Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : ఎఫ్‌బిఐ హిల్లరీని కొంప ముంచిందా?

ఎమ్బీయస్‌ : ఎఫ్‌బిఐ హిల్లరీని కొంప ముంచిందా?

..ముంచిందనే అంది హిల్లరీ - తనకు లక్ష డాలర్ల కంటె ఎక్కువ విరాళం యిచ్చిన దాతల నుద్దేశించి శనివారం మాట్లాడుతూ! మొదట్లో తన ఈ మెయిల్స్‌ గురించి వచ్చిన వివాదం, ట్రంప్‌ ఆడవాళ్ల గురించి చేసిన అసభ్యవ్యాఖ్యలు క్రమేపీ మరుగున పడ్డాయని, ఆర్థికపరమైన విషయాలే ముందుకు వచ్చాయనే భావనలో వున్న హిల్లరీ ఎఫ్‌బిఐ వారి అక్టోబరు 28 నాటి ప్రకటన, నవంబరు 6 నాటి ప్రకటన తన విజయావకాశాలను దెబ్బ తీశాయని వాపోయింది.

నెగ్గబోతూ ఓడిపోయిన ఫీలింగు కలగడంతో ఓటమి దుఃఖాన్ని మింగుకోవడానికి చాలా రోజులే పట్టిందామెకు. నిజానికి హిల్లరీ ఓటమిపాలయినా అనేక వర్గాలు ఆమెను ఆదరించినట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ ద్వారా తెలుస్తోంది.

మగవాళ్లలో 53% మంది ట్రంప్‌కు వేయగా 41% మంది హిల్లరీకి వేశారు. ఆడవాళ్లలో 42% మంది ట్రంప్‌కు వేయగా, 54% మంది హిల్లరీకి వేశారు. (1996 నుంచి ప్రతి ఎన్నికలో 50% కంటె ఎక్కువమంది మహిళలు డెమోక్రాటిక్‌ అభ్యర్థికే వేస్తున్నారు). నల్లవారిలో 88% హిల్లరీకే వేయగా కేవలం 8% మంది ట్రంప్‌కు వేశారు. హిస్పానిక్స్‌, లాటినోలలో 65% మంది హిల్లరీకి, 28% మంది ట్రంప్‌కు వేశారు. జనాభాలో 4% వున్న ఆసియన్‌ ఓటర్లలో డెమోక్రాటిక్‌ పార్టీకి మద్దతిచ్చేవారు గతంలో కంటె తగ్గినా యీ సారి కూడా 65% హిల్లరీకి వేయగా, 29% మంది మాత్రమే ట్రంప్‌కు వేశారు. యూదుల్లో 71%, ప్రొటెస్టంట్లలో 39%, కాథలిక్స్‌లో 45% హిల్లరీకి వేశారు. అయితే హిల్లరీ దెబ్బ తిన్నదెక్కడంటే శ్వేతజాతీయుల విషయంలో! శ్వేతజాతీయుల్లో హిల్లరీకి 37% మంది మద్దతిస్తే, ట్రంప్‌కు 58% మంది యిచ్చారు. 

ఆర్థిక వర్గాల వారీగా చూసినా కింది తరగతికి చెందిన బ్లూకాలర్‌ ఓటర్లు ట్రంప్‌కి మాత్రమే మద్దతిచ్చారనుకోకూడదు. సిఎన్‌ఎన్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం 50 వేల కంటె తక్కువ జీతం వచ్చే వర్గంలో హిల్లరీకి ట్రంప్‌ కంటె 11% ఎక్కువ మద్దతుంది. 50 వేల ఆదాయం కంటె ఎక్కువ సంపాదించే వర్గంలో ట్రంప్‌ లీడ్‌ 11% వుంది. ఎందుకంటే ట్రంప్‌ దిగుమతులపై సుంకాలు విధిస్తానని, కార్పోరేట్‌ టాక్స్‌ తగ్గించి కంపెనీలను అమెరికాకు తిరిగి వచ్చేట్లు చేస్తానని హామీ యిచ్చాడు కాబట్టిట. ఇలా ఆర్థికంగా వెనకబడిన వారిలో కొందరు, పై స్థాయిలో వున్నవారు కొందరు ట్రంప్‌ వెంట వున్నారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలో 80% మంది శ్వేతజాతీయులే. వారిలో చాలామంది బ్లూకాలర్‌ ఉద్యోగులే. అందువలన ట్రంప్‌కు హిల్లరీ కంటె 6% లీడ్‌ వుంటుందని సర్వేలు ఊహించాయి. చివరకు వచ్చేసరికి ట్రంప్‌కు 56% మంది ఓటేస్తే, హిల్లరీకి 40% మంది వేశారు. మొత్తం మీద చూస్తే హిల్లరీకి కనీసం 4% లీడ్‌ వుందని చాలా సర్వేలు చెప్పాయి. మరి ఈ లీడ్‌ ఎందుకు తారుమారైంది?

1992లో బిల్‌ క్లింటన్‌కు శ్వేతకార్మికులు అండగా నిలిచారు. ఈ సారి కూడా వాళ్లను ఆకట్టుకోవాలని బిల్‌ తన భార్యకు సలహా యిచ్చాడు. కానీ హిల్లరీ, ఆమె సహచరులు దాన్ని తిరస్కరించారు. ఇతర జాతులవారు ఎలాగూ తమతో వున్నారు. ఇక శ్వేతజాతీయుల్లో తక్కువగా చదువుకున్న వర్కర్లు ట్రంప్‌ తరఫున వున్నారు కాబట్టి కాలేజీ చదువులు చదివిన సబర్బన్‌ శ్వేతజాతి ఓటర్లను ట్రంప్‌ తిక్కపనులను ఎత్తిచూపి ఆకట్టుకుందామని చూశారు. అది చాలారోజులు బాగానే నడిచింది కానీ ప్రచారం చివరి రోజుల్లో వాళ్లు హిల్లరీకి దూరమయ్యారు. అందుకే యీ ఓటమి అనుకోవచ్చు. వాళ్లు దూరం కావడానికి కారణం ఆమె ఈ మెయిల్‌ వ్యవహారం!

హిల్లరీ ఈ మెయిల్‌ వ్యవహారం గురించి చెప్పుకోవాలంటే - హిల్లరీ విదేశాంగ మంత్రిగా వుండగా 2009 మార్చి నుండి 2013 ఫిబ్రవరి వరకు ప్రభుత్వపరంగా చేయవలసిన కార్యకలాపాలను ప్రభుత్వ ఈమెయిల్‌ ఐడీ ద్వారా కాకుండా, తన వ్యక్తిగత ఈమెయిల్‌ ఐడి ద్వారా వేలాది మెయిల్స్‌ పంపింది. అలా చాలామంది చేస్తారుట కానీ యీమె తన కుటుంబానికి చెందిన సొంత వ్యక్తిగత సర్వర్ల ద్వారా ఆ అధికారిక మెయిళ్లు పంపింది. వాటిల్లో క్లాసిఫైడ్‌ కూడా చాలా వున్నాయి. అది భద్రతాపరమైన నిర్లక్ష్యమే. అంతేకాదు, తన అఫీషియల్‌ డాక్యుమెంట్లు, రహస్య మెమోలు ప్రింటవుట్‌ తీసే పనిని తన పనిమనిషి మారినా శాంటోస్‌కి అప్పగించింది. ఆమె ఫిలిప్పీన్స్‌నుంచి వచ్చిన ప్రవాసి. అమె ద్వారా ఆ రహస్యాలు బయటపడే అవకాశం వుంది. 2015 మార్చిలో యీ విషయం బయటపడింది. రాజకీయనాయకురాలిగా ప్రజాజీవితంలో దశాబ్దాలు గడిపి, కొంతకాలం దేశాధ్యక్షుడిగా వున్న వ్యక్తి భార్య యింత అజాగ్రత్తగా వుండడం ఆశ్చర్యకరం. 

బెంగాజీ దాడుల గురించి హ్యూమా పాత్రను విచారిస్తున్న హౌస్‌ సెలెక్ట్‌ కమిటీ దృష్టికి అనుకోకుండా యీ విషయం వచ్చింది. ఇలా చేయడం ద్వారా హిల్లరీ ప్రభుత్వనియమాలు ఉల్లంఘించారని కమిటీ సభ్యులు వాదించారు. గతంలో కూడా విదేశాంగ మంత్రులు వ్యక్తిగత ఈ మెయిల్‌ ఐడీలు వాడారని హిల్లరీ వాదించింది. వాళ్లు నీలా సొంత సర్వర్‌ వాడలేదు కదా అంటూ ఆమె వాదనను తిరస్కించింది కమిటీ. వ్యక్తిగత ఈ మెయిల్‌ ఉపయోగించే వారు రూలు ప్రకారం తమ అఫీషియల్‌ కరస్పాండెన్సును 20 రోజుల్లోగా ప్రభుత్వానికి అప్పగించాలి. ఆ మేరకు నేను యిచ్చేశాను అని హిల్లరీ 2015 ఆగస్టులో అఫిడవిట్‌ యిచ్చారు. నిజానికి 2014 డిసెంబరు వరకు అప్పగించలేదు. అప్పుడు కూడా 32 వేల ఈమెయిళ్లు డిలీట్‌ చేసి కేవలం 30 వేలు మాత్రమే అప్పగించింది. డిలీట్‌ చేసినవి బయటపెట్టాలంటూ ట్రంప్‌ యాగీ చేశాడు.

మొత్తం వ్యవహారాన్ని ఎఫ్‌బిఐకు అప్పగించారు. అది లోతుగా పరిశోధించి హిల్లరీ కొన్ని ఈమెయిళ్లను అప్పగించలేదని కనుగొంది. అంతే కాదు, కొన్ని ఈ మెయిళ్లు ఎఫ్‌బిఐతో బాటు మరో ఐదు గూఢచారి సంస్థల నుండి వచ్చాయని, హిల్లరీ వాటిపై అన్‌క్లాసిఫైడ్‌ సిస్టమ్స్‌ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపిందని తేల్చింది. పంపిన తదుపరికాలంలో 2100 మెయిళ్లను క్లాసిఫైడ్‌గా గుర్తించారని, పంపేనాటికి అవి క్లాసిఫైడ్‌ కావని హిల్లరీ తరఫువారు వాదించారు. ఎఫ్‌బిఐ డెరక్టర్‌ జేమ్స్‌ కోమీ 110 ఈమెయిళ్లను గుర్తించి అవి పంపే సమయంలోనే క్లాసిఫైడ్‌ వంటివే అని ధృవీకరించాడు. వాటిలో 65 సీక్రెట్‌గా పరిగణించాలని, 22టిని టాప్‌ సీక్రెట్‌గా పరిగణించాలని అన్నాడు. మూడూ మెయిళ్లపై 'సి' (కాన్ఫిడెన్షియల్‌) అనే మార్కు వుంది. హిల్లరీ తనకు 'సి' అంటే ఏమిటో తెలియదని బుకాయించింది. అంత సీనియరు, ఒకప్పటి ఫస్ట్‌ లేడీ అలా వాదించడం చిత్రంగా వుంది. ఏది ఏమైనా ఎఫ్‌బిఐ ఆమెకు అనుకూలంగా వ్యవహరించింది.

స్టేట్‌ డిపార్టుమెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ 2016 మేలో పదవిలో వున్నవారు ఈమెయిల్‌ హేండిల్‌ చేసే తీరుతెన్నుల పట్ల 83 పేజీల రిపోర్టు యిచ్చింది. 2016 జులై 5 న కోమీ ఒక ప్రకటన చేస్తూ 'హిల్లరీ అమిత నిర్లక్ష్యంగా వ్యవహరించింది' అన్నాడు. అంటూనే ఆమెకి ద్రోహబుద్ధి లేదు కాబట్టి అది చర్య తీసుకోదగినంత పెద్ద నేరం కాదన్నాడు. మర్నాడే ఎటార్నీ జనరల్‌ హిల్లరీపై చర్యలేవీ తీసుకోం అన్నాడు. దానిపై ట్రంప్‌ చాలా దుమారమే లేపాడు. వ్యక్తిగత సర్వర్‌ వుపయోగించడం కావాలని చేసింది కాదంటూ హిల్లరీ చెప్పుకుంటే నమ్మినవాళ్లు నమ్మారు. క్రమేపీ ఆ వివాదం మరుగున పడింది.

అయితే అత్యంత నాటకీయ పరిస్థితుల్లో ఈమెయిల్‌ వివాదం మళ్లీ బయటకు వచ్చింది. అసభ్య సందేశాలు (సెక్స్‌కు టెక్స్‌టింగ్‌ కలిపి, సెక్స్‌టింగ్‌ అని పేరు పెట్టారు) పంపాడని ఆంథోనీ వీనర్‌పై వివాదం చెలరేగింది. అతను కాంగ్రెసు మాజీ సభ్యుడు కావడమే కాక హిల్లరీకి అత్యంత సన్నిహితురాలైన సహాయకురాలిగా వున్న హ్యూమా అబెదిన్‌కు భర్త కూడా. హ్యూమా తండ్రి అమెరికాలో స్థిరపడిన అవిభక్త భారతీయ ముస్లిము. అతను కాలిఫోర్నియాలో 'ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ముస్లిమ్‌ మైనారిటీ ఎఫయిర్స్‌' స్థాపించి, దానికి అనుబంధంగా 'ముస్లిము మైనారిటీ ఎఫయిర్స్‌' అనే పత్రిక వెలువరిస్తూ వుండేవాడు. ఈమె 17వ యేట ఆయన పోయాడు. ఆమె తల్లి పాకిస్తానీ మహిళ. సౌదీలో ఓ యూనివర్శిటీలో టీచరుగా పనిచేస్తూంటుంది. సౌదీలో పెరిగిన హ్యూమా 1996లో బిల్‌ క్లింటన్‌ అధ్యక్షుడిగా వుండగా ఆమె వైట్‌హౌస్‌లో ఇంటెర్న్‌గా చేరింది. హిల్లరీకి బాగా నచ్చింది. కూతురిలా చూసుకోసాగింది. అప్పటి నుంచి హ్యూమా హిల్లరీనే అంటిపెట్టుకుని వుంది. ఆంథోనీ వైనర్‌ అనే యూదుణ్ని 2010లో పెళ్లి చేసుకుని ఓ పిల్లాణ్ని కంది. 

అతను డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున 1999 నుండి 2011 దాకా కాంగ్రెస్‌మన్‌గా వున్నాడు. 2011లో తన స్నేహితురాలికి పంపిన అసభ్యకరమైన మెసేజి వెలుగులోకి రావడంతో రాజీనామా చేయవలసి వచ్చింది. అది కాస్త సద్దు మణిగి 2013లో న్యూయార్కు మేయరు పదవికి పోటీ చేస్తే అప్పుడు యింకోటి సెక్స్‌టింగ్‌ బయటపడి ఓడిపోయాడు. ఇప్పుడు హిల్లరీ ప్రచారం ఉధృతంగా సాగుతూండగా మొన్న ఆగస్టులో న్యూయార్కు పోస్టు 2015 జులైలో సాగిన మరో సెక్స్‌టింగ్‌ ప్రహసనాన్ని బయటపెట్టింది. ఇతను పంపిన అశ్లీలచిత్రాన్ని అందుకున్న యువతి దాన్ని పత్రిక వాళ్లతో పంచుకుంది. పత్రిక మార్కెట్లోకి రాగానే వివాదం చెలరేగింది. వెంటనే ట్రంప్‌ అందుకున్నాడు - ''హిల్లరీకి అతి సన్నిహితంగా వుండే హ్యూమా మతం ఏమిటో, ఆమె తల్లి ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తోందో పరికించండి. హ్యూమా భర్త తనపై తనకే నియంత్రణ లేని 'సిక్‌' ఫెలో. హిల్లరీ అధ్యక్షురాలైతే హ్యూమా వద్ద దేశభద్రతకు సంబంధించిన అనేక పేపర్లు వుంటాయి. భర్తగా ఆంథోనీకి అవి అందుబాటులో వుంటాయన్న విషయం తలచుకుంటేనే భయం వేస్తోంది.'' అన్నాడు. ఈ మాట అందరి మనసుల్లో నాటుకుంటుందనే భయంతో కాబోలు హ్యూమా వెంటనే 2016 ఆగస్టు 29న తన భర్తకు విడాకులు యిస్తున్నట్లు ప్రకటించింది. 

ఎలాటి మెసేజిలు పంపాడో చూద్దామని ఆంథోనీ ల్యాప్‌టాప్‌ను ఎఫ్‌బిఐ శోధిస్తే, దానిలో ఆరున్నర లక్షల హిల్లరీ ఈమెయిళ్లు బయటపడ్డాయి. అంటే హిల్లరీ అధికారిక ఈమెయిళ్లను హ్యూమాకు ఫార్వార్డ్‌ చేస్త్తే, ఆమె లాప్‌టాప్‌లో అవి వుండిపోయాయి. ఆమె భర్త కూడా ఆ లాప్‌టాప్‌ను ఉపయోగించాడు. అది చట్టవిరుద్ధమైన చర్య కావడంతో యిదంతా వెలుగులోకి వచ్చింది. దాంతో అక్టోబరు 28న అవన్నీ పరిశీలిస్తామని, హిల్లరీ వ్యవహారంపై పునర్విచారణ జరిపిస్తామని ఎఫ్‌బిఐ డైరక్టరు కోమీ ప్రకటించాడు. పాత ఈ మెయిళ్ల వివాదం మర్చిపోతూండగా, కొత్తగా యిది బయటకు రావడంతో హిల్లరీ సమర్థకులు మండిపడ్డారు. ట్రంప్‌ సమర్థకుల్లో చదువుకోనివాళ్లు ఎక్కువగా వుంటే హిల్లరీ సమర్థకుల్లో చదువుకున్నవాళ్లు ఎక్కువ. దేశభద్రత పట్ల హిల్లరీ యింత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వారికి నచ్చలేదు. అప్పణ్నుంచి వారి మద్దతు తగ్గసాగింది.

ఎఫ్‌బిఐ అంతటితో వూరుకున్నా బాగుండేది, ఎన్నికలకు జస్ట్‌ రెండు రోజుల ముందు నవంబరు 6 న 'మేం ఆరున్నర లక్షల ఈ మెయిళ్లూ పరిశీలించేశాం. హిల్లరీ దుర్బుద్ధితో ప్రవర్తించలేదని జులైలో యిచ్చిన స్టేటుమెంటుకి కట్టుబడి వున్నాం' అంటూ కోమీ మళ్లీ ప్రకటించాడు. ఇది హిల్లరీ అవకాశాలను మరింత డామేజి చేసింది. ఆరున్నర లక్షల ఈ మెయిళ్లను పదిరోజుల్లోపులే పరిశీలించి, పరిశోధించేశారంటే ఎవరు నమ్ముతారు. పైగా అధికారంలో వున్నది హిల్లరీ పార్టీకి చెందిన ప్రభుత్వం. మన సిబిఐ లాగే ఎఫ్‌బిఐ కూడా పాలకుల గూటిచిలక అనే సందేహం ప్రజల్లో వుంటుంది. ట్రంప్‌ ఆ పాయింటే పట్టుకున్నాడు.

''ఈ సర్టిఫికెట్టు నేను నమ్మలేను. ఇంత తక్కువ సమయంలో ఎలా పరీక్షించారు?' అని అడిగాడు. 'మా స్టాఫ్‌ యిరవై నాలుగ్గంటలూ పనిచేసి ఈమెయిల్స్‌ పరిశీలించేశారు.' అని కోమీ జవాబు. ఒకవేళ అది నిజమే అనుకున్నా, అంత  హడావుడిగా చేయవలసిన పనేముంది? హిల్లరీని గట్టున పడేయాలన్న తాపత్రయం కాకపోతే అనే అనుమానం అందరిలో మెదిలింది. ఏదో గోల్‌మాల్‌ జరిగిందని, దాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తున్నారనీ అందరూ అనుకోవడంతో మొదటి స్టేటుమెంటు కంటె రెండో స్టేటుమెంటే ఎక్కువ నష్టం కలిగించిందని హిల్లరీ కూడా అనుకుని వుంటుంది. అందుకనే తన అవకాశాలు దెబ్బ తీసినవి అంటూ తనకు క్లీన్‌చిట్‌ యిచ్చిన నవంబరు 6 స్టేటుమెంటును కూడా కలిపింది! అక్టోబరు 28 ప్రకటన రాగానే కోమీని హిల్లరీ అనుయాయులు తిట్టారు. నవంబరు 6 ప్రకటన రాగానే ట్రంప్‌ తిట్టాడు. ఫలితాలు చూశాక హిల్లరీ వేదన తెలిశాక, ట్రంప్‌ మనసులోనే కామీకి ధన్యవాదాలు చెప్పుకుని వుంటాడు.

ఇంతకీ పెద్దగా చదువుకోని శ్వేతజాతీయులు హిల్లరీ వెంట కాకుండా, ట్రంప్‌వైపు ఎందుకున్నారు? ఆ సంగతి వేరే వ్యాసంలో చూదాం. 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2016)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?