Advertisement

Advertisement


Home > Articles - MBS

గుజరాత్‌ విద్యార్థులకు కొత్త పుస్తకాలు

గుజరాత్‌లోని 42 వేల ప్రైమరీ, సెకండరీ స్కూళ్లలో చదివే విద్యార్థులు సప్లిమెంటరీ (నాన్‌ డిటైల్డ్‌) పుస్తకాలుగా దీనానాథ్‌ బాత్రా రాసిన ఆరు పుస్తకాలను చదవాలని గుజరాత్‌ విద్యామంత్రి భూపేంద్రసింగ్‌ చూడాసమా జూన్‌ 30 న సర్క్యులర్‌ విడుదల చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో నడిచే శిక్షా బచావో ఆందోళన్‌ సమితిలో పనిచేసే యీయన గతంలో స్కూలు హెడ్మాస్టర్‌గా పనిచేశారు. హిందూమతానికి వ్యతిరేకంగా రాసే రచనలను ఖండిస్తూ వుంటారు. హిందూమతాన్ని వక్రీకరిస్తూ వెండీ డోనిగర్‌ అనే రచయిత్రి రాసిన పుస్తకంపై ఎందరు మేధావులు విమర్శలు గుప్పించినా పట్టించుకోని ప్రచురణకర్తలు దీనానాథ్‌కు మాత్రం దడిసి ఆ పుస్తకం అమ్మకాలను ఆపేస్తున్నామని ప్రకటించారు. అంతవరకు బాగానే వుంది కానీ దీనానాథ్‌ ఛాందసవాది. తన పుస్తకాల్లో విద్యార్థులకు యిచ్చిన ఒక సలహా చూడండి - 'ఇండియా మ్యాప్‌ వేయమని ఎవరైనా అంటే మీరు ఏమేం వేయాలో తెలుసా? శ్రీలంక, పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌, నేపాల్‌, భూటాన్‌, టిబెట్‌, బంగ్లాదేశ్‌, బ్రహ్మదేశ్‌ (బర్మాకు ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లు ఉపయోగించే పేరు) - అన్నీ కలిపి వేయాలి. ఎందుకంటే యివన్నీ అఖండ్‌ భారత్‌లో భాగాలే!'

ఇంకో సలహా - 'పుట్టినరోజున కేకు కోసి, కొవ్వొత్తి ఆర్పడం విదేశీయుల పద్ధతి. పుట్టినరోజున దీపం ఆర్పకండి, దీపం వెలిగించండి'.. యింతవరకు బాగానే వుంది. దానికి యీయన కలిపినదేమిటంటే - '..దీపం వెలిగించి గాయత్రీమంత్రం పఠించండి'. విద్యార్థులలో అన్ని మతాలవారూ వుంటారు. దీన్ని అందరికీ ఎలా వర్తింపచేస్తారు? కానీ గుజరాత్‌ ౖప్రభుత్వానికి అదేమీ పట్టదు. ఆ పుస్తకాలను కొని ఉచితంగా అన్ని స్కూళ్లకూ పంచుతోంది. గుజరాత్‌ స్కూలు పుస్తకాలపై గతంలో కూడా వివాదాలు వచ్చాయి. ఏడో తరగతి ఇంగ్లీషు పుస్తకంలో ఆరోగ్యం, ఆహారం గురించి ఓ అధ్యాయం వుంది. దానిలో ''మంచి ఆరోగ్యం గురించి పరమ శివుడు (దేవుడు) యిచ్చిన సలహా'' అనే పాఠం వుంది!  హిస్టరీ పుస్తకాలలో 350 సంవత్సరాల మొఘల్‌ పాలనకు కేటాయించినది ఒక పేరా! 2004లో హిట్లర్‌ను మెచ్చుకుంటూన్న వ్యాసాన్ని 9 వ తరగతి విద్యార్థుల పుస్తకంలో వేస్తే దానిపై ఎవరో కోర్టుకి వెళ్లి తీయించేశారు. 

ఇప్పుడు బాత్రాగారు గుజరాత్‌తో ఆగదలచుకోలేదు. దేశంలోని విద్యావిధానాన్ని సంస్కరించి, 'భారతీయ' విధానాలకు మళ్లించడానికి 'నాన్‌ గవర్నమెంటల్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ (ఎన్‌జిఇసి) పేరుతో 31 మంది సభ్యులతో ఓ సామాజిక సంస్థ ఏర్పాటు చేశారు. ఈ సంస్థ మూడేళ్లపాటు కృషి చేసి తమ నివేదికను ప్రభుత్వానికి అందిస్తుందట. ఇప్పటికే జలంధర్‌లో వున్న పంజాబ్‌ టెక్నికల్‌ యూనివర్శిటీ 'వేదిక్‌ మాథ్స్‌, వేల్యూ ఎడ్యుకేషన్‌, ఇంటెగ్రల్‌ హ్యుమానిజం' అనే సబ్జక్ట్‌లపై కోర్సులు నిర్వహిస్తోందట. సభ్యులలో మాజీ వైస్‌ ఛాన్సలర్లు కూడా వున్నారు. కుమావూ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌గా పని చేసిన బి యస్‌ రాజపుట్‌ డాక్టరేటు తెచ్చుకోవడానికి స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో సబ్మిట్‌ చేసిన పేపరును పేరు మార్చి తన పేర సబ్మిట్‌ చేసిన విషయం బయటకు రావడంతో 2003లో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఆయన కూడా యీ సంస్థలో సభ్యుడే! 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?