Advertisement

Advertisement


Home > Articles - MBS

సినీమూలం: రక్తసంబంధం (1984) - 1/2

ప్రతీ తల్లీ తండ్రీ తనకు పుట్టబోయే సంతానం అందంగా వుండాలనే కోరుకుంటారు. అయితే ఖర్మచాలక ఆ పిల్లవాడు అనాకారిగా పుడితే? అంటే మామూలు అనాకారిగా కాదు, చూడగానే వెలపరం పుట్టేట్టుగా, భయం కలిగేట్లా పుడితే? కలిగే కాంప్లికేషన్స్‌ గురించి చర్చిస్తుంది యీ చిత్రం. ఓ అందమైన జంట వున్నారు. వాళ్లకు అనాకారి పిల్లవాడు పుట్టాడు. అంత అందమైన తల్లికి యింత అసహ్యకరమైన పిల్లవాడు పుట్టాడంటే ఎవరు నమ్ముతారు? ఆవిడ శీలాన్ని శంకిస్తారు అందుకని యీ పిల్లవాణ్ని చంపేయ్‌ అని కోరాడు ఆ తండ్రి. అతనికి డబ్బుంది. పైగా పురుడుపోసిన ఆ డాక్టరు తన ఫ్రెండ్‌. అందుకని అలాగ అడిగేయ గలిగాడు. తల్లికి పాపం ఏమీ తెలియదు. మగతలో వుంది. అలా పుట్టీ పుట్టగానే తల్లివొడిలోంచి విసిరివేయబడిన ఆ పిల్లవాడి కథకు 'ఉల్కా' అని పేరు పెట్టారు బెంగాలీలో ఆ కథ కల్పించిన డాక్టర్‌ నీహార్‌ రంజన్‌ గుప్తా. ఉల్క అంటే తెలుసుగా, మెటిరాయిడ్‌. గ్రహంనుండి ఒక్కోప్పుడు కొంత భాగం వూడి విశ్వంలోకి రాలిపోతుంది. గమ్యం, లక్ష్యం ఏదీ లేకుండా అలా బికారిలా, వేగబాండ్‌లా తిరుగుతూనే వుంటుంది. ఆ ఉల్కా నవల ఆధారంగా హిందీలో పి కె లఖన్‌  డైరక్షన్‌ లో ఓ సినిమా తీశారు 1963 లో! దాని పేరు - ''మేరీ సూరత్‌ తేరీ ఆంఖే''. నా ముఖమూ, నీ కళ్లూ అని. నీ కళ్లతో ఎలా చూస్తే నేను అలా కనబడతాను అని భావం. 

ఓ పెద్దమనిషి మెటర్నటీ వార్డు బయట వేచి వున్నాడు. నర్సు బయటకు వచ్చి అప్పుడే పుట్టిన పిల్లవాణ్ని చేతిలో పెట్టబోయింది. అతను పిల్లాణ్ని తీసుకోబోతూ అతను నల్లగా, వికారంగా వుండడం చూసి ఒళ్లు జలదరించి కిందకు వదిలేశాడు. డబ్బున్న ఆ తండ్రికి స్వెటర్‌లో నల్లదారం కనబడినా అసహ్యమే. అలాటిది పిల్లవాడు యింత అనాకారిగా పుడితే భరించగలడా? భార్య వద్దకు వెళ్లి ఏడో నెల పురుడు కదా, పిల్లవాడు చనిపోయి పుట్టాడని చెప్పాడు. డాక్టరు వద్దకు వచ్చి పిల్లవాణ్ని చంపేయ్‌ అన్నాడు. నా భార్య కలలు కంటున్నది అందమైన పిల్లవాడి గురించి, వీణ్ని చూస్తే గుండె పగిలి ఛస్తుంది అన్నాడు. డాక్టర్‌ సరే నీ వరకు వాడు చచ్చినట్టే అన్నాడు కానీ వాణ్ని పట్టుకెళ్లి ఓ బీద ముస్లిమ్‌ (కనహయాలాల్‌) జంటకు యిచ్చివేశాడు. వాళ్లకు పిల్లలు లేరు. పుట్టే ఛాన్సూ లేదు. అనాకారి పిల్లాడు సుమా అని డాక్టరంటే దేవుడి సృష్టిలో అనాకారితనమే లేదు పొమ్మన్నాడు ఆ రహమత్‌ భాయ్‌. పిల్లాణ్ని పెంచుకుంటాను కానీ, మళ్లీ అడిగితే యివ్వను సుమా అన్నాడు. దానికి ఒప్పుకున్నాడు డాక్టర్‌.

ఇవతల తనకు బిడ్డ పుట్టినట్టే పుట్టి చనిపోయినందుకు తల్లి ఏడవసాగింది. భార్య ఏడుస్తూంటే చూడలేక పెద్దమనిషి పశ్చాత్తాపపడి డాక్టర్‌ వద్దకు వచ్చి పిల్లాడు మళ్లీ కావాలి. వాణ్ని ఏం చేశావన్నాడు. నువ్వు చేసిన తప్పు ఒప్పుకుంటే చెప్తానన్నాడు డాక్టర్‌. అప్పుడు లోకం నన్ను నిందించదా? అన్నాడు తండ్రి. ఇంతలో ఆ ముస్లిం డాక్టరు వద్దకు వచ్చి తన పెంచుకుంటున్న పిల్లవాడి గురించి సంబరంగా చెప్పి బలానికి మందులు రాయమన్నాడు. మందుల ధర తెలిసి గతుక్కుమన్నాడు. ఈ తండ్రి డబ్బివ్వబోయాడు. అతను పుచ్చుకోలేదు. నా పిల్లాణ్ని దానధర్మాలమీద పెంచనని చెప్పి వెళ్లిపోయాడు. తండ్రి అంటే అలా వుండాలి నీలా కసాయిగా వుండకూడదు అని దెప్పి పొడిచాడు డాక్టర్‌.

కొన్నాళ్లకు యీ తండ్రికి ఇంకో పిల్లవాడు పుట్టాడు. వాళ్లు కోరుకున్నట్టు అందంగానే పుట్టాడు. వాణ్ని తల్లి గారాబం చేసి చెడగొట్టింది. వాడు వట్టి విలాసపురుషుడిగా తేలాడు. ఇవతల పెద్దవాడి కష్టాలు తీరలేదు. అతనికి జ్వరం వచ్చినపుడు ఓ అగ్నిప్రమాదంలో వాళ్ల యిల్లు కాలిపోయింది, పెంపుడు తల్లి చనిపోయింది. తండ్రి యితన్ని తీసుకుని ఓ పల్లెటూరికి వెళ్లిపోయాడు. ఇతను అందవికారంతో, ఆత్మన్యూనతాభావంతో కుమిలిపోతూ చీకట్లోనే గడుపుతూ వుంటే అతనికి సంగీతం నేర్పాడు. అతను పెరిగి పెద్దవాడై అశోక్‌ కుమార్‌ అయ్యాడు. నల్లగా, వికారంగా వుంటాడు. అతని తమ్ముడు ప్రదీప్‌ కుమార్‌ అందంగానే కనబడతాడు. 

ఈ సినిమా ఆధారంగా చాలా మార్పులు చేసి ఓ తమిళ సినిమా కల్పించారు. ''దైవమగన్‌'' అని. దానిలో హీరో శివాజీ గణేశన్‌. ఆయన అసహ్యంగా కనబడి, మరొకడు అందంగా కనబడితే వూరుకుంటాడా? అమ్మో, అందుకని ఆ రెండు పాత్రలూ తనే వేస్తానన్నాడు. ద్విపాత్రాభినయం వేసినప్పుడు తేడా కనబరచాలి కదా. అందుకని పెద్దవాణ్ని నల్లగా, మోటుగా, బుగ్గమీద ఒక పెద్ద మచ్చతో చూపించారు. రెండోవాణ్ని నాజూకుగా, అందంగా, ఆడారివాడిగా చూపించారు. అటూ యిటూ వూగిపోతూ, గోళ్లు కొరుకుతూ, తమాషాగా చూపించారు. ఈ రెండూ చాలనట్టు తండ్రి పాత్ర కూడా శివాజీయే వేశారు. తండ్రి పెద్ద కొడుకులాగే అందవికారంగా ఓ పక్క పెద్ద మచ్చతో, గడ్డంతో కనబడతాడు. తండ్రి పాత్రలో హుందాగా, పెద్దకొడుకు పాత్రలో మొరటుగా, ఓవరాక్షన్‌ చేస్తూ, రెండో కొడుకు పాత్రలో ఆడారివాడిలా తిప్పుకుంటూ హాస్యంగా - మూడు రకాలుగా దున్నేశారు శివాజీ గణేశన్‌. ఆ సినిమాను ''కోటీశ్వరుడు'' పేరుతో డబ్‌ చేశారు తెలుగులోకి. జగ్గయ్య డబ్బింగ్‌తో డబ్బింగ్‌ సినిమా కూడా చాలా బాగా ఆడింది. 

ఆ సినిమాను 14 ఏళ్ల తర్వాత స్ట్రెయిట్‌ చిత్రంగా ''రక్తసంబంధం'' తీశారు. కృష్ణ త్రిపాత్రాభినయం చేయగా విజయనిర్మల దర్శకత్వం నిర్వహించారు. తమిళసినిమానే ఫాలో అవుతూ, అక్కడక్కడ కాస్త మార్చారు. హిందీ సినిమాతో పోల్చి ఈ సినిమాను చెప్పుకుంటున్నాం కదా, దీనిలో తండ్రి అందగాడు కాదు. అందవికారమైనవాడు. కష్టపడి పైకి వచ్చాడు. 'ఒక అనాకారి లోకం చేత ఎలా యీసడింపబడతాడో నాకు తెలుసు కాబట్టి, పుట్టిన పిల్లవాణ్ని చంపేయ'మంటాడు. డాక్టర్‌ (సత్యనారాయణ) సరేనంటాడు కానీ యికపై నీతో మాట్లాడనంటాడు. ఆ పిల్లవాణ్ని ఓ చర్చి వారి అనాథ శరణాలయానికి అప్పగిస్తాడు. పెరిగి పెద్దవాడయాక ఇతన్ని పెంచిన సిస్టర్‌ చనిపోతూ ఫలానా డాక్టర్‌ వద్దకు వెళ్లమంటుంది పెద్దవాణ్ని. అప్పుడు అతను డాక్టర్‌ వద్దకు వెళతాడు. కానీ హిందీలో యింత సింపుల్‌గా చూపించలేదు. మంచి కథ కల్పించారు.

తమ్ముడు అందగాడని చెప్పాను కదా, అతనికి డాక్టర్‌ గారి అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. ఆమెను తీసుకుని పిక్నిక్‌కు దగ్గర్లో వున్న పల్లెటూరికి వచ్చాడు. అతను వేరే ఫ్రెండుతో కాస్త అవతలికి వెళ్లినపుడు హీరోయిన్‌ ఆశా పరేఖ్‌ చెవిలో ఒక పాట పడింది. పాటలో విషాదం ఆమెను కదిలించింది. ఎవరా అని చూసింది. ఎవరూ కనబడలేదు. ఎక్కడున్నావు అని తనూ అదే ట్యూనులో పాడింది. ఆమె పాట విని అశోక్‌ కుమార్‌ అటుగా వెళ్లబోయాడు. దారిలో అతని రూపం చూసి ఓ అమ్మాయి కట్టెలమోపు పడేసి పారిపోవడంతో తన రూపం ఎటువంటి నెగటివ్‌ ప్రభావం కలిగిస్తుందో అర్థమైంది. ఇంటికి వచ్చేసి ఉదాసీనంగా పడుక్కున్నాడు. పెంపుడుతండ్రి కనహయాలాల్‌ అతన్ని ఓదార్చాడు. వీధిలో సాగుతున్న గణేశ నిమజ్జన వూరేగింపు చూపిస్తూ ''ఆ గణపతి చూడు ముఖం వికారంగా వున్నా అందరూ పూజిస్తున్నారు కదా'' అన్నాడు. అశోక్‌కు వుత్సాహం పుట్టింది. తండ్రి అతన్ని గుడికి తీసుకెళ్లి తను ముస్లిం కాబట్టి బయట కూచున్నాడు. లోపలకు రాకపోవడానికి ఏదో సాకు చెప్పాడు. కానీ లోపలకి వెళ్లిన అశోక్‌ను దొంగ అనుకుని తన్నబోయారు. కాదు ఫలానా అని చెప్పుకుంటే 'ముస్లింవి, హిందువుల గుడికి వస్తావా' అంటూ కొట్టారు. మధ్యకు వచ్చి కాపాడబోయిన పెంపుడుతండ్రిని తోసేసి గాయపరిచారు. అప్పుడు విధిలేని పరిస్థితిలో కనహయాలాల్‌ చెప్పాడు - అతను ముస్లిం కాదు. హిందూగా పుట్టాడని. అది విని తెల్లబోయిన అశోక్‌ కుమార్‌ తన పుట్టుక గురించిన నిజం చెప్పమన్నాడు. ఆ వివరాల కోసం ఫలానా డాక్టర్‌ను అడగమని చెప్పి, తగిలిన దెబ్బల వలన కన్నుమూశాడు. 

అశోక్‌ కుమార్‌ డాక్టర్‌ వద్దకు వెళ్లి తను ఫలానా అని చెప్పి, నా తలిదండ్రు లెవరు? అని అడిగాడు. వాళ్లు జీవించే వున్నారని తన అందవికారం వలన వదిలేశారని విని తెల్లబోయాడు. అలా పుట్టడంలో నా తప్పేముంది? అన్నాడు. డాక్టర్‌ అతనిపై జాలిపడి వాళ్ల పేరు చెప్పను కానీ నువ్వు వేరే ఎక్కడికీ వెళ్లకు, కొన్నాళ్లు మా యింట్లో వుండు అన్నాడు. తెలుగులో యీ ఘట్టాన్ని మరింత ఎమోషనల్‌గా తీశారు. అనాథగా పెరగడంలో వున్న బాధల గురించి చెప్పించారు. 'నేను అనాకారినైతే, అవిటివాడనయితే యింకా బాగా చూసుకోవాలి కదా' అనిపించారు. 

హిందీ సినిమాలో అందగాడైన రెండో కొడుక్కు ఓ హోటల్‌ వుంది. దాని మేనేజర్‌, దాన్లో డాన్సు చేసే డాన్సర్‌ కలిసి యితన్ని బుట్టలో పెట్టేశారు. ఇతని చేత తాగించి, డాన్సు చేయించారు. తండ్రికి యిది తెలిసి భగ్గుమన్నాడు. కొడుకుని గట్టిగా మందలించబోతూవుంటే తల్లి అడ్డుపడుతూ వుంటుంది. ఆమెకు తగని గారాబం. తెలుగులో రెండో కొడుక్కి మొదటినుండీ హోటల్‌ వుండదు. గిరిబాబు వాళ్లది బంగారం స్మగ్లర్ల ముఠా. తమ యాక్టివిటీస్‌ పోలీసుల కంటబడకుండా ఏదైనా పెద్దింటివాడి వ్యాపారం చాటున తమ స్మగ్లింగ్‌ చేద్దామని ప్లాను వేసుకున్నారు. ఎవరు దొరుకుతారా అని చూస్తున్నారు. ఇంతలో రెండో కొడుకు దొరికాడు. అతను నార్త్‌ యిండియా వెళ్లినపుడు హీరోయిన్‌ రాధ కలిసింది. ఆమెతో సరాగాలు సాగించాడు. ఈమె డాక్టరుగారి కూతురు. కానీ అప్పటికి అది అతనికి తెలియదు. హిందీలో కంటె తెలుగు వెర్షన్‌లో రెండో కొడుకు ప్రేమగాథ ఎక్కువగా చూపించారు. ఊరికి తిరిగి వచ్చాక ఓ హోటల్లో రాధను చూశాడు. ఆమె మెప్పుకోసం రెండు లక్షల విలువ చేసే హోటల్‌ను పదిలక్షలు పెట్టి కొన్నాడు. అది చూడగానే తమకు కావలసినది యిటువంటి చవటేనని గ్రహించిన విలన్లు యితనికి చేరువ కావడానికి ఓ నాటకం ఆడారు. అతన్ని గూండాల బారినుండి రక్షించినట్టు నటించి హోటల్‌లో భాగస్తులుగా చేరారు. ఇలాటివాళ్లతో చేతులు కలిపి చిన్నకొడుకు తను చిక్కుల్లో పడడమే కాక, ఇంట్లో అందరినీ చిక్కుల్లో పడేశాడు. ఈ నమ్మకద్రోహులు సినిమా చివర్లో యితన్ని కిడ్నాప్‌ చేసి, సినిమాను క్లయిమాక్స్‌ వైపుకి నడిపిస్తారు.దానికి ముందు పెద్దకొడుక్కి, హీరోయిన్‌కి మధ్య కొంత కథ నడుస్తుంది. (సశేషం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?