Advertisement

Advertisement


Home > Articles - MBS

సినీమూలం - మోసగాళ్లకు మోసగాడు- 2

సినీమూలం -  మోసగాళ్లకు మోసగాడు- 2

ఇంతలో ఓ బగ్గీ అటుగా వచ్చింది. అగ్లీ, హీరో వెళ్లి చూస్తే దానిలో బోల్డు శవాలు. శవాల మధ్య కొసప్రాణంతో వున్న జాక్సన్‌. ఇక ఎలాగూ చావబోతున్నాను కదాని బంగారం ఎక్కడ దాచాడో తనకు చివర్లో కనబడినవాడికి చెప్పేయబోయాడు. శ్మశానం పేరు అగ్లీకి చెప్పాడు. సమాధి పేరు చెప్పేటంతలో దాహం వేసింది. అగ్లీ ఆదరాబాదరాగా నీళ్లు తెచ్చేలోపున సమాధిపేరు హీరోకి చెప్పి గుటుక్కుమన్నాడు. తెలుగులోనూ యిలాగే జరిగింది. అయితే చెప్పినవాడు దోపిడీ దొంగ కాదు, నిధికి దారికి తెలిసిన కాకరాల కొడుకు. కాకరాల పోతూ పోతూ కొడుక్కి చెప్పాడు. కొడుకు పోతూ పోతూ నిధి నల్లమల అడవుల్లో వుందని నాగభూషణానికి, ఆ తర్వాత పూర్తి దారి హీరోకి చెప్పి చచ్చిపోయాడు. ఇక్కడ నాగభూషణంతో బాటు జ్యోతిలక్ష్మి కూడా వుంది.

ఇక నిధి రహస్యం గురించి హీరోని కాపాడవలసిన బాధ్యత అగ్లీపై పడింది. చచ్చీ చెడి వైద్యం చేయించాడు. ఇద్దరూ కలిసి నిధి వేటకు బయలుదేరారు. ఈ లోపున యింకో గొడవ వచ్చిపడింది. చచ్చినపోయిన కార్సన్‌ పేరు యితను పెట్టుకున్నాడు. దాంతో యితనే ఆ దొంగ అనుకుని విలన్‌ యితని వెంటపడ్డాడు. ఇంగ్లీషు సినిమా కథాకాలంనాటికి అమెరికాలో అంతర్యుద్ధం జరుగుతోంది. ఉత్తరాది రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు పోట్లాడుకుంటున్నాయి. వీళ్లకు ఏ తరఫువాళ్లతోనూ సంబంధం లేదు కానీ అనుకోకుండా యూనిఫాం రంగు విషయంలో చిన్న పొరబాటు చేసి యుద్ధఖైదీలుగా పట్టుబడ్డారు. అక్కడ సార్జంటుగా విలన్‌ తయారయ్యాడు. అగ్లీయే కార్శన్‌ అనుకుని తిండి పెట్టి రహస్యం చెప్పమని చావగొట్టాడు.

తెలుగులో అంతర్యుద్ధం లేదు కానీ నాగభూషణం కూడా చనిపోయినతని పేరు పెట్టుకుని విలన్‌ సత్యనారాయణ పాలబడ్డాడు, తన్నులు తిన్నాడు. హీరో హీరోయిన్లు వచ్చి విడిపించారు. తమతో వుండమన్నారు. ఈ లోపున ఒరిజినల్‌లో లేని విధంగా తెలుగులో కథ మరో మలుపు తిరిగింది. తాళం చెవులు ధూళిపాళ వద్ద లేవని అతను హీరో తండ్రి గుమ్మడికి అప్పగించాడని తెలిసింది. దాంతో విలన్లు అందరూ కలిసి గుమ్మడిని అతి క్రూరంగా చంపి ఐదు తాళంచెవులనూ ఐదుగురూ పంచుకున్నారు. హీరో యింటికి వచ్చేసరికే తండ్రి, తల్లి పోయారు. చంపినవారిలో ఒకరి పేరు తల్లి చెప్పగలిగింది. హీరో పగ తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. హీరో వాణ్ని చంపి తక్కినవాళ్ల పేర్లు తెలుసుకున్నాడు. ఆ హంతకుల్లో యిద్దరు ఆటవికులు వున్నారు. వాళ్లతో భీకర పోరాటం చేశాక వాళ్లనీ చంపి తాళాలు తీసుకున్నారు.  మూడు చేరాక అవి తీసుకుని నాగభూషణం పారిపోయాడు. అప్పటిదాకా వీళ్లతో కలిసి వున్నవాడే, అంతలోనే దుర్బుద్ధి. అదే అగ్లీ లక్షణం. 

ఇంగ్లీషు ఒరిజినల్‌లో యిదంతా లేదు. అక్కడ సైన్యంలో మేజర్‌గా వున్న విలన్‌ అగ్లీనుండి సేకరించిన సమాచారంతో హీరోని బెదిరించాడు. హీరో బెదరలేదు. శ్మశానం పేరు ఆల్‌రెడీ తెలుసుకున్నావు కాబట్టి కావాలంటే మనం యిద్దరం వెళదాం. అక్కడికి వెళ్లాక సమాధి పేరు చెబుతా అన్నాడు. అగ్లీని చంపి పారేయవచ్చు కానీ అతని తలపై మూడువేల డాలర్ల రివార్డు వుందని తెలిసి అతన్ని ఆ వూళ్లో అప్పగించి ఆ డబ్బు పుచ్చుకుందామని రైలు ఎక్కించాడు ఓ సైనికుడు. అగ్లీ ఏదో నాటకం ఆడి రైల్లోంచి కిందకు దొర్లాడు. సైనికుడి తలని రాయికేసి కొట్టి చంపాడు. తప్పించుకున్నాడు. యుద్ధం కారణంగా ఖాళీ చేసిన ఓ యింట్లో దూరి స్నానం చేస్తూండగా హీరో దిగబడ్డాడు. 'విలన్‌ తన ముఠాతో నా వెంటపడ్డాడు. మనిద్దరం చేతులు కలుపుదాం. వాణ్ని చంపుదాం' అని ప్రపోజ్‌ చేశాడు. విలన్‌తో యుద్ధం జరిగింది. వీళ్ల చేతిలో విలన్‌ అనుచరులందరూ చచ్చిపోయారు కానీ విలన్‌ పారిపోయాడు. పోతూ పోతూ 'సీ యూ ఎగైన్‌' అని ఉత్తరం రాసి పెట్టి పోయాడు.

ఇక హీరో, అగ్లీ యిద్దరూ కలిసి నిధివైపు పయనం సాగించారు. దారిలో అనుకోకుండా అంతర్యుద్ధంలో పాల్గొనవలసి వచ్చింది. యుద్ధంలో అనేకమంది వుత్తిపుణ్యాన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని జాలిపడ్డారు. చివరికి ఓ బ్రిజ్‌ పేల్చేసి కాస్త జననష్టాన్ని తగ్గించారు మధ్యలో అగ్లీ హీరోని అడిగాడు - నేను స్మశానం పేరు చెప్పేస్తాను, నువ్వు సమాధి పేరు చెప్పేసేయి అని. హీరో సరేనని చెప్పేశాడు. హీరో చావుబతుకుల్లో వున్న ఓ సైనికుడిపై కాస్త జాలి చూపించేటంతలో అగ్లీ గుఱ్ఱం ఎక్కి పారిపోయాడు. స్మశానం చేరి ఆ సమాధి వద్ద తవ్వబోయాడు. అదే సమయానికి హీరో, విలన్‌ కూడా చేరారు. తీరా తవ్వాక చూస్తే అక్కడ అస్తిపంజరం తప్ప మరేమీలేదు. హీరో కావాలని తప్పు చెప్పాడని తెలిసింది. విలన్‌, అగ్లీ కలిసి అతని మీద పడి ఒత్తిడి చేశారు. ఓ రాతిమీద రాసి చూపిస్తానన్నాడు. ముగ్గురూ కాల్చుకున్నారు విలన్‌ చచ్చిపోయాడు. అప్పుడు హీరో చెప్పాడు - పక్కనున్న సమాధిలోనే బంగారం వుందని. అగ్లీ తవ్వాడు, బంగారం దొరికింది. అతన్ని అలాగే వదిలేస్తే అతను తననూ చంపేయవచ్చు కాబట్టి అతని వాటా కాళ్ల దగ్గర పెట్టి అతని మెడకి వురి బిగించాడు హీరో. దూరంగా వెళ్లి తాడుని కాల్చాడు అగ్లీ బతికాడు. హీరో సరేసరి. ఈ ఆఖరి సీనుమాత్రం తెలుగులో కనబడుతుంది. మధ్యలో చాలా కథ కల్పించారు. 

మూడు తాళం చెవులు తీసుకుని నాగభూషణం పారిపోయి ఓ కాసినోలో చిక్కుకున్నాడు. హీరో హీరోయిన్‌ తనను వెతుకుతూ యిలా వచ్చినపుడు  ''నాలుగో తాళం చెవి దీని ఓనర్‌ వద్ద వుంది. జూదగృహంలో ఏదైనా గొడవ జరిగితే తప్ప అతను బయటకు రాడు.'' అని చెప్పి తన దగ్గరున్న తాళంచెవులు  వాళ్లకు యిచ్చేశాడు. వీళ్లు అక్కడ జరుగుతున్న మోసాన్ని బయటపెట్టి అల్లరి చేసేసరికి అతను బయటకు వచ్చాడు. వీళ్ల చేతిలో చచ్చాడు. త్యాగరాజును చంపడంతో ఐదో తాళం చెవికూడా చేతికి చిక్కింది. ఇప్పుడు వాళ్లు నిధి బాట పట్టారు. వాళ్ల వెనకాలే విలన్‌లు, వ్యాంప్‌ కూడా వచ్చారు. ఇక్కడ మనవాళ్లు ''మెకన్నాస్‌ గోల్డ్‌'' సినిమాను కూడా కొంత అనుకరించారు. మెకన్నాస్‌ గోల్డ్‌లో విలన్‌ నిది కోసం వెతుకుతూ వస్తాడు. నిధి రహస్యం తెలిసిన ఓ రెడ్‌ యిండియన్‌ హీరోకి అది చెప్పి చచ్చిపోతాడు. అందువలన విలన్‌ హీరోని తన వెంట తెస్తాడు. వారి వెంట వున్న వ్యాంప్‌ హీరో అంటే మనసు పడుతుంది - జ్యోతిలక్ష్మి కృష్ణపై మనసు పడినట్టే!

మెకన్నాస్‌ గోల్డ్‌ సినిమా మొదట్లో విలన్‌ చంపేసిన హోటల్‌ యజమాని భార్యే హీరోయిన్‌. ఆమె, హీరో ఒకరంటే మరొకరు యిష్టపడతారు. అసూయతో వ్యాంప్‌ హీరోయిన్‌ను చంపబోతుంది. అదే తెలుగులోనూ పెట్టారు. అలాగే సూర్యకిరణాలు పడి కొండల్లో దారి కనబడడం సీను కూడా దింపేశారు. చిన్న యాంటీ క్లయిమాక్స్‌ ఏమిటంటే ఐదో తాళం చెవి పనిచేయదు. అప్పుడు యింకో విలన్‌ ప్రభాకరరెడ్డి వచ్చి అది తన వద్ద వుందని చెప్పి హీరోయిన్‌ తండ్రిని తనే చంపానని కూడా చెప్తాడు. 

ఆ తర్వాత బోల్డుమంది మధ్య భీకరయుద్ధం. మెకన్నాస్‌ గోల్డ్‌లో లాగానే. చివరికి అందరూ పోయి హీరో హీరోయిన్‌ నాగభూషణం మిగుల్తారు. గుడ్‌ బాడ్‌ అండ్‌ అగ్లీలో లాగానే చివర్లో నాగభూషణానికి వురి ఏర్పాటు చేస్తాడు. దూరం వెళ్లాక తాడు కాల్చేస్తాడు. మన వాతావరణానికి నప్పేట్టుగా హీరో ఆ డబ్బంతా పేదవాళ్లకు పంచేసినట్టు చివర్లో చూపించారు. నాగభూషణం కూడా మంచివాడై పోయినట్టు చూపించారు. లియోన్‌ డైరక్టు చేసిన గుడ్‌ బాడ్‌ అండ్‌ అగ్లీ సినిమా పాత్రచిత్రణ పరంగా కూడా ఓ క్లాసిక్‌గా నిలిచింది. క్లింట్‌ యీస్డ్‌వుడ్‌ హీరోగా, లీ వాన్‌ క్లిఫ్‌ విలన్‌గా, ఎలి వాలాచ్‌ అగ్లీగా అదరగొట్టేశారు. నేపథ్య సంగీతం అద్భుతంగా వుంటుంది. తెలుగులో ఆదినారాయణరావు, సత్యం సహాయంతో మంచి సంగీతం యిచ్చారు. కృష్ణ, విజయనిర్మలు హీరో హీరోయిన్లు కాగా నాగభూషణం అగ్లీగా మంచి అభినయం కనబరిచారు. మోసగాళ్లకు మోసగాడును తమిళంలో, హిందీలో డబ్‌ చేస్తే అవీ బాగా ఆడాయి. అంతేకాదు, ఇంగ్లీషులో ట్రెజర్‌ హంట్‌ పేర డబ్‌ చేస్తే ఆసియా, యూరోప్‌, అంతా బాగా ఆడింది. గ్రీసు భాషలో కూడా డబ్‌ చేశారు. ఆ తరహా చిత్రాలనేక వాటికి స్ఫూర్తినిచ్చింది.  (సమాప్తం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2015)

[email protected]

Click Here For Part-1

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?