Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: చె గువెరాపై కేరళ బీజేపీలో చర్చ

ఎమ్బీయస్‌: చె గువెరాపై కేరళ బీజేపీలో చర్చ

దక్షిణాదిన కేరళలో కాలూనడానికి బీజేపీ ఎన్నాళ్ల నుంచో శ్రమిస్తున్నా ఈ మధ్యే కాస్త ఫలితాలు కని పిస్తున్నాయి. దాన్ని ఎలా నిలుపుకోవాలా, విస్తరిం చుకోవాలా అనేదే కేరళ బీజేపీ నాయకులకు ముఖ్యమైన ప్రశ్నగా మారింది. ముస్లిములు, క్రైస్త వులు హిందువులతో ఇంచుమించు సమానస్థాయి లో వుండే మలయాళ సమాజంలో సెక్యులరిజం చాలా దృఢంగా ఉంది. కార్మికోద్యమం కూడా బలంగా వుండడం చేత ఏ పార్టీకి చెందినవారైనా సరే వామపక్ష వాదాలను వల్లిస్తూంటారు. దేశవి దేశాల్లో ప్రజల పక్షాన పోరాడిన వారిని ఆరాధి స్తారు. అలాటి హీరోల్లో చె గువెరా కూడా కేరళ యువకులను గత 50ఏళ్లగా ఆకర్షిస్తు న్నాడు. అతని పేరుతో వున్న టీ షర్టులు, పోస్టర్లు కేరళలో తరచుగా దర్శనమిస్తాయి. కేరళ యువకులు చె లా గడ్డం పెంచడం, టోపీ పెట్టుకోవడం, అతని సిద్థాంతాలు వల్లించడం ఫ్యాషన్‌గా పరిగణిస్తూంటారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర శాఖ అతన్ని వీరప్పన్‌తో పోలుస్తోంది. అతన్ని మెచ్చుకుంటే నేటి యువతపై దుష్ప్రభావం పడుతుందని వాదిస్తోంది. ఇలా అయితే యువతను ఎలా ఆకట్టుకోగలం అని కొందరు బీజేపీ నాయకుల ఆవేదన.

ఎర్నెస్తో చె గువెరా గురించి చాలామందికి తెలిసే వున్నా కాస్త గుర్తు చేసుకోవడం అవ సరం. అతను దక్షిణ అమెరికాలో అర్జెంటీనాకు చెందిన వైద్యుడు, రచయిత, గెరిల్లా యుద్ధ నిపుణుడు, కమ్యూనిస్టు విప్లవకారుడు. క్యూబాలో విప్లవం రావడానికి ఫిడల్‌ కాస్త్రోతో కలిసి భుజంభుజం కలిపి పోరాడాడు. క్యూబాలో విజయంతో అతను ఆగలేదు. అమెరికా దోపిడీకి గురవుతున్న దక్షిణఅమెరికా దేశాలన్నిటిలో విప్లవం రావాలని శ్రమించాడు. క్యూబాలో విప్లవ ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక హోదాల్లో పనిచేసి భూసంస్కరణలు, అక్షరాస్యతా కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేశాడు. బొలీవియాలో తిరుగుబాటు లేవదీస్తూ ఉండగా, సీఐఏ సహాయంతో బొలీవియన్‌ సైన్యం అతన్ని పట్టుకుని కాల్చి చంపింది. అతనిపై అవినీతి, బంధుప్రీతి, అధికార లాలస వంటి ఆరోపణలు లేవు. అచ్చమైన విప్లవకారుడిలా అత్యంత సాహసభరితంగా జీవించి మరణించాడతను. అందువలన యువతకు అతను హీరో. 

జనవరిలో కేరళ బీజేపీ రాష్ట్ర సమావేశంలో కేరళ యువతపై చె ప్రభావం గురించి చర్చ కు వచ్చింది. రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ ఎఎన్‌ రాధాకృష్ణన్‌ లైబ్రరీల్లో, వీధి మొగల్లో, బస్సు స్టాపుల్లో కనపడే చె పోస్టర్లన్నీ తొలగించాలని డిమాండు చేశాడు. ''అతని ఇమేజి యువతను పెడదారి పట్టించగలదు. అతను హింసాత్మకవాది. హిట్లర్‌, ముస్సోలినీ, స్టాలిన్‌ వంటివాడు. ఆట్టే మాట్లాడితే గంధపు చెక్కల దొంగ వీరప్పన్‌కి తీసిపోడు. అలాటివాణ్ని ఆరాధిస్తే మన యువతీయువకులు కమ్యూనిజం వైపు మరలి, హింసకు పాల్పడతారు.'' అన్నాడు. దీనిపై సహజంగానే సీపీిఎం పార్టీ స్పందించింది. కానీ చిత్రం ఏమిటంటే బీజేపీ పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడైన సీకే పద్మనాభన్‌ కూడా ఆ మాటలు ఖండించాడు. ''చె బొలీవియన్‌ డైరీ చదివితే వీరప్పన్‌కు, అతనికి ఉన్న తేడా ఏమిటో తెలుస్తుంది.'' అన్నాడు. అతను వాజపేయి పక్షానికి చెందిన బీజేపీ నాయకుడు. కేరళ బీజేపీపై ఆరెస్సెస్‌ తన పట్టు బిగిస్తోందని ఫిర్యాదు చేస్తూ వుంటాడు. తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడిస్తూ ఉంటాడు.

కేరళ సమాజం బాగా గౌరవించే సాహిత్యకారుడు ఎంటి వాసుదేవన్‌ నాయర్‌. ఆయన నోట్ల రద్దును విమర్శించాడు. అంతే, స్థానిక బీజేపీ నాయకత్వం ఆయనపై విరుచుకు పడింది. సినిమా హాళ్లల్లో ప్రదర్శనకు ముందు జాతీయగీతం ఆలపింప చేయాలన్న నిర్ణ యాన్ని సినిమా డైరక్టరు కమల్‌ విమర్శిస్తే బీజేపీ నాయకులు అతని పైనా విరుచుకు పడ్డారు. ''పాకిస్తాన్‌కు పొమ్మనండి'' అన్నారు. ఈ రెండు సందర్భాలలోను పద్మనాభన్‌ వాసు దేవన్‌ నాయర్‌, కమల్‌ పక్షాన నిలబడి తన పార్టీ చేష్టలనే నిరసించాడు. ''భారత్‌, పాకిస్తాన్‌ కలిసి అఖండ భారత్‌ ఏర్పడాలని బీజేపీ పార్టీ సిద్ధాంతం. పాకిస్తాన్‌ వాళ్లనే యిక్కడికి ఆహ్వానిస్తానంటున్నపుడు మనవాళ్లను అక్కడకి పొమ్మనమని విదిలించడం దేనికి?'' అన్నాడు. అయితే పద్మనాభన్‌ విమర్శను బీజేపీ, దాని అనుబంధ సంస్థలు సహించలేదు. 

ఆరెస్సెస్‌కు అనుబంధ సంస్థ అయిన భారతీయ విచార కేంద్రం ఉపాధ్యక్షుడు కె జయప్రసాద్‌ ''పద్మ నాభన్‌ అలా మాట్లాడడానికి కారణం లేకపోలేదు. విద్యార్థిగా వుండగా అతను సీపీఎంకు చెందిన స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో సభ్యుడు. కమ్యూనిస్టులకైతే జాతీయ నాయ కులు పనికిరారు. అందుకనే అంతర్జాతీయ నాయకులను వెతుక్కుంటారు. మాకైతే అనేక మంది జాతీయ నాయకులున్నారు.'' అని వెక్కిరించాడు. ''ఇక చె సంగతంటారా? మమ్మల్ని స్థానిక మీడియా ఎన్నో దశాబ్దాలుగా పట్టించుకోలేదు. ఇప్పుడితని కారణంగా ఏదో రకమైన పబ్లిసిటీ వచ్చి పేపర్లో మా పేరు తరచుగా కనబడుతూ వుంటే అదీ మాకు మేలు చేస్తుంది.'' అని చమత్కరించాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?