Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: గుజరాత్‌ ఎన్నికలు - మోదీ ఆరోపణలు

 ఎమ్బీయస్‌: గుజరాత్‌ ఎన్నికలు - మోదీ ఆరోపణలు

      గుజరాత్‌ ఎన్నికలు కాదు కానీ మోదీ ఆరోపణలపై ఆరోపణలు గుప్పిస్తున్నాడు. రాహుల్‌ సోమనాథ మందిరానికి వెళ్లినపుడు దాన్ని వెక్కిరిస్తూ మోదీ జవహర్‌లాల్‌ నెహ్రూ సోమనాథ్‌ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించారనే అసత్యారోపణ చేశాడు. వల్లభాయ్‌ పటేల్‌ సోమనాథ పునర్నిర్మాణానికి వ్యాపారస్తుల సాయం తీసుకుని, దానికి బదులుగా వారికి కొన్ని కన్సెషన్లు యివ్వడాన్ని నెహ్రూ వ్యతిరేకించాడు. అంతేకాదు, రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవుల్లో ఉన్నవారు వ్యక్తిగతమైన మతకార్యక్రమాల్లో పాల్గొంటూ బాగుండదని బాబూ రాజేంద్ర ప్రసాద్‌కు సూచించాడు కూడా. రాజేంద్ర ప్రసాద్‌ వినకపోతే ఊరుకున్నాడు. అది సిద్ధాంతపరమైన అభిప్రాయభేదం తప్ప గుడి మళ్లీ కట్టకూడదని కానే కాదు. నెహ్రూ లేఖల్లో కానీ, ఉత్తర్వుల్లో కానీ ఏదైనా చూపిస్తే తప్ప ఈ ఆరోపణ నిలవదు. వల్లభాయ్‌ లేకపోతే గుడిని ఆ స్థాయిలో నిర్మాణం జరిగేది కాదనేది వాస్తవం. కానీ వల్లభాయ్‌ కాంగ్రెసు నాయకుడు, తప్ప జనసంఘ్‌ నాయకుడు కాడు. జనసంఘ్‌ను కొంతకాలం నిషేధించిన నాయకుడు. అది మోదీ గుర్తు పెట్టుకోవాలి. 

గుజరాత్‌లో బిజెపి ఎదురీత యీదవలసి వస్తోంది అని గ్రహించిన మోదీ తనను తాను అచ్చమైన గుజరాతీగా, తన ఓటమిని, అవమానాన్ని గుజరాత్‌కు ఓటమిగా, అవమానంగా, తన నొక అమరవీరుడిగా చిత్రీకరించుకునే ప్రయత్నం విపరీతంగా చేశాడు. గతంలో గుజరాత్‌లో సైతం హిందీలో ప్రసంగించిన మోదీ ఇప్పుడు గుజరాతీలోనే మాట్లాడుతున్నాడు. గుజరాత్‌ ఆత్మగౌరవ (అస్మిత) నినాదం ఎత్తుకున్నాడు. కాంగ్రెసు పార్టీ ఆంధ్రలో తన ముఖ్యమంత్రులను మార్చినపుడు ఎన్టీయార్‌ ఆత్మగౌరవం నినాదం ఎత్తుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రులను మార్చినది తనే కదా, ఇక మోదీ ఎవరిని తప్పు పడతారు? ఇప్పుడు గుజరాతీలను ఎవరైనా ఏమైనా అన్నారా? ఎక్కడ చూసినా వాళ్లే కదా? రాజకీయంగా, ఆర్థికంగా వాళ్లదే పెత్తనం కదా! ఫిర్యాదు చేయడానికి ఏముంది? అందుకని గతం తవ్వడం మొదలుపెట్టాడు. కాంగ్రెసు గుజరాత్‌ వ్యతిరేకి అన్నాడు. వల్లభాయ్‌ పటేల్‌, మొరార్జీ దేశాయి ఎన్నిక కాకుండా కాంగ్రెసు రిగ్గింగ్‌ చేసిందన్నాడు. మరి పటేల్‌, మొరార్జీ తిరగబడలేదేం? పార్టీ వదిలిపెట్టి వెళ్లలేదేం? గుజరాత్‌ను కాంగ్రెసు అంత మోసం చేస్తే మరి గుజరాత్‌ కాంగ్రెసును అన్ని సార్లు ఎందుకు గెలిపించింది? గత ఎన్నికలలో సైతం 38% ఓట్లెందుకు యిచ్చింది?

రాహుల్‌ది రాజకీయ వారసత్వం అంటాడు. పార్లమెంటులోని ఎంపీలలో 50% మంది రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినవారే. అమెరికాలో బుష్‌ది కూడా వారసత్వమే. బిజెపి దానికి అతీతంగా ఉందా? మోదీ రాహుల్‌కు ముస్లిం లింకు కూడా పెట్టాడు. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ ఎన్నిక కాబోవడం, ఔరంగజేబు వారసత్వమట.  ఔరంగజేబు నామినేషన్‌ వేసి చక్రవర్తి అయ్యాడా? తండ్రిని ఖైదు చేసి, సోదరులను చంపి అయ్యాడు కదా, రాహుల్‌కి తనకి పోలిక ఏమిటి? కాంగ్రెసుది మొగలాయీ సంప్రదాయం అని కూడా మోదీ అన్నాడు. మొగల్‌ సామ్రాజ్యంలో వారసత్వం సజావుగా సాగలేదు. అక్బరు తర్వాతి నుంచి ప్రతీసారి ఎన్నో కుట్రలు జరిగేవి. ఎందరో పోటీ పడేవారు. కాంగ్రెసులో ఆ పరిస్థితే లేదు. అందరూ ఆ కుటుంబానికి జీ హుజూర్‌ అనేవాళ్లే. హిందూ రాజులు మాత్రం ఎన్నికలు జరిపి యువరాజుకు పట్టాభిషేకం చేసేవారా? రాజరికపు పోకడ అంటే పోయేది. కానీ మొఘలాయి అంటూ ఎలాగోలా ముస్లిం లింకు పెట్టాలన్న తాపత్రయం తప్ప మోదీకి మరేమీ అక్కరలేదు. 

రాహుల్‌ ఎన్నికపై మోదీ వెక్కిరిస్తూ ఉంటే సల్మాన్‌ నిజామీ అనే ఒకతను రాహుల్‌ తండ్రి, నాయనమ్మ దేశంలో కోసం ప్రాణాలు విడిచారు, మరి మీ తండ్రి, తాతల మాటేమిటి? వాళ్లేమైనా త్యాగాలు చేశారా? అనే అర్థంలో ట్విటర్‌లో (రాహల్‌ సన్‌ ఆఫ్‌ రాజీవ్‌, గ్రాండ్‌ సన్‌ ఆఫ్‌ ఇందిరా, నరేంద్ర మోదీ సన్నాఫ్‌....? గ్రాండ్‌ సన్నాఫ్‌....?) రాస్తే నా తల్లీతండ్రీని అవమానిస్తాడా? ఇది యావత్తు గుజరాతీలకు అవమానం, యిది కాంగ్రెసు చేయిస్తోంది అని నానా యాగీ చేశాడు. అతను రాసినది తప్పే కావచ్చు, గాంధీ, నెహ్రూలకే యిటీవల దిక్కు లేకుండా ఉంది. నానా రాతలూ రాస్తున్నారు. ఈ నిజామీ రాసినది చట్టరీత్యా తప్పయితే అతనిపై చర్య తీసుకోవచ్చు. సోషల్‌ మీడియా కామెంట్స్‌కు చర్యలు తీసుకుంటున్నారు కదా. అతను తమ పార్టీ సభ్యుడేమీ కాదని కాంగ్రెసు మొత్తుకుంటూంటే వినకుండా ప్రధాని స్థాయి వ్యక్తి నిజామీ అనే అనామకుడికి యింత ప్రాముఖ్యత యివ్వడం దేనికి? హఫీజ్‌ సయీద్‌కు బెయిలు లభించినందుకు కాంగ్రెసు సంబరాలు చేసుకుందని మోదీ అభాండం వేశాడు కూడా.

మాట్లాడితే నన్ను చంపడానికి చూస్తున్నారనడం మోదీకి అలవాటు. నోట్ల రద్దు సమయంలో కూడా విఫలమైందని తెలుస్తూండగానే నల్లధనాన్ని అంతమొందిస్తున్నానని కొందరు నన్ను చంపాలని చూస్తున్నారు అనేశాడు. నల్లధనమూ, మోదీ యిద్దరూ క్షేమంగానే ఉన్నారు. మోదీ యుక్తులు తెలిసి కూడా వాచాలుడైన మణి శంకర్‌ మోదీని 'నీచ్‌ కిస్మ్‌కే ఆద్మీ హై' అన్నాడు. గతంలో మోదీని టీ అమ్ముతాడని ఎద్దేవా చేసి, అతనికి సింపతీ తెచ్చిపెట్టాడు. ఇప్పుడు యిది. అలా అనడం తప్పు. రెండో మాట లేదు. అయితే దాన్ని ఎక్కడి వరకు ఖండించాలో అక్కడి వరకే ఖండించాలి, అది పెట్టుకుని కథలు అల్లేయకూడదు. కిస్మ్‌ అంటే తరహా, మోదీ నీచమైన తరహా వ్యక్తి అన్నాడు మణి. దాన్ని మోదీ అతను నా కులాన్ని, జాతిని, పేదలను, గుజరాతీలను తిట్టాడు. నేను బిసి కాబట్టి అలా అన్నాడు అంటూ రెచ్చిపోయాడు. ఇక్కడ జాతి శబ్దం ఎక్కడ వచ్చింది. ఫలానావాడు నీచుడంటే వాడి కులసముదాయం, వాడి భాషాసముదాయం అందరూ నీచులని అర్థమా? ఒకవేళ కింది స్థాయి అనే అర్థం లాగి చూద్దామన్నా, బిసిలది మరీ అంత కింది స్థాయి ఏమీ కాదే! పైగా మోదీ కులమైన ఘాంచీలు కిరాణా వ్యాపారులుగా, నూనె వ్యాపారులుగా సాంఘికంగా మంచి హోదాలో ఉన్నవారే. 

బిజెపి ఎంపీలు కాంగ్రెసు నాయకులనే కాదు, హిందువేతరులను కూడా హరామ్‌జాదే వంటి నానా మాటలూ అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో క్షమాపణలు చెప్పించారు తప్ప పార్టీలోంచి తీసేయలేదు. కానీ ఎన్నికలలో ఓటమి భయంతో కాబోలు, కాంగ్రెసు వెంటనే స్పందించి మణిశంకర్‌ను పార్టీలోంచి తీసేసింది. అతనూ క్షమాపణ చెప్పాడు. తన సీనియర్‌ ఐన మన్‌మోహన్‌ను రెయిన్‌ కోటు వేసుకుని స్నానం చేసే మనిషి అని వెక్కిరించిన మోదీ ఎప్పుడూ విచారం వ్యక్తం చేయలేదు. మోదీ క్రమేపీ స్వరం పెంచుతూ పోయాడు. పాకిస్తాన్‌ను, ముస్లిములను, కాంగ్రెసును ఒకే గాట కట్టడానికి చూస్తున్నాడు. మణి తన కులాన్ని అన్యాయంగా దూషించాడని ఆరోపించడంతో ఆగని మోదీ, తనను చంపడానికి పాకిస్తానీలతో కలిసి కుట్ర పన్నాడని, వాళ్లకు 2015లోనే సుపారీ యిచ్చాడనీ తీవ్రమైన ఆరోపణ చేశాడు. నిజంగా ఎవరైనా భారతీయుడు తమ దేశ ప్రధానినే కాదు, విపక్ష నేతనైనా సరే చంపమని విదేశీయుడికి సుపారీ యిస్తే, ఆ విషయం తెలిసి కూడా రెండేళ్లపాటు మన ప్రధాని కిమ్మనకుండా, ఏ చర్యా తీసుకోకుండా ఉన్నాడంటే అతని గురించి ఏమనుకోవాలి? మాజీ ప్రధానిని చంపినందుకే, ఎల్‌టిటిఇని మట్టు పెట్టడానికి భారతీయులందరూ కంకణం కట్టుకున్నారే, ప్రధానిని పాకిస్తానీయులు చంపబోతున్నారంటే రక్తం సలసల మరగదా? ఆ స్థానంలో ఎవరున్నారది అనవసరం, ఎల్లయ్య, పుల్లయ్య ఎవరున్నా సరే మనం ఆవేశపడతాం. మరి మోదీలో అలాటి ఆవేశమే లేదా? 2015లోనే మణిశంకర్‌ను అరెస్టు చేయవద్దా? ఎందుకు చేయలేదు? 

మణిశంకర్‌ పాక్‌లో ఒక టీవీ చర్చలో 'మోదీని తొలగిస్తే తప్ప ఇండో-పాక్‌ మధ్య ప్రతిష్టంభన తొలగదు' అన్నాడు. అంతమాత్రం చేత హత్యకు కుట్ర చేసినట్లేనా? అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం ఫలానా వ్యక్తిని  పదవిలోంచి తొలగించింది అంటారు. అంటే చంపేసింది అని అర్థమా? బిజెపి వారికి వేరే నిఘంటువు ఉన్నట్లుంది. అయినా నాకు తెలియక అడుగుతాను - సుపారీ పాకిస్తాన్‌ వెళ్లినపుడే యివ్వాలా? హవాలాలో పంపలేరా? 2015లో యిస్తే యిప్పటిదాకా పని కాలేదేం? ఇదేమైనా నమ్మేట్లుగా ఉందా? మొదటి విడత ఎన్నికలప్పుడు యింతటితో ఆగిన మోదీ, రెండో విడత ప్రచారానికి వచ్చేసరికి డోసు పెంచాడు. మన్‌మోహన్‌ సింగ్‌, మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీలతో సహా పాకిస్తాన్‌ హై కమిషనర్‌, ఆ దేశ మాజీ విదేశీ వ్యవహారాల మంత్రి మణిశంకర్‌ యింట్లో మూడు గంటల పాటు రహస్యంగా సమావేశమయ్యారని, పాక్‌ సైనిక దళాల మాజీ డిజి గుజరాత్‌ ఎన్నికలలో జోక్యం చేసుకుని అహ్మద్‌ పటేల్‌ను ముఖ్యమంత్రి చేయడానికి పన్నాగం పన్నుతున్నారనీ మోదీ యింకో తీవ్రమైన ఆరోపణ చేశాడు. అహ్మద్‌ పటేల్‌ రాజ్యసభకు ఎన్నికై మోదీ, అమిత్‌ షాల అహంపై దెబ్బ కొట్టాడు. అందుకని కాబోలు 'నేను గుజరాత్‌ వదిలేసి చాలా ఏళ్లయింది, ముఖ్యమంత్రి అభ్యర్థిని కాను మొర్రో' అని అహ్మద్‌ మొత్తుకుంటున్నా 'బిజెపి అభ్యర్థిని తిరస్కరిస్తే ఒక ముస్లిమే మీకు ముఖ్యమంత్రి అవుతాడు జాగ్రత్త' అని మోదీ పదేపదే గుజరాత్‌ ఓటర్లను హెచ్చరించడానికి అతని పేరు వాడుకుంటున్నాడు. అమెరికా ఎన్నికలలో రష్యా కలగజేసుకుంటోందంటే దాన్ని అమెరికా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని విచారణలు జరిపిస్తోంది. గుజరాత్‌ ఎన్నికలలో పాక్‌ కలగజేసుకుంటూంటే మోదీ ఏం చేశాడు? విచారణకు ఆదేశించాడా? ఎన్నికలలో అంశంగా వాడుకోవడంతో సరిపెడుతున్నాడా? అలుగుటయే ఎరుగని అజాతశత్రువు మన్‌మోహన్‌కి కూడా కోపం వచ్చి మోదీ తనకు క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. ఆ సమావేశంలో  భారత్‌, పాకిస్తాన్‌లకు చెందిన అనేకమంది ప్రముఖులు, జర్నలిస్టులు, అధికారులు పాల్గొన్నారని, అది అందరికీ తెలిసినదే అనీ గుర్తు చేశారు. కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కూడా ఆ సమావేశం గురించి పత్రికల్లో వచ్చిందని ఒప్పుకున్నారు. మరి దీన్ని 'రహస్య' సమావేశం అని మోదీ ఎలా అన్నాడు?

 ఎన్నికల సమయంలో  పోచికోలు మాటలు సాధారణం. ఛోటామోటా లీడర్ల నోట వస్తే ఫర్వాలేదు. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి హుందాగా ఉండాలి. కానీ మోదీ యిలాటివి మాత్రం రోజుకొకటి మాట్లాడుతున్నాడు. అసలు అంశాలను పక్కదోవ పట్టించి, పనికి మాలిన విషయాలవైపు దృష్టి మరల్చి, తనను చంపడానికి విరోధులు ప్రయత్నిస్తున్నారని ప్రచారం చేస్తూ సానుభూతితో భారీ మెజారిటీ తెచ్చుకుందామని చూస్తున్నాడు. రాబోయే 2, 3 రోజుల్లో యింకా ఏ కొత్త ఆరోపణలు వినవస్తాయో చూడాలి. చివరకు యివన్నీ ఫలించి గుజరాత్‌లో 150 వస్తే రావచ్చు కానీ మర్యాదస్తుల దృష్టిలో మోదీ దిగజారతాడు. -

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2017)

[email protected]

 

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?