Advertisement

Advertisement


Home > Articles - MBS

సినీ స్నిప్పెట్స్‌: షూటింగు స్పాట్‌లో భోజనాలు

సినీ స్నిప్పెట్స్‌: షూటింగు స్పాట్‌లో భోజనాలు

తెర ముందు రంగురంగుల ప్రపంచాన్ని ఆవిష్కరించే సినిమా రంగంలో తెర వెనుక చాలామంది అవస్థలు పడుతూ వుంటారు. వాటిలో ఒకటి, షూటింగు టైములో భోజనాల అవస్థ. అగ్రతారాగణానికి, చీఫ్‌ టెక్నీషియన్లకు బాగానే పెట్టినా, తక్కినవారు సరైన తిండి లేక అవస్థపడేవారు. ఇప్పుడిప్పుడు పరిస్థితి చాలా మెరుగుపడి వుండవచ్చు కానీ గతంలో యీ విషయమై యిబ్బంది పడిన వారెందరో వున్నారు. 'అందరికీ బాగా భోజనాలు పెట్టే నిర్మాత' అని కొందరి గురించే చెప్పుకుంటారంటేనే అర్థమవుతుంది - తక్కినవారందరూ అరకొరగా పెడతారని. నిర్మాతల స్థాయి బట్టి భోజనాల నాణ్యత ఆధారపడుతుంది. లో బజెట్‌ పేరుతో వర్కర్లకు, జూనియర్‌ ఆర్టిస్టులకు, జూనియర్‌ టెక్నీషియన్లకు ఇడ్లీ సాంబార్లతో సరిపెడదామని కొందరు చూస్తారు. డబ్బున్న నిర్మాతల్లో కూడా అందర్నీ సమానంగా చూడాలనే భావన కలగదు. ఈ విషయం గురించి ముళ్లపూడి వెంకటరమణగారు ''(ఇం)కోతికొమ్మచ్చి''లో తన అనుభవం రాశారు. 

ఆయనా, బాపు, ఎన్‌ఎస్‌ మూర్తిగారు కలిసి ''సంపూర్ణ రామాయణం'' (1972) తీసే రోజుల్లో ఆయన రావణ పాత్రధారి రంగారావుగారి మేకప్‌ రూమ్‌కు వెళ్లారు. ఆయన టేబులు మీద పరిచి వున్న టిఫెన్లు - ఇడ్లీ, వడ, సాంబారు, చికెన్‌, మటన్‌, ఫిష్‌, ఉల్లిపాయలు, కిళ్లీలు, చూయింగ్‌గమ్‌ పాకెట్లు, సిగరెట్టు డబ్బా, అగ్గిపెట్టెలు! మాయాబజారులో వివాహ భోజనంబు సీను గుర్తుకు వచ్చి యీయన వాటి కేసి ఆశ్చర్యంగా చూస్తూ వుంటే రంగారావుకి కూడా ఏం తోచిందో ఏమో తన మేకప్‌మాన్‌ను పిలిచి ''ఏమిటిదంతా గలీజుగా..'' అని అడిగారు. అతను బెదరలేదు, ఆశ్చర్యపడలేదు. ''ఇదండీ - ఇడ్లీ గిడ్లీ వడా గిడా - యిదంతా నాన్‌వెజ్‌ - బిలాల్‌ నుంచి మటన్‌, బుహారీ నుంచి చికెన్‌ 65, కొరమీనూ..'' అలా చెప్తూనే పోయాడు. 

''ఇవన్నీ నేను తినడానికే?'' 

''మీ తరవాత మాక్కూడానండి..''

ఇదే జరుగుతుంది. రంగారావు పేరు చెప్పగానే నిర్మాత నోరెత్తడు. ఆయన పేరు చెప్పి తక్కినవాళ్లు తినేస్తారు. నటుడు పట్టించుకోడు. ఓ సారి నిర్మాత పుండరీకాక్షయ్య చెప్పారు - ఆయన ఒక సినిమాలో రాజనాలను బుక్‌ చేస్తూ 'మీరు షూటింగు టైములో రోజుకి ఎన్ని సిగరెట్టు పాకెట్లు కాలుస్తారు?' అని అడిగారు. 

''సుమారుగా రెండు పాకెట్లు. అయినా ఎందుకడిగారు?''  

''మా సినిమాలో మీకు పది రోజుల పని. అంటే యిరవై పాకెట్లు. పోనీ పాతిక. మీరు తాగే బ్రాండ్‌ ఫలానా. పాకెట్టు రేటు యింత. దాని ప్రకారం పాతిక పాకెట్లకు యిదిగో డబ్బు.'' అని చేతికిచ్చారట. రాజనాల ఆశ్చర్యపడి ''డబ్బెందుకు? స్పాట్‌లో సిగరెట్లు పెడితే పోయె కదా'' అన్నారట. ''పెడితే తక్కినవాళ్లు కాల్చేస్తారు. రాజనాల గారికి గెస్టులు వచ్చారండీ, అంతా కలిసి ఏభై పాకెట్లు కాల్చారండి అని ప్రొడక్షన్‌ వాళ్లు నా దగ్గర బిల్లు పెడతారు. అవునా అని నేను మిమ్మల్ని అడగలేను. అందుకని యీ పద్ధతి.'' అన్నారట పుండరీకాక్షయ్య. 

ఎందుకీ జాగ్రత్త అంటే సిగరెట్టు పాకెట్ల దగ్గర హీరోలు చాలా ప్రిస్టేజి ఫీలవుతారు. తమకై తెప్పించినది యితరులు వాడేసుకున్నారంటే సహించరు. రమణ గారు ''కోతికొమ్మచ్చి''లో  ఎన్టీయార్‌తో జరిగిన సంఘటన రాశారు. ''గుడిగంటలు'' సినిమాలో హీరో హెవీ స్మోకర్‌. నిట్టూర్పుకో సిగరెట్టు కాల్చాలి. అందువలన రోజుకి రెండు డబ్బాలు - పొద్దున్న తొమ్మిదికి, మధ్యాహ్నం రెండింటికి - రెడీ చేసేవారు. హీరోగా వేసిన ఎన్టీయార్‌ మామూలుగా సిగరెట్లు కాల్చకపోయినా సినిమాలో వేషం సిగరెట్లు కాల్చేదయితే రోజుకి రెండు డబ్బాలు - అతి ఖరీదైన స్టేట్‌ ఎక్స్‌ప్రెస్‌ 555, డబ్బాకు 50 వుంటాయి - ఊదేసేవారు. ఓ రోజు షూటింగులో మధ్యాహ్నం భోజనాలయాక విశ్రాంతిగా కూర్చుని నిర్మాత డూండీ, రమణగారు కూర్చుని సిగరెట్లు తాగుదామనుకున్నారు. ఇద్దరి దగ్గరా సిగరెట్లు లేవు. ''హీరోగారికై పెట్టిన టిన్ను పట్టుకుని రా'' అని డూండీ తెప్పించి కొత్త డబ్బా తెరిచి ఆయనోటి తీసుకుని, రమణగారికి మరొకటి యిచ్చి డబ్బా వెనక్కి పంపేశారు.

రెండయింది. ఎన్టీయార్‌ మేకప్‌ రూముకి వచ్చారు. కాస్సేపటికే మేకప్‌మన్‌ బయటకు పరుగున వచ్చి ''సార్‌, హీరోగారి సిగరెట్టు డబ్బా ఎవరో ఓపెన్‌ చేశారు. రెండు సిగరెట్లు మిస్సింగు. అయ్యగారు ఫైరై పోతున్నారు.'' అన్నాడు. ''మేమే అని చెప్పు'' అని డూండీ చెప్పి పంపించేరు. గోడకేసి కొట్టిన బంతిలా అతను వెనక్కి వచ్చి ''ఫుల్‌ టిన్‌ పంపితే కానీ సెట్‌కు రారటండి.'' అని చెప్పి వెళ్లిపోయాడు. ఇంకో టిన్ను స్టాకు లేదు. ప్రొడక్షన్‌ మేనేజరు కారేసుకుని వెతకబోయాడు. దగ్గర్లో వున్న దుకాణంలో దొరకలేదు. చివరకు ఆరుమైళ్ల అవతలున్న మార్కెట్‌కు వెళ్లి తెచ్చేసరికి నాలుగైంది. రెండు గంటల షూటింగు వేస్టు. 

ఇచ్చినది డూండీ గారే అయినా తనూ సిగరెట్టు కాల్చి ఎన్టీయార్‌ కోపానికి కారకుడైనందుకు రమణగారు వెళ్లి సారీ చెప్పారు. ఆయన పకపక నవ్వాడు - ''సిగరెట్టు కోసం కాదు బ్రదర్‌! డిసిప్లిన్‌ - ప్రిన్సిపుల్‌ - రేపు నేను తప్పు చేసినా - య్యస్‌ య్యస్‌ - యు కెన్‌ కొశ్చన్‌ మీ'' అన్నాడు. ఆ పూట షాట్‌లో రెండే రెంటు సిగరెట్లు కాల్చి డబ్బాలోని 48 అలాగే వుంచి డూండీని పిలిచి తిరిగి చేతికిచ్చి ''సారీ బ్రదర్‌ - ఏమనుకోకు'' అన్నాడు. డూండీ లాటి పెద్ద నిర్మాతకు కూడా అగచాట్లు తప్పలేదు. అందుకే పుండరీకాక్షయ్య జాగ్రత్త పడ్డారు.

మళ్లీ రంగారావు గారి దగ్గరకు వస్తే - ఆయన మేకప్‌మన్‌ చెప్పిన తిండి ఐటమ్స్‌ గురించి విని ''అవన్నీ సరే - బల్లమీద యీ చూయింగ్‌ గమ్‌ పాకెట్లు ఏంట్రా?''

''అయన్నీ ఫస్టుఫస్టు కత్తుల రత్తయ్య ఫిలిం టైములో తెప్పించామండి - అయ్యే కంటిన్యూ అయిపోతున్నాయండి'' అన్నాడు మేకప్‌మన్‌ నిదానంగా నిశ్చలంగా నిర్వికారంగా. 

ఇదీ ఓ తమాషా. ఎప్పుడో కత్తుల రత్తయ్య వేషానికి కావాలని చూయింగ్‌ గమ్స్‌ తెప్పించారు. ఇక అప్పణ్నుంచి ఏ వేషం వేసినా అవసరం వున్నా లేకపోయినా యివి తెప్పించాల్సిందే అని ఆయన అసిస్టెంట్లు నిర్మాత దగ్గర చెవులు పిండి తెప్పించుకుంటున్నారన్నమాట. పెద్ద నటుడి పేరు చెప్పగానే నిర్మాత కిక్కురుమనడు. చాలా విషయాలు నటుడికి కూడా తెలియకుండా జరిగిపోతూ వుంటాయి. అవేళ రమణగారి ఎదుట యిదంతా తెలిసి వచ్చాక ఆయన బయటకు వెళ్లిపోయాక రంగారావు మేకప్‌మన్‌ను ఏమిటీ వేస్టేజి అంటూ మందలించారు. అతను రమణగారి దగ్గరకు వచ్చి ''పొరబాటేంటండి?'' అన్నాడు కామ్‌గా.

''చూడు - మేం గొప్ప ప్రొడ్యూసర్లం కాము. రంగారావుగారి టిఫెను అయ్యాక మీరంతా డైనింగు హాల్లోకి వచ్చి టిఫిను తినవచ్చు - అందరికీ పెట్టే టిఫిను - మీకూ పెట్టగలం. నాన్‌వెజ్‌ కూడా వడ్డిస్తారు - కావలసినంత, తినగలిగినంత. కానీ అది మధ్యాహ్నం లంచికే.'' అని చెప్పారు. 

అది నిర్మాతల్లో ఒకరైన ఎన్‌ఎస్‌ మూర్తి విన్నారు. బాపురమణలు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ సమానంగా మంచి టిఫెన్లు, భోజనాలు పెట్టేస్తున్నారన్న దుగ్ధ ఆయనకు అప్పటికే వుంది. ఇప్పుడు సమయం వచ్చింది కదాని ''అదే నే జెప్పేది - కొంచెం స్ట్రిక్టుగా ఉండాలి - ఇదే కాదు - మధ్యాన్నాలు నాన్‌వెజ్‌, సాయంకాలాలు స్వీట్సు కూడా కట్‌ చేస్తే బెటరు. ఈ వర్కర్లందరూ యిళ్ల దగ్గర రోజూ స్వీట్లు తింటారా ఏం?'' అన్నారు. ''రోజూ తినరు కాబట్టే యిక్కడ మనం పెట్టాలి.'' అన్నారు రమణ. ''అలా అయితే పెద్దవాళ్లు ఓ పదిమందికి పెట్టండి. యీ చిన్నాళ్లందరికీ ఏల - అదీ నే జెప్పేది'' అని ఆయన గోల. 

''సార్‌ - పెద్దాళ్లకు అరగదు, చిన్నాళ్లకు దొరకదు. పదేసి బియ్యం బస్తాల బరువుండే లైట్లు మోస్తారు, మొహాలు బద్దలుగొట్టే వేడిలో పనిచేస్తారు.'' అని రమణగారు కచ్చితంగా చెప్పారు. ఆయనకు ఆకలి విలువ తెలుసు. అందుకే అదే సినిమా షూటింగు టైములో ఓ రోజు రంగారావు గారు ''నేను ఎక్కడికో వెళ్లాలి, రేపు మధ్యాన్నం లంచవరు లేకుండా యివాళ మిగిలిన వర్కు లాగించేద్దాం'' అని సూచిస్తే ''కడుపు నిండిన మీకు లంచి మానడం పెద్ద విషయం కాదు. కాని చిన్నవాళ్లంతా ఆకలికి తట్టుకోలేరు. అనవసరంగా భోజనం మానేసి పనిచెయ్యరు.'' అని నిర్మొహమాటంగా చెప్పేశారు.

నిర్మాతలకు యిటువంటి విశాలదృష్టి వున్నా సరిపోదు. ప్రొడక్షన్‌ మేనేజర్లు కూడా సవ్యమైనవాళ్లు వుండాలి. ''నవ్విపోదురు గాక..'' పేరుతో ఆత్మకథలో ప్రఖ్యాత నిర్మాత మురారి తను అసిస్టెంటు డైరక్టరుగా వున్న రోజుల్లో ఆకలికి మాడిన సందర్భం రాశారు. పెద్ద నిర్మాణ సంస్థ అయిన వీనస్‌ వారు ''మంచివాడు'' (1974) సినిమాను వి మధుసూదనరావు దర్శకత్వంలో ఎయన్నార్‌తో తీస్తున్నారు. మద్రాసు శివారులోని కుండ్రత్తూరులో కొండ మీద ఔట్‌డోర్‌ షూటింగ్‌. అక్కినేని, కాంచన, వాణిశ్రీలతో సన్నివేశం. అసిస్టెంటు డైరక్టర్లుగా వున్న మురారి, కోదండరామిరెడ్డి పొద్దున్నే స్పాట్‌కు వచ్చేసి అన్ని పనులూ చూసుకుంటున్నారు. టిఫెన్‌ వచ్చింది. చద్దివాసన. మురారి తినలేదు. కొబ్బరిబొండాలు తాగి, దానిలో కొబ్బరి తిని ఆకలి చల్లార్చుకున్నారు. కోదండరామిరెడ్డి కక్కుర్తి పడి తింటే ఒంటిగంట నుంచి కడుపులో గడబిడ. చెంబు పట్టుకుని చెట్టు చాటుకి పోవడం. దాంతో ఆయన పని కూడా మురారిపై పడింది. 

మధ్యాహ్నం బ్రేక్‌లో లంచ్‌ వచ్చింది. ఆర్టిస్టులకు, చీఫ్‌ టెక్నీషియన్లకు పెద్ద క్యారేజీలు వచ్చాయి. మురారి, యితరులకు పొట్లాలు. వాసన చూడగానే తెలిసిపోయింది - తింటే డేంజరని. ఇక  కొండ దిగి కిందకు వెళ్లి ఏదైనా కతుకుదామని మురారి వెళుతూంటే నిర్మాత గోవిందరాజన్‌, దర్శకుడు, హీరోయిన్లతో బాటు భోజనానికి కూర్చున్న ఎయన్నార్‌ కంటపడింది. ఆయనకు పరిస్థితి అర్థమై పోయింది. కేక వేసి పిలిచి మురారి దగ్గరకు రాగానే చేతిలోంచి పొట్లం తీసుకుని విప్పనారంభించారు. విప్పుతూండగానే గుప్పుగుప్పున దుర్వాసన. అది నిన్నో, మొన్నో వండిన పదార్థం. ఈ దృశ్యం చూస్తూనే ప్రొడక్షన్‌ మేనేజర్‌ రంగరాజన్‌ భయపడి పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఎయన్నార్‌ పొట్లాన్ని నిర్మాత చేతిలో పెట్టారు. తన కంపెనీలో యిలాటి భోజనం పెట్టడం, పైగా అది ఎయన్నార్‌ దృష్టికి రావడం ఆయన అవమానంగా భావించి సంబంధిత వ్యక్తులను పట్టుకుని తిట్టిపోశారు. కమీషన్లు కతికి యిలాటి భోజనాలు పెడుతున్న రంగరాజన్‌ను అక్కడే డిస్మిస్‌ చేశారు. 

'అది సరే, వీళ్ల భోజనం సంగతేమిటి' అంటూ ఎయన్నార్‌ తన ప్లేటును మురారి చేతికి యిచ్చారు. మురారి అది పట్టుకుని వెళ్లి కోదండరామిరెడ్డికి యివ్వబోతే ఆయనకు అప్పటికే విరేచనాలతో డీహైడ్రేషన్‌ వచ్చింది. కారులో ఆస్పత్రికి పంపించి డైరక్టరు షూటింగుకి పేకప్‌ చెప్పారు. ''ఇలాటి అనుభవాలు వున్నాయి కాబట్టి నేను సొంత ప్రొడక్షన్‌లో తిండి దగ్గర ఏ మాత్రం రాజీపడేవాడిని కాను. లైట్‌బాయ్‌ దగ్గర నుండి దర్శకుడు, నిర్మాత వరకు అందరికీ ఒకే రకం కూరలతో భోజనం పెట్టేవాళ్లం.'' అని రాశారు మురారి.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్ 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?