Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: అమెరికా- భయాందోళనలే గెలిచాయి...

ఎమ్బీయస్‌: అమెరికా- భయాందోళనలే గెలిచాయి...

ట్రంప్‌ విజయాన్ని అర్థం చేసుకోవడానికి నేటి అమెరికా సమాజాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవలసి వుంది. ట్రంప్‌ గెలుపును మైనారిటీ వ్యతిరేక, విదేశీ కార్మిక వ్యతిరేక ఓటుగా వర్ణించడం తేలిక. ట్రంప్‌ వంటి జోకర్‌ను, వదరుబోతును, అహంకారిని, అవినీతిపరుణ్ని, మూర్తీభవించిన అసభ్యతను గెలిపించినది శ్వేతజాత్యహంకారమే తప్ప వేరొకటి కాదని అనేయవచ్చు. కానీ అక్కడి సామాన్యుడి ఆర్థికస్థితిగతులు, సామాజిక పరిస్థితి, ఆశనిరాశలు తెలుసుకుంటే సమాధానం అంత సులభం కాదని తోస్తుంది.

నిజానికి నేను అమెరికన్‌ ఎన్నికల గురించి పెద్దగా పట్టించుకోను. ఎవరు నెగ్గినా అమెరికా సామ్రాజ్యవాదం మారదనే నిస్పృహ నాది. రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మద్య ఉన్నీస్‌-బీస్‌ తేడా తప్ప వేరొకటి లేదని, ఎవరు వచ్చిన పాకిస్తాన్‌ను చంకనెక్కించుకుంటారని, గల్ఫ్‌లో పెత్తనం సాగిస్తూ, ప్రపంచంలో దాదాపు 100 చోట్ల సైనిక, నౌకా స్థావరాలను నిర్వహించుకుంటూ, అమెరికా వ్యవస్థను తన గుప్పిట్లో వుంచుకునే ఆయుధాల కంపెనీల మనుగడకై ఏదో ఒక దేశంలో ఏదో ఒక సాకుతో యుద్ధాన్ని రగిలించి పబ్బం గడుపుకుంటారని నాకు ఒళ్లు మంట. ఎవరు గెలిస్తే మనకేంటి? అనే భావన నాది. 

కానీ యీసారి ట్రంప్‌ ఉపన్యాసాలు నాలో ఆసక్తి రగిలించాయి. ఉన్నదున్నట్లు మాట్లాడుతున్నాడే, దీన్ని అమెరికన్‌ ప్రజలు ఎలా స్వీకరిస్తారు అనే ఉత్సుకతతో అమెరికా గురించి కనబడిన ఆర్టికల్సన్నీ చదవనారంభించాను. ఆ సందర్భంలో అమెరికన్‌ సమాజం ఎంత కృంగిపోయిందో, సగటు అమెరికన్‌ ఎంత కునారిల్లుతున్నాడో గమనించాను, కొంత వూహించాను. ఎంతసేపూ ఎవడు గెలిస్తే మన యిండియన్స్‌కు వీసాలిస్తాడా? ఔట్‌సోర్సింగ్‌ యిస్తాడా అనే ఆలోచనలోంచి బయటపడి, అసలు అమెరికన్లకు ఎలాటి వ్యవస్థ మంచిది అనే కోణంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను.

పేపర్లు, టీవీలు, సర్వేలు అన్నీ హిల్లరీకే మద్దతు అంటూ వుంటే 'అయితే ట్రంప్‌ది అరణ్యరోదనే అన్నమాట' అనుకున్నాను. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ట్రంప్‌ గెలిచాడు. అనేక వర్గాలు అతన్ని దూరం పెట్టాయి. అయినా సగటు అమెరికన్‌ అతని వెంట నిలిచాడు. ఎందుకో అర్థం చేసుకుందామనే యీ ప్రయత్నం. అయిపోయిన పెళ్లికి బాజాలెందుకు? అనుకోకూడదు. ఎందుకంటే యీ ధోరణి బ్రెగ్జిట్‌లో యిప్పటికే కనబడింది. రాబోయే రోజుల్లో ప్రతిదేశంలోను యిదే తలెత్తవచ్చు. గ్లోబలైజేషన్‌ కాన్సెప్ట్‌ వెనకబడి గతకాలంలా స్వీయరక్షణవాదం (ప్రొటెక్షనిజం) ప్రబలవచ్చు. ఆ పరిణామాలు వూహించడానికి యీ విశ్లేషణ వుపయోగపడుతుంది. 

ఆసియన్‌ దేశాల, యితర అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లలోకి చొచ్చుకుపోవాలని అమెరికా, యూరోప్‌ దేశాలు గ్లోబలైజేషన్‌ ప్రతిపాదన చేశాయి. కానీ వాళ్ల ఆలోచనలు తలకిందులై అమెరికన్‌ మార్కెట్లను చైనా సరుకులు ముంచెత్తాయి. అమెరికన్‌ కంపెనీల ఉద్యోగాలను భారతీయులు, యితర ఆసియన్లు కబళించారు. స్థానిక వాణిజ్యం, కర్మాగారాలు మూతపడ్డాయి. అందుకే యూగన్‌ సర్వేలో 71% మంది అమెరికన్లు విదేశీ కంపెనీల పోటీ నుంచి స్థానిక వాణిజ్యాన్ని రక్షించుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇలాటి రక్షణ ప్రస్తుతం లేకపోవడం చేత ప్రజలు నిరుద్యోగులవుతున్నారు. 50 ఏళ్లగా వలస వస్తున్న వారిలో, నల్లవారిలో ఎక్కువమంది స్థితి ఎప్పుడూ అంతంత మాత్రమే కాబట్టి వారు సర్దుకుపోతున్నారు కానీ ఒకప్పుడు ఘనంగా బతికి యీ రోజు పరిస్థితి తారుమారైనవారు శ్వేతజాతీయులు. ఈనాడు అమెరికన్‌ జనాభాలో వారి సంఖ్య 62% మాత్రమే. వాళ్లు రాజకీయ భేదాభిప్రాయాలతో వేర్వేరుగా ఓటేస్తూ వుంటే నల్లజాతి, హిస్పానిక్‌, ఆసియన్‌ ఓటర్లు మూకుమ్మడిగా ఓట్లేసి డెమోక్రాట్లను తరచుగా గెలిపిస్తున్నారు. ఒబామా స్వేచ్ఛా వాణిజ్యవిధానాలు అమెరికాకు నష్టదాయకంగా పరిణమించాయి. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఒబామా తీసుకున్న చర్యలతో అమెరికా గాడిన పడింది కానీ ఆ ఉద్దీపన నిధులు పెద్ద పెద్ద కంపెనీలకు, బ్యాంకులకు చేరాయి. 

అమెరికా ఆర్థిక వ్యవస్థలో పెద్ద లోపం ధనికులకు, పేదలకు మధ్య అంతరం విపరీతంగా పెరిగిపోవడం. దేశంలోని 75% శాతం సంపద 10% మంది వ్యక్తుల వద్ద పోగుపడింది. తక్కిన 25% సంపదని మిగిలిన 90% జనాభా పంచుకుంటున్నారన్నమాట. అత్యంత ధనికులను, అతినిరుపేదలను తయారుచేస్తున్నది భారీ కంపెనీలు, వాటికి మద్దతుగా నిలిచిన ప్రభుత్వ విధానాలు.

గత రిపబ్లికన్‌ ప్రభుత్వాలకు అమెరికన్‌ సంస్థలకు పన్ను రాయితీలు, ఋణాలు భారీగా యిచ్చాయి కానీ మీరు యిక్కడే పెట్టుబడి పెట్టాలి అనే నిబంధన విధించలేదు. అన్ని సౌకర్యాలూ పొంది రెండు లక్షల కోట్ల డాలర్ల రిజర్వు నిధులు పోగేసుకున్నా ఆ కంపెనీలు తిరిగి అమెరికాలో పెట్టుబడి పెట్టడం లేదు, మరీ తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప స్థానికులకు ఉద్యోగాలు యివ్వటం లేదు. అది గమనించాకైనా డెమోక్రాటిక్‌ ప్రభుత్వాలు విధానాలు సరిదిద్దలేదు. 1952లో అమెరికా ప్రభుత్వాదాయంలో కార్పోరేట్‌ పన్నుల వాటా 33%. కానీ యిప్పుడది దానిలో మూడోవంతుకి, అంటే 11%కి పడిపోయింది. వీటికి ఫెడరల్‌ బ్యాంకు నుండి లోన్లు, గ్రాంట్ల రూపంలో ముట్టినది 11 లక్షల కోట్ల డాలర్లు. ఇంత తీసుకుని యివి మాన్యుఫేక్చరింగ్‌ యూనిట్లను చైనా, మెక్సికో, కొరియా వంటి చౌకవేతనాల దేశాల్లో పెడుతున్నాయి.

పన్నుల విధానంలో అవి ప్రయోజనం ఎలా పొందుతున్నాయో చూపడానికి ఆపిల్‌ ఓ ఉదాహరణ. అమెరికన్‌ మల్టీనేషనల్‌ కంపెనీలు విదేశాల్లో పార్క్‌ చేసి వుంచిన ధనం 1200 బిలియన్‌్‌ డాలర్లు కాగా దానిలో 187 బిలియన్‌ డాలర్లు ఆపిల్‌వే. గత పదేళ్లలో విదేశీ కార్యకలాపాలపై అది 200 బిలియన్‌ డాలర్లు లాభం సంపాదించింది. అయితే అది దాని మీద కట్టిన పన్ను కేవలం 4%! విదేశీ లాభాల్లో 90% అది ఐర్లండ్‌లో పెట్టిన సబ్సిడీ ద్వారా సంపాదించినదే. పోనీ అక్కడైనా పన్ను కడుతోందా అంటే 1991 నాటి ఐరిష్‌ పన్ను విధానాన్ని తననుగుణంగా మలచుకుని, ఏది స్వదేశీ (రెసిడెంటు) కంపెనీ అనే నిర్వచనం ఐర్లండ్‌లో ఒకలా, అమెరికాలో యింకోలా వుండడంతో ఆ వెసులుబాటు ఉపయోగించుకుని అక్కడా అతి తక్కువ పన్నులు కట్టింది. ఇది యూరోపియన్‌ యూనియన్‌ దృష్టికి వచ్చింది. ఇలాటి చర్యలతో లాభాలు సంపాదించి పోటీదారులకు నిలువనీడ లేకుండా చేస్తోందని భావించిన ఇయు దానికి జరిమానా వేసి 1450 కోట్ల యూరోలు చెల్లించమంది, గతంలో తీసుకున్న రాయితీలను కూడా కక్కమంది. ఇది ఆపిల్‌-ఇయూ వివాదం.

అమెరికా ప్రభుత్వానికి దీనిలో జోక్యం ఏముండాలి? కానీ అది ఆపిల్‌ పక్షాన నిలిచి ఇయుపై మండిపడి, దీనికి ప్రతిగా ఇయు దేశమైన జర్మనీకి చెందిన డాయిష్‌ బ్యాంకు మీద 1400 కోట్ల డాలర్ల జరిమానా విధించింది. ఇదీ అమెరికన్‌ ప్రభుత్వం కంపెనీలకు కొమ్ము కాస్తున్న విధం! ఇదేం పద్ధతంటే - 'మేం పన్నులు తగ్గిస్తే అమెరికాలో పెట్టుబడి పెడదామని ఆపిల్‌ చూస్తోంది. మీరే పన్నుల రూపంలో అంతా లాగేస్తే అది డబుల్‌ టాక్సేషన్‌ కింద వస్తుంది కదా' అంటోంది. ఆపిల్‌పై ఇంత ఔదార్యం అవసరమా? నిజానికి యాపిల్‌ అమెరికాలో కేవలం 65 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు యిచ్చి, తన ఉత్పాదనలన్నిటినీ చైనాలో తయారుచేస్తోంది. అంటే పేరుకే అవి అమెరికన్‌ కంపెనీలు తప్ప, వాటి వలన అమెరికా దేశానికి కాని, అక్కడి ప్రజలకు కాని లాభం పూజ్యం. 

ఏ మాత్రం సందు దొరికినా కంపెనీలు అమెరికన్‌ ఉద్యోగులను తీసివేసి, ఆ ఖాళీలను తక్కువ వేతనాలకు లభించే భారత్‌, యితర దేశస్తులకు కట్టబెట్టడం ఇటీవలి కాలంలో మరీ పెరిగింది. డిస్నీలాండ్‌లో యిలా చేయడం ట్రంప్‌ ఎన్నికల అంశంగా చేసుకున్నాడు. దాని గురించి మాట్లాడుతూండగానే ఐబిఎం మినియాపాలిస్‌లో 500 ఉద్యోగాలలో అమెరికన్లను తొలగించి మనవాళ్లకు వేసుకోవడం జరిగింది. అది మరో అంశంగా మారింది. ఇదేమీ కాకపోతే పని మొత్తాన్ని ఔట్‌సోర్సు చేసేస్తున్నారు. మన ఇండియన్‌ కళ్లతో చూసినపుడు యిది మనకు మహదానందాన్ని కలిగిస్తుంది.

'అవును మరి, అమెరికన్లు సరిగ్గా చదువుకోరు, సరిగ్గా పనిచేయరు, మనవాళ్లయితే నిపుణులు, పైగా కష్టపడి పనిచేస్తారు' అని చెప్పుకుంటాం. ఇన్ని శతాబ్దాలుగా అమెరికా అనేక రంగాల్లో పైకి వచ్చిందంటే వాళ్లెవరూ చదువుకోకుండానే, పనిచేయకుండానే వచ్చేసిందా? మనవాళ్లు చెలరేగుతున్నది కొన్ని రంగాల్లోనే అని గుర్తుపెట్టుకోవాలి. మనవాళ్లు సివిలు కిట్టించేసినా, చదువు, అనుభవం విషయంలో బుకాయించేసినా, అమెరికా కంపెనీలు చూసీ చూడనట్లు వూరుకోవడం దేనికంటె చౌకజీతాలకు పని చేయడానికి సిద్ధపడుతున్నాం కాబట్టి! అమెరికన్లతో సమానంగా జీతాలివ్వండి అని అడిగి సాధించిన రోజున మనం కాలరు ఎగరేయవచ్చు. వాళ్లు యిచ్చినంత పుచ్చుకుని ఆ డాలర్లను రూపాయిల్లో మార్చి ఇండియాలో దాచుకుంటేనే మనకు కిట్టుబాటవుతుంది. అదే అమెరికాలో వుంటూ, వాళ్ల జీవనశైలిలోనే బతకాలంటే వాళ్లిచ్చే జీతాలు చాలామందికి చాలవు. అది మనం గ్రహించాలి. ఇక అమెరికా వైపు నుంచి చూస్తే వాళ్లకు అన్యాయం జరుగుతోంది. వాళ్ల ఉద్యోగాలు నానాటికి హరించుకుపోతున్నాయి. 25, 30 ఏళ్లగా వాళ్ల జీవననాణ్యత తగ్గిపోతూ వస్తోంది. అభద్రతా భావం పెరుగుతూ వస్తోంది. 

2007-14 మధ్య వారి ఆదాయాలు 20% పడిపోయాయి.  రాజకీయ ప్రాబల్యం కూడా తగ్గిపోయింది. తమను పట్టించుకునేవారు లేరన్న కసితో వున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఉత్పదక రంగం నుంచి సేవల రంగానికి మళ్లింది. కొన్ని చోట్ల బొగ్గుగనులు మూసేశారు. చైనా కరెన్సీ మానిప్యులేషన్‌తో తన వస్తువులను తక్కువ రేటుకే అమ్ముతోంది. 1990లలో మెక్సికో, కెనడాలతో, 2000 సం||రంలో చైనాతో కుదుర్చుకున్న ఒప్పందాల కారణంగా 20 లక్షల ఉద్యోగాలు పోయాయి. సర్వేల ప్రకారం 50% మంది ఓటర్లు ఆర్థిక కారణాలకే ప్రాధాన్యత యిచ్చారు. ఆర్థిక వ్యవస్థ బాగాలేదని 75% మంది అన్నారు. నాలుగేళ్ల నాటితో పోలిస్తే తమ ఆర్థికస్థితి దిగజారిందని 10% మంది చెప్పారు. మిచిగన్‌, ఒహాయో, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌లు ఒకప్పుడు మ్యాన్యుఫేక్చరింగ్‌ యూనిట్లకు పెట్టింది పేరు. ఇప్పుడు పరిశ్రమలు తరలిపోవడంతో వాటికి 'రస్ట్‌ బెల్ట్‌' అని పేరు వచ్చింది. ప్రపంచ కార్మికులలో అమెరికన్‌ వర్కర్ల శాతం 1960లలో 25% వుంటే పరిస్థితి మారి 2010 వచ్చేసరికి కేవలం 10% మంది వున్నారు. 

దీనికి తోడు పొట్టకూటి కోసం వలస వచ్చినవారు పావలాకు, అర్ధకూ పనిచేయడానికి సిద్ధపడడంతో వీళ్లకు చిన్నాచితకా ఉద్యోగాలు కూడా దొరకడం మానేశాయి. పరదేశం నుండి వచ్చినవాళ్లు ఎలాగైనా, ఎలాటి దుర్భరపరిస్థితుల్లోనైనా బతికేస్తారు. కానీ స్థానికులు కాస్త డీసెంటుగా బతుకుదామని చూస్తారు. అందువలన ఆ జీతాలకు వీళ్లు సిద్ధపడరు. వలస వచ్చినవారిలో సక్రమంగా వచ్చినవారు కొందరైతే, అక్రమంగా వచ్చినవాళ్లు చాలామంది వున్నారు. అసాంకు అక్రమవలసదారులు వచ్చిపడిపోతూ వుంటే మనం వూరుకుంటున్నామా? తరిమివేయాలని చూడడం లేదా? అలాగే వాళ్లూను. మన దేశంలో అయితే గుర్తింపు కార్డు వ్యవస్థ, ఎవరు ఎక్కడివారు అని కనిపెట్టే వ్యవస్థ యిప్పుడిప్పుడే రూపు దిద్దుకుంటోంది. సాంకేతికంగా ఎంతో ముందంజ వేసిన అమెరికాలో ఇల్లీగల్‌ యిమ్మిగ్రెంట్లను కనుగొనడం అంత కష్టం కాకపోవచ్చు. ప్రభుత్వం చూసీ చూడనట్లు వూరుకోవడం వలననే వారి సంఖ్య పెరుగుతూ వచ్చిందని స్థానికులు అనుకుంటూ అక్రమ వలసదారులపై, వారిని అనుమతించిన ప్రభుత్వంపై గుర్రుగా వున్నారు. 

ఒక వ్యాపారవేత్తగా పనివారితో మసలినప్పుడు ట్రంప్‌ వారి మనోభావాలను బాగా గ్రహించి, వారి కోసమే నిలబడ్డానంటూ ప్రచారం చేసుకున్నాడు. సరైన పత్రాలు లేని 20 లక్షల మంది అక్రమవలసదారులను పంపేస్తానని మాటిచ్చాడు. ఎన్నికల తర్వాత కూడా దాన్ని పునరుద్ఘాటిస్తున్నాడు. ఇతర దేశాల నుంచి ఎడాపెడా దిగుమతులు చేసుకోవడం వలననే స్థానికంగా కర్మాగారాలు మూతపడ్డాయని, ఉద్యోగాలు పోయాయని, దాన్ని సరిదిద్దడానికి దిగుమతి సుంకాలను పెంచుతానని చెప్పాడు. ముఖ్యంగా అమెరికాకు కుప్పలుతిప్పలుగా వస్తున్న చైనా వస్తువులపై 45% సుంకాలు విధిస్తానన్నాడు. అక్రమ వలసదారుల్లో ప్రథమస్థానంలో వున్న మెక్సికో దిగుమతులపై 35% పన్నులు వేస్తానన్నాడు. ఇవన్నీ గ్లోబలైజేషన్‌ సిద్ధాంతానికి వ్యతిరేకమే కావచ్చు. అయినా 'అమెరికా ఫస్ట్‌' మన కొంప మనం కాపాడుకుందాం - అనే ట్రంప్‌ వాదన చాలామందిని ఆకట్టుకుంది. 

గోల్డ్‌ డిగ్గర్స్‌లా అమెరికాకు వెళ్లిన మన భారతీయులకు ఆ దేశం అవకాశాల గనిగా, స్వర్ణభూమిగా, అందమైన మేడిపండులా తోచవచ్చు. కానీ స్థానికులకు తెలుసు - ఆ పండులో ఎన్ని పురుగులు వున్నాయో. హార్వార్డ్‌ లో చదువుకుని డెమోక్రాటిక్‌ సెనేటర్‌గా వుంటూ, ట్రంప్‌ను పూర్తిగా వ్యతిరేకించే ఎలిజబెత్‌ వారెన్‌ డెమోక్రాటిక్‌ కన్వెన్షన్‌ ప్రసంగంలో యిచ్చిన గణాంకాలు చూస్తే 30 ఏళ్లలో పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో తెలుస్తుంది. 'కితం తరంలో ఒంటిజీతంతో బతికే కుటుంబాల కంటె యిద్దరు సంపాదిస్తున్న యీనాటి కుటుంబాలకు అధ్వాన్నంగా వున్నాయి. ఋణం తీసుకున్న కుటుంబాలలో మూడోవంతు మంది అప్పు తిరిగి కట్టలేక అవస్థ పడుతున్నారు. 18 ఏళ్లు వచ్చిన కాలేజీ విద్యార్థులలో 70% నెత్తిపై విద్యాఋణాలున్నాయి. కితం ఏడాది 8,20,000 కుటుంబాలు దివాలా (బాన్‌క్రప్టసీ)కి అప్లయి చేశాయి. ఒకప్పుడు మనం మధ్యతరగతికి ప్రోత్సాహకాలిచ్చాం. క్రమేపీ మనం మధ్యతరగతి నెత్తికొట్టి డబ్బున్నవాళ్లనే నెత్తిమీద పెట్టుకుంటున్నాం. 

'1935 నుంచి 1980 వరకు, కొత్తగా సృష్టింపబడే సంపదలో 70% కింది స్థాయిలో వున్న 90% జనాభాకు చేరేది. పై స్థాయిలో వున్న 10%కు 30% దక్కేది. 1980 నుంచి 2016 వరకు సృష్టింపబడిన సంపదలో మొత్తమంతా టాప్‌ 10%కే పోయింది. అభివృద్ధి ఫలాలు 90% మందికి అందనే లేదు. మరి వీళ్ల గతేమైంది? 30 ఏళ్ల కితం అతను తిండిపై ఖర్చు పెట్టే దాని కంటె యీ నాడు 13% తక్కువ ఖర్చుపెడుతున్నాడు, (ఇన్‌ఫ్లేషన్‌ ఎడ్జస్టెడ్‌ ఫిగర్స్‌ యివి) బట్టల విషయంలో 46%, ఎలక్ట్రానిక్‌ పరికరాలు (ఐఫోన్‌ వంటివి కలుపుకున్నా) విషయంలో 48% తక్కువ ఖర్చుపెడుతున్నాడు. అదే సమయంలో ట్రాన్స్‌పోర్టేషన్‌పై 11% ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తోంది. ఇంటికై 57%, హెల్త్‌ ఇన్సూరెన్సుపై 104%, కాలేజీ విద్యపై 275%, చైల్డ్‌ కేర్‌పై 953% ఎక్కువ ఖర్చుపెట్టవలసి వస్తోంది. సామాన్యుడికే కాదు, డబ్బు, పలుకుబడి వున్నవాళ్లకు కూడా ఖర్చులు పెరిగాయి పాపం. లాబీయింగ్‌కై 1980లలో 200 మిలియన్‌ డాలర్లు ఖర్చుపెడితే సరిపోయేది. 2002 నాటికి 1.8 బిలియన్‌ డాలర్లు ఖర్చుపెట్టారు, 2012 కి అది 3.3 బిలియన్‌ డాలర్లు! అంటే 30 ఏళ్లల్లో (ఇన్‌ఫ్లేషన్‌కి అనుగుణంగా సవరిస్తే) 7 రెట్లు ఖర్చు పెరిగిందన్నమాట.'- యిదీ ఆమె ఉపన్యాసం.

ఇంత చెప్పినా మన భారతీయులు 'అమెరికన్లు సరిగ్గా చదువుకుని వుంటే వాళ్లకూ ఉద్యోగాలు వచ్చి వుండేవి' అని వాదించవచ్చు. అక్కడి విద్యావ్యవస్థ ఎంత ఘోరంగా నడుస్తోందో యీ మధ్యే ఒక వ్యాసం రాశాను. మన దగ్గర కార్పోరేట్‌ కాలేజీల కంటె అధ్వాన్నంగా అక్కడి కాలేజీలు చదువుల కంటె ప్రచారంపై ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. విద్యాప్రమాణాలు లేవు. పైగా విద్యార్థులను అప్పులపాలు చేస్తున్నారు. మన దగ్గరైతే పిల్లలకు 30 ఏళ్లు వచ్చినా అప్పోసొప్పో చేసి తలిదండ్రులు చదివించే కుటుంబవ్యవస్థ వుంది. అక్కడది లేదు. పైగా తండ్రికి ఉద్యోగం పోయి ఏడుస్తూవుంటే కొడుకుని ఏం చదివిస్తాడు? ఆదాయం ఎప్పుడైతే తగ్గిందో భార్యాభర్తల మధ్య కీచులాటలు, అవి ముదిరి విడాకులు సహజం. పిల్లలు ఎవరి పంచన చేరతారో, వాళ్లు ఏ మేరకు ఆదుకోగలరో అంతా దైవాధీనం. తక్కువగా చదువుకున్నందుకు పిల్లలకూ చిన్న ఉద్యోగాలే. అవీ పోతున్నాయి. ప్రభుత్వం యిచ్చే భృతిపై ఆధారపడాలి. అది ఎవరికీ ఆనందదాయకం కాదు. 

తనే కాళ్లు విరక్కొట్టి, ఆ పై చంకకర్రలు ఉదారంగా దానమిచ్చే ప్రభుత్వాలు వున్నంతకాలం ప్రజల్లో ఫ్రస్టేషన్‌ పెరుగుతూనే వుంటుంది. ప్రతి వ్యక్తికి ఆత్మగౌరవం వుంటుంది. చేతి నిండా పని కల్పించే ప్రభుత్వం వుంటే తన పని తాను చేసుకుని గర్వంగా బతుకుతాడు. చేతిలో పని లేకుండా, కేవలం ప్రభుత్వం విసిరే ముష్టిపై బతుకుతూంటే నిరాశానిస్పృహలలో మునుగుతాడు. మత్తుపదార్థాలకు బానిసవుతాడు. తన కంటె మెరుగైన పరిస్థితుల్లో వున్న యిరుగుపొరుగులను చూసి అసూయ, కోపం పెంచుకుని అవకాశం వచ్చినపుడు వారిపై దాడి చేద్దామని చూస్తాడు. దానివలన సామాజిక అశాంతి. తుపాకీ సంస్కృతికి ఆదరణ. ఇలాటి పరిస్థితుల్లో సరిగ్గా చదువుకోలేదని వాళ్లను ఎద్దేవా చేయడం అనవసరం.

ట్రంప్‌ వచ్చినంత మాత్రాన అమెరికన్లందరికీ హఠాత్తుగా చదువులు వచ్చేస్తాయని, పెద్ద ఉద్యోగాలు చేయడానికి అర్హులై పోతారని అనుకోలేం. ప్రస్తుత అమెరికన్‌ వ్యవస్థను దోచుకుంటున్న సంస్థలెన్నో వున్నాయి. విద్యావ్యవస్థ ఒక్కటే కాదు, సబ్‌ప్రైమ్‌ ఉదంతంలో, వెల్స్‌ ఫార్గో వుదంతంలో బాంకింగ్‌ వ్యవస్థకూడా సామాన్యులను దోచుకుంటోందని అర్థమవుతోంది. వీటన్నిటిని అతను సంస్కరించి, అదుపులో పెట్టగలిగిననాడే సగటు అమెరికన్‌ జీవితం బాగుపడుతుంది. ఇప్పుడున్న వ్యవస్థ అద్భుతంగా వుందని భావించిన హిల్లరీ ఒబామా వారసత్వాన్ని కొనసాగిస్తానని మాట యిచ్చింది. ఓ పక్క మీకు సంక్షేమపథకాలూ పెడతాను, కంపెనీలను బాగుపడనిస్తాను అంది. పెద్ద కంపెనీలతో, కుబేరులతో మమేకమైన హిల్లరీ మాట నమ్మబుద్ధి కాక, యిది నడిచే వ్యవహారంగా తోచక అక్కరలేదు, మహాప్రభో అన్నాడు సగటు అమెరికన్‌. ట్రంప్‌ వాళ్లకు ఉద్యోగాలు కల్పిస్తానంటున్నది సాంకేతిక పరిజ్ఞానం అవసరమైన పెద్ద ఉద్యోగాలు కాదు. నైపుణ్యం పెద్దగా లేకపోయినా, యూనియన్‌ బలంతో మంచి జీతాలు తెచ్చుకునే యూరోప్‌ తరహా ఉద్యోగాలే! గతంలో యివి వాళ్లకుండేవి. కానీ ఓ పక్క టెక్నాలజీ, మరో పక్క గ్లోబలైజేషన్‌ పెరగడంతో అవి హరించుకు పోయాయి. 

గతంలో పాతికేళ్ల క్రితం మాన్యుఫేక్చరింగ్‌, విద్యుత్‌, గ్యాస్‌ వంటి యుటిలిటీస్‌ రంగాల్లో యిలాటి ఉద్యోగం చేసే అమెరికన్‌ మగవాడు ఒక్క జీతంతో మధ్యతరగతి జీవితాన్ని గడిపేవాడు. కానీ మొదటి రంగం 30% తగ్గిపోగా, రెండోది 25% క్షీణించింది. ఇంకో పరిణామం ఏం జరిగిందంటే యిదే సమయంలో సాంకేతికత పెరిగి భుజబలం కంటె బుద్ధిబలం, ఓర్పు, కమ్యూనికేషన్‌ స్కిల్‌ అవసరం పడే ఉద్యోగాలు పెరిగాయి. అవి ఆడవాళ్లకు అనువుగా వుండి, వాళ్లు పెద్ద ఎత్తున ఉద్యోగాల్లోకి వచ్చారు. విద్య, నర్సింగ్‌, సోషల్‌ వర్క్‌ వంటి రంగాల్లో ఉద్యోగాలు రెట్టింపయ్యాయి. ఈ 'ఆడంగి' ఉద్యోగాలు చేపట్టడం మగవాళ్లు చిన్నతనంగా ఫీలయి దూరంగా వున్నారు. లేదా చిన్న ఉద్యోగాల్లో కుదురుకున్నారు. పెళ్లయి, పిల్లలున్న ఆడవాళ్లలో 23% మంది భర్తల కంటె ఎక్కువ సంపాదిస్తున్నారు. 1960లలో యిది 5% కంటె తక్కువ వుండేది. పిల్లలున్న కుటుంబాలను తీసుకుంటే వాటిలో 40% కుటుంబాలలో మహిళ మాత్రమే సంపాదించడమో, లేక ప్రధాన పోషకురాలిగా (ప్రైమరీ బ్రెడ్‌విన్నర్‌) వుండడమో జరుగుతోంది. 

ఏతావాతా ఇంట్లో భార్యకు ఉద్యోగం వచ్చి, మొగుడికి ఉద్యోగం పోయి మగాళ్ల ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం దెబ్బ తినే పరిస్థితి వచ్చి, అది వారి లైంగిక సామర్థ్యంపై ప్రభావం చూపిందని, అది అనేక సమస్యలకు దారి తీస్తోందని జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ అండ్రూ చెర్లిన్‌ అన్నారు. మగవాళ్లు యిలా ఆత్మన్యూనతా భావంతో బాధపడుతూ చదువులు కూడా పట్టించుకోవడం మానేశారు. కాలేజీ చదువులు చదువుకున్నవారిలో మహిళలు ఎక్కువగా వున్నారు. గ్రాజువేట్‌ లెవెల్లో 57% మంది, పోస్ట్‌ గ్రాజువేట్‌ లెవెల్లో 63% మంది మహిళలే. వాళ్లు మంచి జీతాలు తెచ్చుకుంటూ, తమలా కాలేజీ చదువులు చదివిన మగాళ్లనే పెళ్లాడుతున్నారు. తమ పిల్లలనూ మంచి చదువులు చదివిస్తున్నారు. వీళ్లు సంస్కారయుతమైన కుటుంబాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. ఈ ఫ్యామిలీలలో భార్య తనకంటె ఎక్కువ సంపాదిస్తున్నా భర్త కించపడటం లేదు. తాము ఫెమినిస్టులమని చెప్పుకుంటున్నారు. ఈ వర్గాలు హిల్లరీని సమర్థిస్తూ వచ్చాయి. 

వారికి భిన్నంగా, చదువు రాక, చేతకాక, అవమానభారంతో కృంగి, భవిష్యత్తు ఎలా వుంటుందో తెలియని కింది స్థాయి శ్వేతజాతీయుడు ట్రంప్‌ వెంట నడిచాడు. వాడికి ట్రంప్‌ తమ గోడు తెలిసిన వ్యక్తిగా తోచాడు. నిజానికి వాళ్లు పార్టీని కాక, ట్రంప్‌ను చూసే ఓటేశారనాలి. అతను ఎలాటి అసభ్యపు కూతలు కూసినా, లెక్కలేనంతమంది ఆడాళ్లను జయించేశానని చెప్పుకున్నా, వికారంగా ప్రవర్తించినా అదంతా 'మగతనం' కిందే తోచింది వాళ్లకు. అతనిలో తమను చూసుకున్నారు కాబట్టే, అతన్ని గెలిపించారు. వాళ్లే కాదు, వాళ్ల భార్యలు కూడా ట్రంప్‌ను ఆమోదించారు. 'మగవాళ్లను మగవాళ్లలా వుంచగలిగితే చాలు. ప్రస్తుతం అమెరికాది 'ఇంట్లో యీగలమోత, బయట పల్లకీల మోత' అన్నట్టుంది. ఇతర దేశాల వ్యవహారాలు చక్కబెట్టేందుకు వెచ్చించే డబ్బును యిక్కడ ఖర్చుపెడితే మా బతుకులు బాగుపడతాయి' అనుకున్నారు వాళ్లు. హిల్లరీ గెలిస్తే యీ పరిస్థితి యింకా అధ్వాన్నమవుతుందని భయాందోళనలు చెందారు. దానికి తగ్గట్టు బ్లాక్స్‌, హిస్పానిక్స్‌, ఆసియన్లు అందరూ ఆమెవైపే వున్నారు. ఆమె వాళ్ల పక్షానే మాట్లాడుతోంది కాబట్టి వాళ్లకే మేలు చేస్తుంది తప్ప తమకేమీ చేయదని, తమ పరిస్థితి నానాటికి నాగంభొట్లు అవుతుందని అడలిపోయారు. 

అన్ని దేశాలూ నేర్చుకోవాల్సిన పాఠం యిది. గతంలో రష్యాలో యిదే జరిగింది. కమ్యూనిజం వ్యాప్తి చేస్తామంటూ యితర దేశాల్లో చౌకగా పుస్తకాలు అమ్ముతూ, అక్కడి కమ్యూనిస్టు పార్టీలకు తర్ఫీదు యిస్తూ, నిధులిస్తూ, అక్కడ తిరుగుబాట్లు ప్రోత్సహిస్తూ బయట అగ్రరాజ్యంగా పేరు తెచ్చుకున్నారు. కానీ సొంత ప్రజలకు రొట్టెముక్క కూడా యివ్వలేకపోయారు. తిండిపదార్థాల కోసం మైళ్ల కొద్దీ క్యూలలో నిలబడి నిలబడి రష్యన్‌ ప్రజలు విసిగిపోయారు. గోర్బచేవ్‌ కొద్దిపాటి సంస్కరణలు చేద్దామనుకుని, ఆంక్షలు కాస్త సడలించేటప్పటికి తిరగబడి పాలకులను తరిమికొట్టారు. రష్యా ముక్కలుముక్కలుగా విడిపోయింది. 

అమెరికా కూడా అగ్రరాజ్యంగా వెలుగొందడానికి బయటి దేశాల్లో నానారకాలుగా తలదూర్చి డబ్బులు తగలేస్తోంది కానీ సొంత ప్రజల బాధలు పట్టించుకోవటం లేదు. తన పెట్టుబడిదారీ విధానాలతో ఆర్థిక అసమానతలను పెంచుతూ పోతోంది. (కంపెనీ సిఇఓల జీతాల్లో, వర్కర్ల జీతాల్లో ఎంత అంతరం వుందో, దేశసంపద కొంతమంది చేతుల్లో ఎలా యిరుక్కుందో జులైలో ' ట్రంప్‌కు ఎందుకింత పాప్యులారిటీ?' అనే వ్యాసంలో రాశాను. చూడండి) బతకలేం బాబోయ్‌ అని సామాన్యుడు గగ్గోలు పెడితే 'ఇదిగో భృతి రూపంలో, యిన్సూరెన్సు రూపంలో, యీ ముష్టి తీసుకుని చస్తూ బతకండి' అంటోంది ప్రభుత్వం. ట్రంప్‌ను గెలిపించడం ద్వారా 'మాకు ముష్టి అక్కరలేదు, ఉద్యోగాలు యివ్వండి, మా ఆత్మగౌరవాన్ని మాకు వెనక్కివ్వండి' అని వాళ్లు చాటి చెప్పారు. వాళ్ల యీ మూడ్‌ గమనించే ట్రంప్‌ 'అమెరికా ఫస్ట్‌', 'లెటజ్‌ మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌' అనే నినాదాలు యిచ్చాడు. ఫోకస్‌ స్వదేశంపై తిప్పి, శ్వేతజాతి అమెరికన్లకు పాతికేళ్ల నాటి భద్రతను మళ్లీ కల్పిస్తానని నమ్మకం కల్పించాడు. ఆ క్రమంలో శ్వేతజాతీయుల్లో ప్రాంతీయభావాన్ని రెచ్చగొట్టాడు. మైనారిటీలకు, వలస వచ్చినవారికి వ్యతిరేకంగా కారుకూతలు కూశాడు. వారిని వెక్కిరించాడు. ఈసడించాడు. అన్నీ చేసి, తనకంటూ కొందరు గాఢాభిమానులను కూడగట్టుకున్నాడు - అచ్చు మన కెసియార్‌ లాగానే! కెసియార్‌లాగానే విజయం సాధించాడు కూడా!

మరి సామాన్యుడి యీ భయాందోళనలను కనిపెట్టడంలో సర్వేసంస్థలు ఎందుకు విఫలమయ్యాయి, అమెరికన్‌ ఎన్నికల వ్యవస్థలో వున్న సంక్లిష్టత ఏమిటి అనేది మరో వ్యాసంలో! 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2016)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?