Advertisement

Advertisement


Home > Articles - MBS

సినీమూలం : పెళ్లినాటి ప్రమాణాలు - 2/2

సినీమూలం : పెళ్లినాటి ప్రమాణాలు - 2/2

ఇదీ ''సెవెన్‌ ఇయర్‌ యిచ్‌'' సినిమా. వైవాహిక జీవితంలో ఆసక్తి తగ్గిపోకుండా భార్యాభర్తలు జాగ్రత్తగా చూసుకుంటూ వుండాలని ప్రబోధిస్తుంది. దాన్నే సరదాగా చెప్పారు, వారి వాతావరణంలో! కానీ మన సాంఘిక పరిస్థితుల్లో యిలాటి మెసేజ్‌ యివ్వాలంటే యీ పద్ధతి కుదురుతుందా? కుదరదు. అందుకనే ఈ మూలకథాంశాన్ని తీసుకుని కెవి రెడ్డి గారు, పింగళి గారు ''పెళ్లినాటి ప్రమాణాలు'' కథ తయారుచేశారు. దానిలో కూడా పెళ్లయి ఏడు సంవత్సరాలైన ఓ వివాహితుడు కనబడతాడు. తనకు చాలా ఆత్మనిగ్రహం వుందనుకుంటూ అవతలివాళ్లకు లెక్చర్లు యిస్తూ వుంటాడు. కానీ అతని నిగ్రహం ఎంత బోలుదో అతనికే చూపిస్తుంది ఓ తెలివైన చిలిపి అమ్మాయి. సినిమాలో మొదటి ముప్పావుగంటా హీరోకి, హీరోయిన్‌కి పెళ్లికి దారితీసిన హాస్యఘట్టాలను చూపిస్తారు. ఒకరినొకరు యిష్టపడి పెళ్లి చేసుకున్నారు వాళ్లు.  

హీరో (నాగేశ్వరరావు) డబ్బు లేనివాడు. హీరోయిన్‌ (జమున)కి డబ్బుంది. ఆమె అన్నగారు (ఆర్‌. నాగేశ్వరరావు) హీరోకి ఫ్రెండు. మంచివాడని పట్టుబట్టి తండ్రి (రంగారావు)ని ఒప్పించి పెళ్లి చేయిస్తాడు. పెళ్లి కొత్తరకంగా జరిపిస్తారు. వాటిలో భాగమే ప్రమాణాలు. పెళ్లిపెద్దగా వ్యవహరించిన పెద్దాయన ప్రేమగండం గురించి హెచ్చరించాడు. 'నేను గమనిస్తూనే వుంటాను. దారి తప్పావో అంతరాత్మలా వచ్చి గుర్తు చేస్తూవుంటాను' అన్నాడు. రమణారెడ్డి హీరో బంధువే, తను పనిచేసే కంపెనీలోనే వుద్యోగం వేయించాడు. పక్కవాటాలోనే వున్నాడు. పెళ్లయిన కొత్తల్లో హీరో అందరిలాగానే పెళ్లం కొంగు పట్టుకునే తిరిగాడు. ఆఫీసుకి లీవు పడేసి భార్యతో సరసాలాడతాడు. కానీ పిల్లలు పుట్టుకుని వచ్చిన దగ్గర్నించీ అతనిలో మొనాటనీ వచ్చింది. భార్యలోనూ భర్త పట్ల నిర్లక్ష్యం పెరిగింది. 

ఈ దశలో అతని జీవితంలో రాధ (రాజసులోచన) అనే అమ్మాయి ప్రవేశించింది. ఆమె వాళ్ల కంపెనీలో  టైపిస్టుగా చేరింది. చలాకీ అయిన పిల్ల. ఆమెను చూడగానే ఆఫీసు స్టాఫ్‌ మతి పోగొట్టుకున్నారు. అప్పటిదాకా బూచాళ్లలా వున్నవాళ్లు గడ్డాలు గీసేసి, కొత్త బట్టలు తొడిగేసి ఆమె వెంట పడ్డారు. దాంతో హీరోకు ఒళ్లు మండింది. ఆమెను తిట్టాడు. ఆమెకు యితని వరస - హోలియర్‌ దేన్‌ దౌ అంటారే అలాటిది - చూసి ఒళ్లు మండింది. తన రూమ్మేటుతో చెప్పింది. ఇంతలోనే హీరోగారి భార్యకు పుట్టింటికి వెళ్లే పనిపడింది. పక్కవాటాలో వున్న పెద్దాళ్లకు అప్పగింతలు పెట్టి మరీ వెళ్లింది. మొగుడు కాఫీ కూడా తాగకూడదని ఆమె ఆంక్షలు. ఇవతల ఆఫీసులో హీరోగారు రాజసులోచనకు తనెంత గొప్పవాడో చాటుకోవడానికి సమయం చూసి మనోనిగ్రహం గురించి లెక్చరు దంచేశాడు.

ఆ రాత్రే రాజసులోచన అతని యింటికి వచ్చింది. ఇతను పులకించిపోయాడు.   సరదాగా కబుర్లు చెప్పి కాఫీ కలిపి యివ్వబోయాడు. అలికిడి విని పక్కవాటాలో రమణారెడ్డి దంపతులు వచ్చిపడ్డారు. రాజసులోచన మంచం వెనక్కాల దాక్కుంది. రమణారెడ్డి భార్య ఛాయాదేవి 'అమ్మాయి చీర మంచం మీద పడేసుకుందే అంటూ మడతపెట్టబోయింది, మంచం చాటున రాజసులోచన మెలికలు తిరుగుతూ చీర విప్పనిచ్చింది. హీరో చేసిన కాఫీని రమణారెడ్డి దంపతులు తాగేసి వెళ్లిపోయాక, రాజసులోచనకు చీర మళ్లీ వెనక్కి యిచ్చేసి బయటకు రమ్మన్నాడు. ఇలా వీళ్ల భేటీ నానారకాలుగా రసాభాస అయింది. ఆ వేళ ఆ అమ్మాయి అలా రావడంవలన అతని మనసు చలించింది. ఎంత నిగ్రహం వున్నట్టు పోజు కొట్టినా మనిషికి అంతరాంతరాలలో తను చేసేది తెలుస్తూనే వుంటుంది కదా. అంతరాత్మ మేలుకొన్నపుడల్లా దాన్ని బుకాయించి, జోకొట్టి వూరుకోబెడతాడు. 

హీరోగారు యిలా తనను తాను బుకాయించుకుంటూనే రొమాన్సు సాగించబోయాడు. టైపిస్టు అమ్మాయి కోసం తన చుట్టమైన రమణారెడ్డి మీదనే స్టాఫ్‌ చేత తిరుగుబాటు చేయించాడు. ఆ అమ్మాయి యితన్ని ఓ ఆట ఆడించింది. తన రూముకి వస్తే రూమ్మేటుచేత పిచ్చిదానిలా యాక్ట్‌ చేయించి హడలగొట్టింది. దాంతో హీరో టైపిస్టు అమ్మాయి నేసుకుని జూ తిరగబోయాడు. ఖర్మకాలి అక్కడ తన బావమరిది కంటపడ్డాడు. అతను వెంటపడితే పరిగెట్టి పరిగెట్టి తప్పించుకున్నాడు. ఇంటికొచ్చి పడేసరికి భార్యాపిల్లలు సిద్ధం. జరిగిందేమిటంటే యితని వరస చూసి రమణారెడ్డి ఓ ఆకాశరామన్న వుత్తరం రాసి హీరో బావమరిదిని తెప్పించాడు. బావగారి వ్యవహారం రూఢి అయిపోవడంతో బావమరిది - అసలే మిలటరీవాడు - స్ట్రాంగ్‌ గా డోస్‌ యిచ్చాడు.

ఇలాటి సందర్భాల్లో సగటు భార్య ఏం చేస్తుందో అదే హీరో కృష్ణారావు భార్యా చేసింది. మొగుణ్ని వెనకేసుకుని వచ్చింది. అసలే ఆ పాత్రపేరు రుక్మిణి. టైపిస్టు అమ్మాయి పేరు రాధ. ఈ బావమరిది ఎకాయెకి ఆ రాధ దగ్గరకి వెళ్లి డబ్బిస్తాను వదిలేయమని ప్రపోజ్‌ చేశాడు. రాజసులోచన కంపెనీ ఓనరు గారికి ఆయన వద్ద పనిచేసే స్టాఫ్‌ నిజస్వరూపాన్ని చూపించింది. ఓ ఆడదాని మోహంలో పడి కంపెనీకి కూడా ద్రోహం తలపెట్టే స్వభావం వున్నవారని నిరూపించింది. ఇలా వెకిలిగా బయటపడేవారు కొందరుంటే పెద్దమనుషులుగా కనబడుతూనే లోపల ఆశలు పెంచుకునేవారు ఎలా వుంటారో కంపెనీ సిల్వర్‌జూబ్లీ ఫంక్షన్‌లో బయటపడింది. ఫంక్షన్‌ సందర్భంగా ఓ బ్యూటీ కంటెస్ట్‌ ఏర్పాటు చేశారు. తన భర్తను వెతుక్కుంటూ అనుకోకుండా స్టేజిమీదకు వచ్చిన హీరో భార్యకు ఫస్ట్‌ ప్రెయిజ్‌ వచ్చింది. అందమైన భార్యను నిర్లక్ష్యం చేసి తన వెంటపడుతున్న హీరోగారికి దిమ్మ తిరిగేలా జవాబిచ్చింది రాజసులోచన. అది చాటుగా విన్న ఆర్‌ నాగేశ్వరరావుకు రాజసులోచన విపరీతంగా నచ్చేసి షేక్‌హ్యాండ్‌ యిచ్చాడు. అతని తీరు ఆమెకు నచ్చింది. 

సిగ్గుతో తలవంచుకుని యిల్లు చేరిన హీరోకి మరో షాక్‌. రాజసులోచనతో తన సంభాషణ విన్న భార్య ఆత్మహత్య చేసుకుంటానని ఉత్తరం రాసి యిల్లు విడిచిపెట్టిపోవడం. భార్యావియోగం అతన్ని బాధపెట్టింది. పైగా పిల్లల్ని చూసుకునే భారం అతనిపై పడింది. ఎక్‌స్ట్రా మేరిటల్‌ రిలేషన్‌షిప్‌ వలన జరిగే అనర్థం అతనికి తెలిసి వచ్చింది. పిల్లలు ఏడుస్తూంటే సముదాయించలేక అవస్త పడ్డాడు. నిజానికి ఈ ఆత్మహత్య ఉత్తరం వొట్టిదే. హీరోకి బుద్ధి రావడానికి రమణారెడ్డి ఆడిన నాటకం. చివరకు భర్త క్షోభ భరించలేని ఉత్తమయిల్లాలు బయట పడిపోవడంతో  హీరోకి ఊరట కలిగింది. అతనికి బుద్ధి వచ్చింది. 

హీరో బావమరిది టైపిస్టు అమ్మాయిని పెళ్లాడడంతో కథ సుఖాంతం అయింది. వైవాహిక జీవితంలో ఆటుపోటులు తప్పవని, ప్రేమగండాలు సహజమనీ చెపుతూనే వాటివలన బాధలే తప్ప, సుఖముండదని చెప్పారు తెలుగు సినిమాలో. ఇంగ్లీషు సినిమా, తెలుగు సినిమా రెండూ వైవాహిక బంధాన్ని హైలైట్‌ చేసేవే. అయితే  ఎప్రోచ్‌లోనే వుంది తేడా. మూలంలో స్ఫూర్తిని తీసుకుని మనకు తగ్గట్టుగా మలచుకున్నారు మన తెలుగు మహనీయులు. (సమాప్తం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2016)

[email protected]

Click Here For Part - 1

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?