్థాయీ తాహతు లేని వ్యక్తులు రాజకీయం ముసుగు కింద నాయకులుగా పరివర్తనం చెందుతున్న ఈ రోజుల్లో.. ఎవరికి వారు.. తమకు అయాచితంగానో, వక్రమార్గాల్లోనో, సంప్రాప్తించిన ‘నాయకత్వ’ హోదాను సంరక్షించుకోవడానికి వ్యవస్థను నిర్వీర్యం చేసేయడం జరుగుతోంది. 

ఇక్కడ సరిగ్గా చంద్రబాబు చేస్తున్న పని కూడా అదే. చంద్రబాబునాయుడు సరైన నాయకుడే అయితే గనుక.. ఏర్పాట్ల పేరిట కొన్ని నెలలుగా నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాల్లో ఆయన ఏం సాధించినట్లు. ఇవాళ (మూడోరోజున) తను స్వయంగా పర్యటిస్తే తప్ప కొవ్వూరులో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా విధులు నిర్వహించదేమో అనే అనుమానం ఆయనలో ఉన్నదా? భద్రత చూస్తున్న యంత్రాంగం మీద ఆయనలో అంతగా అనుమానాలున్నాయా? తాను స్వయంగా వెళితే మాత్రమే అంతా సవ్యంగా ఉంటుందని ఆయన భ్రమిస్తున్నట్లయితే.. ఎన్నిచోట్లకు వెళ్లగలరు? ఎన్ని గంటలు ఆయా చోట్ల గడపగలరు? ఇదంతా పెద్ద మాయ. 

‘నేను ఏదో చేసేస్తున్నాను’ అని భ్రమింపజేస్తూ.. తద్వారా తనకు బాకా ఊదడానికి కాసుక్కూచుని ఉండే వ్యక్తులు/ సంస్థల ద్వారా తనను కీర్తింపజేసుకుంటూ.. అక్కడికి తిరుగులేని మైలేజీ వచ్చేసిందని ప్రపంచాన్ని సూడో కీర్తిప్రతిష్టలతో, గోబెల్స్ ప్రచారంతో బురిడీ కొట్టించడం చంద్రబాబునాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఇలాంటి కుయుక్తులు అన్నీ.. ఆయన రాజకీయంగా ఎదుగుతున్న రోజుల్లో ఆయనకు బాగానే ఉపయోగపడ్డాయి. కానీ.. కాలంతోపాటు సమాజంలో వస్తున్న మార్పులను అనుసరించి ప్రజల్లో అవగాహన శక్తి పెరిగింది. కమ్యూనికేషన్ రంగం విస్తరిల్లి.. ప్రజల అవగాహన సామర్థ్యాన్ని పెంచగలిగింది. 

దీని వల్ల.. నాయకుల నాటకాలను ప్రజలు ఎప్పటికప్పుడు గుర్తించగలిగే శక్తి వారికి వచ్చింది. అయితే.. ఆ నాటకాలను సీరియస్‌గా పట్టించుకోకుండా విస్మరించే జడత్వం కూడా ప్రజల్లో పెరిగిపోవడం ఒక దుష్పరిణామం. 

కానీ చంద్రబాబునాయుడు ఇంకా పాత ప్రచార టెక్నిక్‌లనే పట్టుకుని వేళ్లాడుతున్నారు. తాను కొవ్వూరు వెళ్లి.. అక్కడ అంతా చక్కదిద్దానని, ఇలా చెప్పుకోడానికే ఆయన తపన పడుతున్నారు. నిజమైన నాయకుడే అయితే గనుక.. తాను వెళ్లకపోయినా.. సవ్యంగా నడిచే వ్యవస్థనే తీర్చిదిద్ది ఉండాలి కదా... అని ప్రజలు ప్రశ్నించకపోవచ్చు గానీ.. గుర్తించడం కూడా లేదని అనుకుంటే.. అది ఆయన అమాయకత్వం.

బ్రేకింగ్‌న్యూస్‌లోని వాక్యాల్లో మరో ప్రమాద సంకేతం కూడా ఉంది. ‘సీఎం రాక సందర్భంగా పోలీసులు అప్రమత్తం’. చాలా దారుణమైన విషయం ఇది. కొవ్వూరు వంటి రద్దీ బీభత్సంగా ఉండే క్షేత్రంలో ఎంత భారీ సంఖ్యలో పోలీసుల్ని నియమించినా.. చాలదు. వారికి ధ్యాసమొత్తం భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చూడడం మీదనే ఉండాలి. కానీ.. ఇలాంటి కీలక సమయంలో సీఎం వస్తున్నారంటే.. సహజంగా వారి దృష్టి ఆయన మీదకు మళ్లిపోతోంది. అంటే ఆ మేరకు ప్రజలకోసం పనిచేస్తున్న పోలీసుల శ్రద్ద పలచబడుతున్నట్లే కదా! సీఎం సేవ, సీఎం ముఖప్రీతి కోసం ప్రదర్శించే భద్రత చర్యలు, ఇలాంటి వాటి మధ్య సజావుగా సాగే సాధారణ ఏర్పాట్లను కాలరాసేస్తారు. అల్టిమేట్‌గా సీఎం వంటి వారు రావడం వల్ల నష్టం తప్ప మరోటి కనిపించదు. 

ఇన్నాళ్లూ ఏం జరిగింది?

పుష్కరాలు అంటే అదేమీ భూకంపం, తుపాను, సునామీ వంటిది కాదు.. హటాత్తుగా విరుచుకుపడిన ఉత్పాతం అనుకోవడానికి. ఈ సమయంలో గోదావరికి పుష్కరాలు వస్తాయనే సంగతి మనకు 12 ఏళ్ల కిందటే తెలుసు. చంద్రబాబుకు తాను అధికారంలోకి వచ్చినప్పుడే తెలుసు. అంటే గత ఏడాదిగానూ ఈ ప్రభుత్వం.. గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తూనే ఉన్నది. చంద్రబాబునాయుడు లెక్కకు మిక్కిలిగా పుష్కర ఏర్పాట్ల మీద రాజమండ్రిలోను, హైదరాబాదులోను సమీక్ష సమావేశాలను నిర్వహించారు. 

పుచ్చలపల్లి ఏవైతే తప్పని చెప్పారో.. అవన్నీ చేశారు.  మీటింగులు తప్ప.. వాటి ఫలితం గోదావరీ తీరంలో కనిపించలేదు. విడతలుగా 1600 కోట్ల రూపాయల వరకు విడుదల చేసినట్లుగా వార్తలొచ్చాయి గానీ.. కనీసం పుష్కరాలు మొదలయ్యే వేళకు కూడా చాలా చోట్ల పనులు పూర్తి కాలేదు. పూర్తి అయినట్లుగా భ్రమింపజేసిన పనులన్నీ కూడా.. సమయాభావం వల్ల అరకొరగా ముగించేసినవే. అంటే షూటింగు అయిపోగానే పీకి పారేసే సినిమా సెటింగులాగా, ఈ 12రోజులు గడవగానే మళ్లీ యేట్లో కలిసిపోతాయన్నమాట. 

ఒకవైపు అటు పుష్కర ఘాట్‌లలో పనులూ పూర్తి కాలేదు. జనం మాత్రం మూడుకోట్ల కు పైగా వస్తారని ఊదరగొట్టారు. ఇంకా రారమ్మంటూ టీవీ ఛానళ్లకు పత్రికలకు ప్రకటనలు గుప్పించారు. మంచిదే. కానీ.. రాదలచుకున్న జనానికి చేసిన ఏర్పాట్లు ఘోరం. వారికి వసతులు తర్వాత.. కనీసం ఏయే ఘాట్‌లకు ఎలా మళ్లించాలి. ఇబ్బందులు రద్దీ ఏర్పడకుండా.. ఎలాంటి కోఆర్డినేషన్‌తో ఏర్పాట్లుండాలి అనే దిశగా జరిగిన ప్రయత్నాలు సున్నా. మరి ఇన్నాళ్లూ సమీక్షల పేరిట చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమిటో మాత్రం అర్థం కాదు. 

‘నాయకుడంటే’ ఏంటో చంద్రబాబు తెలుసుకోవాలి

నారా చంద్రబాబునాయుడు 30 ఏళ్ల పైచిలుకు సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయవేత్త. ఈ రాష్ట్రానికి అతి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన వ్యక్తి. ఆయన రాజకీయ జీవితం ఉత్థాన పతనాల మేలు కలయిక రాజకీయ ఆశావహులకు ఓ పాఠ్యపుస్తకంలాంటిది. ఇంత ఘన చరిత ఉన్నప్పటికీ.. ఆయన ‘నాయకుడంటే..’ ఏమిటో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఇంకా ఉన్నదంటే.. అతిశయోక్తి కాదు. 

తాను నడిపితే మాత్రమే మాత్రమే ఎగిరే వాహనాన్ని కనుగొని ఉంటే.. రైట్‌బ్రదర్స్‌ను ‘విమానం డ్రైవర్లు’ అంటారే తప్ప.. దాన్ని కనుగొన్న మూలపురుషులుగా కీర్తించరు. తాను నడిపిస్తే మాత్రమే నడిచే యంత్రాంగాన్ని/ వ్యవస్థను రూపుదిద్దిన వాడు ఎన్ని జన్మలెత్తినా నాయకుడు అనిపించుకోలేడు. తన దిగువన పనిచేసే యంత్రాంగం యావత్తూ.. తనతో సమానమైన సామర్థ్యాలతో.. తన పరోక్షంలో కూడా పనిచేసేలా తీర్చిదిద్దగలిగిన వాడు మాత్రమే నాయకుడు. ‘నేనుంటేనే పని జరుగుతుంది.. నేను చేస్తేనే సవ్యంగా ఉంటుంది’ అని చెప్పేవాడు కూలీ మాత్రమే. ‘నా పరోక్షంలో కూడా నేను ఉన్నప్పుడు మాదిరిగానే పని జరుగుతుంది..’ అని భరోసా ఇవ్వగలిగిన వాడు మాత్రమే నాయకుడు!! ఈ సత్యాన్ని, ఈ సత్యానికి దూరంగా తన ఆలోచనల్లో ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకుంటే.. 12రోజులూ రాజమండ్రి తిష్ట వేయాలనే కోరిక చంద్రబాబు కు కలగకపోవచ్చు. కనీసం రాబోయే రోజుల్లో అయినా.. ఆయన తనను తాను నిజమైన నాయకుడిగా ఆవిష్కరించుకోవచ్చు. 

సురేష్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?