Advertisement

Advertisement


Home > Articles - MBS

సినీ స్నిప్పెట్స్‌: గురువు ముంచిన శిష్యుడు

''గురువును మించిన శిష్యుడు'' - ఈ సామెత వినగానే తెలుగువాళ్లకు గుర్తుకు వచ్చేది ఓ జానపద సినిమాయే! వెనువెంటనే దాని హీరో కాంతారావూ, దాని దర్శకుడు విఠలాచార్యానూ. కాంతారావు యింటిపేరు ఏమిటో తెలుసా? అని అడిగితే నూటికి తొంభైమంది 'కె' అంటే 'కత్తియుద్ధాల' అంటారు. ఆయన జేమ్స్‌బాండ్‌ టైపులో ''గుండలు తీసిన మొనగాడు'' అని సినిమా తీశాడని చెప్తే ఓ మిత్రుడు 'కాంతారావు దీనిలో రివాల్వర్‌ తీశాడా? దూశాడా?' అని అడిగాడు ఓ మిత్రుడు. కత్తి దూసిన కాంతారావు చేతులు మరోలా పనిచేయవని అతగాడి అభిప్రాయం. మనకు అగ్రహీరోలు ఎందరున్నా మన పొరుగు రాష్ట్రాలలో గ్రామాల్లో కూడా తెలిసినది మాత్రం కాంతారావు ఒక్కడే! ఎందుకంటే జానపదాలను అతి సులభంగా డబ్‌ చేసి తమిళంలో, కన్నడంలో రిలీజ్‌ చేసేవారు. అవి అక్కడి 'బి', 'సి' సెంటర్లలో ఝామ్మని ఆడేసేవి. నగరాల్లో అయితే థియేటర్ల కొరతగానీ పల్లెటూళ్లలో ఏముంది? అందునా యిలాటి మాయలు, కత్తియుద్ధాలకు పరవశించని పాటకజనం ఏ ప్రాంతంలో లేరు కనక?

జానపదాలతో యింత మమేమకమైన కాంతారావు పాపం సినిమాల్లోకి వచ్చినపుడు కత్తి చేత ధరించి రాలేదు. ఏ వేషం వస్తే ఆ వేషమే వేద్దామని వచ్చారు. అదృష్టం కొద్దీ ఎచ్‌.ఎమ్‌.రెడ్డిగారి కంటపడి ''ప్రతిజ్ఞ''లో హీరోవేషం దక్కింది. ఆ సినిమా హిట్‌ అయినా యితనికి ఎటువంటి ఛాన్సులూ రాలేదు. ఆ సమయంలో విఠలాచార్య ''కన్యాదానం'' (1953) అనే సాంఘిక సినిమా తీస్తూ యితన్ని హీరోగా తీసుకున్నారు. ఆ సినిమా ఘోరంగా ఫ్లాపయింది. వారమైనా ఆడిందంటే దానికి కారణం దానిలో సియస్‌ఆర్‌ నటన (యీ విషయం కాంతారావే చెప్పుకున్నారు). ఇక బిచాణా కట్టేద్దామనుకుంటూంటే గుమ్మడి సిఫార్సుమీద రామారావు ''జయసింహ'' లో హీరో తమ్ముడి పాత్ర యిచ్చారు. అది హిట్‌ అయింది. ఆ తర్వాత ఆరేడు సినిమాలు వచ్చినా చెప్పుకోదగ్గ బ్రేక్‌ రాలేదు. ఇలాటి సమయంలో విఠలాచార్య వచ్చి ''రూటు మార్చి జానపదచిత్రం ''జయ విజయ'' (1959) సినిమా తీద్దామనుకుంటున్నాను. కైకాల సత్యనారాయణ అని అతను కూడా వచ్చాడు. మీ యిద్దరి జాతకాలూ చూసి ఏది సరిపోతుందో దాన్ని బట్టి వాళ్లని హీరోగా చేస్తాను.'' అన్నారు. ఈయన జాతకం నప్పినట్టుంది, యీయన్నే హీరోగా చేసి ఆ సినిమా తీసి విజయాన్ని చవిచూశారు. ఇక అక్కణ్నుంచి కాంతారావు - విఠలాచార్య - జానపదాలు కాంబినేషన్‌ హిట్‌లమీద హిట్లు కొట్టింది. కాంతారావుకు ఒక ఐడెంటిటీ ప్రసాదించింది. అందుకే కాంతారావు తన ఆత్మకథ మొదట్లోనే విఠలాచార్యకు కృతజ్ఞతాంజలి సమర్పించారు. 

ఇక్కడివరకు మనందరికీ తెలిసున్న కథే. అయితే తన ఆత్మకథలో కాంతారావు విఠలాచార్యలో మరొక కోణాన్ని కూడా మనకు చూపారు. విఠలాచార్య అంటే 'లో బజెట్‌' సినిమాలని, హీరో కాల్‌షీట్‌కి రాకపోతే శాపవశాన చిలుకగా మారినట్టు చూపించి, చిలుకతో కథ నడిపించేస్తాడని మనం జోకులేసుకుంటాం కదా. దానిలో మనకు తోచని విషాదం ఒకటుంది. ఆయన కాంతారావుకి పదివేల రూపాయల పారితోషికం యిచ్చేవాడు. సినిమా హిట్‌ అయి తనెంత గడించినా కాంతారావు రేటు అంతకంటె పెరగకుండా, అతని స్థాయి పెరగకుండా చూసేవాడుట. డూండీగారు ''విజయసింహ'' ''వీరాభిమన్యు'', ''జ్వాలాదీప రహస్యం'' సినిమాలు మూడూ ఒకేసారి ప్లాను చేసి మూడిటిల్లోనూ కాంతారావును బుక్‌ చేయబోయారు.ఈయన ఒక్కో సినిమాకు పదిహేను వేల చొప్పున అడిగాడు.  డూండీ సరేనంటూండగానే విఠలాచార్య రంగప్రవేశం చేసి ''కాంతారావుకి పదివేల కంటె ఎక్కువ యిచ్చి కొండమీదకి ఎక్కించవద్దు. మాలాటి చిన్ననిర్మాతలకు అందుబాటులోకి లేకుండా పోతాడు'' అని రగడ మొదలెట్టాడు. నిర్మాతల మండలికి ఫిర్యాదు చేస్తానని డూండీని బెదిరించి, 'నీకు పదివేలకు మించి పైసా యివ్వకుండా నేను చూస్తాను' అని కాంతారావుతో సవాల్‌ చేశాడు.

డూండీకి ఏం చేయాలో పాలుపోలేదు. చివరకి 'కాంతారావు గారూ! మీరడిగినంతా యిస్తాను కానీ యీ విషయం ఎక్కడా పొక్కనీయరాదు.' అని గట్టిగా చెప్పి డబ్బు యిచ్చారు. విఠలాచార్యకు అనుమానం వచ్చింది. ''జ్వాలాదీప రహస్యం'' సినిమాకు ఆయనే దర్శకుడు. కాంతారావును పుల్లవిరుపు మాటలతో హింసించడం మొదలెట్టాడు. ''ఒకేసారి మూడు సినిమాలకు ఒప్పుకున్నావ్‌. ఏం అంతబాగా నచ్చారా వాళ్లు?'' అని ఎత్తిపొడుపులతో మాటలతో గుచ్చి గుచ్చి వదిలేసరికి కాంతారావుకి ఉక్రోషం  వచ్చి ''నా విలువ వాళ్లు గుర్తించారు చూడండి'' అంటూ తమ అగ్రిమెంటు పేపరును ఆయన కళ్లముందు ఆడించాడు. వెంటనే విఠలాచార్య రాజనాలలా నవ్వి ''పట్టేశా!'' అన్నాడు. విషయం డూండీకి తెలియగానే ''కాంతారావుగారూ, మీరు మాట తప్పి నా డైరక్టరుతో నాకు పేచీ తెచ్చిపెట్టారు. మిమ్మల్ని యికపై నేను తీసే సినిమాల్లో తీసుకోను.'' అని చెప్పేశారు. 

కాంతారావు పురోగమనం పట్ల విఠలాచార్యలో రగిలిన అసూయకు పరాకాష్ట కాంతారావు గృహప్రవేశం రోజు ఆయన ప్రవర్తన. టి నగర్‌లో, మంచి లొకాలిటీలో 1964 ప్రాంతాల్లో మూడు లక్షల విలువ చేసే యిల్లు కట్టుకున్నాడీయన. విఠలాచార్యకు అది రుచించలేదు. అప్పుడాయన కాంతారావుతో ''నవగ్రహపూజా మహిమ'' (1964) సినిమా తీస్తున్నాడు. శని ఆగ్రహానికి గురయిన రాజు కథ అది. తెరమీద తిప్పలు పడ్డట్టు చూపించాలంటూ షూటింగులో కూడా నానా హింసలూ పెట్టేశాడు. కాకి చేత తల తన్నించి, మట్టిలో పొర్లించి.. యిలా. అదేమిటండీ అంటే ''డబ్బిస్తున్నాం, నువ్వు వేసి తీరాల్సిందే'' అని నిర్బంధించాడు. ఈయన శాడిజాన్ని గ్రహించిన కాంతారావు ఆయన్ని గృహప్రవేశానికి పిలుద్దామా వద్దానని సందేహిస్తూనే వెళ్లి పిలిచారు. 

ఆయన వెంటనే ''అవేళ షూటింగ్‌ పెట్టుకున్నాను. మీ పూజ పొద్దున్న కదా, రిసెప్షన్‌ సాయంత్రం కదా.. మధ్యలో మూడు, నాలుగు గంటల షూటింగు చేద్దురు గాని రండి. సాయంత్రం ఆరు కల్లా పంపేస్తాను.'' అన్నాడు. అదేమిటండీ అని అడ్డు చెప్పబోతే ''బావి ఒకటి తవ్వించాను. మర్నాటిదాకా వుంచితే అద్దె పెరిగిపోతుంది. మీకు ఫ్రిజ్‌ ఒకటి బహుమతిగా యిస్తాను లెండి' అన్నాడు. (సినిమా హిట్‌ అయింది కానీ యీయన ఫ్రిజ్‌ మాత్రం కాంతారావు యింటికి ఎప్పటికీ చేరలేదు) వృత్తిధర్మం కదాని యీయన పూజ కాగానే షూటింగుకి వెళ్లాడు. రాజు బావిలో పడిన దృశ్యం షూటింగంటూ చింకిగుడ్డలు కట్టించి, మురికినీళ్లు నింపిన గోతిలో యితన్ని దింపాడు. బుట్టలతో పాములు కురిపించాడు, డబ్బాలతో తేళ్లు గుమ్మరించాడు. దుమ్మూ, ధూళీ, ఎండుటాకులు మీద వర్షింపజేశాడు. ఇలా హింసించి, హింసించి రాత్రి పదకొండు గంటలకు వదిలిపెట్టాడు. అప్పటికి యీయన సన్నిహితులు తప్ప ఫంక్షన్‌కి వచ్చిన తక్కినవాళ్లందరూ వెళ్లిపోయారు. కాంతారావు చాలా వేదన అనుభవించారు. 

ఎందుకిలా జరుగుతుంది? గాడ్‌ఫాదర్‌ వంటి విఠలాచార్య కాంతారావు పట్ల యిలా ప్రవర్తించడం ఏమిటని అనిపిస్తుంది కదా. ఒక్కోప్పుడు తలిదండ్రులతో సంతానం పట్ల అసూయ పెంచుకోవడం లోకంలో చూస్తూంటాం. కథకు ముక్తాయింపు ఏమిటంటే - కొన్నాళ్లకి విఠలాచార్య తక్కినవాళ్లతో సినిమాలు తీసి ఆర్థికంగా దెబ్బతిని, కాంతారావు వద్దకు వచ్చి ''అగ్గిదొర (1967) ప్లాను చేస్తున్నాను. చేసిపెట్టాలి.'' అని అర్థిస్తే యీయన కాదనలేకపోయాడు. ఆ సినిమా తెలుగులోనే కాదు, తమిళడబ్బింగ్‌లో కూడా బాగా హిట్‌ అయి విఠలాచార్యకు కాసులు కురిపించింది.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2016) 

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?