Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: గుజరాత్‌లో ఎన్నికల ఆతురత

 ఎమ్బీయస్‌: గుజరాత్‌లో ఎన్నికల ఆతురత

  ఈ డిసెంబరులో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. 19 ఏళ్లగా పాలిస్తున్న బిజెపికి వరుసగా నాలుగోసారి కూడా గుజరాత్‌ ఓటరు ఛాన్సిస్తాడా లేదా అనే ఉత్కంఠ పెద్దగా అక్కరలేదు. ఉత్తర ప్రదేశ్‌లోనే ఘనవిజయం సాధించిన మోదీ-అమిత్‌ ద్వయాన్ని సొంతరాష్ట్రంలో భంగపాటు కలిగించే పని గుజరాతీలు పెట్టుకోరు. మోదీ కేవలం ముఖ్యమంత్రిగా వుండే రోజుల్లో గుజరాత్‌ నుంచి బిజెపి ఎంపీలు ఓ మోస్తరుగా గెలిచేవారు. కానీ 2014 ఎన్నికలలో మోదీ ప్రధాని అభ్యర్థి అనేసరికి గుజరాత్‌లోని మొత్తం 26 పార్లమెంటు స్థానాలలో బిజెపికే ఓటేశారు. 60% ఓట్లు వచ్చాయి. అలా అని అన్నిటా బిజెపినే ఆదరిస్తారన్న గ్యారంటీ లేదు. ఉండి వుంటే మోదీ స్వయంగా ఎంపిక చేసిన ఆనందీబెన్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించేవారు కారు. పటేళ్ల ప్రయోజనాల కోసం హార్దిక్‌ పటేల్‌ చేపట్టిన ఉద్యమం విజయవంతం కావడం కూడా బిజెపిని చికాకు పెట్టింది. పటేళ్లు ప్రధానంగా వ్యవసాయదారులు, గ్రామవాసులు. 2015 నవంబరులో జరిగిన జిల్లా, తాలూకా పంచాయితీ ఎన్నికలలో 70% కంటె ఎక్కువ సీట్లు కాంగ్రెసు గెలిచింది. కానీ మునిసిపల్‌ కార్పోరేషన్లలన్నిటిలో బిజెపి గెలిచింది. అందుచేత బిజెపిని నగరప్రజలు, కాంగ్రెసుని గ్రామీణ ప్రజలు ఆదరించారని అనుకున్నారు.అందుకే ఆనందీబెన్‌ స్థానంలో విజయ్‌ రూపాణీని తీసుకుని వచ్చారు. రూపాణీ పరిపాలనలో సామర్థ్యం కనబరచడంతో బాటు, రాజకీయ చతురత కూడా ప్రదర్శిస్తున్నాడు. 

2017 జనవరిలో గ్రామ పంచాయితీ ఎన్నికలు పార్టీ రహిత విధానంలో జరిగాయి. నెగ్గిన పదివేల మందిలో ఎక్కువమంది మా వాళ్లే అని ఎన్నికల తర్వాత బిజెపి, కాంగ్రెసు రెండూ చెప్పుకున్నాయి.  సందేహాలు నివృత్తి చేయడానికి కాబోలు నెగ్గిన సర్పంచులతో బిజెపి ఒక సమావేశం ఏర్పరచింది. 7 వేల మంది హాజరయ్యారు. అంటే బిజెపివారే ఎక్కువగా నెగ్గారని తేటతెల్లమైంది. హార్దిక్‌ పటేల్‌ చిచ్చర పిడుగులా ప్రారంభమయ్యాడు కానీ అతి త్వరలోనే తడిసిపోయిన టపాకాయలా అయిపోయాడు. గుజరాత్‌లో బలం లేని శివసేనతో చేతులు కలవడం అతని అభిమానులను కలవరపరిచింది. జనాభాలో 12% మంది వున్న పటేళ్లు బిజెపికి, ఆరెస్సెస్‌కు ఎప్పుడూ వెన్నెముకలా నిలిచారు. హార్దిక్‌ వచ్చి దాన్నే హరించబోయాడని బిజెపి కంగారు పడింది. పటేళ్లపైన దృష్టి పెట్టి కొన్ని పథకాలు తయారుచేసింది. పటేళ్లకు కంచుకోట, గుజరాత్‌ ఆర్థికకేంద్రాల్లో ఒకటి అయిన సూరత్‌కు ఏప్రిల్‌ రెండోవారంలో మోదీ స్వయంగా వచ్చాడు. 11 కిమీల పొడుగునా రోడ్‌ షో ఏర్పాటు చేయించాడు. 25 అడుగుల ఎత్తున్న తన కటౌట్లు పెట్టించాడు. పటేల్‌ ప్రముఖులు సూచించిన అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాడు. వాటిలో హైటెక్‌ హాస్పటల్‌ ఒకటి. అక్కడే 12 వేల కోట్ల రూ.లతో నర్మదా నది ఆధారిత సౌనీ యోజనాను ప్రారంభించాడు. సౌరాష్ట్రలోని 115 నదులను 2019 నాటి కల్లా కలిపే ఆ ప్రాజెక్టు పూర్తయితే నదుల అనుసంధానంలో దేశంలో కల్లా పెద్ద ప్రాజెక్టు అవుతుంది. వ్యవసాయదారులైన సౌరాష్ట్ర పటేళ్లకు చాలా మేలు కలుగుతుంది. వాళ్లు బిజెపిని అంటిపెట్టుకుని వుంటారు. 

ఇలాగే రాజకీయ ప్రయోజనాలు కూడా కలగలిపిన 26 చట్టాలను రూపాణీ యిటీవలి అసెంబ్లీ సమావేశాల్లో పాస్‌ చేయించాడు. రూపాణీ వచ్చిన దగ్గర్నుంచి పార్టీకి, ప్రభుత్వానికి మధ్య అనుబంధం పెంచుతున్నాడు. శాంతిభద్రతలు మెరుగుపరిచాడు. సేవా సేతు అనే కార్యక్రమం పెట్టి రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించాలని చూస్తున్నాడు. తక్కిన రాష్ట్రాల లాగానే అక్కడా విద్య వ్యాపారమై పోయింది. ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు ముకుతాడు వేయాలని ప్రయివేటు స్కూళ్లలో ప్రైమరీ స్థాయిలో విద్యార్థి నుంచి సాంవత్సరిక ఫీజులకు పరిమితి విధించారు. ప్రైమరీ స్కూళ్ల కైతే 15 వేలు, సెకండరీకి 25, హయ్యర్‌ సెకండరీకి 27 వేలు. అంతకుమించి వసూలు చేసినవాళ్లకు రూ. 5-10 లక్షల జరిమానా. స్కూలు మూసేసే ప్రమాదం కూడా వుంది. ఇది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఆనందాన్ని కలిగించే విషయం. ఇతర బిజెపి పాలిత రాష్ట్రాలలో కూడా యిలాటి చట్టం తేవాలనే ఆలోచనలో వున్నారట. చాలా నగరాల్లో రోజు (అడ్డా) కూలీలు వుంటూ వుంటారు. వీళ్లకు పర్మనెంటు ఉద్యోగం వుండదు, రోజూ పని కూడా వుండదు. రోజూ పొద్దున్నే నగరాల్లోని ప్రధాన రహదారుల్లో ఓ చోట గుంపుగా కూర్చుని  వుంటారు. దొరికితే ఆ రోజుకి పని దొరికినట్లు. లేకపోతే పస్తే. వాళ్ల కోసం రూపాణీ 'శ్రామిక్‌ అన్నపూర్ణ యోజన' అనే పేర ఒక పథకం పెట్టాడు. 10 నగరాల్లో 88 రహదారుల్లో వున్న సుమారు 50 వేల మంది కూలీలకు రూ.10లకే భోజనం పెడతారు. పని దొరకనివాళ్లే అక్కడ భోజనం చేస్తారనుకోవాలి. ఇదొక మంచి పథకం. 

రైతు సంక్షేమానికి వస్తే వేరుశెనగ రేటు పడిపోయినప్పుడు, ప్రభుత్వమే వెయ్యి కోట్ల రూ.లు వెచ్చించి పంటను రైతుల నుంచి కొంది. అపరాల విషయంలో కూడా యిలాగే జరిగితే అప్పుడు రూ.400 కోట్లు పెట్టి కొంది. గిరిజన ప్రాంతాల్లో సాగునీరు లభ్యత పెంచేందుకు రూ.4800 కోట్ల టెండర్లను ఆమోదించాడు. అడవిలో సేకరించిన సరుకులను అమ్మినపుడు గిరిజనులు అమ్మకాలలో సగం ప్రభుత్వానికి చెల్లించవలసి వచ్చేది. ఇప్పుడు ఆ రూలు ఎత్తివేసి, అమ్మినది మొత్తం మీరే వుంచుకోండి అని చట్టం పాస్‌ చేశాడు.  మొత్తం 182 అసెంబ్లీ సీట్లలో 26 సీట్లలో గిరిజనులదే ఆధిక్యత. సుజలాం-సుఫలాం ఇరిగేషన్‌ స్కీము కింద మాహి, నర్మదా నదుల నుంచి ఉత్తర గుజరాత్‌లోని వెయ్యి చెఱువులకు నీటిని మళ్లించి నీటివసతి పెంచాడు. ఇక హిందూత్వ ఎజెండా కూడా వుంది కాబట్టి, గోవధ చేసేవారికి శిక్షను 10 సం.ల నుండి యావజ్జీవానికి పెంచాడు. చీకటి పడ్డాక ఆవులను ట్రక్కులలో తరలించకూడదు. ఈ రూలును ఉల్లంఘిస్తే ఆ ట్రక్కును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. గుజరాత్‌లో మద్యనిషేధం ఎన్నో దశాబ్దాలుగా అమల్లో వుంది. దానివలన మద్యం అలవాటున్నవాళ్లు గుజరాత్‌ పర్యటించడానికి వెనకాడుతూ వుంటారు. గుజరాత్‌లో వ్యాపార సరమైన సమావేశాలు, సెమినార్లు పెట్టరు. ఇది గమనించిన మోదీ పర్యాటకం, వ్యాపారం అభివృద్ధి చేయడానికి మద్యనిషేధం నియమాలను 2008లో కాస్త సడలించాడు. అయితే యిప్పుడు అల్పేశ్‌ ఠాకూర్‌ అనే ఒబిసి నాయకుడు సంపూర్ణ మద్యనిషేధం డిమాండ్‌ చేస్తూ ఉద్యమం చేస్తున్నాడు. దాన్ని తట్టుకోవడానికై రూపాణీ సడలింపులను అటకెక్కించి, ఉల్లంఘనలకు గతంలో కంటె ఎక్కువ శిక్షలు ప్రతిపాదిస్తూ చట్టం చేశాడు. 

ఇలా రూపాణీ రకరకాలుగా ఎన్నో చర్యలు చేపట్టి ప్రజలను ఆకట్టుకోవాలని ఆతృత పడుతున్నాడు. ఇంత శ్రమ అవసరమా అనుకోవచ్చు అక్కడి పరిస్థితి పూర్తిగా తెలియనివారు.  2002 నుంచి అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి ఓట్ల శాతం, సీట్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2002లో 50% ఓట్లు, 127 సీట్లు వస్తే, 2007లో 49% ఓట్లు 117 సీట్లు వచ్చాయి. 2012 వచ్చేసరికి అది 48% ఓట్లు, 115 సీట్లు అయింది. ఇదే సమయంలో కాంగ్రెసు కొద్దిగా పుంజుకుంటోంది. దాని ఓట్ల శాతం 38-39% మధ్య వూగుతోంది. సీట్ల విషయానికి వస్తే 2002లో 51, 2007లో 59, 2012లో 61 తెచ్చుకుంది. మోదీ లేడు కాబట్టి యీసారి ఎన్నికలలో మరిన్ని ఓట్లు, సీట్లు తెచ్చుకోవచ్చన్న అంచనా వారిది. వారి బలం పెరిగినా, తమ బలం తరిగినా తమకు అప్రదిష్ఠ అని అమిత్‌ షా భావన. అందుకని ఎందుకైనా మంచిదని కాంగ్రెసు నుంచి నాయకులను గుంజుకునే పనిలో పడ్డాడు. ఈ తరహా ప్రయోగాలు యితర రాష్ట్రాలలో చేసి మంచి ఫలితాలు సాధించాడు కాబట్టి యిక్కడా అదే మంత్రం వేస్తున్నాడు. ఆ మంత్రానికి వశమైనవారిలో శంకర్‌ సింగ్‌ వాఘేలా వున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాఘేలాకు రాజకీయ స్థిరత్వం లేదు. గాలి ఎటు వీస్తూంటే అటు మళ్లగల సమర్థుడు. స్వతహాగా బిజెపి నాయకుడు. 1995 సెప్టెంబరులో అప్పటి బిజెపి ముఖ్యమంత్రి కేశూభాయ్‌ పటేల్‌పై తిరుగుబాటు చేసి, ఓ ఏడాది పోయిన తర్వాత బిజెపిని చీల్చి కొత్త పార్టీ పెట్టి కాంగ్రెసు మద్దతుతో ముఖ్యమంత్రి అయిపోయాడు. తర్వాత కొన్నాళ్లకు కాంగ్రెసులో చేరిపోయాడు. మంచి పదవులు సంపాదించుకున్నాడు. యుపిఏ 1 హయాంలో టెక్స్‌టైల్‌ మంత్రిగా వున్నాడు. 

ఏం చూసుకునో కానీ కాంగ్రెసుకు యీసారి గుజరాత్‌లో గెల్చేస్తామని ధీమా పట్టుకుంది. ఈ మధ్య గిరిజనుల సమస్యలను ఎత్తి చూపడానికి నవసర్జన్‌ ఆదివాసీ అధికార్‌ యాత్ర పేర ఒక కార్యక్రమం చేపడితే దానికి మంచి స్పందన వచ్చింది. హార్దిక్‌ పటేల్‌ను దువ్వితే బిజెపికి పటేళ్లను దూరం చేస్తాడన్న ఆలోచన ఒకటి. కలిసికట్టుగా ఏదైనా చేస్తే ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవచ్చు. కానీ తక్కిన రాష్ట్రాలలోగానే యిక్కడా కాంగ్రెసుకు కార్యకర్తల కంటె నాయకులు ఎక్కువ. ఎవరికి వారు తాము ముఖ్యమంత్రి పదవికి అర్హులమనుకుంటారు.  పిసిసి అధ్యక్షుడు భరత్‌ సోలంకి వారిలో ఒకడు. అతను గత ముఖ్యమంత్రి స్వర్గీయ మాధవ్‌ సింహ్‌ సోలంకి కొడుకు. మాధవ్‌ సింహ్‌ గతంలో కొన్ని ఒబిసి కులాలను ఏకం చేసి కాంగ్రెసును అధికారంలోకి తెచ్చాడు. తండ్రి వారసత్వం పుణికి పుచ్చుకున్నానని భరత్‌ అనుకుంటూ వుంటాడు. ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నవారిలో వాఘేలా మరొకడు. వీళ్లిద్దరూ కాక శక్త్‌సింగ్‌ గోహిల్‌, సిద్దార్థ్‌ పటేల్‌ అని మరో యిద్దరున్నారు. తక్కినవాళ్లని కాదని తనకే ముఖ్యమంత్రి పదవి యిస్తానని కాంగ్రెసు అధిష్టానం మాట యివ్వాలని వాఘేలా బ్లాక్‌మెయిల్‌తో సహా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. 

రాజస్థాన్‌కు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం అధిష్టానం తరఫున గుజరాత్‌ కాంగ్రెసు వ్యవహారాలకు యిన్‌చార్జిగా వున్న అశోక్‌ గెహలాట్‌ మే 10న పార్టీ సమావేశం ఏర్పాటు చేసి భరత్‌కు, వాఘేలాకు మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించాడు. ముఖ్యమంత్రిగా తమ పేరు ప్రకటించాలని కోరవద్దని యిద్దరికీ నచ్చచెప్పాడు. ఆ సమావేశం జరిగాక తను అలిగానని చూపడానికి వాఘేలా 30 మంది సీనియర్‌ కాంగ్రెసు నాయకులను ట్విటర్‌లో అనుసరించడం మానేశాడు. (అన్‌ ఫాలోయింగ్‌). ఆ నాయకుల్లో రాహుల్‌ గాంధీ కూడా వున్నాడు. అమిత్‌ షా తనను ఆహ్వానించాడని, తను బిజెపిలోకి వెళ్లిపోయే అవకాశాలున్నాయని, ముందుగా కాంగ్రెసు ఎమ్మెల్యేగా వున్న తన కొడుకు మహేంద్ర సింహ్‌ను బిజెపిలోకి పంపిస్తున్నాడనే వార్తలు ప్రచారంలో పెట్టాడు. బిజెపికి వ్యతిరేకంగా తను గతంలో పెట్టిన ట్వీట్‌లను తన ఖాతా లోంచి తీసేశాడు. జులైలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్‌  అసెంబ్లీ నుంచి బిజెపి రెండు సీట్లు సులభంగా గెలవగలదు. మూడో సీటుకి కాంగ్రెసు అధిష్టానం సోనియాకు ఆత్మీయుడైన అహ్మద్‌ పటేల్‌ను మళ్లీ నిలబెడుతోంది. అతన్ని ఓడించి, తాము గెలవాలంటే 11 కాంగ్రెసు ఎమ్మెల్యేల ఓట్లు చేతిలో వున్న కాంగ్రెసు నాయకుణ్ని ఎవరినైనా బిజెపి వైపు తిప్పుకోవాలి. వాఘేలా చేతిలో 8 మంది ఎమ్మెల్యేలున్నారట. అందువలన బిజెపి వాఘేలాకు గేలం వేస్తుందని, దానిలో పడడానికి అతను సిద్ధంగా వున్నాడని చెప్పుకుంటున్నారు. అతను ఒబిసి కేటగిరీలోకి వచ్చే క్షత్రియ కులస్తుడు. ఆ కులం వారు యిన్నాళ్లూ కాంగ్రెసుకు అండగా వున్నారు. అతని నిష్క్రమణతో కాంగ్రెసుకు ఆ మేరకు బలం క్షీణిస్తుందని ఒక అంచనా.  తను బిజెపిలోకి వెళ్లిపోతున్నట్లు వచ్చిన వార్తల గురించి వాఘేలా మండిపడ్డాడు ''నేనేమైనా చెప్పానా? అమిత్‌ షా ఏమైనా వచ్చి నన్ను పిలిచాడా?'' అని ఉరిమాడు. ఆ తర్వాత కనబడకుండా పోయాడు. చివరకు భరత్‌ జూన్‌ మొదటివారంలో వాఘేలా యింటికి వెళ్లి మాట్లాడాడు. తమ మధ్య విభేదాలు లేవని యిద్దరూ మీడియాకు చెప్పుకున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించేది లేదని, పంజాబ్‌లో కూడా అలా చేయలేదని అధిష్టానం భరత్‌ ద్వారా చెప్పించిందట. మరి వాఘేలా బిజెపిలోకి మారతాడా, లేదా? వేచి చూడాలి. (ఫోటో - విజయ్‌ రూపాణీ, శంకర్‌ సింగ్‌ వాఘేలా)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌  

[email protected]

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?