Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: కార్టూనిస్టు అరెస్టు

ఎమ్బీయస్‌:  కార్టూనిస్టు అరెస్టు

తిరునల్వేలి జిల్లాలోని ఎస్సాకిముత్తు అనే ఒక కార్మికుడు వడ్డీ వ్యాపారి వద్ద 1.45 లక్షల ఋణం తీసుకున్నాడు. వడ్డీ రేటు ఎంత ఉందంటే 2 లక్షలు తిరిగి కట్టినా అప్పు తీరటం లేదు. వడ్డీ వ్యాపారి పీడించసాగాడు. అతను వడ్డీ వ్యాపారికి వ్యతిరేకంగా కలక్టరు వద్ద ఆరుసార్లు ఫిర్యాదు చేశాడని, అయినా ప్రయోజనం లేకపోయిందని అతని సోదరుడు అంటాడు. ఎస్సాకిముత్తు అక్టోబరు 23న తిరునల్వేలి జిల్లా కలక్టరు ఆఫీసు ప్రాంగణంలో భార్య, యిద్దరు పిల్లలకు నిప్పు ముట్టించి, తనూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న పిల్లల చావు ఎందరి మనసులనో కలచివేసింది. మద్రాసు నివాసి ఐన జి.బాల అనే కార్టూనిస్టు వారిలో ఒకడు. అతను ఒక కార్టూన్‌ గీశాడు.

చిన్న పిల్లవాడి శవం కాలుతూ ఉంటే ఆ జిల్లా డిఎస్పీ, కలక్టరు, ముఖ్యమంత్రి చూస్తూ ఉంటారు. వారి నిష్క్రియాత్వాన్ని వెక్కిరిస్తూ, ఈ చావుల వలన వారి పరువు పోయింది, కట్టుకోవడానికి బట్టలు మిగల్లేదు అనే అర్థంలో అతను వాళ్లకు కరెన్సీ నోట్లతో తయారుచేసిన గోచీలు అమర్చాడు. దాన్ని తన ఫేస్‌బుక్‌లో పెట్టాడు. వెంటనే ప్రభుత్వంలోనూ చలనం వచ్చింది. కార్మికుడి మాట అలా వుంచు, ముందు యీ కార్టూన్‌ వేసినవాడి పని పట్టు అన్నారు. అరెస్టు చేశారు. అరెస్టు చేయడానికి వాళ్లకు దొరికిన ఆయుధం ఒక లేఖ. కార్టూన్‌ చూసిన జిల్లా కలక్టరు సందీప్‌ నండూరి 'ఈ అఫెన్సివ్‌, డిరోగేటరీ, డిమీనింగ్‌ కార్టూన్‌ గీసినతనిపై నేను కేసు పెడదామనుకుంటున్నాను' అని తిరునల్వేలి జిల్లా క్రైమ్‌ బ్రాంచ్‌కు లేఖ రాశాడు. అది చాలనుకున్నారు పోలీసులు. 

బాలకు వ్యతిరేకంగా సిపిసి సెక్షన్‌ 501, ఐటి చట్టం 67 వ సెక్షన్‌ కింద నవంబరు 1 న ఎఫ్‌ఐఆర్‌ తయారుచేసి, చెన్నయ్‌ వెళ్లి నవంబరు 5 తెల్లవారుతూండగా బాలను అరెస్టు చేశారు. రూల్సుకు విరుద్ధంగా అతని సెల్‌ఫోన్‌ లాక్కుని, ఎవరికీ ఫోన్లు చేయకుండా నిరోధించారు. అనేక పోలీసు స్టేషన్లు తిప్పి, చివరకు మేజిస్ట్రేటు ఎదుట హాజరు పరిచారు. ఆయన బెయిలు యివ్వబోతే అడ్డుకున్నారు. చివరకు జడ్జి ఆయనకు బెయిలు యిచ్చారు. కలక్టరు తప్ప తక్కిన యిద్దరూ దీనిపై కిమ్మనలేదు. ఎవరైనా పబ్లిక్‌ సర్వెంటు ఫిర్యాదు చేయాలనుకుంటే పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ద్వారా సెషన్స్‌ కోర్టులో పరువు నష్టంపై ఫిర్యాదు చేయవచ్చు.

కానీ యిక్కడ కలక్టరు ఫిర్యాదు చేద్దామనుకుంటున్నాను అని లేఖ మాత్రం రాశాడు. వెంటనే పోలీసు రంగంలోకి దిగి బీభత్సం సృష్టించారు. మద్రాసు హైకోర్టు వారి మధురై బెంచ్‌వారు యీ కేసులో నవంబరు 15 నుంచి నాలుగు వారాల పాటు ఇన్వెస్టిగేషన్‌ను స్టే చేసింది. 'బాల కార్టూన్లు యిలానే ఉంటాయి. గతంలో కరుణానిధి, ఖుశ్‌బూల గురించి యిలాటి అసభ్యమైన కార్టూన్‌ వేశాడు. దీనిలో కూడా ఆ అధికారులకు, ముఖ్యమంత్రికి బట్టలు తొడిగితే ఏం పోయింది?' అంటున్నారు కొందరు కార్టూనిస్టులు, కాలమిస్టులు. అనేక దేశాల్లో నిరసన తెలపడానికి నగ్నప్రదర్శనలు చేస్తూంటారు. మన దగ్గర కూడా అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. వేరెవరో ఎందుకు, తమిళనాడు రైతులే యీ మధ్య దిల్లీలో అలాటి ప్రదర్శన నిర్వహించారు.  

ఈ లాజిక్కులేవీ తమిళనాడు ప్రభుత్వం దగ్గర పనిచేయవు. మీడియాను అణచడంలో అది ఎప్పుడూ ముందుంటుంది. 1971 ఫిబ్రవరిలో డిఎంకెకు మాతృసంస్థ ఐన ద్రవిడ కళగం సేలంలో రాముడు, సీత నగ్నవిగ్రహాలకు మెడలో చెప్పులదండ వేసి ఊరేగించింది. ''తుగ్లక్‌'' ఎడిటరు చో రామస్వామి ఊరేగింపు జరిగిందని తన వారపత్రికలో రాస్తే అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి అలాటిదేమీ జరగలేదని బుకాయించాడు. వెంటనే తర్వాతి సంచికలో చో ఆ ఊరేగింపు తాలూకు ఫోటోలు ముద్రించాడు. అది మార్కెట్లోకి విడుదలవుతూండగానే దాని సంగతి పసిగట్టిన పోలీసులు, ఆ పత్రిక ప్రచురించే ఆనంద వికటన్‌ ప్రెస్‌పై దాడి చేశారు. ప్రెస్‌ వర్కర్లు పత్రిక కట్టలను బయటకు విసిరేశారు. కొందరు అవి పట్టుకుపోయి, అధిక ధరకు అమ్ముకున్నారు. మరుసటి సంచికలో చో కరుణానిధి తన పత్రికకు సర్క్యులేషన్‌ ఏజంటుగా పనిచేసినట్లు కార్టూన్‌ వేశాడు. అది కరుణానిధిని  యింకా మండించింది.

నీచ రాజకీయాలపై చో తీసిన ''మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌'' సినిమా రిలీజైనప్పుడు సినిమా హాళ్లపై దాడి చేయించాడు. కరుణానిధి తర్వాత అధికారానికి వచ్చిన ఎమ్జీయార్‌ కూడా విమర్శల పట్ల అసహనం చూపడంలో తక్కువవాడు కాదు. తన మంత్రివర్గంలో మంత్రులు, ఎమ్మెల్యేలను దొంగలుగా చిత్రీకరిస్తూ ఆనంద వికటన్‌ పత్రికలో కార్టూన్‌ వేసినందుకు, దాని సంపాదకుడు బాలసుబ్రమణియన్‌పై స్పీరు చేత కేసు పెట్టించి జైల్లో పెట్టించాడు. బాలసుబ్రమణియన్‌ జెమినీ వాసన్‌ కొడుకు. ఎమ్జీయార్‌ను హీరోగా పెట్టి సినిమాలు తీసిన నిర్మాత. ఆయన్ను వారం రోజులు జైల్లో ఉంచాక ఎమ్జీయార్‌ 'ఔదార్యం' ప్రకటించి, విడుదల చేయించాడు.   తన అరెస్టును సవాలు చేస్తూ బాలసుబ్రమణియన్‌ కోర్టుకు వెళ్లినపుడు కోర్టు అతని ధైర్యానికి మెచ్చి వెయ్యి రూపాయలు బహుమతిగా యిచ్చింది.

ఎమ్జీయార్‌ వారసురాలిగా అధికారంలోకి వచ్చిన జయలలితకు మీడియా అంటే అరికాలి మంట నెత్తికెక్కుతుంది. ఆమె మొదటి పదవీకాలంలో వ్యక్తిగతంగా 120 పరువునష్టం దావాలు వేసింది. 2006లో అధికారంలోకి వచ్చిన కరుణానిధి ముఖ్యమంత్రి ఆఫీసు ద్వారా అలాటి దావాలు వేయసాగాడు. ఐదేళ్లలో 52 కేసులు వేశాడు. 2011 నుంచి మళ్లీ అధికారానికి వచ్చిన జయలలిత అదే పద్ధతి కొనసాగించి, 190 కేసులు వేయించింది. ప్రెస్‌ మీదే కాదు, ప్రతిపక్ష నాయకుల మీద కూడా కేసులు బనాయించింది. ఆమె చచ్చిపోయింది కానీ చాలా కేసులు కొనసాగుతున్నాయి. ఆమె నుంచి మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే నేర్చుకున్నపుడు ఆమె వారసులైన ప్రస్తుత తమిళనాడు పాలకులు ఆమె బాటలోనే నడవకుండా ఉంటారా? మీడియా వారినే కాదు ఉద్యమకారులనూ వేధిస్తున్నారు.

బాలను అరెస్టు చేయడానికి సరిగ్గా ఒక రోజు ముందు నవంబరు 4న తమిళనాడు ప్రభుత్వం తిరునల్వేలి జిల్లాలోనే సెమ్మాణి అనే మరో వ్యక్తిని కూడా అరెస్టు చేసింది. కూడన్‌కుళం అటామిక్‌ న్యూక్లియార్‌ పవర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న జాలర్లకు అతను సాయపడుతున్నాడు. ఆ జాలర్లపై రాష్ట్రప్రభుత్వం అనేక కేసులు బనాయించింది. అయినా కొంతమంది లాయర్ల బృందం వారి పక్షాన సుప్రీం కోర్టులో వాదిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను యీ సెమ్మాణి వాళ్లకు అందజేస్తున్నాడు. అందుకని ప్రభుత్వం యితన్ని వేధింపులకు గురి చేస్తోంది.

అతన్ని చితక్కొట్టి రెండు రోజుల తర్వాత ఆసుపత్రిలో చేర్చారు. నవంబరు 13 వరకు కేసే పెట్టలేదు. ఏంటీ-మిథేన్‌ ప్రాజెక్ట్‌ ఫెడరేషన్‌ కన్వీనరుగా ఉన్న జయరామన్‌ అనే రిటైర్డ్‌ ప్రొఫెసర్‌పై అక్టోబరు 30న దేశసమగ్రతకు విఘాతం కలిగిస్తున్నాడని కేసు పెట్టారు. చెన్నయ్‌ రామవరంలో రహదారిలో ఆలయం నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శన చేసిన నక్కీరన్‌ పుగళెంది అనే అతన్ని నవంబరు 2 న అరెస్టు చేశారు. ఈ ప్రభుత్వం పోతే యిలాటివి ఆగుతాయనుకోవడానికి లేదు. ప్రతిపక్షం వచ్చినా యిదే పరిస్థితి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?