Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

సూపర్‌స్టార్ ఎవరు?

సూపర్‌స్టార్ ఎవరు?

కొలబద్ధ ఏమిటి? రేసులో ఎందరు? తేలేది నిజమేనా?

‘‘నేనే సూపర్‌స్టార్’’ అని చెప్పుకోగల వారెవ్వరున్నారు. టాలీవుడ్‌లో హీరోల క్రేజ్‌ను అమాంతం పెంచేసే అద్భుత చిత్రాలు ఎన్నెన్నో వస్తున్నాయి. పోతున్నాయి. సూపర్‌స్టార్‌డం అనేది వర్తమానంలో ఒక ‘‘మ్యాజికల్ ఛెయిర్’’ లాగా తయారయింది. ఏదో మ్యాజిక్ జరిగి ఒక యువహీరో హటాత్తుగా శిఖరం అంచున ఉండే  ఛెయిర్‌లోకి వస్తాడు. ఆ తర్వాత వెంటనే కొంతకాలానికి మరో హీరో మరో చిత్రం విజయంతో, ఇతగాణ్ని తోసిరాజని తాను కూర్చోగలుగుతాడు. అంతమాత్రాన ఆ స్థానాన్ని అతనైనా పదిలంగా నిలబెట్టుకుంటాడనే గ్యారంటీ ఎంతమాత్రమూ లేదు. అతడా శిఖరం మీది కుర్చీలోంచి ఎప్పుడు పడిపోతాడో తెలియదు. అందులో కూర్చోవడానికి మరెవ్వరు రెడీ అవుతున్నారో తెలియదు. అందుకే సూపర్‌స్టార్‌డం అనేది ఒక మ్యాజిక్. సదరు మ్యాజిక్‌లో ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఫలితం వరిస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి మన టాలీవుడ్‌లో పరిస్థితి ఏంటి? ఎవరి స్టార్‌డం ఎంత? సూపర్‌స్టార్‌డం ఎవరికి కట్టబెట్టాలి..? ఈ విషయాల్ని పరిశీలిద్దాం.

సూపర్‌స్టార్ అంటే...?

ఏ రంగంలో అయినా సరే.. అపరిమితమైన ప్రజాదరణ గుర్తింపు.. విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న వారిని ‘సూపర్‌స్టార్’ అంటారు. ఇది కేవలం సినిమా రంగానికి మాత్రమే పరిమితమైన పదం ఎంతమాత్రమూ కాదు. నిజానికి ఈ పదం పుట్టుక సినిమా రంగంలో జరగలేదు. 1910 కాలంలో.. సుప్రసిద్ధ హాకీ ప్లేయర్ ఫ్రాంక్ పాట్రిక్ ప్రతిభ గురించి చెప్పడానికి తొలిసారిగా ఈ పదం వాడినట్లు మనకు ఆధారాలున్నాయి. కాలక్రమంలో అన్ని రంగాల్లో విపరీతమైన జనాదరణ ఉన్న వారికి సూపర్‌స్టార్ అనే బిరుదు తగిలించడం ఒక గౌరవంగా మారిపోయింది. మన తెలుగు ప్రాంతపు విషయానికి వచ్చేసరికి.. ఇది కేవలం సినిమారంగానికే పరిమితమైన పదంగా.. అనుకోవడం పరిపాటి అయింది. ఇక్కడ ‘స్టార్’ (తార) అంటే.. సినిమాతారలను ప్రస్తావించే అలవాటు మనకున్నందువల్ల సూపర్‌స్టార్‌ను కేవలం సినిమారంగంలోనే వాడుతున్నాం. చాలా అరుదుగా మాత్రమే ఇతర రంగాల్లో ఈ పదం కనిపిస్తుంది. ‘అసాధారణమైన పాప్యులారిటీ కలిగి ఉన్న వ్యక్తినే సూపర్‌స్టార్ అంటారు’ అని డిక్షనరీ కూడా నిర్వచనం చెబుతుంది. సరిగ్గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది కూడా ఈ కోణంలోంచే!!

సూపర్‌స్టార్ అంటే ఏమిటో హీరో  మహేష్‌బాబు మాటల్లో చెప్పాలంటే.. ఇలా ఉంటుంది. ‘‘సినిమా బాగున్నా లేకపోయినా.. దాని కలెక్షన్లు ఒకే రేంజిలో ఉండాలి. బాగోగులతో పనిలేకుండా.. కలెక్షన్ల పరంగా భారీ విజయాల గ్యారంటీ ఉన్నవాడే.. సూపర్‌స్టార్’’!! అవును మరి మనదేశంలో.. ఇలాంటి సూపర్‌స్టార్‌డం  ఒక్క రజనీకాంత్‌కు మాత్రమే ఉంది. ఆయన సినిమాలు ఫ్లాప్ అయితేనే వసూళ్లు 40-50 కోట్ల మధ్యలో ఉంటాయి. అలాంటి హీరో మరొకరు లేరు. ఇదే స్టార్‌డం గురించి ప్రభాస్ కూడా మరో రకంగా చెప్పారు. ‘‘తెలుగులో ఇప్పుడు స్టార్‌లు, నెంబర్ వన్‌లు ఎవరూ లేరు. అలాంటిది చిరంజీవి జమానాతోనే అంతరించి పోయింది. ఇక మీదట కూడా ఫలానా వారు సూపర్‌స్టార్ అనేది ఉండబోదు’’ అన్నాడు ఓ వేడుకలో ప్రభాస్. వారి వ్యాఖ్యలు అబద్ధం కాదు. అలాంటి సూపర్‌స్టార్‌డం గురించే ఈ కథనం. 

కొలబద్ధ ఏమిటి?

సూపర్‌స్టార్‌డం ను కొలవడానికి ఎవ్వరి వద్దా నిర్దిష్టమైన తూకం రాళ్లు లేవు. దానికి ఒక శాస్త్రీయమైన ప్రాతిపదిక లేదు. ఎవరికి వారు రకరకాల కారణాలు చూపిస్తూ.. తామే సూపర్‌స్టార్ అనుకుంటూ గడిపేస్తుంటారు. ఫ్యాన్స్ అయితే.. తమ హీరోనే సూపర్‌స్టార్ అంటుంటారు. పాతరోజుల్లో అయితే కనీసం ఒక సినిమా పత్రిక బ్యాలెట్ నిర్వహించడమూ.. అందులో ఓట్లు సాధించడమూ.. సూపర్‌స్టార్ బిరుదులాగా దక్కడమూ ఉండేది. ఇప్పుడు మీడియా అలాంటి ప్రయోగాల జోలికి వెళ్లడం లేదు. ఎవరూ నిర్దిష్టంగా ఒక పద్దతి ప్రకారం తేల్చకపోతుండడం వలన.. ఎవరికి వారు తమ డప్పు తామే కొట్టుకోవడం అనే పద్దతి ఇక్కడ అమల్లో ఉంది. కానీ.. కొలబద్ధలు ప్రస్తుతానికి లేవు గానీ.. అలా ఉండతగిన అంశాలేమిటో.. ఆ పరంగా.. ఏయే హీరోల స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనం బేరీజు వేసుకుంటే బాగుంటుంది. 

కలెక్షన్ల గేం నిజమేనా?

మన తెలుగు సినిమా పరిశ్రమలో సినిమాలు ప్రస్తుతం మూడు రకాలుగా ఉన్నాయి. భారీ సినిమాలు, మధ్యతరహా సినిమాలు, చిన్న సినిమాలు. సూపర్‌స్టార్ అనే గేం కేవలం భారీచిత్రాల భారాన్ని భుజాన మోసే హీరోలకు మాత్రమే పరిమితమైన ఆట. అయితే ఈ విషయాన్ని నిగ్గు తేల్చడం మాత్రం చాలా కష్టసాధ్యంగా మారిపోయింది. ప్రతి భారీ చిత్రానికి విపరీతంగా హైప్ తీసుకురావడం అనేది ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. సినిమా విడుదలకు ముందు ప్రజల్ని ఎంతగా మాయ చేయగలిగితే అంతగా తమకు కలెక్షన్లు కురుస్తాయనే సిద్ధాంతాన్నే అందరు నిర్మాతలు ఫాలో అవుతున్నారు. సినిమా విడుదల తర్వాత.. సినిమాలోని బలంతో ప్రేక్షకుడిని మాయచేసి, సమ్మోహనపరచి.. కలెక్షన్లు రాబట్టాలనే విశ్వాసాలు.. పాతకాలం చింతకాయ పచ్చడి సిద్ధాంతాలు అయిపోయాయి. నలభై కోట్లు పెట్టి సినిమా తీస్తే ఆడియో వేడుక, పబ్లిసిటీ ల కోసం పదికోట్లు ఖర్చు పెట్టడానికి కూడా నిర్మాతలు ఈరోజుల్లో వెనుకాడడం లేదు. పబ్లిసిటీ లేకపోతే.. రిటర్న్స్ కష్టం అనేది ఒక నాంతికమైన మాట అయిపోయింది. 25 శాతం పెట్టుబడి పబ్లిసిటీ మీద వెళుతున్నారు.

పైగా సినిమాలో కథా కథన బలంను ఎందరు నమ్ముతున్నారో గానీ.. హీరోల మధ్య రేసులో అందరూ పాత్రధారులుగా మారిపోయి.. వందలనుంచి వేల థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయడానికి ఎగబడుతున్నారు. ఒక హీరోసినిమా వెయ్యి థియేటర్లలో విడుదలైతే.. మరొకరు రెండు వేల థియేటర్లకోసం ఎగబడుతున్నారు. ఇలాంటి అపరిపక్వ పోటీ ఫలితంగా ఇండస్ట్రీలో మరో కేటగిరీ చిత్రాలకు సినిమా థియేటర్లు దొరక్కపోవడం ఒక ఎత్తు అయితే.. సదరు చిత్రానికి రాగల కలెక్షన్లు మొత్తం తొలి వారాల్లోనే వచ్చేస్తున్నాయి. భారీ విజయం అనుకున్న చిత్రాలు కూడా వారాల్లోనే తిరిగి వచ్చేస్తున్నాయి. ఒకటి రెండు వారాల్లో ఎవరి సినిమా ఎంత వసూళ్లు చేసిందనేది ఒక కొలబద్ధ అని కొందరు అనుకుంటున్నారు. అందుకోసం.. సినిమాను గొప్పగా చేయడం సంగతి అటుంది.. హైప్ పెంచి, థియేటర్ల సంఖ్యను పెంచి రాబట్టాలని ఉబలాటపడుతున్నారు. 

ప్రతి పెద్ద హీరో కూడా.. రెండు వారాలు గడిచేసరికి మాది నలభైకోట్లు క్రాస్ చేసింది అని చెప్పుకోవడం కూడా పబ్లిసిటీలో భాగం అయిపోయింది. ‘పబ్లిసిటీ లో భాగం’ అనగానే అవన్నీ నమ్మడానికి వీల్లేదు. ఏతావతా ప్రస్తుతానికి అయితే సూపర్‌స్టార్‌లను లెక్కించడానికి తూకం రాళ్లుగా కలెక్షన్లే ఉపయోగపడుతున్నాయి. అయితే ఇందులో చాలా కన్ఫ్యూజన్ కూడా ఉండచ్చు. ఫరెగ్జాంపుల్ ఇప్పుడు బాహుబలి చరిత్ర ఎరుగని కలెక్షన్ల సునామీని సృష్టించిందని మనకు తెలుసు. మరి ‘సూపర్‌స్టార్’ అనేది ఎవరి ఖాతాలోకి వెళ్లాలి. కలెక్షన్ల కొలబద్ధ అయితే.. అంత గందరగోళం గ్యారంటీగా ఉంటుంది.

ఫ్రీక్వెన్సీతో పని లేదా?

గుడ్డిలో మెల్ల ఏంటంటే.. ‘నేనే సూపర్‌స్టార్’ అని హీరోలు ఎవ్వరూ ఈరోజుల్లో చెప్పుకోవడం లేదు. టైటిల్‌కార్డ్స్‌లో వేసుకోవడం లేదు. కాకపోతే.. ప్రతిఒక్కరూ కూడా.. నేనే సూపర్‌స్టార్ అనుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఒక హీరో చిత్రం 75 కోట్లు వసూలు చేసిందనుకుందాం. ఆ సినిమా తర్వాత.. ఆయన నాలుగేళ్లపాటూ మరో చిత్రం గురించి పట్టించుకోకుండా.. రోజులు గడిపేస్తుంటాడు అనుకుందాం. మరి ఆయన సూపర్‌స్టార్ అవుతాడా? ఈ స్టార్‌డం కు సదరు హీరోలు చేసే సినిమాల ఫ్రీక్వెన్సీతో పనిలేదా? అనే మీమాంస మనలో తప్పకుండా కలుగుతుంది. 

ఉంది. ఖచ్చితంగా హీరోలకు సినిమాల ఫ్రీక్వెన్సీతో కూడా స్టార్‌డం కు నిమిత్తం ఉంటుంది. దీన్ని ఎవరూ కాదనలేరు. పాతరోజుల్లో అయితే హీరో కృష్ణ ఏడాదిలో 14 సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయనకు సూపర్‌స్టార్ అనే పేరు ఊరికే అనాయాసంగా రాలేదు. కానీ ఇప్పటి హీరోల్లో సినిమాల ఫ్రీక్వెన్సీ మీద శ్రద్ధ పోయింది. స్టార్‌డం మీద, దాని ద్వారా లభించే రెమ్యూనరేషన్ల మీద  మాత్రం మోజే! రెమ్యూనరేషన్లు పెంచేసుకుంటూ.. ఫ్రీక్వెన్సీ తగ్గించేసుకుంటున్నారు. పదిహేను కోట్లు తీసుకునే హీరోకు ఏడాది పొడవునా కష్టపడి షూటింగ్ చేయాలనే ధ్యాస ఎందుకుంటుంది. మూడేళ్లకు ఓ చిత్రం చేసుకుంటూ.. జీవితాన్ని ఎంజా్గు చేద్దాం అనిపిస్తుందే తప్ప!

అదే ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతోంది. కలెక్షన్ల కొలబద్ధ మీద పెద్ద విజయాలను నమోదుచేయడంతో పాటూ.. విజయవంతమయ్యే చిత్రాల ఫ్రీక్వెన్సీ కూడా సమానంగా మెయింటైన్ చేయగలవారే సూపర్‌స్టార్ లు అని మనం గుర్తించే పరిస్థితి రావాలి. 

సమానమైన ఆదరణ అక్కర్లేదా?

ఇప్పుడు టాలీవుడ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మార్కెట్. అలాగే రాబడి హిట్‌టాక్ కు సంబంధించి ఓవర్సీస్, శాటిలైట్ మార్కెట్ అనే రెండు విభాగాలు కూడా చాలా కీలక భూమికనే పోషిస్తున్నాయి. రెండురాష్ట్రాల్లో ఏరియాల వారీగాచూస్తే ఇదివరకటి లాగానే నైజాం, సీడెడ్, ఆంధ్రా, ఉత్తరాంధ్ర ప్రాంతాలున్నాయి. ఇలా వర్గీకరించుకుంటే.. ఈ అన్ని చోట్ల సమానమైన ఆదరణ ఉండగల చిత్రం అంటూ రావడం లేదు. ఒక హీరో చిత్రం 50 కోట్లు వసూలు చేయవచ్చు గాక.. కానీ, అన్ని ప్రాంతాల్లో సమానమైన ఆదరణతో అలాంటి కలెక్షన్ రికార్డును సృష్టిస్తున్న చిత్రాలు అరుదుగా ఉంటున్నాయి. నైజాం, రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల వేర్వేరు స్థాయుల్లో హీరోలకు ఆదరణ ఉంటోంది. అలాంటప్పుడు.. ఆ ప్రజాదరణకు కొలబద్ధ ప్రాంతాలవారీ అభిమాన దురభిమానాలు అవుతాయే తప్ప.. సినిమా ద్వారా సంపాదించే క్రేజ్ ఎలా అవుతుంది. అలాంటి హీరోలను సూపర్‌స్టార్‌లుగా ఎలా గుర్తించగలం.

అదే తీరుగా.. ఇక్కడ ఎంతపెద్ద హిట్ అయినా.. ఓవర్సీస్‌లో తేలిపోయే చిత్రాలు కొన్ని ఉన్నాయి. శాటిలైట్ మార్కెట్‌లో ఠికానా లేని చిత్రాలు కూడా ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో ఏకరీతిగా జనాదరణ కలిగి ఉండే చిత్రాలు, హీరోలు అరుదు. ముందే మనం నిర్వచనం చెప్పుకున్నట్లుగా సూపర్‌స్టార్ అంటేనే అపరిమితమైన జనాదరణ. మరి.. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అపరిమితంగా, కొన్నిచోట్ల పరిమితంగా ఆదరణ ఉంటే.. ‘సూపర్’ ఎలా అవుతారు?

రేసులో ఉన్నదెవరు? జారినదెవరు?

సూపర్‌స్టార్‌డం గురించి ఎన్ని రకాలుగా చర్చించుకున్నా.. ప్రస్తుతానికి మనకు ఉన్నది కలెక్షన్ల కొలబద్ధ ఒక్కటే అని చెప్పుకున్నాం. అయితే నవతరం సినిమాలు/ హీరోల మధ్య ఇలాంటి రేసు మొదలైన తర్వాత.. ఒక రకంగా చెప్పాలంటే.. మహేష్ చేసిన పోకిరి చిత్రం ఒక బెంచ్‌మార్క్‌ను సృష్టించింది. ఆరోజులకు 50 కోట్ల కలెక్షన్లు అనేది ఒక తూకం రాయిలాగా నిలబడింది. దాన్ని అధిగమించిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాతి కాలంలో.. నవతరం హీరోల హిట్ చిత్రాల కలెక్షన్ ర్యాంకింగ్స్‌లో ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ సంగతి తాజా విజయాలతో కూడా పోల్చిన తర్వాత.. ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అల్లు అర్జున్ ఆ బెంచ్‌మార్క్ దాటిన చిత్రాలు రెండు మూడు స్కోర్ చేశాడు. రాంచరణ్ మగధీరతో 75 కోట్ల వరకు వెళ్లిపోయి.. సరికొత్త బెంచ్‌మార్క్ ఇది అన్నట్లు చేశాడు. మధ్యలో దూకుడు కూడా అలాంటి బెంచ్‌మార్క్‌లాంటి సినిమానే. పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేదితో.. దానిని కూడా అధిగమించేశాడు.

ఇలా ఈ హీరోలంతా రేసులో ఒక అడుగు ముందుకు, ఒక అడుగు వెనక్కు వేస్తూ.. ఇంచుమించు సమానమైన జోరుతోనే పరుగులిడుతూ ఉన్నారు. వీరందరూ కూడా రేసులో ఉన్నట్లే. కానీ ఎన్టీఆర్ మాత్రం.. రేసునుంచి జారిపోయినట్లు భావించాలి. ఎందుకంటే.. ఎన్ని భారీ చిత్రాలు చేస్తున్నా.. తాతగారి తరం నుంచి కుటుంబ పరంగా విపరీతమైన ఫ్యాన్‌బేస్ ఉన్నా.. 50 కోట్లు దాటిన సినిమాలు ఖాతాలో పడడం లేదు. మొన్నటికి మొన్న టెంపర్ యిరగదీసేస్తోంది అని పదేపదే అనుకున్నారు.. గానీ.. ఆ మార్క్ కు ఇవతలే ఆగిపోయింది. ఎన్టీఆర్ రేసు నుంచి జారిపోయినట్లే అయింది. 

రేసులో ఉన్నది పైన చెప్పుకున్న హీరోలే,  అంటే... పవన్‌కల్యాణ్, మహేష్, ప్రభాస్, అర్జున్, రాంచరణ్ అనుకుందాం! అయితే వీరికి సూపర్‌స్టార్‌డంను కట్టబెట్టే ముందు.. పైన చెప్పుకున్న ఇతర ప్రమాణాలు కలెక్షన్లతో పాటుగా, ఫ్రీక్వెన్సీ సమానమైన జనాదరణ వంటివి కూడా పరిగణనలోకి తీసుకుంటే ఎవరెవరు ఎక్కడ ఉంటారో అనుమానమే. నిశ్చితంగా ఫలానా హీరో సూపర్‌స్టార్ అని చెప్పలేని పరిస్థితి టాలీవుడ్‌ను వెన్నాడుతోంది. 

ప్రేక్షకుల ట్రెండ్ మారడం శుభపరిణామం

సినిమాలకు, సూపర్‌స్టార్‌డంకు సంబంధించి.. ప్రేక్షకుల ట్రెండ్ మారడం శుభపరిణామం. ఒక హీరో చిత్రం అంటే జనం వెర్రెత్తినట్లుగా ఎగబడి చూసే రోజులు మారిపోతున్నట్లుగా అనిపిస్తోంది. ఇదివరకటి రోజుల్లో ఆ ట్రెండ్ చాలా పరిపూర్ణంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. సినిమా బేస్డ్‌గానే ఆదరణ కూడా ఉంటోంది. యాభయ్యేసి కోట్ల కలెక్షన్లు రాకపోవచ్చు గానీ.. కొన్ని చిన్న చిత్రాలు కూడా సాధించిన అతిపెద్ద విజయాలు కొన్ని మనం గుర్తు చేసుకోవాలి. అంటే ప్రేక్షకుల ట్రెండ్ మారుతున్నదనడానికి ఇది నిదర్శనం. ఇది శుభపరిణామం.

ఇదే ట్రెండ్‌లో ఉన్న ఆశావహ పరిస్థితి ఏంటంటే.. ప్రేక్షకుల ఆలోచన ధోరణిలో మార్పు రావడం. సినిమా బాగుంటేనే ఆదరించాలి అనే దృక్పథం పెరగడం. చిన్న చిత్రాలకు పెద్ద విజయాలు ఇచ్చే ఇలాంటి పోకడ.. స్టార్ హీరోల భారీ చిత్రాల విషయంలో కూడా పనిచేస్తోంది. హీరోలు ఎంతగా హైప్ సృష్టిస్తున్నా.. బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్న చిత్రాలున్నాయి. కేవలం స్టార్ హీరో, స్టార్ కాంబినేషన్ మాత్రమే కాదు.. సినిమా కూడా కథాకథనాల పరంగా అద్భుతంగా ఉంటేనే.. కొత్తగా ఆకట్టుకునే విధంగా ఉంటేనే.. చిత్రాలకు సూపర్‌కలెక్షన్లను ప్రేక్షకులు కట్టబెడుతున్నారు. అందుకే దీనిని శుభపరిణామంగా పేర్కొనాలి. 

సూపర్‌స్టార్ కాదు ‘సూపర్ సినిమా’ కల్చర్ రావాలి

ప్రజలు, ప్రేక్షకులు ప్రతిసారీ తమ తీర్పు విషయంలో ఖచ్చితంగానే ఉంటున్నారు. కానీ ఫిలిం మేకర్స్ మరియు హీరోలు ఎప్పటికప్పుడు ఆత్మవంచన చేసుకుంటూ స్టార్‌డం ఊబిలో పడి కొట్టుకుపోతున్నారు. నిజం చెప్పాలంటే.. సూపర్‌స్టార్ కల్చర్ కాదు.. ‘సూపర్‌సినిమా’ అనేది ఒక సంసృ్కతిగా రావాలి. అంటే సినిమాను బట్టి జనాదరణ ఏర్పడాలి తప్ప.. అందులో నటించిన వ్యక్తిని బట్టి కాదు. అలాంటి దిశగా బాహుబలి చిత్రం ఒక ఘనవిజయం అని చెప్పవచ్చు. గతంలో కూడా ఇలాంటి అరుదైన విజయాలుఎన్నో ఉన్నాయి. 

అయితే మారుతున్న జనం ట్రెండ్‌ను మేకర్స్/ హీరోలు గుర్తించలేదని అనలేం. కానీ ఒప్పుకోవడానికి వారికి ఈగో అడ్డు వస్తోంది. దాన్ని అధిగమించి వారు ఒప్పుకున్న రోజున తెలుగు పరిశ్రమలో ఒక్క బాహుబలి ఏమిటి..? ఇది గ్రాఫిక్స్ పరంగా ఓ అద్భుతం మాత్రమే.. దీని తలదన్నేలా పెర్ఫార్మెన్సుల పరంగా, కథాబలం పరంగా, అన్ని కోణాల పరంగా.. అద్భుతమైన చిత్రాలు ఆవిషృ్కతం అవుతాయి. అలాంటి సూపర్ సినిమా కల్చర్ ఒక్కటే సూపర్ టాలీవుడ్‌ను తీర్చిదిద్దుతుంది.

స్టార్‌డం అనేది ఒకరి గుత్త సొత్తు అనుకునే జమానా ఇప్పుడు మారిపోయింది. ఏ హీరో సినిమా విడుదలైతే.. అతడే సూపర్‌స్టార్! ఏ హీరోడైరక్టర్‌లు బాక్సాఫీసు పేల్చేస్తే, వారిదే స్టార్‌డం!

అన్న నందమూరి వారి అనుభవం ఇది...

అన్న నందమూరి తారక రామారావు ‘దానవీర శూరకర్ణ’ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్న రోజులవి. చలపతి రావుతో ఆ చిత్రంలో వేర్వేరు పాత్రలు వేయించారు ఎన్టీఆర్. ఒకరోజున పిలిచి.. ‘రేపు ఫలానా పాత్ర ఉంటుంది.. ఉదయాన్నే వచ్చి మేకప్ వేయించుకో’ అన్నార్ట. ఆయనకు ఎదురు చెప్పడానికి భయపడుతూనే చలపతి రావు.. ‘అన్నగారూ ఈసినిమాలో ఇప్పటికే నాలుగు పాత్రలు వేశాను. ఇంకోటి వేయడం అంటే.. జనం గుర్తు పట్టేస్తారేమో’ అన్నాట్ట. దానికి ఎన్టీఆర్ నవ్వి.. ‘ఆంధ్రదేశంలో సగం మంది నన్నే గుర్తు పట్టరు. ఇక నువ్వెంత’ అని చెప్పారట. 

తెలుగుజాతి మొత్తం కీర్తిస్తుంది అని చెప్పుకునే నందమూరి అన్నగారికి తన స్టార్‌డం గురించి తనకున్న అభిప్రాయం అది. ఆయనతో పోల్చిచూసుకుంటే ఇప్పటి హీరోల పరిస్థితి ఎంత? ఇక వారి సూపర్‌స్టార్‌డం గురించి మాట్లాడుకోవడం ఏమిటి?

 సురేష్

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?