Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

నీతిఆయోగ్... ఇంత పనికిమాలిన ఐడియానా?

నీతిఆయోగ్... ఇంత పనికిమాలిన ఐడియానా?

ప్రధాని నరేంద్రమోదీ అంటే.. ఆయన జాతిని ఉద్ధరించడానికి అవతరించిన మహానుభావుడని నిన్నమొన్నటి దాకా దేశంలో చాలా మంది అనుకున్నారు. ఆయన కేబినెట్ లోని వందిమాగధులు అచ్చంగా ఆయన దేవుడు పంపిన ఉద్ధారకుడు అంటూ పలుమార్లు పలు సందర్భాల్లో కీర్తించారు కూడా. నిజమే అనుకుందాం.. అలాంటి మహోన్నతుడు తానుగా ఎంపికచేసి.. దేశాన్ని ఉద్ధరించే కొన్ని కీలక పదవుల్లో కొందరు వ్యక్తులను నియమించినప్పుడు.. వారందరూ కూడా మహామహిమాన్వుతులే అని అనుకుంటాం కదా!

కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్న నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చేస్తున్న ప్రతిపాదనలు వింటే.. ఇంత బాధ్యతాయుతమైన దేశాన్ని ఉద్ధరించే కీలకమైన హోదాల్లో ఉన్న వారికి ఇంత పనికిమాలిన ఐడియాలు ఎలా స్ఫురిస్తాయా అనే అనుమానం కలుగుతోంది. ఇంత చెత్త ఐడియాలు ఇవ్వగల వ్యక్తులను ఇంత కీలక పదవుల్లో పెట్టుకుని ప్రధాని నరేంద్రమోడీ.. ఈ దేశాన్ని ఏ ఉన్నతులకు తీసుకువెళ్లాలని అనుకుంటున్నారా? అనే భయం కూడా కలుగుతుంది.

నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. ఏపీ సర్కారు అనుసరిస్తున్న రియల్ టైం గవర్నెన్స్ ను పరిశీలించిన తర్వాత.. ఆయన ఏపీలో విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఏపీకి చేయూత అనవసరం అనే అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు. 12నుంచి 15శాతం వృద్ధి రేటు ఉన్నప్పుడు ప్రత్యేకంగా చేయూత అనవసరం అని ఆయన ‘‘సరదాగా’’ అన్నట్లుగా పత్రికలు రాశాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతటి ఘోరమైన అవస్థలో ఏర్పడిందో.. వనరుల పరంగా.. ఆర్థికంగా ఎంతగా వెనుకబడి ఉందో.. తెలిసికూడా.. వృద్ధిరేటు కనిపిస్తున్నది కదాని.. ఈ రాష్ట్రానికి చేయూత అనవసరం అని ‘‘సరదాగా’’ చెప్పగల వ్యక్తి అంత జాతీయ స్థాయి హోదాలో ఎలా వెలగబెడుతున్నారో అర్థంకాని సంగతి.

పైగా ఆయన చెప్పిన పరిష్కారం వింటే.. ఇంత తలలేని మనుషులు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులా అనే సందేహం కలుగుతుంది. హైదరాబాదు నగరాన్ని కోల్పోవడం వల్ల ఏపీ నష్టపోయిందిట. హైదరాబాదు నగరానికి 40శాతం ఆదాయం ఏపీ వారి వల్లే వస్తోందిట. అక్కడి వారంతా.. ఇక్కడకువచ్చేస్తే ఆ సమస్య తీరిపోతుందిట. ఈ పరిష్కారాన్ని ఆయన నవ్వుతూ చెప్పారుట.

నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న రాజీవ్ కుమార్ వంటి వ్యక్తి.. ఒక రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగితే.. ఇలాంటి చిల్లర పరిష్కారాలు సూచిస్తూ నవ్వడానికి, వెటకారాలు చేయడానికి ఎంత బరితెగింపు ఉండాలి. ఎవరి అండచూసుకుని.. ఇంత బరితెగింపుతో మాట్లాడుతున్నారు..? ఇలాంటివన్నీ ఎవరికి వారు ఆలోచించదగినవే.

కనీసం అదే వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి అయినా ఖండించి ఉంటే కాస్త పరువుగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే.. హైదరాబాదునుంచి ఆంధ్రోళ్లనంతా తరిమేయాలి అన్నట్లుగా ఉన్న ఈ వ్యాఖ్యలను ఎవరైనా అసలు ఎందుకు సహించాలి. అడ్డగోలుగా చీలిపోయి ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సుహృద్భావ వాతావరణానికి విఘాతం కలిగించే వ్యాఖ్యలకు ఇవి పునాది అవుతాయని కూడా గుర్తించాలి.

-కపిలముని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?