Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: హిమాచల్‌లో కాంగ్రెసు అవస్థ

ఎమ్బీయస్‌: హిమాచల్‌లో కాంగ్రెసు అవస్థ

హిమాచల్‌ ప్రదేశ్‌లో యీ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 1977 నుంచి అక్కడ కాంగ్రెసు, బిజెపి మార్చిమార్చి గెలుస్తూ వున్నాయి. ప్రస్తుతం వున్నది కాంగ్రెసు. అంటే వచ్చేసారి బిజెపి రావాలి, లెక్క ప్రకారం. ఆనవాయితీ మార్చేస్తాం అని కాంగ్రెసు చెప్పుకోవాలంటే వాళ్ల ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ తలమునకలా అవినీతి ఆరోపణల్లో మునిగిపోయాడు. అతనికి బదులు వేరే ఎవరూ కానరావటం లేదు. ఎవరో ఒకరిని తెచ్చి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపాలి. బిజెపి తరఫున గతంలో ముఖ్యమంత్రిగా చేసిన ప్రేమ్‌ కుమార్‌ ధూమల్‌ కూడా అవినీతి బురద అంటించుకున్నాడు. అందువలన అతనికి కూడా ప్రత్యామ్నాయం వెతుకుతోంది బిజెపి.

2012లో బిజెపి ప్రభుత్వం వుండేది. ధూమల్‌పై అవినీతి ఆరోపణలున్నా బిజెపి అధిష్టానం ఖాతరు చేయకుండా అతనికే మద్దతు పలుకుతూ వచ్చింది. అతనిపై ఫిర్యాదులు చేసిచేసి విసిగిన బిజెపి కార్యకర్తలు బయటకు వెళ్లిపోయి హిమాచల్‌ లోక్‌హిత్‌ పార్టీ అని పెట్టుకున్నారు. ఎన్నికలలో వారు ఒక్క సీటు మాత్రమే గెలిచినా 10% ఓట్లు తెచ్చుకుని బిజెపి కంచుకోటల్లో బిజెపిని దెబ్బ కొట్టారు.

మధ్యలో కాంగ్రెసు లాభపడింది. 68 సీట్లలో కాంగ్రెసుకు 36 వచ్చాయి. బిజెపి 26తో సరిపెట్టుకోవలసి వచ్చింది. కాంగ్రెసు ముఖ్యమంత్రి అభ్యర్థి వీరభద్ర సింగ్‌పై అప్పటికే అవినీతి ఆరోపణలున్నాయి. వాటి కారణంగా ప్రజలతనికి ఓటెయ్యరని బిజెపి అంచనా వేసింది. కానీ అది తప్పింది. వీరభద్ర సింగ్‌కు ప్రజల్లో చాలా పలుకుబడి వుంది. అందరికీ అందుబాటులో వుంటాడు.

అనేకమందికి సహాయాలు చేశాడు. దానధర్మాలు విరివిగా చేశాడు. అతని యింటికి ఎవరు వెళ్లినా ఉంచుకో అని కాస్త డబ్బు చేతిలో పెట్టే రివాజు వుందట. అది ఎక్కణ్నుంచి ఎలా వస్తోందో సామాన్యుడికి అనవసరం. తనను ఆదరంగా చూశాడు, చాలు. అలాటి మారాజు మీద అనవసరంగా కేసులు మోపి అల్లరిపాలు చేస్తున్నారు అనుకున్నాడు. సింపతీ వర్కవుట్‌ అయింది. కాంగ్రెసు గెలిచింది, అతను ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రిగా వుండగా మరిన్ని చిక్కుల్లో యిరుక్కున్నాడు.

హిమాచల్‌ రాజకీయాల్లో వీరభద్ర సింగ్‌ 82 ఏళ్ల కురువృద్ధుడు. పార్లమెంటు సభ్యుడిగా, కేంద్రమంత్రిగా, హిమాచల్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. పరిపాలనా సమర్థుడు, ప్రజలకు ఆప్తుడు. అయినా అవినీతి, పదవీదుర్వినియోగం, మనీ లాండరింగ్‌ కేసుల్లో భార్యతో సహా యిరుక్కున్నాడు. వాళ్లతో బాటు ఒక తెలుగువాడి పేరు కూడా వినబడుతోంది. వాకమళ్ల చంద్రశేఖర్‌ అని. అతను తరిణి గ్రూపు ప్రమోటరు.

హిమాచల్‌లోని చంబాలో వెంచర్‌ ఎనర్జీ అండ్‌ టెక్నాలజీస్‌ పేర 15 మెగావాట్ల సాయికోఠీ హైడల్‌ పవర్‌ ప్రాజెక్టు పెడదామనుకున్నాడు. వీరభద్ర సింగ్‌ ముఖ్యమంత్రిగా వుండగా 2004 సెప్టెంబరులో దీని అనుమతిని రద్దు చేశాడు. తర్వాత 2007లో మళ్లీ అనుమతి యిచ్చాడు. ఈ రెండు చర్యల మధ్య చంద్రశేఖర్‌ వివిధ రకాలుగా 6 కోట్ల రూ.ల వరకు సింగ్‌కు ఆర్థిక లబ్ధి చేకూర్చాడుట. 2013లో ఆ ప్రాజెక్టుకి అనుమతి పొడిగించినపుడు ముఖ్యమంత్రిగా వున్న సింగ్‌కు ఎంపీగా వున్న అతని భార్య ప్రతిభకు మరో రూ.1.80 కోట్లు చెల్లించాడట. మెహరౌలీలో వున్న ఫామ్‌హౌస్‌ మార్కెట్‌ విలువ రూ. 27 కోట్లుంటుంది.

దాన్ని రూ.1.20 కోట్లకే కొన్నట్లు చూపించి, తక్కినది క్యాష్‌లో యిచ్చాడని అమ్మినవాళ్లు యిన్‌కమ్‌ టాక్స్‌ వాళ్లకు చెప్పేశారు. కొన్నదాన్ని మేపుల్‌ అనే కంపెనీ పేర రిజిస్టర్‌ చేయించాడు. ఆ కంపెనీలో సింగ్‌ కొడుకు విక్రమాదిత్య సింగ్‌, కూతురు అపరాజితా సింగ్‌ భాగస్వాములు. అంతేకాదు, తరిణి ఇంటర్నేషనల్‌ కంపెనీ రూ. 16.8 కోట్లు ఐపిఓ ద్వారా సేకరించి మేపుల్‌కు బదిలీ చేసింది. ఎందుకు అంటే మాకు వాళ్లకీ వున్న కాంట్రాక్టు వలన అని జవాబిచ్చాడు చంద్రశేఖర్‌. ఆ కాంట్రాక్టు ఏమిటో, మేపుల్‌ వాళ్లు తరిణికి ఏం పనిచేసి పెట్టారో చూపించలేక పోయాడు. 

'నీ కంపెనీలకు లాభాలు తగ్గుతున్నా వీరభద్ర సింగ్‌కు డబ్బు ఎలా బదిలీ చేయగలిగావ'ని ఇన్‌కమ్‌టాక్స్‌ అధికారులు చంద్రశేఖర్‌ను అడిగారు. 'మా అమ్మమ్మ త్రిపురాన అహల్యాదేవికి విజయనగరం జిల్లాలో 45 ఎకరాల భూమి వుంది. దానిలో పళ్లు, సుగంధ ద్రవ్యాలు పండిస్తుంది. ఆవిడ యిచ్చింది' అని జవాబిచ్చాడితను. టాక్సు అధికారులు వెళ్లి చూడగా అతనిచ్చిన అడ్రసులో అహల్యాదేవి వుంటుంది కానీ ఆవిడ యితనికి చుట్టమేమీ కాదు.

ఆవిడ యింట్లో అద్దె కుంటున్నాయన పేరు వాకమళ్ల నాగభూషణరావు. ఏ బాదరాయణ సంబంధం కలుపుకున్నాడో మరి. ఆవిడకు 45 ఎకరాలు వున్న మాట నిజమే కానీ ఆ పొలంలో సగం ఖాళీగా పడి వుంది. తక్కిన దాంట్లో మామిడి, జీడిమామిడి చెట్లున్నాయి. చంద్రశేఖర్‌ లంచంగా ఎంత యిచ్చాడో, సింగ్‌కు చెందిన బ్లాక్‌మనీని ఏ మేరకు  లాండరింగ్‌ చేసిపెట్టాడో యింకా తేలాలి. 

ఇదంతా పాత గాథ. ఇప్పుడు కొత్తగా ఎన్‌డిఏ అధికారంలోకి వచ్చాక 2015 నుంచి సిబిఐ తవ్వితీస్తున్న కేసులు వేరు. బ్లాక్‌మనీని వైట్‌ చేసుకోవడానికి వీరభద్ర సింగ్‌ తనకు వ్యవసాయభూములపై ఆదాయం వచ్చిందని చూపించాడు. అది సిబిఐ నమ్మటం లేదు. సింగ్‌కు షిమ్లా జిల్లాలో శ్రీఖండ్‌ ఆర్చర్డ్‌ అని వ్యవసాయక్షేత్రం వుంది. దాని మేనేజర్‌ ఆనంద్‌ చౌహాన్‌ సింగ్‌ తరఫున ఆరున్నర కోట్ల బ్లాక్‌మనీని 2009-12 మధ్య లాండరింగ్‌ చేశాడని సిబిఐ అంటోంది.

సింగ్‌ ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌స్‌లో వ్యవసాయంపై వచ్చిన ఆదాయాన్ని రూ.47.4 లక్షలుగా చూపించాడు. కానీ చౌహాన్‌ బ్యాంక్‌ ఖాతాలో ఏకంగా రూ. 6.5 కోట్లు జమ అయ్యాయి. అవి ఎక్కడివి అని అడిగితే 'ఇవి సింగ్‌ గారి క్షేత్రంలో ఆపిల్‌ పళ్లు అమ్మగా వచ్చిన డబ్బు. నేను దానికి కేర్‌ టేకర్‌ను. మా యిద్దరి మధ్య స్టాంపు పేపరు మీద రాసుకున్న ఒక ఎంఓయు (అంగీకార పత్రం) వుంది.

దాని ప్రకారం ఆ డబ్బు నా దగ్గరే దాచి వుంచాను' అన్నాడు. 2012లో సింగ్‌ గత మూడేళ్లవి రివైజ్‌డ్‌ ఐటీ రిటర్న్‌స్‌ దాఖలు చేశాడు. 2009-10లో రూ.7.35 లక్షల ఆదాయం వచ్చిందని మొదట్లో చెప్పి తర్వాత కాదు, కాదు 2.21 కోట్లు వచ్చిందన్నాడు. అదే విధంగా 2010-11 అంకెను రూ.15 లక్షల నుంచి రూ.2.8 కోట్లకు పెంచాడు. 2011-12 అంకెను రూ.25 లక్షల నుంచి రూ.1.55 కోట్లకు పెంచాడు.

పంట విపరీతంగా  పండేసిందని చెప్పుకున్నారు. 'ఓహో అలాగా అయితే అన్ని యాపిల్స్‌ని మార్కెట్‌కు ఎలా తరలించారు? ట్రక్కుల వివరాలివ్వండి' అంటే 'అబ్బే, ట్రక్కులు కాదు, స్కూటర్ల మీద, మారుతి 800 కారులోనూ తరలించార' అని చెప్పారు. పోనీ ఏ మార్కెట్‌లో అమ్మారో చెపితే మీ సరుకు అక్కడికి చేరిందో లేదో అక్కడి రికార్డులు వెరిఫై చేస్తాం అన్నారు టాక్సువారు. ఏ రికార్డూ లేని, మూలపడిన మార్కెట్‌ పేరు చెప్పారు వీళ్లు.  

ఆ 6 కోట్ల డబ్బు ఎక్కణ్నుంచి వచ్చిందో చెప్పలేక యిలాటి తికమక సమాధానాలు చెపుతున్నారని అర్థమై పోతోంది. సరే మీకు, ఏపిల్‌ డీలర్‌కు మధ్య ఎంఓయు వుందన్నారు కదా, ఆ దస్తావేజు పట్టుకు రండి అన్నారు.  అది 2008 జూన్‌ 17న నాన్‌-జ్యుడిషియల్‌ స్టాంప్‌ పేపరుమీద రాసినట్లుంది. దానిపై వున్న సీరియల్‌ నెంబరు ప్రకారం చూస్తే ఆ స్టాంప్‌ పేపరు నిజానికి 2008 సెప్టెంబరు 24న నాసిక్‌లో ప్రింటు చేసినట్లుంది.

అంటే తర్వాత ఎప్పుడో స్టాంప్‌ పేపరు కొని  పాత తారీకు వేసేశారన్నమాట. జూన్‌ 15న మరో ఏపిల్‌ డీలర్‌తో రాసుకున్న ఎమ్‌ఓయు వున్న స్టాంపు పేపరుదీ యిదే కథ. ఎవరికీ పండనంత పంట మీకెలా పండింది అని సింగ్‌ను అడిగితే 'అంతా దేవుడి దయ' అన్నాడు. అతనికి వున్న 105 బిఘాల (ఎకరానికి రెండున్నర బిఘాలు) భూమిలో 3200 చెట్లున్నాయి. మహా అయితే ఏడాదికి 15 వేల పెట్టెల ఏపిల్స్‌ పండవచ్చు, వాటిపై రూ.15 లక్షల ఆదాయం రావచ్చు.

ఐటీ వాళ్లు ఉదారంగా లెక్కలు వేసినా ఎక్కువలో ఎక్కువ ఏడాదికి రూ.64 లక్షలకు మించి రాకూడదు. మరి సింగ్‌ గారికి కోట్లకు కోట్లు వచ్చిపడ్డాయి. (కెసియార్‌ కూడా వ్యవసాయం చేసి ఎకరాకు కోటి రూ.లు సంపాదించిన మాట, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కూడా వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న సంగతీ యిక్కడ గుర్తుకు వస్తే అది నా తప్పు కాదు) ఈ సంగతులన్నీ అరుణ్‌ జేట్లీ 2012లో రాజ్యసభలో లేవనెత్తి హిమాచల్‌ ఎన్నికలకు ముందు వీరభద్ర సింగ్‌ను అప్రతిష్ఠ పాలు చేయాలని చూశాడు. కానీ దానివలన సానుభూతి పెరిగింది తప్ప తరగలేదు. 

కానీ కోర్టు వారి అభ్యర్థనను తిరస్కరించింది. 2016 మేలో ఇడి మనీ లాండరింగ్‌తో సంపాదించిన ఆస్తులు అంటూ, దిల్లీ గ్రేటర్‌ కైలాశ్‌లో సింగ్‌కు వున్న రెండస్తుల మేడను స్వాధీనం చేసుకుంది. దాని విలువ రూ.8 కోట్లు. దానితో బాటు ఎల్‌ఐసి పాలసీలు, ఫిక్సెడ్‌ డిపాజిట్లు కూడా స్వాధీనం చేసుకుంది. 2016లో ఆగస్టులో సింగ్‌ను, భార్యను విచారించింది. 'ఇదంతా మోదీ చేయిస్తున్నదే, వసుంధరా రాజే, రమణ్‌ సింగ్‌, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వంటి ముఖ్యమంత్రులపై కూడా కేసులున్నాయి. వారెవరిపై చూపించనంత కాఠిన్యం నాపై చూపిస్తున్నారంటే యిది రాజకీయ దురుద్దేశమే' అని సింగ్‌ వాపోయాడు. 

ఆరోపణలు బయటకు వచ్చిన కొత్తల్లో అతని పార్టీ ఎమ్మెల్యేలు అతని వెనక దృఢంగా నిలిచారు. అతనికి వున్న మాస్‌ లీడరు యిమేజి తమను మళ్లీ గెలిపిస్తుందని వారి ఆశ. పోనుపోను సిబిఐ, ఇడి ఉచ్చు బిగిస్తున్న కొద్దీ పరిస్థితి మారుతోంది. అవినీతి, ఫోర్జరీ అనే నేరాలపై 2017 మార్చిలో సింగ్‌పై, అతని భార్యపై సిబిఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఏప్రిల్‌ మొదటివారంలో రూ. 27 కోట్ల మెహరౌలీలో ఫామ్‌హౌస్‌ కూడా స్వాధీనం చేసుకుంది.

అది సింగ్‌ కొడుకు విక్రమాదిత్య సింగ్‌ కంపెనీ ఐన మేపుల్‌ డెస్టినేషన్స్‌ పేర వుంది. ఏప్రిల్‌ మూడోవారంలో ఇడి సింగ్‌ను 9 గంటలు ఏకధాటిగా ప్రశ్నలతో ముంచెత్తింది. మే 29 న సిబిఐ స్పెషల్‌ కోర్టు వాళ్లకు బెయిల్‌ యిస్తూనే పాస్‌పోర్టులు అప్పగించమంది. ఇవన్నీ చూసిన ఎమ్మెల్యేలలో కొందరికి వీరభద్ర సింగ్‌ పార్టీకి బరువుగా మారిన యీ అవకాశాన్ని వినియోగించుకుని తామే ఎందుకు ముఖ్యమంత్రులు కాకూడదని అనిపించసాగింది. కేసుల్లో తనకు శిక్ష పడవచ్చని ఊహించిన సింగ్‌ తన అసెంబ్లీ స్థానంలో వచ్చే ఎన్నికల్లో తన కొడుకు విక్రమాదిత్య నిలబడతాడని ముందే ప్రకటించాడు. 

సింగ్‌ వారసత్వాన్ని వదుల్చుకుందామని సోనియా నిశ్చయిస్తే అతని స్థానంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నవారిలో ఆనంద శర్మ ఒకడు. అతను సోనియాకు ఆప్తుడే కానీ రాష్ట్రప్రజల్లో పలుకుబడి లేదు. ఇంకో అభ్యర్థి కౌల్‌ సింగ్‌ ఠాకూర్‌. ప్రస్తుత కాబినెట్‌లో ఆరోగ్యశాఖామాత్యుడు. సింగ్‌ను విమర్శిస్తాడు. మూడో వ్యక్తి సుధీర్‌ శర్మ. కాబినెట్‌లో పట్టణాభివృద్ధి శాఖకు మంత్రి. సింగ్‌కు అనుయాయి.

నాలుగో వ్యక్తి - సింగ్‌ వ్యతిరేకించినా 2012లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబడి కొనసాగుతున్న సుఖ్వీందర్‌ సింగ్‌ సుక్కు. వయసు 52 కాబట్టి యువనాయకుడిగా లెక్క కానీ రాజకీయంగా బలమైనవాడు కాదు. కానీ ఆశ బాగానే వుంది. 'వీరభద్ర సింగ్‌ యిప్పటికే 6 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ప్రజలు, ముఖ్యంగా యువత మార్పు కోరుకుంటున్నారు. నేను బూత్‌ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ వ్యవస్థను బలోపేతం చేశాను.' అని చెప్పుకుంటున్నాడు.

ఈ ఆశావహులందరూ యీ సారి పార్టీ వీరభద్ర సింగ్‌పై ఆధారపడకుండా సమిష్టి నాయకత్వానికి బాధ్యతలు అప్పగించాలని, ఎవరినీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించ కూడదనీ కోరుకుంటున్నారు. ఎందుకంటే 2012లో పార్టీ హై కమాండ్‌ వద్దంటున్నా వీరభద్ర సింగ్‌ పార్లమెంటు స్థానానికి రాజీనామా చేసి, తనపై అవినీతి ఆరోపణలున్నా అసెంబ్లీ గోదాలోకి దిగి 36 స్థానాలు గెలిచి చూపించడంతో హై కమాండ్‌ ఏమీ చేయలేక పోయింది. ఈ సారి అలా జరగడానికి వీల్లేదని యీ నాయకుల పట్టుదల. ఇప్పటికి కూడా 23 మంది ఎమ్మెల్యేలు సింగ్‌ నాయకత్వంపై విశ్వాసం ప్రకటిస్తూ మే 26న ఒక లేఖపై సంతకాలు పెట్టారు.  

కాంగ్రెసు పక్షాన బలమైన నాయకుడు చిక్కుల్లో పడిన యీ సమయాన్ని బిజెపి ఉపయోగించుకుని, పొరుగున వున్న ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో లాగానే యిక్కడా తమ తడాఖా చూపించాలనుకుంది. ఏప్రిల్‌ 27న షిమ్లాలో పెద్ద సభ ఏర్పాటు చేసి మోదీని ఆహ్వానించింది. అధికారికంగా అయితే అది ''ఉడాన్‌'' (ఎయిర్‌ కనెక్టివిటీ స్కీము) ప్రారంభించడానికి వచ్చినట్లు లెక్క. కానీ 'అవినీతిమయమైన ప్రభుత్వాన్ని కూలదోయండి' అంటూ మోదీ పిలుపు నీయడంతో ఆ పర్యటన రాజకీయపు రంగు పులుముకుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?