Advertisement

Advertisement


Home > Articles - MBS

సినీ స్నిప్పెట్స్‌- సావిత్రి- జెమినీ గణేశన్‌ దాంపత్యం-2

సినీ స్నిప్పెట్స్‌- సావిత్రి- జెమినీ గణేశన్‌ దాంపత్యం-2

నిజానికి వివాహితుణ్ని పెళ్లి చేసుకునే స్త్రీలందరూ అతని తిరుగుళ్లు తనతో ఆగిపోయేట్లా చేయగల శక్తి తమకు వుందని భ్రమ పడతారు. తిరిగే తుమ్మెదను ఆపలేమని గ్రహించరు. యవ్వనంలో వుండగా రెండో భార్య, ఉంపుడుకత్తెల మాట చెల్లుబాటు కావచ్చు కానీ యవ్వనం ఉడిగేక అసలు భార్యదే పై చేయి అవుతుంది. సమాజం, అతని కుటుంబం యొక్క మద్దతు ఆమెకే వుంటుంది. మొదటి భార్య కూతుళ్లు పెళ్లివయసుకి వచ్చేసరికి యితను హఠాత్తుగా పెద్దమనిషి తరహాగా వ్యవహరించ వలసి వస్తుంది. 'లేకపోతే నీ అల్లుడూ నీలాగే తయారవుతాడు' అని కుటుంబసభ్యులు తిడతారు. ఇక రెండో భార్య విలువ సంఘంలో మరింత దిగజారుతుంది. ఆమె పిల్లల పెళ్లికి భర్త రావడమే మహద్భాగ్యం అవుతుంది. మొదటి భార్యతో దూరంగా వుంటానని మాట యిచ్చినా, ఆమె వలన పుట్టిన పిల్లలకోసం రెండో భార్య సంపాదనను ఖర్చు చేయడానికి యితను వెనకాడడు. ఆ విధంగా వివాహితుణ్ని చేసుకోవడం ఎప్పటికైనా ముప్పే. హేమమాలినికి యిన్‌కమ్‌ టాక్స్‌ కష్టాలు వచ్చినపుడు ధర్మేంద్ర పట్టించుకోలేదు. అయితే ఆమె తెలివైనది కాబట్టి, తండ్రి, అన్నగార్ల తోడ్పాటు వుంది కాబట్టి నిలదొక్కుకోగలిగింది. 

సావిత్రి విద్యావంతురాలు కాదు. కుటుంబం సపోర్టు లేదు. బోళా మనిషి, ఉబ్బేస్తే చాలు డబ్బులిచ్చేసేది. మితిమీరిన దానధర్మాలు ఆమెను నాశనం చేశాయి. ఇన్ని దానాలు చేసినామెకు యిన్‌కమ్‌ టాక్సు కట్టాలని తోచకపోవడం చిత్రం. సరైన సమయంలో ఆమె టాక్సు చిక్కుల్లో పడి, దెబ్బ తింది.  భోగలాలసుడైన జెమినికి మూడో భార్యగా వచ్చిన సావిత్రి అతన్ని ఆకట్టుకోవడానికైనా శరీరాకృతిపై శ్రద్ధ పెట్టాల్సింది. అదీ జరగలేదు. మద్యపానం కారణంగా కారెక్టరు నటిగా కూడా పాత్రలు రావటం లేదని గుర్తించినపుడు దాన్ని తగ్గించుకోవలసింది. కానీ అదీ చేయలేదు. సావిత్రిలో మూర్ఖత్వం వుంది. హితైషులు  చెప్పినా వినేది కాదుట. తను డైరక్ట్‌ చేసిన, నిర్మించిన సినిమాలు ఫెయిలవుతున్న కళ్లు తెరుచుకోలేదు. బయటివాళ్లే వారించగా లేనిది భర్త వారించి వుండడా? శివాజీ, ఎమ్జీయార్‌ నిర్మాతలుగా మారినా జెమినీ సినీనిర్మాణం జోలికి పోలేదు. అలాటప్పుడు సావిత్రి అప్పులు చేసి సినిమాలు తీస్తూంటే హర్షిస్తాడా? తన భార్య తను చెప్పిన మాట వినలేదన్న కోపం అతనికి వుండవచ్చు. మద్యం, మత్తుపదార్థాల మత్తులో సావిత్రి జెమినీని ఏమేమి అనేదో తెలియదు. గతంలో తన దగ్గర నుంచి డబ్బు పట్టుకెళ్లిన విషయం మళ్లీ మళ్లీ గుర్తు చేసేదేమో! వచ్చి తిట్లు తినడం దేనికి, అతనికి వెళ్లడానికి చాలా యిళ్లున్నాయి. మొదటి భార్య బాబ్జీ ద్వారా ఐదుగురు కూతుళ్లు, రెండో భార్య నటీమణి, పుష్పవల్లి ద్వారా ఇంకో కూతురు హిందీ సినీనటి రేఖ వున్నారు. ఏకాకిగా మిగిలిన సావిత్రి మరింత నిరాశకు లోనైంది. 

ఆమె అనారోగ్యం పాలైనప్పుడు జెమినీ అస్సలు పట్టించుకోలేదని కొందరనుకుంటారు. అది నిజం కాదు. 1980 మేలో ఒక కన్నడ సినిమాలో చిన్న వేషం వేయడానికి ఆమె బెంగుళూరు వెళ్లి 'చాణక్య' హోటల్‌లో వుండగా రాత్రంతా భోజనం లేకుండా, విపరీతంగా మద్యం సేవించింది. బిపి, సుగర్‌ విపరీతంగా వున్నా అంతకు కొన్ని వారాలముందే ఆమె మందులు వాడడం మానేసింది. దాంతో  కోమాలోకి వెళ్లింది. ప్రయివేటు హాస్పటల్స్‌ చేర్చుకోవడానికి ఒప్పుకోలేదు. గవర్నమెంటు హాస్పటల్‌కు తీసుకెళ్లి బెడ్స్‌ లేక నేలమీద పడుక్కోబెట్టారు. ఫిల్మ్‌ యూనిట్‌ వాళ్లకు తెలిసి బెడ్‌ ఏర్పాటు చేయించారు. కానీ ఆమె కోలుకోలేదు. జెమినీ కోరిక మీద, సావిత్రి కుటుంబసభ్యుల అనుమతితో 16 రోజుల తర్వాత ఆమెను మద్రాసులోని అన్నానగర్‌ యింటికి తరలించారు. డాక్టర్ల బృందం పరీక్షించి కోమాలోంచి ఎన్నాళ్లకు కోలుకుంటుందో చెప్పలేమని అన్నారు. కోమాలోకి వెళ్లిన 596వ రోజున 1981 డిశంబరు 26 న ఆమె మరణించింది. పోయేనాటికి ఆమె వయసు 50 సం||ల లోపే. ఆమె కోమాలో వున్నపుడు జెమినీ అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్లేవాడు. స్వామీజీల చేత తాయెత్తు కట్టించడం, ఆయుర్వేదం మందులు యిప్పించడం వంటివి చేసేవాట్ట. పోయాక శవాన్ని జెమినీ యింటికి తరలించి, అక్కణ్నుంచి శ్మశానికి తీసుకెళ్లారు. ఈ విషయాలన్నీ సావిత్రి పిల్లలు అర్థం చేసుకున్నారనుకుంటాను. అందుకే తల్లి మరణం తర్వాత వాళ్లు తండ్రిని అంటిపెట్టుకున్నారు. సావిత్రి కుమార్తె తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడరు. మా వ్యవహారాలు చక్కదిద్ది, మాకు మార్గదర్శనం చేశారు. మా సవతి తల్లి పిల్లలతో మేము కలిసే వుంటాం అంటారు. సావిత్రి మరణం నాటికి  విజయకు పెళ్లయి ఎనిమిదేళ్లయింది. సతీశ్‌ పదేళ్ల చిన్నవాడు కాబట్టి తండ్రిని నమ్ముకోవాల్సి వచ్చింది అనుకున్నా, పెరిగి పెద్దవారయ్యాక కూడా తండ్రికి దూరం కాలేదు. సతీశ్‌ యింజనీరింగు చదువు బాధ్యతలు జెమినీ చూసుకున్నాట్ట. అతనికి యితర భార్యల వలన కొడుకులు లేరు. 

సావిత్రి విషాదగాథలో విలన్లు చాలామంది వున్నారు, వారిలో జెమినీ ఒకడు. ఆమె పొరపాట్లు కూడా చాలా వున్నాయని ఆవిడే చెప్పుకున్నారు. పైన ఉదహరించిన పుస్తకంలోనే రామారావుగారికి సావిత్రి యిచ్చిన యింటర్వ్యూ వేశారు - 'తెలిసీ, తెలియక చేసిన తప్పులన్నీ ఏకమై కక్ష గట్టి నన్ను పతనానికి గెంటాయి. నా మనసు చాలా సందర్భాలలో అజ్ఞానంగా మూర్ఖంగా ప్రవర్తించి నన్ను అటు మానసికంగా, భౌతికంగా పాడు చేసింది. జెమినీ ఒక్కర్నే అనుకోవాల్సిన పనేముంది? నిజానికి జెమినీ నన్ను ప్రేమించారు, బాగా చూసుకున్నారు. కొన్ని విషయాల్లో ఆయన మాటలు నేను వినలేదు. డైరక్షనే తీసుకోండి. చిన్నారి పాపలు డైరక్షన్‌ విషయం చెప్పగానే కొన్ని రోజులు సమాధానం చెప్పలేదు. ఆయన మనసులో నేను డైరక్షన్‌ చేయకూడదని వుంది. సినిమా తీద్దామని వచ్చినవాళ్లు నాకు ప్రెజర్‌ యిస్తూంటే నేను ఆయనమీద ఆయన మీద ప్రెజర్‌ యివ్వడంతో సరేనన్నారు కానీ నేను ఎలా చేస్తున్నానో చూడడం కాని, మంచిచెడ్డలు తెలుసుకోవడం కాని చెయ్యలేదు. షూటింగ్‌కు కూడా రాలేదు. నిజానికి నేను డైరక్షన్‌ చేయడం మొదటి తప్పు, నిర్మాత కావటం రెండో తప్పు. నా ఆత్మకథ చెప్పవలసి వస్తే యివన్నీ రాయాలి, నా గురించి కూడా నేను చెడ్డగా రాయాలి. జెమినీ గురించి, నన్ను మోసం చేసిన, దొంగదెబ్బ తీసిన ఎందరో వ్యక్తుల గురించి రాయాలి. మా అమ్మ తప్ప అందరూ స్వార్థంగానే ప్రవర్తించారు. ఇవన్నీ రాయడం వలన నాకు ఒరిగేదేమిటి? ' అందామె. -  (సశేషం) 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2015)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?