Advertisement

Advertisement


Home > Articles - MBS

బాపు గురించి బాలు - 05

బాపు గురించి బాలు - 05

బాపుగారి గురించి ప్రఖ్యాత గాయకులు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంగారు ''హాసం'' పత్రికలో ''బాపు విశ్వరూపం'' శీర్షిక క్రింద 2002 లో వ్రాసిన వ్యాసపరంపర. బాలుగారికి కృతజ్ఞలతో, ''హాసం'' సౌజన్యంతో పునర్ముద్రణ...

అందరూ అనుకుంటారు బాపుగారికి తెలుగు సినిమా, మన కొబ్బరిచెట్లు, కోనసీమ, రాజమండ్రి ఇలాంటివే ఇష్టం, వేరే సంగీతం నచ్చదు అని. ఆయన దగ్గర వెస్ట్రన్‌ మ్యూజిక్‌ కలెక్షన్‌ కూడా చాలా ఉంది. దాంట్లోంచి ఎన్నో ఎన్నో విషయాలను, ఎన్నో గమ్మత్తయి నటువంటి కొన్ని పీసెస్‌ను వినిపించి అనుకరించకుండా వాటిని అనుసరించమనడం, చాలా అందంగా షేప్‌ చేయించుకోవడం - ఆయనకే సాధ్యమైంది. మహదేవన్‌గారు మ్యూజిక్‌ చేసిన సినిమా ''రాజాధిరాజు'' లో ఆ ప్రభావం చాలా కనపడుతుంది. ఇది మాత్రమే కాదు బాపుగారు - వేకువఝామునో, రాత్రిపూటనో ఇంటిపక్క మామిడి చెట్టువిూద ఉన్న కోయిల ఎప్పుడు కూస్తుందా అని టేపురికార్డర్‌ పెట్టుకుని గంటల తరబడి రికార్డ్‌ చేసుకునేవారు. చాలా సౌండ్‌ ఎఫెక్టులు టేప్‌ చేసుకుని తన సినిమాలలో రీ-రికార్డింగ్‌లుగా వాడుకోవడాలు లాంటివి కూడా వున్నాయి.

మన సినిమాలలో  కేవలం చెప్పుల చప్పుడు కార్లు, బస్సులు రాకపోకల వంటి శబ్దాలు, లేకపోతే కాకుల అరుపులు, పిచ్చుకల అరుపులు లాంటివే బాగా వినిపిస్తూ వుంటాయి. మనం శ్రద్ధగా గమనించామంటే ''సీతాకల్యాణం'' లో ఆడవాళ్లు నడిచి వస్తున్నపుడు, ఆడవాళ్లనే కాదు, పురాణపురుషులు వాళ్లు వేసుకున్న దుస్తులతో నడుస్తున్నప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందో అలాటి శబ్దం వస్తుంది. దుస్తులే కాదు, కాళ్లకున్నటువంటి కంకణాలు ఎలాంటి శబ్దాలు చేస్తాయి, గాజులు ఎలాంటి శబ్దాలు చేస్తాయి - యివన్నీ కూడా ఆయన అద్భుతంగా వినిపింపచేశారు. ఈ టీవీలో యిప్పుడు వస్తున్న ''భాగవతం''లో కూడా ఆ శబ్దాలని ప్రత్యేకంగా వినిచూడండి తెలుస్తుంది... బాపుగారు యిలాటి విషయాల్లో ఎంత శ్రద్ధగా వుంటారో!

అడిగిందే తడవుగా ఎన్ని బొమ్మలు వేసిచ్చారో... అప్పుడెప్పుడో నేను అడిగిన చిన్న చిన్న విషయాల దగ్గర్నుంచి మొన్న ''మన ఘంటసాల'' బయోగ్రఫీ పుస్తకం దాకా ఆయన వేసిన బొమ్మలను నేను ఉపయోగించుకోవడం జరిగింది. ఓసారి బాలగోపాలుడుగా నేను బొద్దుగా నెమలి పింఛం పెట్టుకుని గిటార్‌ వాయిస్తుంటే చుట్టు అందరూ చప్పట్లు చరుస్తూన్నట్టు ఓ బొమ్మ వేశారు. తర్వాత వారు అడిగిందే తడవుగా కొన్ని పుస్తకాలు ప్రింట్‌ చేసే భాగ్యాన్ని, వరాన్ని నాకిచ్చారు ఆయన. మొదటిది ''ఆండాళ్‌ తిరుప్పావై'' రెండోది ''జనార్దనాష్టకం''. 

ఆ పుస్తకాల్ని ప్రింట్‌ చేయించి నేనేదో ఫేవర్‌ చేశానని బాపురమణగార్లు అనుకుంటారు... కానేకాదు... అది వారు నాకిచ్చినటువంటి వరంగా నేను భావిస్తాను. నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానానికి వాళ్ల మనసుల్లో ఎంతో పెద్ద పీట వేసి కూర్చోబెట్టుకున్నారు. 'బాలుసరస్వతి నమస్తుభ్యం' అని నా బొమ్మవేసి అందులో ప్రింట్‌ చేయించారు. నాకొచ్చిన డాక్టరేట్లు కంటే పద్మశ్రీ కంటే కూడా ఈ కితాబు,  నేను జీవితంలో మరిచిపోలేనటువంటిది. 

బాపుగారి ''సీతాకళ్యాణం'' సినిమాలో 'గంగావతరణం' పాట విూకు గుర్తుండే ఉంటుంది. అది రికార్డ్‌ చేస్తుండగా ఆయన అడిగిన ఎక్స్‌ప్రెషన్స్‌ నా దగ్గర్నుంచి రావటం లేదు. ఆయన శివుడు ఎలా నిల్చుంటాడో ఒక బొమ్మ పేపర్‌ విూద ఒక రెండు నిముషాల్లో గీసి వాయిస్‌ రూమ్‌లోకొచ్చి 'బాలుగారు, ఇది శివుడుండే పద్ధతి. పాటకు సంబంధించిన ఎక్స్‌ప్రెషన్‌ నాకు ఇలా కావాలి' అన్నారు. పాడడానికి అది నాకు ఎంత హెల్ప్‌ చేసిందో చెప్పడానికి వీల్లేదు. అలాగే ''శ్రీనాథ కవిసార్వభౌమ'' చేస్తున్నప్పుడు అందులో అన్ని పద్యాలు, పాటలు పాడే అవకాశం నాకిచ్చారు. 

ఇక్కడో విషయం చెప్పి నా గుండె బరువు దించుకోవాలి. మా చెల్లెలు శైలజ పెళ్లి పత్రిక ఇవ్వడానికి రామారావుగారి స్టూడియోకి హైదరాబాద్‌కు వెళ్లాను. ''శ్రీనాథ కవిసార్వభౌముడు'' డబ్బింగో, ఎడిటింగో అక్కడ చూసి బయటకు వస్తున్నారు బాపుగారు. చూడగానే 'ఏమిటి ఇలా వచ్చారు' అన్నారు. 'ఇలా ఇన్విటేషన్‌ ఇవ్వడానికి వచ్చానండి' అనగానే... 'ఒక్క నిముషం నిల్చోండి' అని చేతిలో ఉన్న ఫైల్స్‌ అవీ పక్కనెవరికో ఇచ్చి వచ్చి నా కాళ్లకు దణ్ణం పెట్టారు. నా ప్రాణం ఉసూరు మనిపించింది. 

నాకర్థం కాలేదు అసలేమిటి ఇది... శాపమా? వరమా? అర్థం కాలేదు. నా కళ్ల నిండా నీళ్లు వచ్చాయి. 'ఏమిటి సార్‌ ఇది' అంటే - ''మీ గాత్రంతోటి, మీ పాటలతోటి, పద్యాలతోటి ఈ సినిమాకి ఎంత ప్రాణం పోశారు! సరస్వతీపుత్రులు మీ కాళ్లకి దణ్ణం పెడితే తప్పేంటండి'' అని అన్నారు. ఇంతకంటే వారి హృదయ వైశాల్యానికి తార్కాణం ఏముంటుంది చెప్పండి. 

నా దృష్టిలో బాపుగారి తీసినవన్నీ కూడా చాలా అందమైన సినిమాలు. చాలా గొప్ప సినిమాలు. కొన్ని డబ్బులు సంపాదించి ఉండవచ్చు, కొన్ని ఎకౌంట్‌లోకి రాకుండా ఫ్లాప్‌ అయి ఉండవచ్చు. కానీ అద్భుతమైన సినిమాలు. ఆయన తీసిన వాటిలో నాకు చాలా ఇష్టమైన సినిమా ''స్నేహం''. అందులో ఆరుద్రగారి చేత రాయించుకున్న పాటలు, మామచేత చేయించుకున్న సంగీతం, నాచేత పాడించుకున్న తీరు... ఆ సినిమా నేను ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. ఆ సినిమా నిర్మాత ఒకసారి కాకినాడలో కనపడితే  చుట్టుప్రక్కల ఎవరున్నారని చూడకుండా మా మిత్రులందరూ ఆయన కాళ్ల విూద సాష్టాంగ పడిపోవడం నాకింకా గుర్తుంది. ఆ సినిమా వాళ్ల విూద అంత ప్రభావం చూపించింది. అందులో పాటలు ఈనాటికీ కూడా ఆణిముత్యాల్లాంటి పాటలు. నేను పాడిన చాలా మంచి పాటల్లో ప్రథమశ్రేణి స్థాయికి చెందినటువంటి పాటలు. ఆ సినిమా ఎంత అందంగా తీసారో చెప్పడానికి వీల్లేదు.

ఓసారి... బాపుగారు చాలా ఎక్సెప్ట్‌ చేసి తీసిన సినిమా ఏమాత్రం ఆడకపోగా మరో చెత్త దర్శకుడు తీసినటువంటి చెత్త సినిమా చాలా అద్భుతంగా రన్‌ అవుతోంది. మిత్రులెవరో నేనున్నప్పుడే వారి సమక్షంలో బాధపడిపోతూ ''ఇంతకంటే అన్యాయం ఏముంటుందండి ప్రపంచంలో. ఇంత అందమైన సినిమా తీశారు కానీ ఓ చెత్త సినిమా అద్భుతంగా పోతోంది'' అంటే - మామూలు మనిషి ఎవరైనా రియాక్టయి '...కదండీ, మరి చూశారా ఎంత బాధగా ఉంటుందో'' అంటారు. నాకు బాగా గుర్తు... ఆరోజున బాపుగారు 'ఏమిటోసార్‌ మనం తీసిన సినిమా జనానికి నచ్చలేదు. వారికి కావాల్సింది ఏదో ఇవ్వడం ఆయనకు చాతనైనట్టుంది. అందుకే ఆ సినిమా సక్సెస్‌ అయ్యింది. మనం ఆ సినిమా చూసి నేర్చుకోవాల్సింది ఎంతో వుంది''. అన్నారు. ఇది వ్యంగ్యంగా అన్న మాట కాదండి చిత్తశుద్ధితో అన్న మాట. ఆయన విూద ఆయన వేసుకున్న కార్టూన్లు ఎన్నున్నాయో లెక్కకు తెలియదు.    (సశేషం)

 - ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం 

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?