Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : విమర్శలు ఏ మేరకు పట్టించుకోవాలి?

ఎమ్బీయస్‌ : విమర్శలు ఏ మేరకు పట్టించుకోవాలి?

విమర్శ అనేది రచయితలకో, సినిమావాళ్లకో సంబంధించినది అనుకోనక్కరలేదు. మనలో ప్రతి ఒక్కరం అనుదినం విమర్శలను ఎదుర్కుంటూనే వుంటాం. సరిగ్గా చదువటం లేదని తండ్రి, శుభ్రంగా లేమని తల్లి, వంట బాగా లేదని భర్త, యింటి విషయాలు పట్టించుకోలేదని భార్య, పని శ్రద్ధగా చేయలేదని బాస్‌, సరుకు బాగా లేదని కస్టమరు, అవకాశాలు వున్నా తగినంత సంపాదించలేదని పిల్లలు - యిలా ఎవరో ఒకరు ఎందుకో అందుకు మనల్ని విమర్శిస్తూనే వుంటారు. వారికీ మనకీ మధ్య వున్న అనుబంధం బట్టి అవి తిట్లగా, దెప్పుళ్లగా, మందలింపుగా, సణుగుళ్లగా రూపు మార్చుకుంటాయి. కళారంగంలో ఉన్నవాళ్లకయితే వీరందరికి తోడు రసజ్ఞుడు కూడ విమర్శిస్తాడు. గాయకుడికి శ్రోత, రచయితకు పాఠకుడు, సినిమాకు ప్రేక్షకుడు, చిత్రకారుడికి వీక్షకుడు, వక్తకు సదస్యులు... వీరిలో ఎవరైనా విమర్శించవచ్చు. వీరి ప్రతినిథిగా విమర్శకుడి అవతారమెత్తి ఒక నిపుణుడు సరైన భావవ్యక్తీకరణతో సమీక్షలు, విమర్శల పేరుతో అక్షరాల్లో పెట్టవచ్చు. వీటిని ఏ మేరకు స్వీకరించాలన్నదే ప్రశ్న.

తనను తాను ఎరిగినవాడే ఘనుడు, ఆత్మావలోకనం చేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలి.. యిలాటి సూక్తులు ఎన్ని వున్నా ఆచరణలో అవన్నీ కష్టమే. ప్రతివాడికీ తాను చేసినది రైటే, తన పరిస్థితుల్లో వేరెవరున్నా తనకంటె బాగా చేసి వుండేవారు కాదు అనే అభిప్రాయం ఉండడం సహజం. అయితే కొందరికి యింతకంటె బాగా చేసి వుండవచ్చేమో అనే సందేహమూ వుంటుంది. అందువలన సూచనలు, విమర్శలు వస్తే వాటి గురించి ఆలోచిస్తారు. స్వీకరిస్తారా లేదా అన్నది విమర్శకుడు చెప్పే విధానంపై వీళ్ల అవగాహన బట్టి వుంటుంది. సద్విమర్శను స్వీకరిస్తాను అని చాలామంది అంటారు. 'ప్రశంసను అంగీకరిస్తాను, ఒకవేళ ప్రతికూలంగా మాట్లాడినా, ఏదో హంసతూలికతో తట్టినట్లు సుతారంగా వుండాలి' అనే భావం దానిలో స్ఫురిస్తుంది. కానీ విమర్శ యిలా వుంటుంది అని నిర్ధారించడం మన చేతిలో లేదు. కంచంలో పెట్టినది నచ్చకపోతే ఒకడు నిట్టూర్చి ఊరుకోవచ్చు, మరోడు పక్కకు నెట్టేయవచ్చు, యింకోడు ఏమిటిలా అఘోరించింది అని తిట్టవచ్చు, మరొకడు కంచాన్ని నేలకేసి విసిరికొట్టవచ్చు. అంతా వాళ్ల ఎక్స్‌పెక్టేషన్స్‌ మీద, సహనం మీద ఆధారపడి వుంటుంది.  అందుకే విమర్శల్లో కొన్ని రీజనబుల్‌గా వుంటాయి, కొన్ని అన్‌రీజనబుల్‌గా వుంటాయి, మరి కొన్ని పనిగట్టుకుని తిట్టినట్లుంటాయి. అన్నీ అంగీకరించినా తప్పే, అన్నీ తృణీకరించినా తప్పే.  

కొందరు చాలా సెన్సిటివ్‌గా వుంటారు. వాళ్లు చేసినది బాగా లేదని సుతారంగా చెప్పినా విరుచుకు పడతారు. మరి కొందరు ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ఐ యామ్‌ ఆల్వేజ్‌ రైట్‌ అనే ధోరణిలో వుంటారు. అదీ మంచిది కాదు. విమర్శలను మన పట్టించుకోవాలి. వినదగు నెవ్వరు చెప్పిన... అన్నట్లు వినాలి. తర్వాత వివేకం ఉపయోగించి, విమర్శలో ఎంత న్యాయం వుంది అనేది పరిశీలించుకోవాలి. ఇది పూర్తిగా వ్యక్తిగతం. ఒకరికి న్యాయంగా తోచినది మరొకరికి అన్యాయంగా తోచవచ్చు. 'నీ మంచి కోసమే చెప్తున్నా' అంటాడు విమర్శకుడు. 'నా మీద కసితో, అసూయతో చెప్తున్నావు' అంటాడు యివతలివాడు. ప్రయివేటుగా బంధుమిత్రుల విమర్శల పాలవడం ఎవరికైనా తప్పదు. కళాకారులు, ప్రముఖులు, నాయకులు పబ్లిగ్గా, అదీ తీవ్ర స్థాయిలో విమర్శల నెదుర్కోవలసి వస్తుంది. వారు విమర్శకులతో ఎలా వ్యవహరించాలి అన్నదానిపై దృష్టి పెడదాం. 

ముందుగా గుర్తించవలసినది బహిరంగ విమర్శ వస్తోందంటే, నువ్వు తగినంత ప్రముఖమైన స్థాయిలో వున్నావని అర్థం. 'నో వన్‌ ఎవర్‌ కిక్స్‌ ఏ డెడ్‌ డాగ్‌' అంటూంటారు. నువ్వు ఒక పనికిమాలినవాడివి అయితే నీ గురించి పట్టించుకునేవాడే ఉండడు. నీలో ఒక విశేషం వుంది కాబట్టే అవతలివాడు నీ గురించి మాట్లాడి తనకు గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. 1936లో ఇంగ్లండుకు రాజైన ఎనిమిదవ ఎడ్వర్డు యువరాజుగా వుండేటప్పుడు 14 ఏళ్ల వయసులో నేవల్‌ ఎకాడమీకి చెందిన డెవన్‌షైర్‌లోని డార్ట్‌మౌత్‌ కాలేజీలో చదువుకునేవాడు. ఓ రోజు అతను ఒంటరిగా కూర్చుని ఏడుస్తూంటే ఓ నౌకాదళాధికారి చూసి అడిగాడు. అతను ఏమీ లేదన్నాడు. అడగ్గాఅడగ్గా చెప్పాడు - 'నా రూములో నాతో బాటు వున్న నేవల్‌ కాడెట్స్‌ నన్ను ఉత్తిపుణ్యాన తంతున్నారు.' అని. అధికారి నిర్ఘాంతపోయాడు. ఆ రూమ్మేట్లను పిలిచి అడిగాడు. వాళ్లూ ఓ పట్టాన చెప్పలేదు. చివరకి నోరు విప్పారు. 'పాపం అతను అహంకారి కాదు, మా మీద జులుం చలాయించడు. మేం తన్నేదెందుంటే రేపుమర్నాడు మేం నౌకాదళంలో కెప్టెన్లమయ్యేటప్పటికి అతను రాజవుతాడు. మేం మా కొలీగ్స్‌తో 'కెన్‌ యూ బిలీవ్‌? మేం చిన్నపుడు రాజుగార్ని తన్నాం తెలుసా!?' అని చెప్పుకోవచ్చని!' ఇదీ కారణం! వినగానే అదోలా అనిపిస్తుంది కానీ మానవస్వభావాన్ని బయటపెడుతుంది. యువరాజు కాకపోతే ఆ తన్నులుండేవి కావన్న విషయాన్ని గుర్తిస్తే విమర్శకు గురైనవాడికి  మనశ్శాంతిగా వుంటుంది. విమర్శకుడు తన గుర్తింపు కోసం నా మీద రాయడం దేనికి? అనుకుంటే లాభం లేదు. పూలగుత్తులతో బాటు, యిటుకబెడ్డలూ కూడా అంగీకరించాలి. అది ఆక్యుపేషనల్‌ హజార్డ్‌. 

ఉత్తరధృవానికి చేరడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. 1898లో అడ్మిరల్‌ రాబర్ట్‌ పియరీ అనే అమెరికన్‌ సాహస పరిశోధకుడు ప్రాణాలకు తెగించి అక్కడకు వెళతానన్నపుడు ఎంతోమంది డబ్బులు సేకరించి అతని యాత్రకు నిధులు సమకూర్చారు. దారిలో అతను నానాకష్టాలూ పడ్డాడు. చలికి, ఆకలికి ప్రాణాలు కడగట్టాయి. మంచుకి 8 కాలివేళ్లు గడ్డకట్టిపోతే, వాటిని తీసివేయవలసి వచ్చింది. మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చాయంటే అతనికి పిచ్చెక్కిపోతుందేమో అనుకున్నారు. చివరకు 1906 ఏప్రిల్‌ 6న అతను గమ్యం చేరడంతో లోకమంతా జేజేలు పలికింది. ఇది చూసి నేవీ డిపార్టుమెంటులోని అతని పైఅధికారులు కుళ్లుకున్నారు. అతను యీ యాత్ర పేర దండిగా డబ్బులు పోగేసి, ఆర్కిటిక్‌లో పచార్లు కొట్టాడనే ప్రచారం మొదలుపెట్టారు. అది ఎంతవరకు వెళ్లిందంటే జనాలు ఆ ప్రచారం నమ్మి నిధులివ్వడం మానేశారు. కానీ పియరీ వాటిని పట్టించుకోకుండా 1908లో మళ్లీ వెళ్లడానికి ప్రయత్నాలు చేసుకోసాగాడు. చివరకు దేశాధ్యక్షుడు మెక్‌కిన్లే స్వయంగా కలగజేసుకుని పియరీ ఆర్కిటిక్‌ వెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడు. విమర్శలకు జడిసి పియరీ ఆగిపోయి వుంటే అనేక పరిశోధనలు ఆగిపోయి వుండేవి. ఇక్కడ మనం గమనించవలసినదేమిటంటే - పియరీ ఏదో డెస్క్‌జాబ్‌ చేసుకుంటూ వుంటే ఎవరూ అతని జోలికి వచ్చేవారు కారు. అతను గొప్పపని చేశాడు కాబట్టే పొగడ్తలూ, తెగడ్తలూ. 

విమర్శకుడు ఎంత గొప్పవాడైనా కావచ్చు కానీ అతనిది ఎప్పుడూ ద్వితీయస్థానమే. సృజనాత్మక ఉన్న కళాకారుడిదే ప్రథమస్థానం. ప్రథమస్థానంలో వున్నాను కదాని కళాకారుడు విర్రవీగనక్కర లేదు. విమర్శకుణ్ని చిన్నచూపు చూడనక్కరలేదు. విమర్శకుడు తను కళాకారుడి కంటె మిన్న అనుకోవడమూ పొరపాటే. ఎవరి టాలెంటు వాళ్లది. కళాకారుడు ఎక్కడ తప్పు చేశాడో ఎత్తి చూపగల పాండిత్యం విమర్శకుడికి ఉండాలి. అతనెవరు నన్ను అనడానికి? దమ్ముంటే నాలా పాడమను, ఆడమను, రాయమను అనే అధికారం కళాకారుడికి లేదు. పాడడం, ఆడడం, రాయడం విమర్శకుడి పని కాదు. అతన్ని ఎందుకు రంజిల్లింప చేయలేకపోయానా అని కళాకారుడు స్థిమితంగా కూర్చుని ఆలోచించాలి. సంగీత, నృత్య విమర్శకుడు విఎకె రంగారావుగారు ఓ సారి చెప్పారు - ఒక ప్రముఖ్య నాట్యకళాకారిణి ఆయనను విమర్శకై ప్రత్యేకంగా నియమించుకుందట. ప్రదర్శనకై వేరే ఊరు వెళ్లినా ఆయనను ఖర్చులు పెట్టుకుని తీసుకెళ్లేదట. పత్రికల్లో రాసేవాళ్లు ఎలాగూ రాస్తారు. ఈయనైతే సద్విమర్శకుడు, చిన్నచిన్న విషయాలు సైతం మనకు తెలియచెపుతాడు అని ఆవిడ నమ్మకం. ఈయన దానికి తగ్గట్టే 'ప్రదర్శన జరుగుతూండగా టీ కుర్రాడు అడ్డంగా వచ్చి డిస్టర్బ్‌ చేశాడు' వంటివి కూడా నోట్‌ చేసి చెప్పేవాడట. ఇది ఆవిడ ప్రదర్శనల నాణ్యత పెంచుకోవడానికి ఉపకరించింది. ఇటీవలి కాలంలో ఫీడ్‌బ్యాక్‌ పేరుతో సంస్థాగతంగా యిటువంటి ప్రక్రియ చేపడుతున్నారు. దానివలన చాలా సందర్భాల్లో మంచి జరుగుతుంది. 

కళాకారులే కాదు, మామూలు వాళ్లు కూడా విమర్శను ఆమోదించి, ఏ మేరకు స్వీకరించాలో తర్కించుకోవడం మంచిది. జార్జి రోనా అనే న్యాయవాది వియన్నాలో వుండేవాడు. రెండవ ప్రపంచయుద్ధంలో జర్మనీ ఆస్ట్రియాపై దండెత్తినపుడు అతను స్వీడన్‌ పారిపోయాడు. చేతిలో డబ్బు లేదు, ఉద్యోగం లేదు. తనకు చాలా భాషలు తెలుసుకాబట్టి యితర దేశాలతో ఎగుమతులు, దిగుమతుల వ్యాపారం చేసే సంస్థలు తమ కరస్పాండెన్సు చూసే అవకాశం యిస్తారేమో ప్రయత్నిద్దాం అనుకుని, అలాటి సంస్థలనేక వాటికి తన సేవలు ఆఫర్‌ చేస్తూ ఉత్తరాలు రాశాడు. చాలా సంస్థలు 'యుద్ధం వలన వ్యాపారం ఆగిపోయింది, మీ అప్లికేషన్‌ దాచుకున్నాం. అవసరమైనపుడు సంప్రదిస్తాం' అని రొటీన్‌ జవాబిచ్చి ఊరుకున్నాయి. ఒక వ్యాపారి మాత్రం ప్రత్యేకంగా లేఖ రాశాడు - 'నేను చేసే వ్యాపారం నువ్వనుకున్న ఎక్స్‌పోర్ట్‌, యింపోర్ట్‌ వ్యాపారం కాదు, ఒకవేళ అలాటిది ప్రారంభించినా నాకు ఉత్తరాలు రాసిపెట్టేవాడు అక్కరలేదు, ఒకవేళ అవసరమైనా స్వీడిష్‌ భాష బాగా వచ్చినవాణ్ని పెట్టుకుంటాను తప్ప తప్పులతడక స్వీడిష్‌ రాసే నీలాటి వాణ్ని పెట్టుకోను.' అని. 

ఇది చదవగానే రోనా మండిపడ్డాడు - 'ఈ వ్యాపారి రాసిన స్వీడిష్‌ లేఖలోనే బోల్డు తప్పులున్నాయి. పైగా నాకు స్వీడిష్‌ రాదంటాడూ?' అని. పోరా, నువ్వూ నీ బోడి కంపెనీ అనే పద్ధతిలో ప్రత్యుత్తరం రాసి, పోస్టు చేయకుండా తమాయించుకుని, ఆలోచనలో పడ్డాడు. 'ఒకవేళ వాడు చెప్పినది కరెక్టేయేమో! నా స్వీడిష్‌లో తప్పులున్నాయేమో. నేను దాన్ని నేర్చుకున్నాను కానీ ఎంతైనా మాతృభాష కాదు కదా. కమ్యూనికేషన్స్‌ చూస్తానంటూ బయలుదేరిన నేను ఆ భాషను నిర్దుష్టంగా రాయగలగాలి, ఎవరికైనా చూపించి సరి చేసుకోవాలి. అప్పుడే నా కుద్యోగం వస్తుంది.' అని నిర్ధారణకు వచ్చాడు. ఆ తర్వాత తోచింది - 'తక్కినవాళ్లెవరూ యీ తప్పులు ఎత్తి చూపలేదు. ఇతనొక్కడే ఎత్తి చూపి నాకు సరైన ఉద్యోగం వచ్చేందుకు దోహదపడుతున్నాడు. తనకు తెలియకుండానే నాకు సాయపడ్డాడు. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా ఉపకారం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పినా తప్పులేదు.' అని. పాత ఉత్తరం చింపేసి 'మీకు నా సర్వీసెస్‌ అక్కరలేకపోయినా నా కోసం సమయం వెచ్చించి లేఖ రాసినందుకు ధన్యవాదాలు. మీ కంపెనీ గురించి సరిగ్గా తెలుసుకోకుండా మీకు ఉత్తరం రాసి మీ సమయం వృథా చేసినందుకు చింతిస్తున్నాను. నా లేఖలో వ్యాకరణదోషాల సంగతి నాకు తెలియదు. తెలిసి వుంటే అలా రాసేవాణ్ని కాను. మీరు ఎత్తి చూపారు కాబట్టి స్వీడిష్‌ భాషను మరింత బాగా నేర్చుకుంటాను. నన్ను నేను యింప్రూవ్‌ చేసుకునే దారిలో నన్ను పెట్టినందుకు కృతజ్ఞతలు.' అని రాసి పోస్టు చేశాడు. కొన్నాళ్లకు వ్యాపారి నుంచి పిలుపు వచ్చింది, వచ్చి కలవమని. ప్రత్యక్షంగా చూశాక రోనా అడిగిన ఉద్యోగం కాకపోయినా మరో ఉద్యోగం యిచ్చాడా వ్యాపారి. కథ సుఖాంతం. 

'ద్రౌపదీ వస్త్రాపహరణం' పేరుతో ఎచ్‌ ఎమ్‌ రెడ్డిగారు తీసిన సినిమా విజయవంతమైంది. దీనిలో కంటె పోటీగా విడుదలైన 'ద్రౌపదీ మానసంరక్షణం'లో సాంకేతిక విలువలు బాగున్నాయని 'కృష్ణాపత్రిక'లో ఓ వ్యాసం వెలువడింది. ఆ సమీక్ష చూసి రెడ్డిగారు వ్యాసం రాసిన కమలాకర కామేశ్వరరావుగారిని మద్రాసు పిలిపించి తన వద్ద అసిస్టెంటు డైరక్టరుగా ఉద్యోగం యిచ్చారు. తర్వాతి రోజుల్లో కమలాకర చాలా పెద్ద డైరక్టరుగా ఎదిగారు. రెడ్డిగారి సహృదయం వలన యిద్దరూ లాభపడ్డారు. మొహమాటానికి పోయి వుంటే కమలాకరకు ఆ ఛాన్సు దక్కేది కాదేమో! అందువలన సృజనకారులూ వుండాలి, విమర్శకులూ వుండాలి. ఇద్దరూ ఒకరికొకరికి కాంప్లిమెంటరీగా వుండాలి. విమర్శలకు అతిగా పొంగిపోవడం లేదా కృంగిపోవడం అనవసరం. తగు మోతాదులో తీసుకుంటే చేదు కూడా ఆస్వాదనీయమే, ఆరోగ్యదాయకమే. 

మామూలుగా అయితే యింతటితో ఆపేయవచ్చు. అయితే వ్యాఖ్యలు రాసేవారు 'మరి నీ సంగతేమిటి?' అనవచ్చు. వారి కోసం కొసరుగా నా గురించి రాస్తున్నాను. వ్యక్తిగా - నేను విమర్శలు చేస్తాను, వింటాను. నాకు లాజిక్‌ అంటే నమ్మకం. ఎవరినైనా విమర్శించినపుడు దానికి కారణాలేమిటి అనేది తార్కికంగా బోధపరుస్తాను. తర్వాత మీ యిష్టం అనేస్తాను. అవతలివాళ్లను మెప్పించే మెరమెచ్చు మాటలు మాట్లాడడం కంటె నిక్కచ్చిగా మాట్లాడడం మంచిదని, అంత్యనిష్ఠూరం కంటె ఆది నిష్ఠూరం మేలని నమ్మి ఆచరిస్తాను. నా సన్నిహితులకు నా మాటల ధోరణి తెలుసు. అప్పటికప్పుడు చికాకు పడినా, పోనుపోను నా విమర్శలో వాస్తవం వుందని గ్రహించినవారే నాతో ఉంటారు. ఉద్యోగంలోనూ అలాగే వున్నాను. పెద్దపెద్ద వాళ్లతో మసలినపుడూ అలాగే వున్నాను. నచ్చకపోయినా నచ్చిందని అనడానికి నాకు నోరు రాదు. ఎందుకు నచ్చలేదో చెప్పగలగడానికి చాలా కసరత్తు చేస్తాను. విమర్శ కూడా సిన్సియర్‌గా చేస్తాను. ఇక నన్ను ఎవరైనా విమర్శించినపుడు శ్రద్ధగా వింటాను - చిన్నవాళ్లయినా, పెద్దవాళ్లయినా సరే! దాని గురించి ఆలోచిస్తాను. వారిది కరక్టయితే ఆ సలహా అనుసరిస్తాను. నాది పొరపాటైతే సారీ చెప్పడానికి ఏ మాత్రం వెనకాడను. ఎవరైనా పనిగట్టుకుని తప్పులు పడుతూ వుంటే, ఓ రోజో, రెండు రోజులో మథన పడతాను. తర్వాత ఆలోచించడం మానేస్తాను. 

రచయితగా ఎదుర్కునే విమర్శల గురించి చెప్పాలంటే - పొగిడినపుడు సహజంగానే ఆనందపడతాను. సరైన బాటలోనే నడుస్తున్నానన్నమాట అనుకుంటాను. కానీ నా వైపు నుంచి స్పందన పెద్దగా వుండదు. ఈమెయిల్‌ రాస్తే 'థాంక్స్‌' అనే ఒక్క మాటతో జవాబు రాస్తాను. కామెంట్స్‌ బాక్స్‌లో అయితే ఆ స్పందనా వుండదు. ఒకరిద్దరు ఆ విషయాన్ని ఎత్తిచూపారు కూడా. మన సమాజంలో బాగులేనప్పుడే చెప్తారు తప్ప బాగుంటే చెప్పరు. దానివలన ప్రశంసలకు ఎలా రియాక్టవాలో మనకు తెలియదు. చిరునవ్వు చిందించి వదిలేస్తాం. ఫోన్‌ చేసి మెచ్చుకునేవారితో కూడా వ్యవహారం యిలాగే ఉంటుంది. సంభాషణ ముందుకు సాగదు. అదే బాగాలేదన్నారనుకోండి, అప్పుడు నాకు ఆసక్తి పెరుగుతుంది. 'ఎందుకు బాగాలేదనిపించింది?' అని అడిగి తెలుసుకుంటాను. నా కథలో/వ్యాసంలో సరిగ్గా చెప్పలేకపోయానని తోచినపుడు వివరిస్తాను. ఈ మెయిల్స్‌లో కూడా నా తరఫు వాదనను వినిపిస్తాను. వాటిపై టైము వేస్టు ఎందుకు చేస్తావ్‌? అవతలివాడు పెద్ద విమర్శకుడా ఏమన్నానా? అని కొందరంటారు. 

''హాసం'' పత్రిక నడిపే రోజుల్లో తెగ ఉత్తరాలు, ఫోన్లు వచ్చేవి. మెచ్చుకునే ఫోన్లను 2, 3 నిమిషాల్లో కట్‌ చేసేవాణ్ని. తిడుతూ ఉత్తరం రాసినవాళ్లకు ఫోన్లు చేసి మా సమస్యలు వివరించేవాణ్ని. మా యిబ్బంది తెలిశాక ఓహో అలాగా అనేవారు. ఇరువైపులా జ్ఞానం పెరిగినకొద్దీ అపోహలు తగ్గి, అవగాహన పెరుగుతుంది. విమర్శకుడికి తెలివిడి పెరగడం అందరికీ మంచిది. స్వాభావికంగా నేను విమర్శలకు సెన్సిటివ్‌. మనను తిట్టిన ఒక వ్యక్తి వెనుక అలాటి అభిప్రాయాలున్న మరో పదిమంది వున్నారని, వాళ్లు బద్ధకం చేతనో, రాయడం దండగ అనే అభిప్రాయంతోనో రాయలేదనీ నా నమ్మకం. అందువలన మెయిల్‌ రాసినతనితో చర్చకు దిగుతాను. దీనివలన అవతలివారి దృక్కోణం మరింత విశదంగా నాకు తెలుస్తుంది. ఘర్షణ వలననే వెలుగు వస్తుంది. వేడీ వస్తుంది. వేడిని సహిస్తే వెలుగు మన జ్ఞానాన్ని మరింత ప్రకాశవంతం చేస్తుంది. నా దృక్పథమే కరక్టు అని నేననను.  'ఏకం సత్‌, విప్రాః బహుధా వదన్తి' అని వచించే భారతీయ తత్త్వమైన బహుళత్వం (ప్లూరాలిటీ)పై నాకు అపార నమ్మకం. గణాంకాలు అవే కావచ్చు, కానీ చూసే కోణంలో తేడా వుండవచ్చు. ఎవరి దృక్కోణం వారిది అనే వివేచనతో భిన్నధోరణినిని గుర్తించి, ఓహో అనుకుంటాను.

అయితే కొందరు ఉత్తిపుణ్యాన వాదనకు దిగుతారు. అసందర్భంగా, అవకతవకగా వాదిస్తారు. దాన్ని ఒకసారి ఎత్తిచూపి, యింకా మారకపోతే వదిలేస్తాను. వాళ్లకు వాళ్ల భావాల ప్రచారానికి, వాళ్ల పార్టీప్రచారానికి కామెంట్‌ బాక్స్‌ను వేదికగా ఉపయోగించు కుంటున్నారని నాకర్థమై పోతుంది. నేను రాసినదాని గురించి వ్యాఖ్యానించకుండా రాయనిదాని గురించి లేక మరొకరు రాసినదాని గురించి రాస్తారు. నువ్వు అలాటివాడివి, యిలాటివాడివి అని నింద వేస్త్తారు. నేను కాంగ్రెసు/కమ్యూనిస్టు/వైసిపి అభిమానిని అంటారు. ఏకకాలంలో మూడు పరస్పర విరుద్ధమైన పార్టీలకు ఎలా అభిమాని నవుతానో నాకే అర్థం కాదు. వాటికి ఓటేయమని నేను రాసిన వాక్యాలేమైనా వుంటే చూపండి అంటాను. చూపరు. స్పష్టంగా రాయకపోయినా అలాటి భావం వచ్చేట్లా రాశావు అంటారు. ఎక్కడ? రుజువేది? అంటాను. చెప్పరు. పోనీ వాళ్లను నేను విమర్శించిన వ్యాసాలు చూశారా అంటాను. బదులు చెప్పరు.  మోదీ పాలనలో లోపాల గురించి రాస్తే అయితే రాహుల్‌ను ప్రధాని చేయాలా అంటారు. బాబు పాలనలో లోపాల గురించి రాస్తే అయితే జగన్‌ను సిఎం చేయాలా? అంటారు. డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌లో రోగం వుందా లేదా అని చర్చించాలి తప్ప దీనికి మందు లేదు కాబట్టి రోగమే కాదు అని వాదించకూడదు. రోగాన్ని నిర్ధారిస్తే ఏదో ఒక పతీలో మందు వుందేమో వెతకవచ్చు. లేకపోతే రోగాన్ని భరించనూవచ్చు.  

ఆధారాలతో వాదించేవారితో వ్యవహరించడం సులభం. అపోహలతో వాదించేవారిని పట్టించుకోకపోవడం ఆరోగ్యకరం. నేను ఎప్పుడూ అడిగేది - యధార్థాలు తారుమారు చేస్తున్నానా చెప్పండి, గణాంకాలు తప్పా చెప్పండి అని. దాన్ని ఖండించాలంటే కాస్త హోంవర్కు చేయాలి. ఆ ఓపిక వుండదు. అత్యంత సులభమైనదేమిటంటే నువ్వు ఫలానా వాడి దగ్గర డబ్బు తిని యిలా రాశావ్‌ అనడం. అదెలా సాధ్యం అనే ఆలోచన కూడా చేయరు. మనకు నచ్చనివాణ్ని ఏదో ఒకటి అన్నామన్న తృప్తి చాలు వారికి. కొంతమంది బూతులు వాడతారు. వాళ్ల పెంపకం అలాటిది. బహిరంగ వేదికలపై ఎలాటి భాష వాడాలో తెలియనివారికి 'ఇది పద్ధతి కాదు, సరిగ్గా మాట్లాడితే జవాబిస్తా' అని చెప్పేసి వదిలేస్తాను. వాళ్ల సంస్కరించడం వాళ్ల అమ్మానాన్నాగురువుల వలననే కాలేదు, మన వల్ల ఏమవుతుంది? వ్యతిరేకమైన విమర్శలు వచ్చాయి కదాని నేను చెప్పదలచినది మానను. సమైక్యవాదానికై నిలబడినపుడు చాలా బెదిరింపు మెయిల్స్‌ వచ్చేవి. అయినా చెదరలేదు. చెప్పాలంటే ఏ ప్రశంసా, ఏ అభిశంసనా నా నిద్రను ఎన్నడూ చెడగొట్టలేదు. ఇదీ విమర్శల పట్ల నేను వ్యవహరించే తీరు. ఇప్పటిదాకా పెద్దగా సమస్యలేమీ రాలేదు.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2017)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?