Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: శత్రువులతో వ్యవహరించడం ఎలా?

ఎమ్బీయస్‌: శత్రువులతో వ్యవహరించడం ఎలా?

ఎవరో మనమీద పడి ఏడుస్తున్నారనే అనుమానంతో భయపడి, బాధపడి మనం ఏడవడం అనవసరం. 'ఏడిచేవాళ్లని ఏడవనీ, నవ్వేవాళ్ల అదృష్టమేమని ఏడిచేవాళ్లనీ ఏడవనీ' అని పాత తెలుగు సినిమాలో పాట ఉంది. వాళ్ల అసూయ మనను డైరక్టుగా ఏమీ చేయలేదు. అయితే కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష శత్రువులు ఏర్పడతారు. ఫ్యాక్షనిస్టుల సంగతి వదిలేయండి. అది తరాల పాటు సాగినా, ఏవో కొద్ది కుటుంబాలకు మాత్రమే పరిమితం. మామూలు సందర్భాల్లో మన కొన్న స్థలం ఎవడో కబ్జా చేశాడు, లేదా అమ్మినవాడు సరైన టైటిలు లేకుండా మనకు అంటగట్టాడు. మన పొలానికి పక్కవాడితో సరిహద్దు వివాదం వచ్చింది, నీళ్లు ఆపేశాడు. చవగ్గా అమ్మమని బెదిరించాడు. వీళ్లంతా శత్రువులే, పేచీ తప్పదు. విడాకుల కేసు నడిచినంతకాలం భార్యాభర్తలు శత్రువుల్లాగానే వ్యవహరిస్తారు.

కేసు అటోయిటో తేలేవరకు శత్రుత్వం కొనసాగుతుంది. కొనసాగినంత కాలం చికాకే. దాన్ని ఏ మేరకు సీరియస్‌గా తీసుకోవాలన్నదే ప్రశ్న. 'తన కోపమె తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష..' అనే పద్యం అక్షరసత్యం. శత్రువు పట్ల కోపం వహించినంతకాలం అది అవతలివాణ్ని ఏమైనా చేస్తుందో లేదో తెలియదు కానీ మనను మాత్రం దహిస్తుంది. శరీరానికి అనారోగ్యం కలిగిస్తుంది. జాతకచక్రంలో ఆరోస్థానం - శత్రువులను, అనారోగ్యాన్ని, ఋణాలను సూచిస్తుంది. ఆలోచిస్తే తక్కిన రెండూ కూడా మనకు శత్రువులే. అప్పిచ్చేవరకూ ఋణదాత మనకు మిత్రుడే, కావలసినవాడే. అప్పు చెల్లించే సమయం వచ్చేసరికి అతను శత్రువు, కానివాడు అయిపోతాడు. మనం వెళ్లేదారిలో అతను ఎదురుపడి పలకరించినా చికాకు పడతాం.

శత్రువుని క్షమించమని ధార్మిక గ్రంథాలు చెప్పే సూక్తులు వింటే ఒళ్లు మండుతుంది. కానీ నిదానంగా, లోతుగా ఆలోచిస్తే అది సర్వదా క్షేమదాయకమని అర్థమౌతుంది. ఇరుపక్షాల వారూ తమదే రైటనీ, తమెంత ఉదారంగా వున్నా అవతలివాడు శత్రుత్వం పూనాడనీ పోనీకదాని తప్పుచేసిన ఎదుటివాణ్ని క్షమించానని, కాబట్టి తనదే పైచేయి అనుకుని అహం చల్లార్చుకుని రాజీపడినా పొరపాటేమీ లేదు. ఎలాగోలా నిప్పు చల్లారడమే ముఖ్యం. అలా కాకుండా 'వాడి అంతు చూస్తాను' అని యిద్దరిలో ఏ ఒకరు అనుకున్నా ప్రమాదమే. ఎదుటివాడికే కాదు, అనుకున్నవాడికి కూడా! ఎందుకంటే అప్పణ్నుంచి శత్రువు ఎప్పుడు ఏం చేస్తున్నాడు, ఎలా వున్నాడు, ఎవరితో వున్నాడు, నా మనుషులను తనవైపు తిప్పుకుంటున్నాడా, వాడి తర్వాతి ఎత్తు ఏమిటి, విరుగుడుగా మనమేం చేయాలి? అనే ఆలోచనలతోనే సతమతమవుతాడు.

ఏ చెట్టులో చింత అనే యీ అగ్ని వుంటుందో ఆ చెట్టే కాలిపోతూ వుంటుంది. పాండవులను అరణ్యవాసానికి పంపిన దుర్యోధనుడు హాయిగా కూర్చున్నాడా? వాళ్లు అడవిలో ఎలా వున్నారు, కొత్త అస్త్రాలు సమకూర్చుకుని బలపడుతున్నారా, తనపై పడి ఏడ్చుకుంటున్నారా అనే ఆలోచనల్లో నిరంతరం మునిగి తేలాడు. గూఢచారులను పంపి తెలుసుకోవడంతో తృప్తి చెందకుండా స్వయంగా ఘోషయాత్రకు బయలుదేరి శృంగభంగమై తిరిగి వచ్చాడు. కురు సామ్రాజ్యానికి రారాజై వుండి కూడా ఎందుకీ దుర్గతి అంటే శత్రువు గురించి ఎక్కువగా ఆలోచించడం వలననే అనే సమాధానం వస్తుంది. ఓకే, మనం ఆలోచించకపోయినా వాడు ఆలోచిస్తాడుగా, అదాటున వచ్చి మన పుట్టి ముంచితే..? మనం సిద్ధంగా లేకపోతే యిబ్బందే కదా! అవును, యిబ్బందే! కానీ థియరీ ఆఫ్‌ ప్రాబబులిటీ ప్రకారం చూస్తే తక్కిన కష్టాల లాగానే యీ శత్రుబాధ కూడా వాస్తవం కంటె ఊహ ఎన్నో రెట్లు ఎక్కువ. వాడికి మనం ఒక్కళ్లమే శత్రువులం కాదేమో! వాడి శక్తికుయుక్తులు పదిమంది మీదా పంచేసరికి మజ్జిగ పల్చన అవుతుందేమో! కాస్త జాగ్రత్తలో వుంటూ బండ నెత్తిన పడ్డాకనే రియాక్టు కావడం మంచిది. ఏ క్షణాన పడుతుందోనని అనుక్షణం భయపడుతూ వుంటే పిచ్చెక్కడం ఖాయం. పూర్వం విష్ణుద్వేషి ఐన ఘంటాసురుడనే రాక్షసుడు వుండేవాట్ట. ఒళ్లంతా గంటలు కట్టుకుని విష్ణువు పేరు వినబడగానే అది చెవిన పడకుండా గంటలు వాయించేవాడు. 

నిరంతరం అదే ధ్యాసతో విష్ణువు పేరు కోసం పరమభక్తుడి కంటె ఎలర్ట్‌గా వుండేవాడు. మనసు నిండా విష్ణువుని నింపుకోవడంతో అతనికి మోక్షం వచ్చిందట. ఇంకో కథ ఉంది. ఓ పతివ్రత యింటి ఎదురుగా ఓ వేశ్య ఉండేది. ఆ వేశ్య తన వృత్తి చేసుకుంటూనే అనుక్షణం యీ పతివ్రతను  తలచుకునేది - యీపాటికి ఆవిడ స్తోత్రం ముగించుకుని నైవేద్యం పెడుతూ వుంటుంది... యిలా. ఇక పతివ్రతకి నిరంతరం పతిత గోలే. పూజ చేస్తున్నా ఆవిడ మనసు ఎప్పుడూ 'యీపాటికి అది ఫలానావాడితో శయనించి వుంటుంది. ఫలానా భంగిమలో వుండుంటుంది..' అంటూ. చివరకి పతివ్రతకు నరకం, పతితకు స్వర్గం దక్కాయట. అదేమంటే నీ మనసు దేని మీద లగ్నమై ఉంటుందో దానిగానే నువ్వు మారతావు అని యమధర్మరాజు చెప్పాడట. భ్రమరకీటకన్యాయం ఇదే కదా! శత్రువు గురించి నిరంతరం ఆలోచిస్తే మనకు కూడా శత్రువు లక్షణాలే పట్టుబడతాయి. 'టు బి రాంగ్‌డ్‌ ఆర్‌ రాబ్డ్‌ యీజ్‌ నథింగ్‌ అన్‌లెస్‌ యూ కంటిన్యూ టు రిమెంబర్‌ యిట్‌' అంటాడు కన్‌ఫ్యూషియస్‌. ఎవడైనా మీకు అన్యాయం చేశాడు, లేదా దోచుకున్నాడు అనుకోండి. దాని గురించి మీరు గుర్తు పెట్టుకుని చింతిస్తూన్నంత కాలమే అది మిమ్మల్ని బాధిస్తుంది. మీరు మర్చిపోయారనుకోండి దాని ప్రభావమే ఉండదు. 

ఇవన్నీ చెప్పడం సులభం కానీ ఆచరణలో చాలా కష్టం. ముఖ్యంగా నమ్మకద్రోహాలు మర్చిపోవడం మరీ కష్టమే కానీ మర్చిపోగలిగితే చాలా మంచిది. మనకు ఎక్కువ బాధ కలిగించే ఘట్టాలేమిటంటే మన వల్ల ఉపకారాలు పొందినవారు శత్రువులు కావడం. అలాటప్పుడు కర్మ సిద్ధాంతాన్ని, దేవుణ్ని నమ్మడం మేలు. 'వాడికి ఆ ఉపకారం జరగాలని రాసిపెట్టి వుంది, అందువలన దేవుడు నా చేత అలా చేయించాడు, ఇప్పుడు చేసింది చాల్లేరా అని నా మీద జాలి పడి వాళ్లతో వైరం కలిగించాడు.' అనుకోవడం సుఖం. మనకు టీవీ సీరియల్స్‌లో, సినిమాల్లో పగ సాధించినవాళ్లే ఘనులుగా చూపిస్తారు. అందువలన శత్రువులు లేరని చెప్పుకున్నవాడు మన దృష్టిలో చేతకానివాడు. కానీ ఔదార్యం (షివల్రీ) చూపించి, శత్రువును మిత్రుడిగా చేసుకున్నవాడే అసలైన విజేత. అలెగ్జాండరు యుద్ధభూమిలో పురుషోత్తముణ్ని ఓడించి కూడా స్నేహహస్తం చాచాడని యీ సందర్భంలో గుర్తు చేసుకోవాలి.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2017)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?