Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: పెద్ద నోట్ల రద్దు - ఓ పెద్ద ప్లాప్ షో

ఎమ్బీయస్: పెద్ద నోట్ల రద్దు - ఓ పెద్ద ప్లాప్ షో

బాపుగారి కార్టూన్ వుంది. భార్యాభర్తలు సినిమాహాల్లోంచి షో తర్వాత లేచి వచ్చేస్తూంటారు. భార్య అంటుంది - ‘ఇంతటి అవకతవక కంగాళీ సినిమా నా జన్మలో చూళ్లేదు’ అని. తెరపై ‘శుభం’ అని బదులు ‘భశుం’ అని వుంటుంది. అంటే చివరికి ఓ రెండు అక్షరాలు కూడా సరిగ్గా రాయలేకపోయారన్నమాట సినిమా తీసినవాళ్లు.

నాకూ అనబుద్ధవుతోంది - పుట్టి బుద్ధెరిగాక ఏ ప్రభుత్వపథకమూ యింత అవకతవకగా, అస్తవ్యస్తంగా, అసంబద్ధంగా, కంగాళీగా అమలు కావడం చూడలేదని! ఇదో భశుం అని  గట్టిగా చెప్పబోతే అయితే నువ్వు నల్లకుబేరుడివన్నమాట, పాక్ టెర్రరిస్టుకు వత్తాసు పలికే దేశద్రోహివన్నమాట అనేస్తున్నారు. అదేమీ కాదు మొర్రో అంటే ‘కొద్దిపాటి కష్టానికైనా ఓర్చుకోలేక పోతే ఎలా? సంస్కరణలన్నాక కొందరు అవస్థలు పడాలి’ అని కూకలేస్తున్నారు.

నిజమే సంస్కరణలు చేపట్టినపుడు నిజాయితీపరులకు కూడా యిబ్బంది కలుగుతుంది. అంతిమంగా సమాజానికి మేలు కలుగుతుందంటే తన వ్యక్తిగత కష్టం ఏపాటిదిలే అనుకుంటాడు అతడు. కానీ మేలు ఎప్పటికైనా కలుగుతుందా అనేదే ప్రశ్న.

సంస్కరణల్లో నిజాయితీ వుంటోందా?

భూసంస్కరణలప్పుడు చూశాం. కష్టపడి సంపాదించిన భూమి కూడా పరిమితికి మించి వుంది అని ప్రభుత్వం లాగేసుకుంటే కొందరు బిత్తరపోయారు. పక్కింటి మోతుబరులు బినామీల పేర పెట్టి తప్పించుకున్నపుడు విస్తుపోయారు. ఇప్పటికీ తమ పేర వందల ఎకరాలున్నాయని చెప్పుకునేవాళ్లు కనబడుతున్నారు. పరిమితి చట్టం వుండగా ఎలా సాధ్యం? అలాగే పట్టణ భూపరిమితి, అర్బన్ లాండ్ సీలింగ్ (యుఎల్‌సి) చట్టం. లిమిటు కంటె ఎక్కువ వుంటే అప్పచెప్పేయాలన్నారు. కొందరు అప్పచెప్పారు. కొందరు వుంచేసుకున్నారు. ఇప్పటికీ యుఎల్‌సి కేసులు నడుస్తూనే వున్నాయి.

ఒక్కో ముఖ్యమంత్రి పదవి దిగిపోతూ కొందరికి మినహాయింపులు దయచేయిస్తాడు. పెంట్‌హౌస్ కట్టడం చట్టవిరుద్ధం, కార్పోరేషన్ కిచ్చిన ప్లాన్ కాస్తయినా మార్చి కట్టడం తప్పు, అదనపు ఫ్లోర్ వేయడం అక్రమం.. అని భయపడుతూ మనం బిక్కుబిక్కుమంటూ రూల్సు పాటిస్తాం. అవేమీ పట్టించుకోనివాడు మనల్ని చూసి నవ్వుతాడు. కట్టిపారేస్తాడు. ‘ఎప్పుడో ఒకసారి బిల్డింగ్ రెగ్యులరైజేషన్ పేరు చెప్పి డబ్బు తీసుకుని యివన్నీ సక్రమం చేసి పారేస్తుంది ప్రభుత్వం’ అంటాడు. అలా కాకుండా పడగొట్టేస్తే...? అని మన సందేహం. మనం కట్టం, వాడు కడతాడు. తర్వాత ప్రభుత్వం వాడి పక్షానే నిలుస్తుంది. వాడు మనల్ని చూసి హేళన చేస్తాడు. 

మనం యిన్‌కమ్‌టాక్స్ భయపడుతూ కట్టేస్తాం. ఎవడికైైనా బ్లాక్‌లో డబ్బివ్వాలంటే మన దగ్గరది  వైటే కాబట్టి అదే యివ్వగలుగుతాం. పెత్తందారులు పన్ను కట్టరు. వాళ్ల దగ్గర నల్లధనం మేట వేసుకుని పోయినప్పుడు ప్రభుత్వమే వాలంటరీ డిస్‌క్లోజర్ స్కీము అని పెట్టి దొంగలూ దొంగలూ వూళ్లు పంచుకున్నట్లు అక్రమధనాన్ని ప్రభుత్వమూ, బ్లాక్‌మనీదారు పంచుకుంటారు. మా బాగా అయింది, 40% పన్ను కట్టాట్ట అని మనం చంకలు గుద్దుకుంటాం. సక్రమంగా సకాలానికి కట్టి వుంటే దానిపై కట్టే పన్ను యింకా చాలా ఎక్కువ వుంటుంది. ఆ నాటి ధరలతో పోలిస్తే యీనాడు వాడు కట్టేది బహు తక్కువ అని మనం గ్రహించం.

ఏ యేడాది కా యేడాది మనమే వాడి కంటె ఎన్నో రెట్లు ఎక్కువ కట్టి వుంటాం. అక్రమమైతే కూల్చిపారేస్తారు, జైల్లో పెట్టి మొత్తం డబ్బు లాగేసుకుంటారు అనే భయం వుంటే యిలాటివి జరగవు. కూల్చడం మొదలుపెట్టగానే కోర్టు ఆపుతుంది, లేకపోతే ఎమ్మెల్యేలు వచ్చి నిరాహారదీక్ష చేస్తారు. బ్లాక్‌మనీ దారులైతే ప్రభుత్వం ‘కనబడుటలేదు’ ప్రకటనల్లో రాసే పద్ధతిలో ‘నాయనా, రమ్ము, నిన్ను ఏమియూ అనము, మీ పేరు బయటపెట్టము’ అని హామీ యిచ్చి కాపాడుతుంది. మనం మాత్రం జస్ట్ 2 వేలు ఎక్స్‌ఛేంజ్ చేయాలంటే ఆధార్ కార్డు జిరాక్స్ యివ్వాలి, వేలి మీద చుక్క పెట్టించుకోవాలి! 

ఆపరేషన్ మొదలుపెట్టేముందు సరంజామా రెడీగా పెట్టుకున్నారా?

చదువురాని వాడి దగ్గర్నుంచి ఎత్తి చూపుతున్న ప్రధానలోపం - వంద, ఏభై నోట్లు దండిగా ముందే ముద్రించి వుండాల్సింది. ఇప్పుడు బ్యాంకుల్లోనే వందలు లేవు. బ్యాంకులంటే డబ్బు రొటేషన్ చేస్తాయి తప్ప వందలు పుట్టించలేవు కదా. ఖాతాల్లో డబ్బు జమ చేసేవాళ్లందరూ 500, 1000 కడుతున్నారు తప్ప 100, 50 యింట్లోనే దాచుకుంటున్నారు. అందువలన బ్యాంకుల వద్ద వందలుండటం లేదు.

కొన్ని బ్యాంకుల్లో ఖాతాదారులకు తప్ప తక్కినవాళ్లకు మార్చమంటున్నారు. రూలు ప్రకారం అలా అనకూడదు. అయినా క్షేత్రస్థాయిలో వుంటున్న యిబ్బందులివి. మరి కొన్ని బ్యాంకుల్లో ఎక్స్‌ఛేంజ్ చేస్తే 4500 యిస్తామని అన్నారు కానీ, వందలై పోతే అబ్బే 4 వేలే అంటూ, 2000 రూ.ల నోట్లు రెండిచ్చి పొమ్మంటున్నారు. రిజర్వ్ బ్యాంకు నుంచి సకాలంలో కొత్త నోట్లు రాకపోవడంతో (‘‘ఈనాడు’’ వార్త) కాబోలు మారకం పరిమితిని యిప్పుడు 2 వేలకు తగ్గించారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి క్యూలు తగ్గిద్దామని తగ్గించాం అని చెప్తున్నారు శక్తికాంత దాస్. తాడిచెట్టు ఎందుకెక్కావురా అంటే దూడగడ్డి కోసం అన్నట్టుంది. 4 వేలు మార్చుకుందామంటే రెండు రెట్లు ఎక్కువ సార్లు నిల్చోవాలి. అప్పుడు క్యూలు పెరుగుతాయా, తగ్గుతాయా? క్యూలు తగ్గాక వెళ్లి మార్చుకుందామని ఆగినవాళ్ల నెత్తిన పిడుగు వేశారు - డిసెంబరు 30 లోగా ఒక్కసారి మాత్రమే వెళ్లి 2 వేలు మాత్రమే  మార్చుకోగలరని! మర్నాటి కల్లా క్రమేపీ యింకా తగ్గిస్తామంటూ వార్త. పాత నోట్లు చెల్లవు, కొత్త నోట్లు చేతి కందవు. చేతి కందినవాటిపై కూడా పెన్సిల్ గీతలుంటే చెల్లవట. ఇక ఎలా బతకాలి?

మొదట్లో ఆధార్ కార్డు జిరాక్సు యిస్తే కొత్తనోట్లు యిస్తామన్నారు. ఇప్పుడు కార్డు చూపితే చాలంటున్నారు. అంటూనే మళ్లీమళ్లీ వస్తున్న వ్యక్తులను గుర్తించడానికి వేలి మీద యింకు చుక్క పద్ధతి పెట్టారు. సరే, యింకు ఇంకు చుక్క పెట్టడానికై బ్యాంకు స్టాఫ్ హఠాత్తుగా పెరగరు కదా. ఎన్నికల బూతులో అయితే చుక్కలు పెట్టేదానికి ఒక వ్యక్తి ప్రత్యేకంగా కూర్చుంటాడు. బ్యాంకులో వేరేగా ఎవరినైనా కూర్చోపెట్టేటంత స్టాఫ్ కుషన్ వుంటుందా? డబ్బిచ్చే అతనే పెడుతూ కూర్చుంటే ఆలస్యమై పోయి, క్యూ మరింత పెరగదా? నోట్ల మార్పిడికి అదే మనుష్యులు మళ్లీమళ్లీ వస్తారని ముందెందుకు వూహించలేదు? ఈ వారం రోజుల పాటు కొంతమందికి నల్లధనం మార్చుకునే వెసులుబాటు మీరే కల్పించారు కదా. సరే చచ్చిచెడి నిల్చుంటే డిసెంబరు 30 లోగా మీ చేతికి వచ్చేది 2 వేల నోటు ఒక్కటే. చిల్లర యివ్వటం లేదు. ఆ నోటుతో మీరేం కొనగలరు? కొనాలంటే అవతలివాడి వద్ద పాత వందలు వుండాలి. ఒకటో రెండో వున్నా ఎంతమందికి యివ్వగలడు? అందుచేత ఆ నోటు చేతిలో వున్నా ఎందుకూ ఉపయోగపడటం లేదు. 

వెలిసిపోయే 2 వేల నోటు, యిప్పట్లో వెలియని వెయ్యి నోటు

అసలు 2 వేల నోటు తయారీ విషయంలో కూడా కంగాళీతనం కనబడుతోంది. రంగు వూరిపోయే, వెలిసిపోయే నోటెవరైనా ప్రవేశపెడతారా? ప్రపంచంలో అలాటి నోటు వుంటుందనుకోను. వర్షాకాలంలో ఆ నోటు కారణంగా జేబు ఖరాబు, దానితో బాటు పెట్టిన నోట్లకు రంగు అలుమకుంటుంది. నోటు విడుదల చేసేటప్పుడే ఆర్‌బిఐ వారు యీ ముక్క చెప్పాల్సింది. జనాలు గగ్గోలు పడ్డాక చెప్పడమేమిటి? నా అనుమానం మామూలుది తయారుచేస్తే, నాణ్యత లోపించి అది యిలా తయారైందని. గొడవయ్యాక పొరపాటు గుర్తించి, కావాలనే అలా చేశాం అని బుకాయిస్తున్నారేమో!

కొత్త 500, 1000 నోట్లు ప్రవేశపెడతామన్నవారు గురువారం వచ్చేసరికి కొత్త వెయ్యి నోట్లు వుండవు అని చెప్తున్నారు. 500 యిప్పటిదాకా రాలేదు. కొత్త నోట్లు తయారు కావాలంటే 3,4 నెలల కసరత్తు చేయాలి కదా. వెయ్యి నోట్ల విషయంలో చేయలేదా? చేయకపోతే మరి విడుదల చేస్తామని వారం కితం ఎందుకు చెప్పారు?  ప్లానింగూ, పాడూ లేదా? లేకపోతే 2 వేల నోటులా దానికి ఆల్‌రెడీ డూపిే్లకటు నోటు తయారై పోతే, ఆ విషయం తెలిసి దీన్ని విత్‌హోల్డ్ చేశారా?

ఎనీ టైమ్ నో-మనీలు 

ఎటిఎంలలో ట్రేల పరిమాణం పెంచి 100లు అలవాటు చేసి వుండాల్సింది. 30% ఎటిఎంలు పని చేయడం లేదని, పదేళ్ల కోసారి మార్చవలసిన ఎటిఎంలను మార్చకపోవడం వలన క్యాష్ డెలివరీ చాలా ఆలస్యమౌతోందని ఏడాది క్రితమే రిజర్వ్ బ్యాంకు అన్ని బ్యాంకులను హెచ్చరించిందట. ఈ ఆపరేషన్ ద్వారా నల్లధనాన్ని సాధ్యమైనంత మొత్తంలో బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి తెచ్చేద్దామని కదా ప్రయత్నం. ఒకసారి లోపలికి వెళ్లినది బయటకు ఎలా వస్తుంది? బ్యాంకులు బ్రాంచ్‌లు పెంచలేవు కదా, స్టాఫ్‌ను హఠాత్తుగా పెంచలేవు కదా. ఎటిఎంల ద్వారానే మళ్లీ డబ్బు ప్రజల్లోకి రావాలి. బ్యాంకులు మరిన్ని ఎటిఎంలను నెలకొల్పడం ద్వారానే అది సాధ్యం. ఉన్నవాటిల్లోనే మూడోవంతు పనిచేయకుండా వున్న పరిస్థితిని చక్కదిద్దకుండా యీ స్కీము ఎలా పెట్టారు? పైగా ఎటిఎంలు పెద్ద నోట్లే యిస్తూ వచ్చాయి.

500 స్థానంలో 100 నోట్లు యివ్వాలంటే లోపల వున్న ట్రే సైజు అయిదు రెట్లు ఎక్కువ వుండాలి. లేకపోతే ఐదో వంతు సమయంలోనే అది ఖాళీ అయిపోతుంది. అదే జరుగుతోంది. పోలింగు రోజున ఇవిఎం (ఓట్ల లెక్కింపు యంత్రాలు)ల లాగానే ఎటిఎంలు మొరాయిస్తున్నాయి. రోజులో చాలాభాగం ఎటిఎం క్యూలలో  గడిచిపోతోందని జనం మొత్తుకుంటున్నారు. దాన్లోంచి తీసే మొత్తాన్ని 1 వ తారీకు నుంచి రెట్టింపు చేస్తామన్నారు. కానీ చేయలేమని నాలుగు రోజుల ముందే చేతులెత్తేశారు. ఇదీ మరో ప్లానింగ్ వైఫల్యం.

కొత్త 2 వేల నోటు పట్టేట్టు ఎటిఎమ్‌లను మారుస్తున్నారట. దేశంలో మొత్తం 2 లక్షల ఎటిఎంలు వుంటే గురువారం నాటికి 22,500 ఎటిఎంలను సంస్కరించారట. అంటే 11% అన్నమాట. పెట్రోలు బంకుల్లో స్టేటు బ్యాంకు పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్లు వుంటే అక్కడ 2 వేలు విత్‌డ్రా చేయవచ్చని చెప్తున్నారు. అవి 2500 వున్నాయట. అంటే యింకో 0.12% చేర్చాలన్నమాట. మరి తక్కిన .% ఎటిఎంలను మార్చేలోపున జనం వెతలు ఎవరు తీరుస్తారు? కొత్త 500 వచ్చి వుంటే ఎటిఎంలలో పెట్టి వుండేవారు. అవి లేవు. సరిపడా వందలూ లేవు. అందువలన చాలా ఎటిఎంలు మూతపడి వుంటున్నాయి.  ఎటిఎం చార్జిలు ఎప్పటికీ ఎత్తేశాం అంటేనే ప్రజలు బ్యాంకుల్లో డబ్బులు వేసుకోవడం అవాటు చేసుకుంటారు. ప్రస్తుతానికి చార్జి లేదంటున్నారంతే. 

బ్యాంకు విత్‌డ్రాయల్స్

బ్యాంకులో డబ్బు వేసుకుని, కావలసి వచ్చినపుడు తీసుకోవడం ఖాతాదారు హక్కు. అది అతని డబ్బు. బ్యాంకునుంచి ఋణంగా తీసుకున్నది కాదు. ఎటిఎంలలోనైతే డబ్బు ముందుగానే పెట్టాలి కాబట్టి పరిమితి పెట్టవచ్చు. అలాగే క్యాష్ రిజర్వ్ ఎక్కువగా పెట్టుకోలేని గ్రామీణ బ్రాంచీల్లో అయితే కూడా డబ్బు తీసేదానికి పరిమితి పెడతారు. అది కూడా లక్షల్లో వుంటుంది. చిన్న పోస్టాఫీసు ఖాతాల్లోంచి అయితే డబ్బు తీయాలంటే, ఎవరైనా మనియార్డర్ కట్టేదాకా ఆగాల్సి వచ్చేది. ఇప్పుడు మామూలు బ్యాంకు బ్రాంచీల్లోంచి డబ్బు తీయడంపై పరిమితి పెడుతున్నారు. ఇది బ్యాంకింగ్ రూలు ప్రకారం చెల్లుతోందో లేదో నాకు డౌటు.

వారానికి 20 వేలని (యిప్పుడు 24, అంకె పెంచారు కానీ బ్యాంకులో నగదు లేకపోతే అంత యివ్వరు) మొదలుపెట్టారు. అప్పు అడిగితే ఎందుకోసం అని బ్యాంకు వాళ్లు అడిగినా అర్థముంది. దీర్ఘకాలం వుంచుతానని మాట యిచ్చిన ఫిక్సెడ్ డిపాజిట్ ముందుగా మూసేస్తూ వుంటే అడిగినా ఫర్వాలేదు. సేవింగ్స్ ఖాతాలో నేను దాచుకున్న నా డబ్బును ఎందుకు తీస్తున్నానో, ఎలా ఖర్చు పెడుతున్నానో బాంకుకు చెప్పాలా?

వారానికి 20 వేలు నగదు మాత్రమే ఖర్చు పెట్టాలని మీరెలా చెప్తారు? నా ఖర్చులు నావి. కమ్యూనిస్టు రాజ్యాల్లో కూడా యీ రూలుండదనుకుంటా. పెళ్లిళ్లకు 2.5 లక్షలు తీసుకోవచ్చట. అయినా పెళ్లికొడుకు, పెళ్లికూతురు యిరుపక్షాలు కలిపి ఖర్చు పెట్టాల్సిన మొత్తం 2.5 లక్షలా? దాన్లో పెళ్లి అయిపోతుందా? నిన్ననే నమస్తే తెలంగాణ సిఎండి గారింట్లో పెళ్లి టీవీలో చూపించారు. గాలి జనార్దనరెడ్డి యింట్లో పెళ్లయితే 500 కోట్ల పై మాటేట! ఆ అట్టహాసం చూస్తే యీ రూల్సన్నీ సామాన్యులకు తప్ప పెద్ద తలకాయలకు కావనీ, వాళ్లకు జరిగేవన్నీ జరుగుతూనే వున్నాయని అర్థమౌతుంది.

వ్యవసాయ కమిటీ వద్ద నమోదు చేసుకున్న వ్యవసాయదారుడికి కూలీల కోసం వారానికి 50 వేలు తీసుకోవచ్చట.  రైతులకైతే వారానికి 25 వేలు, పంట అమ్మకాల సొమ్ము చెక్కు ద్వారా వచ్చి వుంటే మరో 25 వేలు తీసుకోవచ్చట. కూలీ కోసం, లేదా ఖర్చుల కోసం అని ఉత్తరాలు రాసి యిస్తారా? అవన్నీ బ్యాంకువాళ్లు దాచి ఇన్‌కమ్ టాక్స్ వాళ్లకు అప్పగిస్తారా?

వెసులుబాట్లు, నియంత్రణలు ముందే ఎందుకాలోచించలేదు?

ఇవన్నీ వెసులుబాట్లు అనుకుంటే యివి ఎప్పుడో పెట్టాల్సింది, జనాలు గగ్గోలు పెట్టాక కాదు. టోల్‌గేట్ వసూళ్లు వసూలు చేయించారు, ఓ రోజు గడిపాక కొన్నాళ్లు ఆపారు,  ఫ్రీ అంటూ గడువు పొడిగించారు. ఏమిటీ గందరగోళం? టోల్‌గేట్‌లకు యిన్నాళ్లూ వసూళ్లు పోయాయి కదా, వారి నష్టం ఎవరు పూరిస్తారు? పాట పాడుకున్న కాంట్రాక్టర్లకు అదనంగా మరో నెల్లాళ్లు వసూలు చేసుకోండి అని చెప్తారా? అతను నె అయిన తర్వాత ఆపేస్తాడా? దాన్ని ఎవరైనా పర్యవేక్షిస్తారా? ఇప్పటికే కాలం తీరిన టోల్‌గేట్ల వద్ద తోలు తీస్తున్నారని రిపోర్టులున్నాయి. ఇవి వేరే విషయాలనుకున్నా, టోల్ గేటు వసూళ్లు దెబ్బ తింటే అంతిమంగా ప్రభుత్వానికే నష్టం కదా!

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని సామెత. అందర్నీ గడగడలాడించగలిగిన ఆదాయపుపన్ను అధికారుల కళ్లు గప్పి నల్లధనం పోగేసుకున్నవారు కోటి కాకపోయినా పదో, పాతికో ఉపాయాలు ఉపయోగిస్తారని ఆర్థికశాఖ అధికారులు వూహించలేకపోయారా? రైల్వే, బస్సు టిక్కెట్ల వద్ద పాత నోట్లు చెల్లుతాయి అనగానే అందరూ కౌంటర్ల వద్దకు వెళ్లి పాత నోట్లతో ఫస్ట్ క్లాస్ ఎసి టిక్కెట్లు బుక్ చేయడం, మర్నాడు కాన్సిల్ చేసి కొత్త నోట్లు తీసుకోవడం. ఇలా వారం రోజులు జరిగాక తిరిగి యిచ్చేటప్పుడు ఖాతాల్లో వేస్తాం అన్నారు. ఈ పని మొదటి రోజునుంచే చేసి వుండాల్సింది కదా.

జన్‌ధన్ యోజనా ఖాతాల్లో డబ్బు వెల్లువెత్తుతుందని ఎవరైనా వూహించవచ్చు. అలాగే జరిగింది కూడా. అలా ఓ  ఐదారు రోజులయ్యాక, అప్పుడు 50 వేలకు మించి కూడదని పరిమితి పెట్టారు. అదీ ముందుగానే పెట్టాల్సింది. బంగారం విషయంలో కూడా నియంత్రణ ఆలస్యంగా వచ్చింది. మనీ లాండరింగ్‌కు సహకరించిన ట్రస్టులకు నోటీసులు యిస్తామంటున్నారు. ముందే నిఘా వేసి వుండాల్సింది. జరిగాక యిప్పుడు యిస్తే ‘అప్పుడే ఎలా యిస్తారు? ఫైనాన్షియల్ ఇయర్ పూర్తి కాలేదు, రిటర్న్‌స్ సబ్మిట్ చేయలేదు’ అంటారు వాళ్లు. 

రెండున్నర లక్షల దాకా అనుమతించడానికి లాజిక్కేమిటి?

సొంత ఖాతాల్లోకి ఎంతయినా వేసుకోవచ్చు అన్నపుడు వైట్ మనీ మాత్రమే రావాలి. అయితే బ్లాక్‌మనీ దాచుకున్నవాళ్లపై ప్రభుత్వానికి హఠాత్తుగా జాలి పుట్టింది. లెక్కల్లో చూపని 2.50 లక్షల డబ్బు తమ ఖాతాల్లో వేసుకున్నా ఏమీ అనం అన్నారు. రైతులు, ఇల్లాళ్లూ అని చెప్పుకుంటే చాలు ఏ ప్రశ్నా వేయం అన్నారు. మన దేశంలో ప్రతి మహిళా యిల్లాల్ని అని చెప్పుకోవచ్చు. నూటికి 90 మంది రైతులమని చెప్పుకోవచ్చు. బ్యాంకు క్యాషియర్ మీ పత్రాలు యివ్వండి అని అడగడు కదా. రైతులు బతికే పరిస్థితి లేదంటున్నారు. ఋణమాఫీ చేయమంటున్నారు. వాళ్ల దగ్గర రెండున్నర లక్షల డబ్బు కుప్పపోసి వుంటుందా? వచ్చినదంతా మా ఆయన తాగేశాడు. మాకు తెల్లకార్డు యివ్వండి, గులాబీ కార్డు యివ్వండి, యిళ్లు కట్టించి యివ్వండి అనే యిల్లాళ్లూ వున్నారు. వీళ్ల దగ్గరా అంత డబ్బుంటుందా?

వీళ్ల పేరు చెప్పి బ్లాక్‌మనీ వైట్ చేసుకోసాగారు. ఏ పేరు చెప్పి ఎవరెవరి పేర డిపాజిట్లు వేసి తప్పించుకోవచ్చో ఆడిటర్లు యిచ్చిన సలహాలు వాట్సప్‌లలో వీరవిహారం చేస్తున్నాయి. వీటికి తోడు జన్‌ధన్ ఖాతాల్లో కూడా వచ్చిపడడంతో బ్యాంకుల్లో డిపాజిట్లు ముంచెత్తాయి. ఇంత డబ్బు వచ్చిపడితే బాంకుల వాళ్లు ఏం చేసుకుంటారు? సరైనవాడికి ఎవరికైనా అప్పిచ్చి వడ్డీ గడిస్తేనే మన డిపాజిట్ల మీద వడ్డీ యివ్వగలరు. నిజాయితీ గలవాళ్లు కనబడకపోతే అప్పులు యివ్వడం ఎలా? అందువలన బ్యాంకులు డిపాజిట్ల పై వడ్డీ రేట్లు తగ్గించేశారు. డిసెంబరు 30 (గడువు పెంచకుండా వుంటే) చివరకు బాంకు వడ్డీలు ఎంత కిందకు వచ్చి చేరతాయో చూడాలి. సామాన్యుడు రేపటికోసం డబ్బు దాచుకోవడానికి బాంకులే శరణు. అవి కూడా యిప్పుడు మరో చెంపదెబ్బ కొడుతున్నాయి. 

మనీ లాండరింగ్ జరుగుతోంది

నిజానికి బాంకుల ఎదుట క్యూలు కట్టే సామాన్యుడు అవస్థల పాలవుతున్నాడు. కానీ మనీ లాండరింగ్ చేసే దారులు మాత్రం తెరిచే వున్నాయని అర్థమౌతోంది. నా వద్ద న్యూస్ పేపరు బాయ్ కూడా పాత నోట్లు తీసుకున్నాడు. కిరాణా షాపు వాళ్లూ తీసుకుంటున్నారు. రౌండ్ ఆఫ్ చేసేట్లా వస్తువులు తీసుకోండి, చిల్లర అడక్కండి అంటున్నారంతే. బేరం వదులుకోవడం యిష్టం లేని యితర వ్యాపారస్తులూ తీసుకుంటున్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లోనూ తీసుకుంటున్నారు. ఎలా ఎన్‌క్యాష్ చేస్తారని అడిగితే ఏమో సార్, ఆడిటరుగారు చెప్తారట అంటున్నారు. మరీ విపులంగా అడిగితే తీసుకోనంటాడేమోనని భయం. బహుశా అక్టోబరులోనే ట్రాన్సాక్షన్ జరిగినట్లు చూపిస్తారేమో. బ్యాంకులకైతే ఏ రోజు ఎక్కవుంట్లు ఆ రోజు ఆఖరికి క్లోజ్ చేయాలి. ప్రయివేటు పార్టీ అయితే భయమేముంది?

బంగారం విషయంలో ఏం జరిగిందో ఆధారాలతో సహా కథనాలు వచ్చాయి. భారీ ఎత్తున బంగారం కొనుగోళ్లు జరగడం వాస్తవమేగా. పాత నోట్లు చిత్తుకాగితాలగా మారితే, పుచ్చుకోవడానికి వాళ్లేమైనా పిచ్చివాళ్లా? ఎప్పుడైనా బుక్స్ క్లోజ్ చేయవచ్చు. ఎడ్జస్ట్‌మెంట్లు చేయడానికి యింకో ఆర్నెల్లు టైముంది. ఇవన్నీ కనిపెట్టి ఇన్‌కమ్‌టాక్స్ వాడు అడిగినప్పుడు మాట కదా! అయినా యిన్ని పట్టించుకోవడానికి వాళ్లకు తీరికెక్కడ? టాక్స్ రిఫండ్స్, రిటర్న్‌స్‌పై క్వెరీలు ఎంత లేటుగా చేస్తున్నారో చూస్తున్నాం. ఒకవేళ తప్పు పట్టుకున్నారు అంటే అదేదో అప్పుడే చూసుకోవచ్చు. వాళ్లూ మానవమాత్రులేగా! అనుకుంటారు జనం. బ్యాంకుల్లో కూడా కంప్యూటరైజేషన్ జరగని బ్యాంకుల్లో పాత డేట్లతో ఫిక్సెడ్ డిపాజిట్లు తెరిచేస్తున్నారట. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం అదుపు తక్కువ వుంటుంది. పోన్లెద్దురూ అంటూ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తారు. 

ముందే లీక్ అయిందా?

అయిందని ప్రతిపక్షాలంటున్నాయి. కాలేదని బిజెపి వారనడం సహజం. కొందరు నోరుజారినా సర్దుకుంటున్నారు. కానీ అధిష్టానం వద్ద సరైన సమాధానాలు రావటం లేదు. గుజరాత్ పేపర్లలో ముందే (ఏప్రిల్ 1కే కాదు, ఆగస్టులో కూడా వచ్చిందట) వచ్చిందన్న వార్తను ఖండించలేకపోయారు. జులై-సెప్టెంబరు మధ్య డిపాజిట్లు పెరిగాయని అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణను ఖండించలేదు. అక్టోబరులో యింకా పెరిగి వుంటాయి.

బ్యాంకుల్లో పెద్దమొత్తంలో అప్పు తీర్చినవాళ్లను, డిపాజిట్లు వేసినవాళ్లను తాటిస్తే నిజం బయటకు వస్తుంది. జియో ఉచితంగా యివ్వడం వెనక్కాల కూడా దీని ముందస్తు సమాచారం వుందంటున్నారు. ఒక రాష్ట్రమంత్రి ఎన్నికలకై చేసిన అప్పులన్నీ ప్రకటనకు నెల్లాళ్ల ముందే తీర్చేశాడట. అప్పులవాళ్లను పిలిచి మరీ యిచ్చేశాడట.

గుజరాత్‌లో పటేల్ కులస్తులెవరూ కళవెళ పడటం లేదట. అది నిజమైతే ఉప్పందిందనే అనుకోవాలి. నిజంగా లీకు జరిగి వుంటే, ఒక నెల్లాళ్లలో వివరాలతో  బయటకు వచ్చేయాలి. సర్జికల్ స్ట్రయిక్స్ మిలటరీ ఆపరేషన్. చాలా తక్కువమందే యిన్వాల్వ్ అవుతారు. దీనిలో వేలాదిమంది వుంటారు. ఎవరు మాట జారినా న్యూస్ బయటకు వచ్చేసి నల్లధనికులు సర్దుకుంటారు. 

టెర్రరిజానికి ఉచ్చు పడిందట!!!

ఈ ఆపరేషన్ ఫెయిలందని ఒప్పుకోవడం మోదీ భక్తులకు కష్టంగా వుంది. ఈ చర్య కారణంగా కశ్మీర్‌లో అలజడి తగ్గిపోయిందట. నిజమా? అలా అయితే తక్షణం సైన్యాన్ని ఉపసంహరించమనండి. ఓ వారం రాళ్లేయనంత మాత్రాన ఏవేవో థియరీలు అల్లేస్తే ఎలా? కొత్త నోట్లు లేకపోయినా పచారీ దుకాణం వాడే అరువిస్తున్నాడు. పాక్ ప్రేరేపకులు రోకడా వచ్చేవారం యిస్తాంలే అంటే విద్రోహకారులు కాదంటారా? అయినే డబ్బే యివ్వాలని ఏముంది? తిండి పదార్థాలు, దుస్తులు, మద్యం వగైరాలు యివ్వలేరా? అయినా జిహాదీలు డబ్బుకోసం చేస్తున్నారనుకోవడం తప్పు. పట్టుబడిన వారు చెప్పినదాని ప్రకారం వాళ్లకు ముట్టేది అతి తక్కువ. కేవలం మతోన్మాదమే వాళ్లను నడిపిస్తోంది. మతం ప్రమాదంలో పడిందనే ప్రచారంతోనే వాళ్లను ఆపరేట్ చేస్తున్నారు. ఓ వారం నోట్లు అందలేదు కదాని చప్పబడిపోయే జనాభా కాదది. వారి స్తబ్దతకు కారణమేమిటో విచారించాలి. 

హడావుడిగా దిగడానికి కారణం రాజకీయమా?

లీకులు జరిగాయా లేదా, టెర్రరిజం ఆగిందా లేదా యిలాటి మీమాంసలకు యిప్పుడిప్పుడే సమాధానాలు రావు కానీ అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం - స్కీము ఫెయిలయింది, ప్రజలను యిక్కట్లపాలు చేసింది. కాష్‌లెస్ ట్రాన్సాక్షన్లకు జనం పూర్తిగా సిద్ధపడని తరుణంలో పెట్టిన యీ పథకం వలన నోట్ల చలామణీ జరగక వ్యాపారాలు దెబ్బ తిన్నాయి. కార్డు తీసుకునే సూపర్ బజార్లకు ఫర్వాలేదు కానీ మోదీకి వెన్నెముకగా నిలిచిన చిన్న వ్యాపారస్తులు మాత్రం గొల్లుమంటున్నారు. బ్యాంకు ఖాతా వుంటే తప్ప డబ్బు మార్చుకోలేని పరిస్థితి తెస్తున్నారు. జనాభాలో ఎంతమందికి ఖాతాలుంటాయి? ఇప్పటికిప్పుడు ఖాతాలు తెరవగలరా? ఆధార్ కార్డులే జనాభా అందరికీ లేవు. బ్యాంకులు నోట్ల మార్పిడే చేస్తాయా? ఖాతాలే తెలుస్తాయా? దేశమంతా అల్లకల్లోలంగా వుంది. సామాన్యులకు గుబులుగా వుంది. రాష్ట్ర ప్రభుత్వాలూ గతుక్కుమంటున్నాయి. జీతాలివ్వడానికి అల్లాడుతున్నాయి.

ముఖ్యమంత్రులకూ గుబులుగా వుంది. సామూహికంగా వెళ్లి ప్రధానిని అడుగుదామంటే భయంలా వుంది. పార్లమెంటులో అడుగుదామంటే మోదీగారి దర్శనం దుర్లభం. వెంకయ్యనాయుడు నోరు పెట్టుకుని పడిపోతారు. ఎదురు మాట్లాడితే దేశద్రోహి అంటారు. ఈ పరిస్థితిని 3 వారాల్లో చక్కదిద్దడం అరుణ్ జేట్లీ తరం కాదనేది సుస్పష్టం. ఫారిన్ ఎక్స్‌ఛేంజి వెల్లడి స్కీము పెడితే ఫెయిలయింది. ఇన్‌కమ్ డిస్‌క్లోజర్ స్కీము (ఐడియస్) పెడితే స్పందన లేక అదీ ఫెయిలయింది. ఇప్పుడీ స్కీము కూడా అందరితో - ముఖ్యంగా బ్యాంకుల వారితో - కలిసి చర్చించకుండా ప్రవేశపెట్టడం వలన ఆచరణలో ఫెయిలైంది.

ఆర్థికశాఖ అధికారులు యింత చేతకానివారా? అంటే నమ్మడం కష్టం. ఐడియస్ విషయంలో చాలా ప్లాన్‌డ్‌గా వెళ్లి కృషి చేశారు. స్పందన లేకపోవడం వేరే విషయం. అంతటి సమర్థులు, యీ స్కీములోని సాధకబాధకాలను ఆర్థికమంత్రికి పూర్తిగా వివరించి వుంటారు. సరిగ్గా అమలు చేయడానికి కొంత వ్యవధి అడిగి వుంటారు. కానీ ఆర్థికమంత్రి, మోదీ యివ్వలేదని అర్థమౌతోంది. ఎందుకివ్వలేదు? ఇంత ఆదరాబాదరాగా హోం వర్క్ లేకుండా స్కీము ప్రవేశపెట్టవలసినంత అర్జన్సీ ఏమొచ్చింది? తస్మదీయులకు లీకై వాళ్లూ జాగ్రత్తపడసాగారా? పరీక్ష పేపరు లీకయితే పరీక్ష రద్దు చేస్తారు. లీకు జరిగిందని తెలిస్తే స్కీము ప్రవేశపెట్టి వుండేవారు కారు. మరి!? కచ్చితంగా రాజకీయకారణాలు వుండి వుంటాయి. పంజాబ్ ఎన్నికలో, యుపి ఎన్నికలో, మరోటో మరోటో..! అదేమిటో యిప్పుడు స్పష్టంగా తెలియటం లేదు. రోజులు గడిచే కొద్దీ స్పష్టత వస్తుందని ఆశిద్దాం. 

ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2016)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?