Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: షీలా దీక్షిత్‌ గతి ఏమవుతుంది?

ఎమ్బీయస్‌: షీలా దీక్షిత్‌ గతి ఏమవుతుంది?

మోదీపై ఆరోపణలు చేసి భూకంపం సృష్టిస్తా అంటూ రాహుల్‌ గాంధీ సహారా వారి డైరీ, బిర్లా వారి డైరీలోని ఎంట్రీలు బయటపెట్టాడు. భూకంపం ఎక్కడ? అంటూ మోదీ ఎద్దేవా చేశాడే కానీ వాటిపై విచారణ జరిపిస్తానని ఏమీ అనలేదు. సహారా డైరీలో ఎంట్రీలన్నీ అభూతకల్పనలు అని కోర్టు చెప్పింది అంటూన్న బిజెపి ప్రతినిథులు బిర్లా డైరీ గురించి సరైన వివరణ యివ్వటం లేదు.

సహారా డైరీలో తన పేరు కూడా వుండడంతో షీలా దీక్షిత్‌ అదంతా బోగస్‌ అని కొట్టి పారేయడాన్ని బిజెపి తమకు అనుకూలంగా వుపయోగించుకుంటోంది. షీలాయే కాదు, ఆ పరిస్థితుల్లో ఎవరైనా సరే అదే చేస్తారు. కానీ డైరీ ఎంట్రీల ఆధారంగానే గతంలోనూ విచారణలు జరిగాయి. కొందరు పట్టుబడ్డారు కూడా. ఆ డైరీని పట్టుకుని మీరు రాజీనామా చేయాలి అని రాహుల్‌ మోదీని అడుగుతూండగా 'అయితే మీ యుపి ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్‌ మీద వున్న ఆరోపణలు కూడా ఒప్పుకున్నట్టేగా' అని బిజెపి వారు తప్పక అడుగుతారు. అప్పుడు కాంగ్రెసు షీలాను తమ అభ్యర్థిగా విరమింప చేయక తప్పదు. వీటన్నిటికీ సిద్ధపడ్డాకనే కాంగ్రెసు ఆ డైరీని బయటపెట్టిందనుకోవాలి. అలా అనుకుంటే షీలాపై తనే ఆరోపణలు చేసి, తన ముఖ్యమంత్రి అభ్యర్థినే కాంగ్రెసు ఎందుకు దెబ్బ తీసుకుందనే ప్రశ్న వస్తుంది. యుపిలో పరిణామాలు గమనిస్తే దానికి సమాధానం తోస్తుంది.

గత కొద్దికాలంగా యుపి అధికారపక్షమైన ఎస్పీలో కుటుంబకలహాలు పెచ్చుమీరాయి. ములాయం తన రెండవ భార్య సాధనా గుప్తకు, ఆమె కొడుకు ప్రతీక్‌కు ఆప్తుడైన సంజయ్‌ సేఠ్‌ను 2015 జూన్‌లో పార్టీ తరఫున ఎమ్మెల్సీగా నియమిస్తానన్నపుడు అఖిలేశ్‌ అడ్డుకున్నాడు. సంజయ్‌ షాలిమార్‌ కార్పోరేషన్‌ అనే రియల్‌ ఎస్టేటు కంపెనీకి మేనేజింగ్‌ డైరక్టరు. తర్వాత అతన్ని పార్టీ కోశాధికారిగా నియమిస్తానన్నపుడూ అడ్డుకున్నాడు. దాంతో ములాయంకు తిక్కరేగింది. కొడుకుపై విమర్శలు పెంచి తమ్ముడు శివపాల్‌ను వెనకేసుకుని రాసాగాడు. అతన్ని పార్టీ రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిగా చేశాడు. రాబోయే ఎసెంబ్లీ ఎన్నికలలో టిక్కెట్ల పంపిణీ విషయంలో తన మాట చెల్లాలన్న షరతుపై దానికి అఖిలేశ్‌ అంగీకరించాడు. శివపాల్‌ తన పదవిని యిష్టం వచ్చినట్లు వుపయోగిస్తూ అఖిలేశ్‌కు చిక్కులు తెచ్చిపెట్టాడు. అతను పూర్తిగా వ్యతిరేకిస్తున్న క్వామీ ఏక్‌తా దళ్‌ను పార్టీలో విలీనం చేశాడు. నేరప్రవృత్తి వున్నవారికి, క్రిమినల్‌ కేసులున్న వారికి టిక్కెట్లు యివ్వకూడదన్న అఖిలేశ్‌ వాదనను పక్కన పెట్టి ములాయం 'ఇలాటివి పట్టించుకోకూడదు, నెగ్గడం ముఖ్యం' అని వాదించే తమ్ముడి మాటలకే విలువ యివ్వసాగాడు. 

పార్టీలో గొడవలు యిలా వుండగానే అఖిలేశ్‌ అభివృద్ధిలో తనకు ఎవరూ సాటి రారు అని చూపించుకోవడానికి ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజల మన్ననలు పొందాడు. అతను పార్టీని చీల్చి బయటకు వస్తాడని, దాంతో అన్ని పార్టీల యువత అతనికి ఓట్లేస్తారని అనుకోసాగారు. కానీ తను పార్టీ చీల్చనని అఖిలేశ్‌ ప్రకటించాడు. పార్టీ మాట ఎలా వున్నా అఖిలేశ్‌కు గెలిచే అవకాశాలు బాగున్నాయి కాబట్టి అతనితో చేతులు కలిపితే మంచిదని కాంగ్రెసు సలహాదారు ప్రశాంత్‌ కిశోర్‌ సలహా యిచ్చాడు. దానికి కాంగ్రెసు సమ్మతించడంతో అతను అఖిలేశ్‌ వద్దకు, అతని సూచనపై ములాయం వద్దకు రాయబారం నడిపాడు. ప్రస్తుతం యుపిలో బిజెపి ముందుకు దూసుకుపోతోంది. బిజెపి వ్యతిరేక ఓటర్లకి ఎస్పీ, బియస్పీ, కాంగ్రెసు రూపంలో మూడు ఆప్షన్లు వున్నాయి. కలహాలతో మునిగిన ఎస్పీ బిజెపిని ఎదుర్కోలేదని, కాంగ్రెసు గతంలో కంటె పుంజుకున్నా బిజెపిని ఎదిరించేందుకు సొంతంగా బలం చాలదని ఆ ఓటర్లు అనుకుంటున్నారు. అందుచేత మూకుమ్మడిగా బియస్పీకి ఓటేద్దామనుకుంటున్నారు. ఎస్పీ అంతర్గతంగా చేయించుకున్న సర్వేలో బిజెపి, బియస్పీల తర్వాతనే తమ స్థానం వున్నట్లు తెలుసుకుంది. ఎందుకంటే బిసి ఓటర్లలో బిజెపి చీలిక తేగలిగింది. 

ఇలాటి పరిస్థితుల్లో కాంగ్రెసు, ఎస్పీతో చేతులు కలిపితే బిజెపి వ్యతిరేక ఓటర్లందరినీ ఆకర్షించగలదు. 2012 ఎసెంబ్లీ ఎన్నికలలో వారికి వచ్చిన ఓట్ల శాతాలను కలిపితే 41% వచ్చింది. 2014 లోకసభ ఎన్నికల అంకెలు చూసినా 30% వస్తోంది. ఆ ఎన్నికలలో బిజెపికి 43% వచ్చింది కానీ యీసారి అంత రాదని అందరికీ తెలుసు. కాంగ్రెసుతో బాటు ఆర్‌ఎల్‌డిని కలుపుకుని బిహార్‌ తరహాలో మహాగఠ్‌బంధన్‌ ఏర్పరచాలని ములాయం ఆలోచన. అది ఫలిస్తే అఖిలేశ్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం. శివపాల్‌కు అది యిష్టం లేదు. అందుకని ఎస్పీకి సొంతంగా బలం వుందని, కాంగ్రెసుతో చేతులు కలపనక్కలేదని ప్రకటనలు యిచ్చాడు. డిసెంబరు 11న 23 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేశాడు. దానిలో క్వామీ ఏక్‌తా దళ్‌ ఎమ్మెల్యే సిగ్బతుల్లా అన్సారీ పేరు వుండడం అఖిలేశ్‌ను మండించింది. తను సమాంతరంగా జాబితా తయారుచేశాడు. అది వింటూనే శివపాల్‌ 175 మంది పేర్లతో మరో జాబితా విడుదల చేశాడు. డిసెంబరు 24 న అఖిలేశ్‌ తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి 'మీ అందరికీ టిక్కెట్లిచ్చే బాధ్యత నాది' అన్నాడు. మర్నాడు తన జాబితాను ములాయంకు సమర్పించాడు. 

పార్టీకి 229 మంది ఎమ్మెల్యేలుంటే వారిలో 183 మంది అఖిలేశ్‌కు మద్దతిస్తున్నారన్న సంగతి ములాయంకు తెలుసు. ఇటు శివపాల్‌ 'ముఖ్యమంత్రి ఎవరన్నది ముందే చెప్పం. ఎన్నికల తర్వాత గెలిచిన అభ్యర్థులు ఎన్నుకుంటారు' అని చెప్తున్నా అఖిలేశ్‌ను చూసే కాంగ్రెసు ముందుకు వస్తోందని తెలుసు. చివరకు ఎటు మొగ్గుతాడో చూడాలి. కాంగ్రెసుతో పొత్తు పెట్టుకునేట్లయితే యిప్పటికే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన షీలా దీక్షిత్‌ను వాళ్లు ఎలా వదుల్చుకుంటారన్న ప్రశ్న వస్తుంది. ఇప్పుడు డైరీల వ్యవహారం తర్వాత తోచేదేమిటంటే - తమ పార్టీ నైతికతకు కట్టుబడి వుందని చూపుకుంటూ కాంగ్రెసు షీలాను అభ్యర్థిగా తీసివేసి పొత్తుకు మార్గం సుగమం చేయవచ్చు. 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?