Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: స్మారక చిహ్నాన్ని వదుల్చుకోవడం ఎలా?

 ఎమ్బీయస్‌: స్మారక చిహ్నాన్ని వదుల్చుకోవడం ఎలా?

సాధారణంగా జాతీయ, అంతర్జాతీయ నాయకులకు సంబంధించిన జ్ఞాపకాలను, కట్టడాలను ఎలా కాపాడాలా అని ప్రభుత్వాలు ఆలోచిస్తూ వుంటాయి. కానీ ఆస్ట్రియా ప్రభుత్వం బ్రౌనౌ యామ్‌ ఇన్‌ అనే చిన్న వూళ్లో 17 వ శతాబ్దికి చెందిన ఓ భవంతిని చరిత్రనుంచి ఎలా చెరిపివేయాలా అని మల్లగుల్లాలు పడుతోంది. ప్రపంచాన్ని వణికించిన నియంత హిట్లర్‌ పుట్టిన ఆ భవనం నియో నాజీలకు తీర్థస్థలంగా తయారయ్యింది. ఇటీవలి కాలంలో యూరోప్‌లో తీవ్ర దక్షిణవాదపు (ఫార్‌-రైటిస్టు) ధోరణులు ప్రబలడంతో దాన్ని సందర్శించి స్ఫూర్తి పొందేవాళ్లు ఎక్కువయ్యారు. అదీ సమస్య! 1889 ఏప్రిల్‌ 20న హిట్లర్‌ ఆ గెస్ట్‌హౌస్‌లోని సెకండ్‌ ఫ్లోర్‌లో పుట్టాడు. అప్పుడప్పుడు కొన్ని నెలలు మాత్రమే అక్కడ గడిపాడు.

ఆ భవనాన్ని గెర్లిండ్‌ పామర్‌ అనే అతను 1912లో కొని పెట్టుకున్నాడు. హిట్లర్‌ జర్మనీని పాలించే రోజుల్లో అతని ప్రయివేటు సెక్రటరీ మార్టిన్‌ బోర్‌మన్‌ నాజీ పార్టీ తరఫున దాన్ని పామర్‌నుంచి కొనుగోలు చేశాడు.  రెండవ ప్రపంచయుద్ధంలో అతని ఓటమి తర్వాత ఆస్ట్రియా దేశం విముక్తి చెందింది. హిట్లర్‌ పరిపాలనలో అవస్థలు పడిన ఆస్ట్రియా తమ దేశస్తులు హిట్లర్‌ను పొగిడినా, నాజీయిజం గురించి గొప్పగా చెప్పినా సహించదు. 1950లలో ఆ భవనాన్ని ఆస్ట్రియా ప్రభుత్వం నాజీ పార్టీ నుంచి స్వాధీనం చేసుకుని పామర్‌ పేర బదిలీ చేసింది. పామర్‌ దాన్ని నాజీ మ్యూజియంగా మారుస్తాడన్న భయం వేసిందో ఏమో, ఆ ప్రమాదాన్ని నివారించడానికి 1972లో దాన్ని 5 వేల యూరోలకు లీజుకి తీసుకుని అనేకమంచి చిన్నా, చితకా కుటుంబాలకు, కొన్ని సంస్థలకు అద్దె కిచ్చేసింది. 

అయితే ఆ పురాతన భవంతికి మరమ్మత్తులు అవసరం పడ్డాయి. పామర్‌ని అడిగితే రిపేర్లు చేయించేవాడు కాదు. దాంతో అందరూ ఖాళీ చేసి వెళ్లిపోసాగారు. వికలాంగులకు సహాయపడే సంస్థ ఆఖరిగా 2011లో ఖాళీ చేసి వెళ్లింది. 'సరే, కిరాయిదార్లందరూ వెళ్లిపోయారు. నువ్వేమో రిపేర్లు చేయించవు. పోనీ ప్రభుత్వానికి అమ్మేయ్‌' అంది ప్రభుత్వం పామర్‌తో. 'అమ్మను' అన్నాడు పామర్‌. ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోలేదు. ఇటు చూస్తే నియో నాజీలందరూ ఆ బిల్డింగు చుట్టూ తిరుగుతూ ఫోటోలు తీసుకుంటున్నారు. దాన్నో పుణ్యక్షేత్రంగా చూస్తున్నారు.

గత్యంతరం లేక 2016 డిసెంబరులో ఆ భవంతిని పామర్‌ నుంచి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ప్రజాస్వామ్యయుతంగా నడిచే ప్రభుత్వం యిలా జబర్దస్తీగా ప్రజల ఆస్తులు హరించడం వివాదాస్పదం అవుతుందన్న భయమూ వుంది. ఈ విషయమై ఒక రోజు పార్లమెంటులో అర్ధరాత్రి దాటేవరకు చర్చ చేసి, చివరకు చట్టం తయారుచేసి భవనాన్ని ప్రభుత్వపరం చేసుకుంది. ఇక ఇప్పుడు దాన్ని ఏం చేయాలి అనే సమస్య ఎదురైంది. పునాదులు అలాగే వుంచేసి పై భవంతిని పడగొట్టి, కొత్తది కట్టి అక్కడ నాజీ అకృత్యాలపై డాక్యుమెంట్లు భద్రపరిచే ప్రభుత్వ కార్యాలయం ఏదైనా పెట్టేస్తే సరి అన్నారు కొందరు. 

హిట్లర్‌ బవేరియా ఆల్ప్‌స్‌ పర్వతశ్రేణిలో ఒబెర్‌సాల్జ్‌బర్గ్‌లో ఒక విశ్రాంతి గృహం కట్టుకున్నాడు. దాన్ని పార్టీ ముఖ్యకేంద్రంగా పదేళ్లపాటు వాడాడు. రెండవ ప్రపంచయుద్ధంలో అది చాలా భాగం నాశనమైంది. ఏదో కాస్త మిగిలితే అలాగే వుంచేశారు. యుద్ధానంతరం నియో నాజీలు అక్కడకు చేరి సమావేశాలు పెట్టుకోసాగారు. బవేరియా ప్రభుత్వానికి దడ పుట్టింది. 1952లో డైనమైట్‌ పెట్ట దాన్ని పేల్చేసింది. అటు వెళ్లకూడదంటూ బోర్డులు పెట్టింది. ఈ విధ్వంసంతో హిట్లర్‌ భక్తుల దృష్టిని అది ఆకర్షించింది. పెద్ద టూరిస్టు ఎట్రాక్షన్‌ అయిపోయింది.

ఇది గమనించిన ప్రభుత్వం దాని ప్రాముఖ్యతను గుర్తించక తప్పదని గ్రహించి, అక్కడ డాక్యుమెంటేషన్‌ సెంటర్‌ పెట్టింది. అలాటిదే యిక్కడా పెడదామని ఆస్ట్రియన్ల ఆలోచన కానీ అది హెరిటేజి ఏరియాలో వున్న 17 వ శతాబ్ది నాటి హెరిటేజి బిల్డింగు. పురావస్తు చట్టం ప్రకారం దాని జోలికి వెళ్లడానికి వీల్లేదు. ఇవన్నీ పరిశీలించి మంచి పరిష్కారం సూచించమని ప్రభుత్వం 13 మంది సభ్యులతో ఓ కమిటీ వేసింది. ఈ లోగా తన భవంతిని స్వాధీనం చేసుకోవడానికి చేసిన చట్టాన్ని కొట్టేయమని కోరుతూ పామర్‌ కోర్టు తలుపు తట్టాడు. కోర్టు యింకా ఏ మాటా చెప్పలేదు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?