Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: కశ్మీరు మహిళలలో డ్రగ్‌ వాడకం

ఎమ్బీయస్‌: కశ్మీరు మహిళలలో డ్రగ్‌ వాడకం

తెలుగు సినిమారంగంలో డ్రగ్‌ వాడకం గురించి మన దగ్గర చాలా చర్చ జరుగుతోంది. భారీ బజెట్‌లతో సినిమాలు తీసేటప్పుడు వాటి జయాపజయాలపై ఆందోళన పడి టెన్షన్‌ తట్టుకోలేక సంబంధిత వ్యక్తులు మద్యానికో, మాదకద్రవ్యాలతో బానిసలు కావడం జరుతోందని అర్థం చేసుకోవచ్చు. డబ్బో, పేరో పోతుందన్న భయంతోనే డ్రగ్స్‌కు అలవాటు పడితే, మరి మరుక్షణంలో ప్రాణాలుంటాయో లేదో తెలియనివాళ్లు అలవాటు పడరా? కశ్మీర్‌లో రెండు దశాబ్దాలుగా శాంతి భద్రతలు బొత్తిగా లేవు. ఓ పక్క మిలిటెంట్లు, మరొక పక్క సైన్యం సాధారణ జనజీవితాన్ని అతలాకుతలం చేసేశారు. ఎవరు కాల్చిన గుండు తమను పొట్టన పెట్టుకుంటుందో తెలియదు. అక్కడి పౌరులందరూ ప్రాణాలకు తెగించి పోరాడే మిలిటెంట్లు కారు. తమ ప్రాంతాలు శాంతియుతంగా వుండి యిబ్బడిముబ్బడిగా టూరిస్టులను ఆకర్షించాలని, తమకు ఆదాయం చేకూరాలని, తాము తమ కుటుంబసభ్యులు ఆనందంగా వుండాలని కోరుకునేవారే ఎక్కువ. కానీ అక్కడ నెలకొన్న కల్లోల పరిస్థితి కారణంగా  లక్ష మంది దాకా చనిపోయారు. వేలాది యువతులు వితంతువులు అయ్యారు, రమారమి లక్ష మంది పిల్లలు అనాథలయ్యారు. కర్ఫ్యూలు, కాల్పులు, గ్రెనేడ్‌ బాంబుల పేలుళ్లు, ఇంటింటా సెర్చ్‌ ఆపరేషన్స్‌ నిత్యకృత్యం అయిపోయాయి. 20 ఏళ్లగా తల్లులు తమ పిల్లలను ఆడుకోవడానికి వీధుల్లోకి పంపటం లేదు. భర్త, సోదరుడు లేదా కొడుకు తీవ్రవాదిగా మారతాడేమోనని  భయపడే స్త్రీలు ఎక్కువై పోయారు. నిరంతర మానసిక ఆందోళన కారణంగా వైవాహిక జీవితంలో కలతలు వస్తున్నాయి. ఒక యువకుడు మరణించినా, లేక అనుమానం చేత ఖైదుపాలయినా అతని భార్య అనాథ అవుతోంది. అతని తలిదండ్రులకు ఆసరా పోతోంది. తీవ్రవాదులకు, సైన్యానికి మధ్య నలిగిన ప్రజలు టెన్షన్‌ తట్టుకోలేక మానసిక రోగులవుతున్నారు. సహజంగా సున్నిత స్వభావులైన స్త్రీలు వీటిని తట్టుకోలేక నిద్రమాత్రలకు, తేలికపాటి మాదకత్వం కలిగించే కాఫ్‌ సిరప్‌లకు అలవాటు పడుతున్నారు.

ఈ పరిస్థితి గమనించిన శ్రీనగర్‌వాసియైన ఒక డాక్టరు 2010లో శ్రీనగర్‌లోని ప్రభుత్వాసుపత్రి ఐన శ్రీ మహారాజా హరిసింగ్‌ హాస్పటల్‌ వారి వద్దకు వెళ్లి మానసిక రోగులకు వారి కాంపౌండులోనే ఒక బిల్డింగు కట్టమని కోరాడు. 'ఇక్కడెందుకు? విడిగా కట్టవచ్చు కదా' అంటే 'మానసిక వైద్యశాలకు వెళ్లాలంటే చిన్నతనంగా వుంటుంది. అందుకని జనరల్‌ హాస్పటల్‌లోనే ఓ మూల యీ విభాగం పెడితే ఎవరూ ఎత్తిచూపరు. మనం విడిగా బోర్డు కూడా పెట్టనక్కరలేదు. అక్కడ మానసిక చికిత్స అందించడంతో బాటు డ్రగ్స్‌ అలవాటు మాన్పించే చికిత్స కూడా అందిద్దాం.' అని కన్విన్స్‌ చేశాడు. సరే అని దాని నిర్మాణం మొదలుపెట్టారు. అది నిర్మాణంలో వుండగా డాక్టరు అటువేపు వెళుతూ ఎంతవరకు వచ్చిందోని చూడబోయాడు. అక్కడ టాయిలెట్స్‌ చూస్తే మగవాళ్లకు మాత్రమే కట్టి వున్నాయి. 'ఆడవాళ్ల కెక్కడ?' అని ఆర్కిటెక్ట్‌ని అడిగితే అతను తెల్లబోయాడు. 'ఇది డి-ఎడిక్షన్‌ సెంటరన్నారు కదా! ఆడవాళ్లెందుకు వస్తారు?' అని. ఆడవాళ్లు డ్రగ్స్‌ తీసుకోవడం వూహించలేకపోయాడతను. పోనుపోను పరిస్థితి ఎంత అధ్వాన్నంగా తయారైందంటే డ్రగ్‌ తీసుకునేవారిలో మహిళల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్శిటీ నిర్వహించే స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ విద్యార్థిని 2012లో నిర్వహించిన ఒక అధ్యయనంలో 26-30 సం.ల మధ్య వయసులో వున్న స్త్రీలలో 75% మందికి 'గేట్‌వే డ్రగ్స్‌' (డ్రగ్స్‌కు దారి తీసే తొలిదశ మాదక ఔషధాలు) గురించి తెలుసు. వారితో పోలిస్తే మగవాళ్లలో 22% మందికే తెలుసు. నిజానికి ఆ సర్వేలో పాల్గొన్నవారి సంఖ్య చాలా తక్కువ. శ్రీనగర్‌, అనంత్‌నాగ్‌, బారాముల్లా, పుల్వామా, బుడ్‌గాం లలో కలిపి మొత్తం 250 మందిని మాత్రమే ఎంపిక చేసుకున్నారు. కానీ మహిళల డ్రగ్‌ వాడకంపై అది ఒక అవగాహన కల్పిస్తోంది. 'ఆడవాళ్లు డ్రగ్స్‌ తీసుకుంటారా?' అని అడిగితే 72% మంది మగవారు, 50% మంది ఆడవాళ్లు 'ఆహా, తీసుకుంటారు' అని జవాబిచ్చారు.

కశ్మీరులో గొడవలు రావడానికి ముందు రోజుల్లో గ్రామీణ మహిళలకు హుక్కా , గంజాయి పీల్చే అలవాటు వుండేవి.   అవి కూడా మత్తు కలిగిస్తాయి. ఇప్పుడీ కల్లోల పరిస్థితి వచ్చాక నగరంలోని యువతులకు మందుల షాపులో దొరికే సెడటివ్స్‌, ట్రాన్‌క్విలైజర్లు, ప్రోక్సీవన్‌ టాబ్లెట్లు, న్యూరో-టాక్సిక్‌ డ్రగ్స్‌ విచ్చలవిడిగా వాడడం అలవాటయింది. గతంలో కశ్మీర్‌లో అక్షరాస్యత తక్కువ, మహిళలలో మరీ తక్కువ. పోనుపోను పరిస్థితులు మారి ఆడవాళ్లు కూడా చదువుకుని డిగ్రీలు సంపాదించుకున్నారు. అయితే తలిదండ్రులు వాళ్లను పై చదువులకు కానీ, ఉద్యోగాలకు కానీ బయట వూళ్లకు పంపటం లేదు. ఉన్న వూళ్లో కూడా దూరంగా పంపటం లేదు. చదువుకుని యింట్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవడం వలన వాళ్లకి ఫ్రస్ట్రేషన్‌ పెరుగుతోంది. మత్తుమందులు తీసుకుంటున్నారు. నిజానికి వాళ్లు కాలేజీ వుండగానే యివి అలవాటవుతున్నాయి. సంఘవ్యతిరేక శక్తులు కాలేజీ కాంటీన్ల ద్వారా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నాయి. యువతీయువకులు వాటికి బానిసలవుతున్నారు. హైక్లాసు యువతీయువకులకు అది ఫ్యాషన్‌గా మారి, అలవాటు లేనివాళ్లను చాదస్తులుగా ముద్రవేసి చిన్నచూపు చూడడం కూడా వుంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి స్త్రీలు జిగురు తాగడం అలవాటు చేసుకుంటున్నారు. అది కూడా మత్తు కలిగిస్తుందట. ఏ స్టేషనరీ దుకాణంలోనైనా జిగురు సీసాలు దొరుకుతాయి. ఎవరికీ అనుమానం రాదు. 

యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటర్నేషనల్‌ డ్రగ్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం వారు 2008లో నిర్వహించిన సర్వే ప్రకారం అప్పటికే కశ్మీరులో 70 వేలమంది డ్రగ్స్‌ తీసుకునేవారున్నారు. వారిలో 4 వేల మంది మహిళలు. అదే సర్వే కశ్మీరు విద్యార్థులలో 70% మంది డ్రగ్స్‌ తీసుకుంటారని, వారిలో 26% మంది విద్యార్థినులని చెప్పింది. అనంత్‌నాగ్‌, పూల్వామా జిల్లాలలో దొంగతనంగా గంజాయి పంట వేసి వీళ్లకు సప్లయి చేస్తున్నారు. పోలీసులు, సైన్యం అప్పుడప్పుడు ఆ పంటలను కాల్చివేసి ధ్వంసం చేస్తూ వుంటారు. అయినా వేరే చోట సాగు చేస్తూ వుంటారు. హరిసింగ్‌ హాస్పటల్‌లో డ్రగ్‌ బాధితులను చికిత్స చేసే విభాగం తెరిచాక 2014లో 291 మందిని ఔట్‌ పేషంట్లగా, 119 మంది ఇన్‌-పేషంట్లగా ట్రీట్‌ చేశారు. వచ్చే ఏడాదికి 490 మంది ఔట్‌ పేషెంట్లు, 226 మంది ఇన్‌-పేషంట్లు, 2016 వచ్చేసరికి ఆ సంఖ్య 535 - 224 అయింది. ఈ ఏడాది యిప్పటికే 584 మంది ఔట్‌ పేషెంట్లు, 191 మంది ఇన్‌ పేషంట్లు నమోదయ్యారు. రాష్ట్ర హోం శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2014-16 మధ్య జమ్మూ, శ్రీనగర్‌, అనంత్‌నాగ్‌, బారాముల్లాలలో డీఎడిక్షన్‌ చేయించుకున్నవారి సంఖ్య 3864. వీరిలో  2260 మంది శ్రీనగర్‌ వాసులే. చికిత్స చేయించుకోని వారెందరున్నారో ఎవరికి వారు వూహించవలసిందే. చాలామంది పెయిన్‌ కిల్లర్స్‌ విపరీతంగా వాడి వాటికి అలవాటు పడుతున్నారు.  కశ్మీరు పరిస్థితి నానాటికీ దిగజారుతూండడంతో వీరికి యిప్పట్లో విముక్తి కలిగే సూచనలు కనబడటం లేదు. (ఫోటో - గంజాయి పంటను నాశనం చేస్తున్న సైన్యం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2017) 

[email protected]

 

 

 

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?