Advertisement

Advertisement


Home > Articles - MBS

సినీ స్నిప్పెట్స్‌: కాస్టింగ్‌ ఏజంటుగా రేలంగి

సినీ స్నిప్పెట్స్‌: కాస్టింగ్‌ ఏజంటుగా రేలంగి

హాస్యనటన అనగానే రేలంగి గుర్తుకు వస్తారు. అయితే ఆయన మొదట్లో హాస్యనటుడు కాడు. నాటకాల్లో స్త్రీపాత్రధారి, గాయకుడు. హాస్యవేషాలకు మారిన తర్వాత కూడా సినిమాల్లో నటించే ఛాన్సులు పెద్దగా రాలేదు. పుల్లయ్యగారి వద్ద రకరకాలు పనులు చేస్తూ కొత్త నటీనటుల్ని సెలక్టు చేసే కాస్టింగ్‌ ఏజంటుగా పనిచేశాడు. ఇలా ఏడాది, రెండేళ్లూ కాదు, పదిహేనేళ్లు చేశాడు. ఆ తర్వాతే ఆయన టాలెంట్‌ బయటకు వచ్చింది. రేలంగి తండ్రి కాకినాడలో సంగీతం మేస్టారు. హరికథలు చెప్పేవారు, హార్మోనియాలు బాగు చేసేవారు. ఆదాయం తక్కువ. ఆయనకు యిష్టం లేకపోయినా రేలంగి పదవ యేట కాకినాడలోని 'యంగ్‌ మెన్స్‌ హ్యాపీ క్లబ్‌'లో చేరి నాటకాలు వేసేవాడు. తండ్రి చదువుకోమని మొత్తుకున్నా తొమ్మిదో క్లాసు దాటలేదు. నాటక సమాజంలో ఆడవేషాలు వేస్తూ, ఆ ట్రూపుతో నాలుగేళ్లు వూరూరూ తిరిగేవాడు. ఆంధ్ర బాలగాన సంఘం వాళ్లు ఓ హాస్యగాడి పాత్ర యిచ్చి చేయమన్నారు. అంతవరకూ మగపాత్రలు వేయకపోవడం, హాస్యం అభినయించక పోవడం చేత రేలంగికి తన సత్తా తెలియదు. కానీ మంచి రెస్పాన్సు రావడంతో ధైర్యం వచ్చింది. నాట్యమిత్ర మండలి అనే నాటకసంస్థను సొంతంగా మొదలుపెట్టాడు. తెనాలిలో నాటక ప్రదర్శన. స్త్రీ పాత్రల కోసం చీరలు కావాలి. తల్లికి తెలియకుండా నాలుగు చీరలు ఎత్తుకుని వెళ్లి నాటకం ప్రదర్శించాడు. ప్రదర్శన తర్వాత యింటికి వెళ్లడానికి మొహం చెల్లలేదు. తెగిన గాలిపటంలా ఒక వూరుగాని, స్థిరనివాసం గాని లేకుండా కొన్నాళ్లు తిరిగాడు. పారుపల్లి సుబ్బారావు గారి ట్రూపులో చేరి మంచి హాస్యపాత్రలు వేసి పేరు తెచ్చుకున్నాడు. అక్కడే పరదేశి అనే తబలిస్టు తారసిల్లి రేలంగి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాడు. రేలంగికి ఆయన మాటపై గురి. 

పారుపల్లి ట్రూపులో వుండగానే రేలంగిని మూకీ సినిమాలు ఆకర్షించాయి. ఒక నాటకాన్ని గ్రామఫోనుగా విడుదల చేయడానికి బెంగుళూరు వెళ్లినపుడు తొలి టాకీ ''భక్త ప్రహ్లాద'' చూశాడు.  సినిమాల్లోనే నటించాలనే మోజు పెరిగింది. పరదేశి ఉపదేశంలో రేలంగి యింటికి తిరిగి వెళ్లాడు. పెళ్లి చేస్తే కుదురు వస్తుందనుకుని తలిదండ్రులు 1933 డిసెంబరులో పెళ్లి చేశారు. కొన్నాళ్లకు పరదేశికి సినిమా ఛాన్సు తగిలింది. కాకినాడ వాస్తవ్యులే అయిన సి.పుల్లయ్యగారు ''లవకుశ'' సినిమా కలకత్తాలో తీస్తూ పరదేశిని రమ్మనమని పిలిచారు. తనూ వస్తానన్నాడు రేలంగి. 'నేను వెళ్లి సెటిలవనీ, నిన్ను పిలుస్తాను' అన్నాడు పరదేశి. కొన్ని రోజులకు కలకత్తాలో ''కృష్ణతులాభారం'' సినిమా తీద్దామని ఏర్పాట్లు జరిగాయి. దానిలో వసంతకుడు పాత్ర వేయడానికి జోగినాథం అనే మంచి హాస్యనటుణ్ని ఎంచుకున్నాడు. యంగ్‌మెన్స్‌ హ్యాపీ క్లబ్‌ నిర్వాహకుల్లో ఒకడైన ఆయన సున్నితమైన హాస్యానికి పెట్టింది పేరు. రేలంగి ఆయనకు శిష్యుడు. జోగినాథంతో బాటు, హార్మోనిస్టు దూసి శాస్త్రి, డైరక్టరు రాజారావు కలకత్తా బయలుదేరారు. రేలంగిని రమ్మనమన్న వారెవరూ లేరు. అయినా ధైర్యం చేశాడు. అక్కడికి వెళితే ఏదో ఒకటి చేయవచ్చులే అనే ధైర్యంతో వాళ్లతో పాటు రైలెక్కేశాడు. వెళ్లే ముందు తలిదండ్రులకు, భార్యకు నచ్చచెప్పాడు. 

కలకత్తాలో దిగాక నిర్మాత వద్దకు వెళ్లి వేషం కోసం అడిగాడు. ఆయన ఎగాదిగా చూసి 'సరే, ఏదైనా వుంటే చూస్తాంలే' అన్నాడు. 'సినిమా పూర్తయేవరకు యిక్కడే వుండు, నాలుగు నెలలు పడుతుంది. తిండీ, బస మాదే. మేం వెయ్యమన్న వేషాలన్నీ వెయ్యాలి. చివర్లో డెబ్భయ్‌ రూపాయలిస్తాం.'' అన్నారు కాస్సేపటికి. రేలంగి సరే అన్నాడు. చివరకు మూడు పాత్రలు యిచ్చాడు. వసుదేవుడు, చాకలివాడు, గొల్లవాడు.. మూడూ తెరపై ఒక్క క్షణం కనిపించే పాత్రలే. చివర్లో 70 రూ.లిచ్చారు. ఆ రోజుల్లో తులం బంగారం పదమూడు రూ.లు, రూపాయికి పదిశేర్లు బియ్యం దొరికేది. రేలంగి తండ్రి జీతం నెలకు 10 రూ.లు. ఆ విధంగా చూస్తే యీ 70 రూ.ల విలువ ఎంతో వూహించవచ్చు. సినిమా ఫెయిలయింది. రేలంగి పాత్రలకు గుర్తింపు రాలేదు. మరే అవకాశమూ  రాలేదు. ఇంటికి వచ్చేసి డబ్బు యింట్లో యిచ్చి, మళ్లీ నాటకాల్లో వేషాలు వేయసాగాడు.

పరదేశికి ఛాన్సు దొరికిన ''లవకుశ'' హిట్టయింది. పుల్లయ్యగారు తన తర్వాతి సినిమా ''అనసూయ-ధ్రువ విజయం''కు మళ్లీ కలకత్తా రమ్మనమని పిలిచారు. పరదేశి యీ సారి రేలంగిని వెంటపెట్టుకుని వెళ్లి పుల్లయ్యగారికి పరిచయం చేశాడు. ఆయన రేలంగిని ఆడ్‌-జాబ్స్‌ మ్యాన్‌గా పెట్టుకున్నారు. ప్రొడక్షన్‌ మేనేజర్‌గా, కాస్టింగ్‌ ఏజంటుగా.. చిత్రనిర్మాణంలో ఏం పని చెపితే అది చేయడమంతే. అది కాకుండా వేషాలు కూడా వేయమనేవారు. జీతం నెలకు రూ.30. రెణ్నెళ్లు పోయేసరికి రూ.40 అయింది. రేలంగి చేయని పని లేదు. సినిమాలో చాలామంది పిల్లలు వేసేవారు. వాళ్లందరినీ సినిమాలకీ, షికార్లకీ తీసుకుని వెళ్లేవాడు. పుల్లయ్యగారికి రేలంగి బాగా నచ్చాడు. రెండేళ్లు పోయేసరికి నెల జీతం రూ.100 చేశారు. ఆయన వద్ద ''వరవిక్రయం'', ''మాలతీమాధవం'', ''మోహినీ భస్మాసుర'', ''శ్రీ సత్యనారాయణ'', ''బాలనాగమ్మ'', ''గొల్లభామ'' సినిమాలకు పనిచేస్తూ వాటిల్లో వేషాలు కూడా వేశాడు. కాస్టింగ్‌ ఏజంటు కావడం వలన ఎందరెందరో నూతన నటీనటులు ఆయన చేతి మీదుగా సినిమాలలోకి వచ్చారు. వాళ్లలో కృష్ణవేణి, పుష్పవల్లి, హైమవతి, భానుమతి, అంజలీదేవి.. యిలా ఎందరో వున్నారు. వాళ్లు తర్వాతి రోజుల్లో పెద్ద తారలై, సినీనిర్మాతలై రేలంగికి తమ సినిమాల్లో మంచి వేషాలిచ్చారు. 

''గొల్లభామ'' (1947) తర్వాత రేలంగి కాకినాడ వెళ్లిపోవలసి వచ్చింది. ఏం చేయాలో తెలియక కొన్నాళ్లు కొట్టుమిట్టులాడి, చివరకు కుటుంబంతో సహా మద్రాసు చేరాడు. అక్కడ డబ్బు లేక చాలా అవస్థలు పడ్డాడు. తిండికి అలమటించాడు. వేషాలు పెద్దగా రాలేదు. కారణమేమిటో యీ విశేషాలన్నీ ''హాస్యనటచక్రవర్తి రేలంగి'' పుస్తకంలో రాసిన రచయిత టి.ఎస్‌. జగన్మోహన్‌ చెప్పారు  - ''అతని నాలుక మందం కావడంతో వాచికం సరిగ్గా వుండేది కాదు. నాటకాలలో చేంతాడంత డైలాగులనూ, పద్యాలనూ తనకి అనుగుణంగా అర్థం చెడకుండా విరిచి, చెప్పేవాడు, పాడేవాడు. మాటల లోటును ఆంగికాభినయంతో భర్తీ చేసుకుని జనాలని బాగా అలరించేవాడు.'' రేలంగి ఒక సినిమాలో డైలాగు కొరుకుడు పడక తడబడితే డైరక్టరు 'నువ్వు సినిమాలకి పనికిరావ'ని తిరస్కరించి, కించపరిచాడు. ''స్వయంప్రభ'' సినిమాలో రేలంగిని బుక్‌ చేసి, అతన్ని తీసేసి ఆ స్థానంలో శివరావును తీసుకున్నారు. 

ఆ టైములో ''వింధ్యరాణి'' (1948)లో హాస్యపాత్ర ఛాన్సు వచ్చింది. 300 రూ.లిచ్చారు. కృష్ణవేణి నిర్మాతగా మారి తీసిన ''కీలుగుఱ్ఱం''లో కనకం సరసన ఓ హాస్యపాత్ర యిచ్చి మరో 300 యిచ్చారు. బండి కాస్త ముందుకు సాగింది. కీలుగుఱ్ఱం హిట్‌ అయింది కానీ వింధ్యరాణి ఫెయిలయింది. కానీ ఆ సినిమాలో అతని నటన గురించి విన్న కెవి రెడ్డిగారు తన ''గుణసుందరి కథ''లో  మంచి వేషం యిచ్చారు. అది సూపర్‌ డూపర్‌ హిట్‌. ఇక అప్పణ్నుంచి రేలంగి వెనక్కి చూడలేదు. ఈ విషయాలన్నీ చెపుతూ రేలంగి ''నాలో వున్న టాలెంట్‌ వున్నా, అది బయట పడడానికి, జనాలకు తెలియడానికి పదిహేను, పదహారేళ్లు పట్టింది. దేనికైనా టైము రావాలి. టైము వచ్చిందంటే యిక దేనికీ టైముండదు.'' అనేవారు.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?