Advertisement

Advertisement


Home > Articles - MBS

చెంఘిజ్‌ ఖాన్‌ వారసులు

మంగోలియాలో సంచారజాతులకు చెందిన చెంఘిజ్‌ ఖాన్‌ 1206లో తన దండయాత్రలతో ఆసియా మొత్తాన్ని గడగడలాడించాడని పుస్తకాల్లో చదివాం, సినిమాల్లో చూశాం. అతని మనుమడు కుబ్లాయి ఖాన్‌ ఏకంగా చైనానే జయించాడు. అతని కాలంలోనే మార్కో పోలో చైనాను సందర్శించాడు. కొన్నాళ్లకు ఆ వంశపాలన అంతమయ్యాక వాళ్లు తిరిగి మంగోలియాను పాలించారు. కాలక్రమంలో ఆ వంశీకులు ఏమయ్యారో, మంగోలియా దేశంలో ఎటువంటి పాలన వుందో మనకు పెద్దగా వార్తల్లోకి రాలేదు. ఎందుకంటే మంగోలియా చైనా, రష్యా వంటి రెండు పెద్ద సామ్రాజ్యాల మధ్య యిరుక్కుంది. దేశపు విస్తీర్ణం పెద్దదే కానీ, జనాభా తక్కువ. వాళ్లు కూడా తమ పూర్వీకులలాగానే ఆవులు మేపుకుంటూ, గొఱ్ఱెలు కాసుకుంటూ, గుఱ్ఱాలపై తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఇన్నాళ్లకు అది మారబోతోంది. మార్పు వెనకాల చైనా హస్తం వుంది. మంగోలియాలో వున్న సంచారజాతులు తమలో తాము కలహించుకుంటూ వుండేవి. ఎవరో ఒకరు జయించి, తక్కినవారిని పాలించేవారు. 16, 17 శతాబ్దాలలో టిబెట్‌ బౌద్ధం ప్రభావంలో పడింది. 17 వ శతాబ్దాంతంలో చైనా ఏలుబడిలోకి వెళ్లింది. 1911లో చైనా చక్రవర్తి బలహీనపడగానే స్వాతంత్య్రం ప్రకటించుకుంది. కానీ రష్యాలో కమ్యూనిస్టు విప్లవం తర్వాత దానికి ఉపగ్రహ రాజ్యంగా మారింది. 1989లో సోవియట్‌ సామ్రాజ్యం కుప్పకూలాక, మంగోలియాలో కూడా ప్రజాస్వామ్యం కోసం పోరాటం జరిగింది. 1992లో కొత్త రాజ్యాంగం రాసుకుని కేంద్రం బలంగా వుండే పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పరచుకున్నారు. ఓ అధ్యకక్షుడు, ఓ ప్రధానమంత్రి కూడా వున్నారు. అయితే ప్రజల్లో చాలామంది పేదవారు. జనాభాలో 30% మంది సంచారజీవులే. ఏడాదిలో ఆర్నెల్లు తీవ్రమైన శీతాకాలం, యింకో ఆర్నెల్లు వేసవి. ఇటీవలి కాలంలో మంగోలియా యువకులు గుఱ్ఱాలపై చేసే విన్యాసాలు చూడడానికై చైనా  నుండి  యాత్రికులు వచ్చిపడుతున్నారు. వాళ్లతో పాటు డబ్బూ వచ్చిపడి, మంగోలియా ప్రజల దృక్పథంలో మార్పు వస్తోంది. 

ఆ మార్పు మరింతగా రావాలని మంగోలియా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నానికి అంతర్జాతీయ కారణాలు వున్నాయి. రష్యాతో వ్యాపారబంధాన్ని పటిష్టం చేసుకుని ఆసియాలో తన ప్రాబల్యం పెంచుకుందామని, అమెరికాను యిక్కడ కాలు పెట్టనీయకూడదనీ చైనా ప్రయత్నిస్తోంది. అమెరికా, యూరోప్‌ దేశాల వ్యాపారపరమైన ఆంక్షలు తట్టుకోవాలంటే చైనాపై ఆధారపడక తప్పదని రష్యా గ్రహించింది. చైనా, రష్యాల మధ్య రవాణా సౌకర్యం పెంచుకోవాలంటే రెండింటికి మధ్యలో వున్న మంగోలియాను వాడుకోవాలి. వాళ్లు ఎదురు తిరగకుండా ఆ ప్రభుత్వానికి, ప్రజలకు ఆర్థికంగా సహాయసహకారాలు అందిస్తూ స్నేహం పెంచుకోవాలి. ఇదీ చైనా ప్లాను. మంగోలియాలోని మన్‌జౌలి ల్యాండ్‌ పోర్టు ద్వారా రష్యాకు చైనాకు మధ్య యిప్పటికే ఏటా 3 కోట్ల టన్నుల కార్గో అటూ యిటూ రవాణా అవుతోంది. దాన్ని 7 కోట్లకు పెంచాలని లక్ష్యం పెట్టుకున్నారు. అంతేకాదు, దక్షిణ చైనాలోని సుజౌ నుండి పోలండ్‌ వరకు రైల్వే ట్రాకు వేస్తున్నారు. అది మన్‌జౌలి, రష్యాల మీదుగా వెళుతుంది. ఇలా కొత్తకొత్త వ్యాపారాలు వచ్చి పడుతూంటే స్థానిక ప్రజలు తమ జీవితసరళి మార్చుకోక తప్పదు. మార్పును వాళ్లు ఆహ్వానించేట్లా చేయాలంటే, 'అభివృద్ధి చెందడానికి యిది మీకు ఒక మంచి అవకాశం' అని నచ్చచెప్పాలి. మంగోలియా ప్రభుత్వం ప్రస్తుతం ఆ పని మీదే వుంది.

అక్కడ 55 సంచార జాతులున్నాయి. ఇతరులతో చైనీస్‌ మాట్లాడినా తమలో తాము మంగోలియన్‌ భాషలోనే మాట్లాడుకుంటారు. మంగోలియాలో ఖనిజ సంపద ఎక్కువ కాబట్టి 2011లో చైనా మైనింగ్‌ కంపెనీలు వచ్చి మంగోలియా ప్రభుత్వ సహాయంతో అక్కడ కార్యకలాపాలు మొదలుపెట్టబోతే మంగోలియా పశులకాపర్లు అడ్డుకున్నారు. హైలార్‌ ప్రాంతంలో 40 కోట్ల మిలియన్‌ హెక్టార్లల పచ్చిక బయలు వుంది. దానిపై 12 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం టూరిజం, డెయిరీ యిండస్ట్రీలు పెడతామని, మైనింగ్‌ జోలికి పోమని హామీ యిచ్చి వాళ్లను మచ్చిక చేసుకుంటోంది. ఈ పశుపాలన వదిలిపెట్టి వేరే వృత్తిలో స్థిరపడడం ఎలాగో మీకు ట్రైనింగ్‌ యిస్తాం, ఒక ఏడాదిలో వాళ్లకు పునరావాసం కల్పిస్తాం అంటూ నచ్చచెపుతున్నారు. చెంఘిజ్‌ ఖాన్‌ వంశానికి చెందిన టెగెక్సీ అనే అతన్ని మంగోలియా ప్రభుత్వం వారు యీ పనికి గుడ్‌విల్‌ ఎంబాసిడర్‌గా పెట్టుకుని, ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ''30 తరాలుగా మా పెద్దలు ఏం చేశారో నేనూ అదే చేస్తూ వస్తున్నాను. అంటే పొద్దున్న 4 గంటలకు లేచి 70 పశువులకు మేత వేయడం, తర్వాత 600 గొఱ్ఱెలను తీసుకుని మేపడానికి వెళ్లడం, సాయంత్రం యింటికి వచ్చి పడుక్కోవడం. ఇప్పుడు మా తర్వాతి తరంలో మార్పు వస్తోంది. 26 ఏళ్ల మా అబ్బాయి కంప్యూటర్‌ సైన్స్‌ చదువుకుంటున్నాడు. త్వరలోనే డిగ్రీ చేతబట్టి బిజినెస్‌ పెడతానంటున్నాడు. 23 ఏళ్ల మా అమ్మాయి యూనివర్శిటీలో న్యాయశాస్త్రం చదువుతోంది. మేమంతా సంచార జీవితమే గడిపాం. పిల్లలైనా నగరాల్లో స్థిరపడి, ఉద్యోగాలు చేసుకుంటే సంతోషిస్తాం. అలా అని వాళ్లు సంప్రదాయాలు మర్చిపోతే బాధపడతాం.'' అన్నాడతను. అతని ద్వారా యితర మంగోలియన్‌ జాతులకు కూడా మార్పును ఆహ్వానించమనే సందేశం యిప్పిస్తోంది ప్రభుత్వం. అంతిమంగా యిది వాళ్లకు మేలు చేస్తుందో లేదో చూడాలి.

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?