Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ''ప్లేబోయ్‌'' హ్యూ హెఫ్నర్‌ - 01

ఎమ్బీయస్‌: ''ప్లేబోయ్‌'' హ్యూ హెఫ్నర్‌ - 01

''ప్లేబోయ్‌'' వ్యవస్థాపకుడు, ప్రచురణకర్త, సంపాదకుడు తన 91వ యేట సెప్టెంబరు 27న  చనిపోయాడు. అతనెంత విలాసంగా బతికాడో, ఎంతమందిని పెళ్లాడాడో, ఎంతమందిని ఆడలేదో యీ వివరాలతో చాలా కథనాలు వచ్చాయి. డబ్బు వచ్చాక ఎలా ఖర్చు పెట్టాడా అనే దాని గురించి నేనంత లక్ష్యపెట్టను. అసలలాటి పత్రిక పెట్టి ప్రజామోదాన్ని ఎలా పొందగలిగాడు, పత్రిక పెట్టేనాటి సామాజిక పరిస్థితులేమిటి, ఎటువంటి మిక్స్‌తో అతను పాఠకులను ఆకట్టుకున్నాడు, దాని అవసరం వుంటుందని ఎలా వూహించాడు అనేవే ఆసక్తి కలిగించే అంశాలు.

హ్యూ తన పత్రిక పెట్టడానికి ముందే షికాగోలో మగ పాఠకుల కోసం 'గర్లీ' మ్యాగజైన్ల పేర అమ్మాయిల నగ్న, అర్ధనగ్న చిత్రాలతో పత్రికలు వచ్చేవి. అలాటి పత్రికలు ప్రచురించే వాన్‌ రోసెన్‌ అనే సంస్థలో ప్రమోషన్‌ (మార్కెటింగ్‌) శాఖలో వారానికి 80 డాలర్ల జీతంపై హ్యూ పనిచేశాడు. 5 డాలర్ల పెంచమని అడిగి, అది యివ్వకపోవడంతో దాన్ని 1952 జనవరిలో వదిలేసి చిన్నపిల్లల మ్యాగజైన్‌లో పనిచేశాడు. అక్కడ పని తక్కువగా ఉండేది. కొత్త పత్రిక పెడితే ఎలా ఉంటుంది, దాని రూపురేఖలు ఎలా వుండాలి అని ఖాళీ సమయాల్లో ఆలోచిస్తూ ఉండేవాడు. 

అతనికి ఎన్నో ఏళ్లగా రకరకాల మ్యాగజైన్లు చదివే అలవాటుంది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం పేపరు రేషనింగ్‌ ఎత్తివేయడంతో అనేక రకాల పత్రికలు మార్కెట్‌ను ముంచెత్తాయి. మార్కెటింగ్‌ శాఖ విస్తరించి, టూర్ల మీద తిరిగే సేల్స్‌మెన్‌  పెరిగారు. ఇంటికి దూరంగా, వేరే ఊరి హోటలు గదిలో ఒంటరి రాత్రులు గడిపేవారికి అమ్మాయిల బొమ్మలున్న పత్రికలు ఊరట నిచ్చేవి. అయితే అలాటి పత్రికలను డిస్ట్రిబ్యూట్‌ చేయడానికి అగ్రశ్రేణి డిస్ట్రిబ్యూటర్లు యిష్టపడేవారు కారు.

ఇవే కాదు, సినిమా తారలపై పుకార్లు రాసే పత్రికలు, గృహిణుల అక్రమసంబంధాల గురించి రాసే పత్రికలు, లైంగిక విజ్ఞానాన్ని అందించే పత్రికలు, వ్యవస్థను దుయ్యబట్టే వర్కర్స్‌ మ్యాగజైన్లు, చీప్‌ పేపరు మీద ముద్రించిన చిన్న తరహా పత్రికలు - యిలాటి వాటిని కూడా అవి ముట్టుకునేవి కావు. అవి పంపిణీ చేయడానికి షికాగోలో కాపిటల్‌ న్యూస్‌ ఏజన్సీ పని చేసేది. ఇది బుక్‌స్టాల్‌ వాళ్లకు ఎక్కువ కమిషన్‌ యిచ్చేది. వాళ్లు పుస్తకాలను బాహాటంగా ప్రదర్శించకుండా కౌంటర్ల కింద ఉంచేవారు. రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్లు అడిగితే వాటిని చూడనిచ్చేవారు. వాళ్లు అరడజను పత్రికలు తిరగేసి, ఒకటో రెండో కొనేవారు. హ్యూ మాత్రం అన్నీ కొనేవాడు. 

హ్యూ పనిచేసిన వాన్‌ రోసెన్‌ సంస్థ మగవాళ్ల కోసం ''మోడరన్‌ మ్యాన్‌'' అనే పత్రిక ప్రచురించేది. మగతనం అంటే కొండలెక్కడం, సముద్రంలో డైవ్‌ చేయడం, వేటాడడం, ఫిషింగ్‌ చేయడం అనే అభిప్రాయాలను ప్రచారం చేస్తూ ఆ కథనాలతో బాటు స్విమ్‌సూట్‌లో ఉన్న అమ్మాయిల బొమ్మల్ని వేసేవారు. తక్కిన మగవాళ్ల పత్రికలు కూడా యిలాగే వుండేవి. ఇలాటి సాహసాల జోలికి పోకుండా సుఖమంటే నాలుగ్గోడల మధ్య వుంటూ హాయిగా తిని, తాగి, అమ్మాయిలతో పడుక్కోవడమే అనుకునే తనబోటి మగవాళ్ల యిష్టాయిష్టాలను ప్రతిబింబించే పత్రిక ఏది? అనుకున్నాడు హ్యూ. అప్పట్లో సెక్స్‌ గురించి తక్కిన పత్రికలు కూడా రాసేవి.

కానీ అది చెడ్డదన్నట్లు, దాన్ని నిరసించాలన్నట్లు ప్రెజంట్‌ చేసేవి. మన టీవీ ఛానెల్స్‌ చూడండి - నగరంలో పెరుగుతున్న విచ్చలవిడితనం, మధ్యతరగతి కుటుంబాల్లో పెచ్చుమీరుతున్న వ్యభిచారం అంటూ చూపించాల్సిందంతా చూపించేసి, 'ఇది తప్పు' అని నీతివాక్యాలు వల్లించి, తామేదో ఉన్నతస్థాయిలో వున్నట్లు పోజు కొడుతూంటాయి. అప్పట్లో అమెరికాలో పత్రికలు అలా వుండేవన్నమాట. నైట్‌క్లబ్బులు, వ్యభిచారగృహాలపై వ్యాసాలు వేసి, వాటిలో పనిచేసేవారి బొమ్మలు వేసి, విపులంగా వర్ణించి చివర్లో 'దీని గురించి ప్రభుత్వం ఏం చేస్తోంది?' అంటూ వ్యాఖ్యానం జోడించేవి. సెక్సంటే నిర్భీతిగా అనుభవించదగినది, అదేమీ తప్పు కాదు అని రాయరేం వీళ్లు? అనుకున్నాడు హ్యూ.

సెన్సేషన్‌పై బతికే కొన్ని టాబ్లాయిడ్లు ''పెరుగుతున్న అబార్షన్‌ వ్యాపారం'', ''సంసారం ముసుగులో సాగే వ్యభిచారం'', ''విజృంభిస్తున్న పల్లెటూరి జాణలు'' వంటి కాప్షన్లతో వ్యాసాలు వేసేవి. కొన్ని సంసారపక్ష పత్రికలు సెక్స్‌ను ఒక వైపరీత్యంగా చూపించేవి. హైహీల్డ్‌ బూట్లు వేసుకున్న అమ్మాయిలు కొరడా చేతబట్టి మగవాళ్లను చావగొడుతున్న ఫోటోలు వేసేవారు. కొన్ని మహిళల పత్రికలు సెక్స్‌ను ఆరోగ్యసమస్యగా చిత్రీకరించేవి. డాక్టర్లను, ఫ్యామిలీ కౌన్సిలర్లను కాలమిస్టులుగా నియమించి శృంగారంలో ఎదురయ్యే సమస్యల గురించి చర్చించేవి. 1953 నాటి పత్రికారంగం పరిస్థితి యిది. ఇదంతా చూసి హ్యూకి బోరెత్తిపోయింది.

శృంగారాన్ని ఒక స్కాండల్‌గా కాకుండా ప్రకృతి ప్రసాదించిన ఆహ్లాదకరమైన, ఆనందదాయకమైన చేష్టగా ఎందుకు చూడరా అనుకునేవాడు. తన పత్రికలో ఆరోగ్య సమస్యలు, వయసు మీరడం వలన వచ్చే సమస్యల గురించి ప్రస్తావించకపోవడమే కాదు, దానికి సంబంధించిన యాడ్స్‌ కూడా వేయకూడదనుకున్నాడు. బట్టతల, స్థూలకాయం, నరాల బలహీనత, హెర్నియా, పొక్కులు, దద్దుర్లు, చర్మసమస్యలు, ముఖంపై ముడతలు యిత్యాది వాటిని రానివ్వకుండా చేసే ఔషధాలు, సౌందర్యసాధనాల ప్రకటనలు ఎంత డబ్బిచ్చినా అంగీకరించనని స్పష్టంగా చెప్పాడు. ఆ మాట నిలబెట్టుకున్నాడు కూడా. 

యుద్ధసమయంలో, యుద్ధానంతరం వచ్చిన మార్పులతో సమాజపు విలువలు ఎంత మారాయో ఎవరికీ పూర్తి అవగాహన రాలేదు. అమెరికన్ల శృంగారజీవితం గురించి స్పష్టత లోపించింది. మహిళలు యిటువంటివి నిరసిస్తారనే భావన బలంగా వుండేది. అందువలన ఏది సభ్యత, ఏది అసభ్యత అనే విషయంలో వాదోపవాదాలు నడిచేవి. ఏ మేరకు పత్రికాస్వేచ్ఛను అనుమతించవచ్చు అనే విషయంలో గందరగోళం వుండేది. అందువలన యీ గర్లీ మ్యాగజైన్లు నడిపేవారందరూ లాయర్లను కన్సల్టెంట్లగా నియమించుకునేవారు. అయినా లాభం లేకపోయేది. ఏదైనా ఫోటో అసభ్యమైనది అని కోర్టు తీర్పు యిస్తే జరిమానా కట్టి బయటపడేవారు. ఈ పరిస్థితుల్లో సెక్స్‌ అలవాట్ల గురించి డా. కిన్సే రిపోర్టు వెలువడి, అందర్నీ ముక్కుపై వేలు వేసుకునేట్లు చేసింది.

ఆ నివేదిక ప్రకారం - అమెరికన్‌ మహిళల్లో 50% మంది పెళ్లికి ముందే రతిలో పాల్గొన్నారు. కాలేజీ విద్యార్థినుల్లో అయితే అది 60%. పెళ్లయిన వనితల్లో 25% మంది వివాహేతర సంబంధం కలిగి వున్నారు. సగానికి కంటె ఎక్కువమంది స్త్రీలు స్వయంతృప్తికి, 43% మంది మగవాళ్లతో ముఖరతికి, 13% మంది యితర స్త్రీలతో అనుభవానికి  అలవాటు పడ్డారు. ఈ రిపోర్టు రాగానే పత్రికా సంపాదకులు దీన్ని నిరసించారు. కిన్సే సమాజానికి హాని చేస్తున్నాడన్నారు. కొంతమంది ఆ రిపోర్టును సెన్సారు చేశారు. మరి కొంతమంది  మతసంఘాల ఒత్తిడికి లొంగి, ముక్కలుముక్కలుగా వేశారు. వీళ్లు ఏమనుకున్నా సైంటిఫిక్‌, ఎకడమిక్‌ సంస్థలు ఆ రిపోర్టును ఆమోదించాయి. విలియం మాస్టర్స్‌ అనే ఆయన వర్జీనియా జాన్సన్‌తో కలిసి ఆ దిశగా మరింతో లోతుగా పరిశోధనలు సాగించాడు. 

ఆ నివేదిక చదివి హ్యూ ఉప్పొంగిపోయాడు. ఆడవాళ్లు గతతరం కంటె మరింతగా సెక్సువల్‌ అయ్యారని తను అంచనా వేస్తున్నది కరక్టే అని తేలిందనుకున్నాడు. తమ తలిదండ్రుల నైతిక విలువలు వేరు, తమ విలువలు వేరు అతను ఎప్పణ్నుంచో అనుకుంటున్నాడు. యుద్ధసమయంలో యువకులు యుద్ధరంగానికి వెళ్లారు. వాళ్ల గర్ల్‌ఫ్రెండ్స్‌ ఊళ్లోనే వుంటూ వారిని ఉత్సాహపరచడానికి ప్రేమ కురిపిస్తూ ఉత్తరాలు రాసేవారు, బహుమతులు పంపేవారు. కానీ ఊళ్లో అందుబాటులో వున్న కుర్రాళ్లతో శయనించేవారు.

అక్కడ యుద్ధం చేసే యువకులు విదేశీ ప్రాంతాలను ఆక్రమించినప్పుడు అక్కడి వనితలు వీళ్ల దగ్గర ఉన్న ఆహార పదార్థాల కోసం, సిగరెట్ల కోసం వీళ్లకు ఒళ్లమ్ముకునేవారు. ఇలా ఓ పక్క ప్రేమ వ్యవహారం సాగిస్తూనే మరో పక్క శయ్యాసుఖం విషయంలో పట్టింపులు పెట్టుకునేవారు కారు. యుద్ధం నుంచి తిరిగి వచ్చేక యువకులు సగంలో ఆపేసిన చదువు కొనసాగించడానికి కాలేజీల్లో చేరేరు. పాత గర్ల్‌ఫ్రెండ్‌నో, కొత్తమ్మాయినో ఎవరో ఒకరిని పెళ్లాడారు. యుద్ధసమయంలో ఆడవాళ్లకు ఉద్యోగాలు విరివిగా దొరికాయి. వాళ్లు సమర్థవంతంగా పనిచేయడంతో వాళ్లను తీసేసి మగవాళ్లను పెట్టుకోవడానికి యజమానులు సుముఖంగా లేరు. 

మగాళ్లకు ఉద్యోగం దొరకడం, దొరికిన దాన్ని నిలబెట్టుకోవడం కష్టమై పోయింది. ఆర్థికంగా నిలకడ లేకపోవడం వలన కాపురంలో కలతలు. రుచులు మరిగిన శరీరం ఒకరికే కట్టుబడడానికి మొరాయించేది. భాగస్వామితో శృంగారంలో అసంతృప్తి. విడిగా వుండడమో, విడాకులో ఏదో ఒకటి జరిగి ఒంటరి ఆడవాళ్లు, మగవాళ్లు పెరిగారు. విడిపోతే భరణం యివ్వవలసిన భారం పైనబడి మగవాళ్లు మరింత చికాగ్గా వుండేవారు. హ్యూది కూడా యిలాటి పరిస్థితే. అతను 1944లో ఆర్మీలో చేరి మిలటరీ న్యూస్‌పేపరుకు రచయితగా పనిచేశాడు.

1946లో వెనక్కి వచ్చి, ఇల్లినాయి కాలేజీలో చేరి రెండున్నర సంవత్సరాలు సైకాలజీ, క్రియేటివ్‌  రైటింగ్‌ అండ్‌ ఆర్ట్‌ చదివాడు. తనతో బాటు చదువుకున్న తారసిల్లిన మిల్డ్రెడ్‌ అనే అమ్మాయిని ప్రేమించి, ఆర్మీకి వెళ్లేముందు నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇతని ఫియాన్జీగా వుండే రోజుల్లోనే ఆమె యింకో అబ్బాయితో శయనించింది. అది తెలిసీ అతనామెను 1949లో పెళ్లాడాడు. వాళ్లకు 1952లో కూతురు, 1955లో కొడుకూ కలిగారు. అతను బయట తిరుగుళ్లు తిరిగినా, తనపై తప్పుంది కాబట్టి ఆమె చూసీ చూడనట్లు ఊరుకుందిట. ఏది ఏమైనా 1953లో అతను పత్రిక పెట్టడానికి ఆమె సహకరించింది. పత్రికలో తలమునకలైనా సహించింది. చివరకు 1959లో విడిపోయారు. 

చదువయ్యాక అతను ఆర్ట్‌ గ్రాజువేట్‌ కాబట్టి జీవనోపాధికై కార్టూన్లు వేసేవాడు. కానీ వాటినెవరూ ఆమోదించలేదు. దాంతో రకరకాల ఉద్యోగాలు చేశాడు. అట్టపెట్టెల కంపెనీలో, యాడ్‌ ఏజన్సీలో, డిపార్టుమెంటల్‌ స్టోర్సులో పని చేశాడు. ఒకదాని తర్వాత మరొకటి చొప్పున మూడు పత్రికా ప్రచురణ సంస్థల్లో పని చేశాడు. డబ్బు యిబ్బందులు ఎలాగూ వున్నాయి, భార్యపై మోజు తగ్గింది, వివాహంలో గొడవలు. 27 ఏళ్ల వయసుకే జీవితమంటే బోరు కొట్టింది. చుట్టూ చూస్తే తనలాటి మగవాళ్లు చాలామంది కనబడుతున్నారు. వాళ్ల కోసం అప్పటిదాకా మార్కెట్లో లేని తరహా పత్రిక పెట్టాలి.

ఆ పత్రిక చూడగానే వాళ్లకు ఉత్సాహం, జీవితంపై అనురక్తి రగలాలి. గర్లీ మ్యాగజైన్లలా ఒట్టి అమ్మాయిల బొమ్మలతో నింపి చౌకబారు లుక్‌ ఇవ్వకూడదు. ఆలోచనాపరులైన మగవాళ్లు చదివే కథలు, వ్యాసాలు కూడా పెట్టాలి. తన కోసం ఎందరో అందమైన అమ్మాయిలు వేచి వున్నారని, అమ్మాయిలను సుఖపెట్టగలిగినవాడు వృత్తిలో కూడా రాణిస్తాడనే నమ్మకం పాఠకుడికి కలిగేట్లా చేయాలి. ఇలా చేస్తే కనీసం 30 వేల ప్రతులు అమ్ముడుపోతాయని అతను లెక్కలు వేశాడు. అయితే సమస్య ఏమిటంటే దానిలోని ఆర్టికల్స్‌ను, ఫోటోలను పోలీసులు, కోర్టులు సభ్యమైనవిగా చూస్తారో, అసభ్యమైనవిగా చూస్తారో తెలియదు. రిస్క్‌ తీసుకోవాలి. (ఫోటో భార్య మిల్డ్రెడ్‌తో హ్యూ హెఫ్నర్‌) (సశేషం) 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?