Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఆంగ్లో ఇండియన్లు

 ఎమ్బీయస్‌: ఆంగ్లో ఇండియన్లు

                           మన మధ్య ఆంగ్లో ఇండియన్లు కనబడుతూంటారు. సికింద్రాబాదులోనే చాలామంది ఉన్నారు. నగరాలలో, ముఖ్యంగా రైల్వే హెడ్‌క్వార్టర్సు ఉన్నచోట్ల అధిక సంఖ్యలో కనబడతారు. వాళ్లల్లో కొంతమంది యూరోపియన్లలా కనబడతారు, మరి కొంతమంది పూర్తి భారతీయుల్లా కనబడతారు. మన సినిమాల ప్రకారమైతే వాళ్లు స్టెనోలుగా, సెక్రటరీలుగా, నర్సులుగా, క్యాబరే డాన్సర్లుగా వుంటూంటారు. మగవాళ్లల్లో అయితే స్మగ్లర్లు, దొంగసారాయి రవాణా చేసేవాళ్లు, వాయిద్యకారులు (ముఖ్యంగా గిటారిస్టులు) అయివుంటారు. నిజానికి ఆంగ్లో ఇండియన్లలో బాగా చదువుకున్నవారు, విద్య, క్రీడారంగాల వంటి అనేక రంగాల్లో రాణించినవారూ ఉన్నారు. టిపికల్‌ ఆంగ్లో ఇండియన్‌ జీవనసరళిని వాస్తవానికి దగ్గరగా చిత్రీకరించిన సినిమా ''జూలీ''. హీరోయిన్‌ తండ్రి రైల్వే యింజన్‌ డ్రైవర్‌. మంచివాడే కానీ విపరీతంగా తాగుతాడు. తల్లి లేని గొప్పలకు పోతూవుంటుంది. వేరే దేశానికి వలస పోతే మంచిదంటూ వుంటుంది. డబ్బు లేకపోయినా ఇంట్లో  విందులకు లోటు చేయదు. మామూలు జనాలకు వాళ్లను చూడగానే ఒకప్పటి మన బానిసత్వం గుర్తుకు వస్తుంది. ఇక్కడి మూలాలు కూడా కలిసి వున్నా వాళ్లు ఎక్కణ్నుంచో దిగి వచ్చినట్లు పోజు కొడుతున్నారన్న ఫీలింగు ఉంటుంది. రంగు వేరేగా వుండడంతో బాటు, వాళ్లు ఇంగ్లీషు తమ మాతృభాషగా చెప్పుకోవడం చేత వాళ్లను మనలో భాగంగా చూడడానికి మనస్కరించక విడిగానే చూడడం జరుగుతుంది. వాళ్లూ వాళ్ల సమూహంలోంచి బయటకు రాలేదు. తమ వారందరితో కలిసి ఒకే చోట యిళ్లు కట్టుకుని, వారిలో వారే విందులు, వివాహాలు జరుపుకుంటూ వచ్చారు. బ్రిటిషు హయాంలో వాళ్లకు చాలా మేలు చేసి వుంటారనీ, మనకు స్వాతంత్య్రం రావడం వాళ్లకు యిష్టం లేదనే భావన మనకుంటుందిరీ. అయితే బ్రిటిషు వాళ్లు కూడా వాళ్లను ఆదరించలేదని అర్థమవుతుంది - ఇటీవలే విడుదలైన ''ద ఆంగ్లో - ఇండియన్స్‌'' అనే పుస్తకం చదివితే. హ్యేరీ మెక్‌లూర్‌తో కలిసి యీ పుస్తకాన్ని రాసిన ముత్తయ్య స్వయంగా ఆంగ్లో ఇండియన్‌ కాదు. 

ఆంగ్లో ఇండియన్స్‌ అనే పేరుతో వ్యవహరింపబడుతున్న వారందరిలో ఇంగ్లీషు రక్తమూ, ఇండియన్‌ రక్తమూ ఉన్నాయనుకోకూడదు. పోర్చుగీసు, డచ్‌, ఫ్రెంచ్‌ మగవాళ్లకు భారత్‌, శ్రీలంక, బర్మా స్త్రీలకు పుట్టినవారందరినీ ఆ పేరుతో పిలుస్తున్నారు. నిజానికి వారిని యూరో-ఏసియన్లు అనాలి.  వ్యాపారరీత్యా లేదా ఉద్యోగరీత్యా సొంత దేశంలో యిల్లాళ్లను వదిలి వచ్చినవారు స్థానికులతో సంపర్కం పెట్టుకోవడంతో యీ మిశ్రమ జాతి ఏర్పడింది. తమ ఉద్యోగులు యిలా చేసి తమ స్వచ్ఛమైన రక్తాన్ని 'కలుషితం' చేయడం ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఉన్నతాధికారులకు నచ్చలేదు. 1806లో లార్డ్‌ వేలింషియా అనే ఆయన 'కలకత్తాలో ప్రస్తుతం ప్రబలుతున్న యీ జాడ్యం వలన యీ 'జాతి' పెరుగుతోంది. వీళ్లు కొన్నాళ్లకు అచ్చమైన బ్రిటిషు వారి కంటె ఎక్కువ సంఖ్యలో కనబడతారు. దీన్ని ఎలాగైనా ఆపాల్సిందే' అంటూ ఇంగ్లండుకు లేఖ రాశాడు. కానీ ఎవరూ ఆపలేకపోయారు. తమ రక్తం కలిసి వున్న వీళ్లకు పాలకులు ప్రాధాన్యత యిస్తున్నారని, అసలు దొరల కంటె యీ 'నల్లదొరలు' ఎక్కువ జులుం చలాయిస్తున్నారని సవర్ణ హిందువులు ఫీలయ్యేవారు. కానీ బ్రిటిషు వారు వీరిని పెద్దగా నమ్మలేదు. ఇలా రెండు జాతులు కలవడం వలన ఇద్దరిలో వున్న దుర్గుణాలు వీళ్లల్లో వచ్చి చేరి వుంటాయని, వీరిని పెద్దగా నమ్మజాలమని వారి నమ్మకం. అందుకని వీరిని రైల్వేలో, పోలీసు ఉద్యోగాలలో భర్తీ చేశారు తప్ప సైన్యంలో చేర్చుకోలేదు. సైన్యంలో చేర్చుకున్నపుడు కూడా మిలటరీ బ్యాండు వాద్యగాళ్లగా చేర్చుకున్నారు తప్ప ప్రముఖ పదవులు యివ్వలేదు. పైకి వచ్చిన ఆంగ్లో ఇండియన్లు స్వయంప్రతిభతో ఎదిగినవారే కానీ ప్రభుత్వ ప్రోత్సాహంతో కాదు. 

స్వాతంత్య్రం వచ్చేటప్పటికి వారి సంఖ్య సుమారు 5 లక్షలుండేది. వారిలో చాలామంది బ్రిటన్‌, ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజీలాండ్‌, కెనడా వంటి కామన్‌వెల్త్‌ దేశాలకు వలస పోతూ వచ్చారు. అది 1990ల వరకూ సాగింది. ప్రస్తుతానికి ఇండియాలో లక్షకు అటూయిటూగా వుంటారని అంచనా. రాజ్యాంగం రాసేటప్పుడు వీళ్లని మైనారిటీలలో ఒకరిగా చేర్చారు. తక్కినవారిని మతపరంగా గుర్తించి మైనారిటీ స్టేటస్‌ యిచ్చారు కానీ వీళ్ల విషయంలో వారసత్వాన్ని గుర్తించి ఆ స్టేటస్‌ యిచ్చారు. పార్లమెంటులో రెండు స్థానాలు వాళ్లకు రిజర్వ్‌ చేశారు. అంతేకాదు, వాళ్లు తగుమాత్రం సంఖ్యలో వున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, బిహార్‌, బెంగాల్‌, కర్ణాటక, ఉత్తరాఖండ్‌, ఝార్‌ఖండ్‌ రాష్ట్రాల శాసనసభల్లో ఒక నామినేటెడ్‌ సభ్యుణ్ని నియమిస్తూ వచ్చారు. వాళ్లు సాధారణంగా అధికార పార్టీకి మద్దతిస్తూ ఉంటారు. 'ఓటుకు నోటు' కేసులో రేవంత్‌ రెడ్డి లంచం యివ్వబోయినది అలా నామినేట్‌ చేయబడిన ఆంగ్లో ఇండియన్‌ ఎమ్మెల్యేకే! వాళ్ల జీవనశైలి ఆంగ్లేయులను అనుకరిస్తూన్నట్లు కనబడినా వారు ప్రధానంగా భారతీయ విధానాలనే అనుసరిస్తారని ముత్తయ్య అంటారు. ఇంగ్లీషు పాలన ఉండగా ఏమో కానీ, ప్రస్తుతం వారి గురించి ప్రత్యేకంగా ఆలోచించేవారే లేరు. తమ కష్టనష్టాలను గూర్చి వాళ్లెప్పుడూ రచ్చ కెక్కరు. - (ఫోటో - మిస్‌ వరల్డ్‌ 1997, డయానా హేడెన్‌, సినీనటి హెలెన్‌) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2017)

[email protected]

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?