Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ కథలు: ఫ్యూజ్‌ పోయింది!

ఎమ్బీయస్‌ కథలు: ఫ్యూజ్‌ పోయింది!

''శోభను పెళ్లి చేసుకుని తీరతానని ఛాలెంజి చేసి మరీ చేసుకున్నావు గురూ, సెలబ్రేట్‌ చేసుకోవాల్సినంత విషయమే'' అన్నాడు గోపాలం ఓ చేత్తో సుబ్రహ్మణ్యం వీపు తడుతూ మరో చేత్తో విస్కీ గ్లాసులోకి ఒంపుతూ.

సుబ్రహ్మణ్యం చిరునవ్వు నవ్వుతూ అతనికి ఛీర్స్‌ చెప్పాడు. గ్లాసులు గలగలమన్నాయి. గలగలమంటూ వాళ్ల కబుర్లూ సాగాయి. ''శోభలాటి గడుగ్గాయిని లొంగదీసిన నీ విజయగాథ వినిపించాలిరా మణీ'' అని మిత్రులు అడిగినా మొదట్లో చెప్పలేదు గానీ గంటన్నరసేపు డ్రింకింగ్‌ సెషన్‌ సాగాక అతని ప్రమేయం లేకుండానే నాలుక వదులయ్యింది.

కొత్తగా పరిచయమైన పద్మారావు ''గురూ గారూ, మీ కథ సాంతం చెప్తేనే మాలాటి జూనియర్లకు ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది'' అనడంతో సుబ్రహ్మణ్యం చెప్పుకొచ్చాడు -

''చూడు పద్మారావ్‌! మగాడు తలచుకోవాలే గానీ ఏ ఆడదీ తలవంచకుండా ఉండలేదు. ప్రయత్నం గట్టిగా చేస్తే లొంగి తీరుతుంది. మొదట్లో ఇష్టం లేకపోయినా సరే, మనం ఓ పట్టు బట్టామంటే చాలు వశమయిపోతుంది. నా కేసు వింటే నీకే తెలుస్తుంది - మేం గుడివాడలో ఉండేటప్పుడు ఓ అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. నాలుగు వాటాలుండేవి. మా పక్కవాటాలోనే శోభ, వాళ్లన్నయ్య రాంబాబు, వాళ్ల అమ్మా, నాన్నా ఉండేవాళ్లు.

'ఈ శోభ వుంది చూసావూ, భలే అందగత్తెలే, అందానికి మించిన పొగరు కూడా ఉంది. నన్ను చూడగానే తల ఎగరేసేది 'నీ లెక్కేమిట'న్నట్లు. నేనూ చూశా, చూశా. మొదట్లో మనకెందుకులే అనుకున్నాను కానీ తన తలబిరుసు అణచడానికైనా పెళ్లి చేసుకుంటే బాగుంటుందనుకున్నా. కానీ వాళ్లకు పెద్దగా డబ్బు లేదు కాబట్టి మా నాన్న ఒప్పుకోడని తెలిసి ఎందుకొచ్చిన గొడవ అని ఊరుకున్నాను.

అప్పుడు నేను డిగ్రీ ఫైనలియర్‌. శోభ ఫస్టియర్‌. వాళ్లన్నయ్య నా క్లాసుమేటే కానీ ఒట్టి పుస్తకాల పురుగు. ఓ సారి వాళ్లింటికి ఎవడో జ్యోతిష్కుడు వచ్చాడు. శోభ జాతకంలో సప్తమాధిపతికి తృతీయాధిపతికి లింకు ఉందట. 'నీకు బాగా తెలిసున్నవాడే నిన్ను పెళ్లాడతాడు' అన్నాడు. 'నాకు మేనరికం ఎవరూ లేరే' అంది తను. 'మూడేళ్లుగా నేను తెలుసు కదా, నన్నే చేసుకుంటావేమో' అన్నాను నేను తనని ఏడిపిద్దామని.

''నిన్నా? ఛస్తే చేసుకోను. కావాలంటే పెళ్లే మానేస్తాను'' అంది విసురుగా, పెళుసుగా.

నాకు అరికాలి మంట తలకెక్కింది. ఆ క్షణంలోనే నిశ్చయించుకున్నాను. ఎలాగైనా సరే తననే పెళ్లి చేసుకోవాలని.

అదృష్టం మన వైపుంది. పదిరోజులు తిరక్కుండానే వాళ్లింట్లో ఓ రోజు రాత్రి ఎనిమిది గంటలకు కరెంటు పోయింది. ఆ పోర్షన్లో వైరింగు సరిగ్గా ఉండేది కాదు. ఫ్యూజ్‌ వేయాలంటే రాంబాబు గాడికి భయం. వాళ్ల నాన్న డ్యూటీ నుండి పదిగంటలదాకా రాడు. వాళ్ల అమ్మ నా దగ్గరకు వచ్చి ''మణీ, కాస్త మా ఇంట్లో ఫ్యూజ్‌ వేసి పెడుదూ'' అంది. సరే అని వెళ్లా.

''ఒరేయ్‌ రాంబాబూ, కాస్త టార్చిలైట్‌ వేయరా'' అంటే మనవాడేడి? లేడే. ''ఒరే, నువ్వు దూరంగా ఉండు. ఏదైనా షాకూ, గీకూ కొడుతుంది. ఇలా నా దగ్గరకు రా'' అంటూ వాళ్లమ్మ పిల్చుకుపోయింది. ఇద్దరూ వరండాలో కూచున్నారు. నాకు ఒళ్లు మండిపోయింది. అంటే నేను షాక్‌ కొట్టి టపా కట్టేసినా ఫర్వాలేదన్నమాట. ఆవిడా, పిల్లలూ మాత్రం నిక్షేపంలా వుండాలి.

స్టూలు దిగి పోబోతూంటే టార్చ్‌లైట్‌ వెలుతురు ఫ్యూజ్‌బాక్స్‌ మీద పడింది. ఎవరాని చూస్తే శోభ! చెప్పానుగా రౌడీ అని. స్టూలు పక్కనే నిలబడింది. ''షాక్‌ కొడుతుందని నీకు భయం లేదా?'' అన్నాను. 

''ఉంటే ఎందుకు వస్తాను? అసలు నీకు ఫ్యూజ్‌ వేయడం వచ్చా? భయపడి కింద పడతావా?'' అంది పెంకె ఘటం.

నాకు సర్రున కోపం వచ్చి రయ్యిన ఆ పింగాణీ ఫ్యూజ్‌ కాప్‌ లాగేను. కింద పడింది. రేదర్‌ పడబోయింది. శోభ ఛట్టున ఒంగి దాన్ని పట్టుకుంది. ఆ ఒంగడంలో ఆమె వెనుకభాగం అందుబాటులోకి రావడంతో చిన్నగా దరువు వేసేను. పైనుంచి ఏదో పడిందనుకుందేమో చూరుకేసి చూసుకుంటూ ఫ్యూజ్‌ కేస్‌ నా చేతిలో పెట్టింది. అందుకుంటూ లైట్‌గా గిల్లా.

వెంటనే నెత్తి మొత్తడానికన్నట్టు టార్చిలైట్‌ ఝుళిపించింది కానీ 'అమ్మోయ్‌' అని కేక పెట్టలేదు. అహంభావం అడ్డువచ్చిందేమో. ఏదైతేనేంలే, అమ్మయ్య అనుకున్నాను. బహుశా దానివల్లనే నాకు ధైర్యం పుట్టుకొచ్చిందనుకున్నాను. ఫ్యూజ్‌ వేసేసి మెయిన్‌ స్విచ్‌ ఆన్‌ చేసే ముందు ఒంగి ఆమె ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని ఒక ముద్దు లాగించేసాను. టార్చిలైటు రెండు చేతులా పట్టుకుందేమో చేతులు అడ్డుపెట్టలేకపోయింది. గింజుకోవడం మాత్రం గింజుకుంది.

ముద్దంటే పెట్టేశాను కానీ తర్వాత భయం వేసి కాళ్లు గజగజ వణికిపోయేయి. స్విచ్‌ వేయడం, స్టూలు మీదనుండి ఉరికి మా వాటాలోకి పరిగెట్టడం కన్ను మూసి కన్ను తెరిచేలోగా జరిగిపోయాయి.

మర్నాడు ఏదైనా గొడవ పెడుతుందేమోనని చూసాను. గొడవ పెట్టలేదు కానీ నన్ను కొరకొరా చూసింది.  చెప్పాను కదా గురూ, మగాడు తెగిస్తే ఆడది ఏమీ చేయలేదు. చూస్తూ, చూస్తూ రట్టు చేసుకోలేదు కదా.

దీ

తమాషా ఏమిటంటే వారం తిరక్కుండా మళ్లీ అదే టైముకి కరంటు పోయింది. ''ఈసారి అన్నయ్యను లైటు పట్టుకోమను'' అని గొడవ పెట్టింది శోభ. కానీ వాళ్ల అమ్మ చివాట్లేయడంతో చచ్చినట్లు నిలబడింది.  

ఎవరికీ వినబడకుండా ''క్రితం సారిలా చేస్తే అరుస్తా జాగ్రత్త'' అంది పళ్ల సందుల్లో నుంచి.

''సరే సరే'' అన్నాను కానీ చివర్లో మళ్లీ సేమ్‌ ట్రీటుమెంటు ఇచ్చా. ఈ సారి పారిపోయేముందు బోనస్‌గా పైన ఒత్తి  వదిలిపెట్టా. కిక్కురుమనలేదు పిల్ల!

ఓ పదిహేనురోజులు పోయాక మళ్లీ కరెంటు పోయింది. ఈ సారి శోభ ముందే జాగ్రత్తపడి దూరంగా నిల్చుంది. నేను ఒంగిన కొద్దీ తనూ దూరంగా జరిగింది. పట్టుదప్పి నేను పడబోతూంటే మాత్రం అసంకల్పితంగా నన్ను పట్టుకోబోయింది. నేనూ, ఆమె చుట్ట చుట్టుకుని పక్కనున్న మడతమంచం మీద పడ్డాం. లేద్దామనే ప్రయత్నంలో ఒకళ్లనొకళ్లం మరింత చుట్టుకుని దొర్లడం జరిగింది. ఆ రొమాన్సే వేరులే! దాంట్లో ఉన్న థ్రిల్‌ మొదటిరాత్రి కూడా కలగలేదంటే నమ్ము గురూ.

మంచం కిర్రుమనడం వల్ల కాబోలు వాళ్లమ్మ ''ఏమిటే ఆ చప్పుడు?'' అంది.

''మడతమంచం మణి కాలికి తగిలింది'' అంది జాణ జరిగినది చెప్పుకోలేక.

''వద్దంటూంటే నువ్వే దాన్ని దారికడ్డంగా వేసావ్‌'' అని కూతుర్ని కాస్త చివాట్లేసి ''కాస్త జాగ్రత్తగా చూసుకుని నడు నాయనా, ఫ్యూజు చప్పున వేసేయ్‌'' అంది నాతో వాళ్లమ్మ. స్విచ్‌ ఆన్‌ చేసి మారు మాట్లాడకుండా వచ్చేసాను.

నిజం చెప్పాలంటే శోభను చేసుకుంటానని మా నాన్నతో నేను గట్టిగా వాదించగలగడానికి ఆ మడతమంచం మీది కౌగిలే కారణం. కానీ ఆయన ఔననడానికి ఆర్నెల్లు పట్టింది. ఈ లోపున నాలుగైదుసార్లు కరెంటు పోవడం, శోభే టార్చిలైటు పట్టుకోవడం జరిగింది.  రెండుసార్లు ఎదురింటి చిన్నపిల్లను తోడుగా పెట్టుకుంది కానీ మూడుసార్లు మాత్రం నేనుకున్నది సాధించగలిగేను. ఏ మాట కా మాట చెప్పుకోవాలి. మొదట్లో చూపిన వ్యతిరేకత క్రమంగా తగ్గింది. అందుకే అంటాను - మగాడు తలుచుకుంటే ఆడదాన్ని గెలవడం అసాధ్యం కాదని.

గుడివాడ వదిలి విజయవాడ వచ్చేసిన ఏడాది లోపున నాకు ఉద్యోగం రావడంతో మా నాన్న గ్రహించేడు - వీణ్నిక ఆపలేంరా అని. పెద్దరికం నిలుపుకోడానికి సరేనన్నాడు. శోభ అభ్యంతరం చెప్పినా వాళ్ల నాన్న వినగలడా? ఆయనకీ గుంటూరు బదిలీ అయిందిలే. మా నాన్న పిలిచి మాట్లాడగానే వెంటనే సరేననేసాడు.

 మొదటిరాత్రే అడిగేను. ''నన్ను చేసుకోనని శపథం చేసావుగా మంగమ్మా, ఇప్పుడేం చేసినట్టు?'' అని. ఓడిపోయినవాళ్లు ఏం చేస్తారో అదే చేసింది. నవ్వేసి ''పోన్లెండి'' అనేసింది. అండీ అని గౌరవించడం కూడా నేర్చుకుంది చూశావా. అదిమాట మన పవరు!''

సుబ్రహ్మణ్యం కథ పూర్తవడంతో మిత్రులంతా హర్షధ్వానాలు చేసారు. అవి చెవిలో మార్మ్రోగుతుండగానే మర్నాడు ఆఫీసులో తెలిసింది - గుడివాడ ట్రాన్స్‌ఫరయింది. శోభ కూడా ఎంతో సంతోషించింది.

తన ఫ్రెండు నుంచి ఉత్తరం వచ్చినప్పుడు ఆమె సంతోషం రెట్టింపయింది. ''ఏమండీ, మనం ఇదివరకు అద్దెకున్న ఇంట్లో మా పోర్షన్‌ ఖాళీగా ఉందిట. అక్కడ వెళ్లి ఉందామా? ఫర్‌ ఓల్డ్‌టైమ్స్‌ సేక్‌!'' అంది కళ్లు మెరుస్తూండగా.

సుబ్రహ్మణ్యానికి ఆమెను చూస్తే ముచ్చట వేసింది. ''ఆ రొమాన్స్‌ గుర్తుకు తెచ్చుకోవడానికైనా అక్కడ ఉండవచ్చు. కానీ ఆ ఇంట్లో కరంటు ప్రాబ్లెమ్‌. మాటిమాటికి ఫ్యూజు పోతుంది. వైరింగు మార్పిస్తేనే ఆ ఇంటికి వెళదాం'' అన్నాడు ఆమె బుగ్గ మీద మీటుతూ.

ఆమె ఇతని బుగ్గ మీద చిటికేసి, ''ప్యూజెందుకు పోతుంది? మా ఇస్త్రీ పెట్టె పెట్టకపోతే సరి'' అంది.

''ఇస్త్రీ పెట్టేమిటి?'' అన్నాడు సుబ్రహ్మణ్యం తెల్లబోతూ.

''అబ్బ, అది పెడితేనే కదా ఫ్యూజ్‌ పోతుంది'' అంది శోభ నుదురు కొట్టుకుంటూ.

''మరి ఇస్త్రీ పెట్టె బాగు చేయించలేకపోయారా?''

''చాల్లెండి. అదెక్కడ బాగుచేయిస్తారోనని అపురూపంగా నా దగ్గరే దాచుకునేదాన్ని. నా కది బ్రహ్మాస్త్రం. నాకెప్పుడు కావాలంటే అప్పుడు బోర్డులో పెట్టడం, స్విచ్చి వేయడం, అంతే క్షణాల్లో మీరు హాజరు!'' అంది శోభ కిలకిలా నవ్వుతూ.

ఆ తర్వాత రొమాన్స్‌ విషయంలో సుబ్రహ్మణ్యం ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదు!

(స్వాతి వీక్లీ ఆగస్టు 1999)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?