Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ''ప్లేబోయ్‌'' హ్యూ హెఫ్నర్‌ - 02

ఎమ్బీయస్‌: ''ప్లేబోయ్‌'' హ్యూ హెఫ్నర్‌ - 02

మొదటి సంచికకు మెయిన్‌ ఎట్రాక్షన్‌గా ఉండే ఫోటో కావాలి. ''ఎడ్వర్టయిజింగ్‌ ఏజ్‌'' అనే పత్రిక తిరగవేస్తూంటే ఒక వార్త హ్యూ కంట పడింది. 1949లో వేషాలు లేక అల్లాడుతున్న కాలంలో మేర్లిన్‌ మన్రో చాలా ఫోటోలకు మోడల్‌గా చేసింది. వాటిలో మూడు న్యూడ్స్‌ను షికాగో శివారులో వున్న ఒక కాలండరు తయారీదారు కొనుక్కున్నాడని ఆ వార్త. వెంటనే హ్యూ తన పాతకారు వేసుకుని అతని దగ్గర కెళ్లాడు. రేడియో మాత్రమే 'ధరించిన' మార్లిన్‌ న్యూడ్‌ ఫోటో ఒకదానికి 500 డాలర్లకు బేరం కుదిరింది. అంతేనా? అనుకోనక్కరలేదు. ఎందుకంటే అది మరీ సెక్సీగా వుంది. దాన్ని మ్యాగజైన్‌లో వేసే ధైర్యం తక్కిన పత్రికాధిపతులు ఎవరూ చేయరు.

అప్పట్లో న్యూడ్‌ ఫోటోలు వేసేవారు చిత్రకారుల కోసం తీసిన ఫోటోలు వేసేవారు. వాటిలో అమ్మాయిలు నగ్నంగా ఉండి శరీరపు ఒంపుసొంపులు ప్రదర్శించినా, మొహంలో ఎటువంటి శృంగార భావమూ వ్యక్తపరిచేవారు కారు. కానీ యీ మార్లిన్‌ ఫోటో ఆహ్వానిస్తూన్నట్లు వుంది. ఇది ప్రచురిస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్న భయం తక్కిన ప్రచురణకర్తలది. కానీ హ్యూ రిస్క్‌ తీసుకోదలచుకున్నాడు. ఇదే కాదు, మరో రిస్కు కూడా వుందతనికి. అతని దగ్గర ఉన్నది 600 డాలర్లు మాత్రమే. అదే అతని యావత్తు పెట్టుబడి.

అది కూడా తన యింట్లో ఫర్నిచర్‌ గ్యారంటీగా పెట్టి బ్యాంకు నుంచి తీసుకున్న అప్పుగా తీసుకున్నది! ఇక మిగిలినది 100 డాలర్లు మాత్రమే. అందువలన తన పబ్లిషింగ్‌ కంపెనీలో వాటాలు అమ్మనారంభించాడు. అతని ఆలోచనలను నమ్మి 2000 డాలర్లు పెట్టి వాటాలు కొనుకున్న అతని స్నేహితుడు - ఎల్డన్‌ సెల్లర్స్‌. అతను గతంలో ఎయిర్‌ ఫోర్స్‌లో పైలట్‌గా పనిచేశాడు. పెట్టుబడి పెట్టడంతో పాటు అతను కంపెనీకి బిజినెస్‌ మేనేజరుగా కూడా పనిచేశాడు. 

హ్యూ తన మాసపత్రికకు 'స్టాగ్‌ పార్టీ' అని పేరు పెడదామనుకున్నాడు. స్టాగ్‌ అంటే దుప్పి. ఆడవాళ్లు లేకుండా కేవలం మగవాళ్లు మాత్రమే చేసుకునే పార్టీని స్టాగ్‌ పార్టీ అంటారు. ఆ పేరు ప్రకటించగానే అప్పటికే ''స్టాగ్‌'' అనే పేరుతో పత్రిక నడుపుతున్నవాళ్లు లాయర్‌ నోటీసు పంపారు. అప్పుడు ఎల్డన్‌ ''ప్లేబోయ్‌'' అని పెడదామని సూచించాడు. అతని తల్లికి చాలా ఏళ్ల క్రితం ఆ పేరుతో ఒక స్టయిలిష్‌ కారు వుండేది. హ్యూ సరేనన్నాడు. హ్యూ తమ్ముడు కీత్‌ తనూ 500 డాలర్ల షేర్లు కొంటానన్నాడు. కొడుకులిద్దరూ దీనిలో దిగడంతో, హ్యూ తల్లి, యీ గర్లీ మ్యాగజైన్‌ ఐడియా నచ్చకపోయినా, 1000 డాలర్లు యిచ్చి ప్రోత్సహించింది.

వాళ్ల నాన్న ఏమీ యివ్వలేదు కానీ మ్యాగజైన్‌ బాగా ఎదిగాక ఎక్కౌంటెంట్‌గా పనిచేశాడు. హ్యూ తన పత్రిక ఐడియాతో మొత్తం 45 మందిని కన్విన్స్‌ చేసి 10 వేల డాలర్ల దాకా డబ్బు పోగేశాడు. కొంతమంది రచయితలకు, ఇలస్ట్రేటర్లకు, బ్లాక్‌ ఎన్‌గ్రేవర్‌కు పారితోషికాలకు బదులు కంపెనీలో వాటాలు యిచ్చాడు. వీరి సహకారంతో తన పత్రిక ఎలా వుండబోతోందో ఒక బ్రోషర్‌ తయారుచేశాడు. దానిలో మార్లిన్‌ ఫోటో గురించి విశేషంగా రాశాడు. చాలాకాలంగా ప్రచురణ, పంపిణీ రంగాల్లో ఉన్నాడు కాబట్టి ద్వితీయశ్రేణి డిస్ట్రిబ్యూటర్లు సేల్‌ ఆర్‌ రిటర్న్‌ (అమ్ముడుపోని ప్రతులు వెనక్కి పంపేయవచ్చు) పద్ధతిపై పెద్ద సంఖ్యలో కాపీలు బుక్‌ చేసుకున్నారు. 1953 వేసవి నాటికి ఆ ఆర్డర్ల సంఖ్య 30 వేలు దాటింది. శీతాకాలం వచ్చేసరికి అది 70 వేలయింది.

ఈ హంగామా అంతా చూసి పత్రిక ముద్రించే ప్రెస్‌ వాళ్లు అరువు యిస్తానన్నారు. 70 వేలు వేస్తున్నాం కానీ ఒక నెలలో అమ్ముడు పోతాయా లేదా అని భయం వేసింది హ్యూకి. 1953 అక్టోబరులో మార్కెట్‌లో విడుదల చేస్తూ ఎందుకైనా మంచిదని కవరు పేజీ మీద నెల పేరు వేయలేదు.  ఒక నెలలో అమ్ముడుపోకపోతే వేరే స్టాల్స్‌కి బదిలీ చేసి పై నెలలో కూడా అమ్మకాలు కొనసాగిద్దామనుకున్నాడు. 

మొదటి సంచిక 48 పేజీలుంది. కవరు పేజీ మీద మార్లిన్‌ మన్రో బ్లాక్‌ అండ్‌ వైట్‌ బొమ్మ వేశాడు. సెంటర్‌స్ప్రెడ్‌గా తను కొన్న న్యూడ్‌ కలర్లో వేశాడు. కవర్‌ స్టోరీగా 'మిస్‌ గోల్డ్‌ డిగ్గర్‌ ఆఫ్‌ 1953' అని కథనం వేశాడు. ఆడవాళ్లు డబ్బు కోసం మగవాళ్లను వలలో వేసుకుని, పెళ్లాడి, విడాకులు అడిగి, భరణం కోసం ఎలా పీడించి డబ్బు గడిస్తున్నారో దానిలో రాశాడు.  వివాహం అంటే విసుగు చెందిన తనలాటి ఇన్‌డోర్‌ మగవాళ్ల కోసమే యీ ఆర్టికల్‌ అనుకున్నాడు హ్యూ. స్త్రీల సెక్స్‌ అలవాట్లపై కిన్సే రిపోర్టు ప్రచురిస్తూ దానికి నోరూరించే యిలస్ట్రేషన్లు జోడించాడు. 'స్ట్రిప్‌ క్విజ్‌' అనే ఒక ఫోటో ఫీచర్‌ వేశాడు.

లివింగ్‌ రూములో ఒక జంట ఒకరి నొకరు ప్రశ్నలు వేసుకుంటారు. జవాబు చెప్పలేకపోతే ఒక ఉడుపు జారవిడిచేయాలన్నమాట. అలా వివిధ దశల్లో ఫోటోలు తీసి ఒక కథనంలా వేశాడు. కాలిఫోర్నియాలో సన్‌బాత్‌ చేస్తున్న దిగంబరమహిళల ఫోటోలు వేయడంతో బాటు ఒక పేజీ నిండా ద్వంద్వార్థాల పార్టీ జోకులు, మరో పేజీలో కార్టూన్లు (తనవే) వేశాడు. బొకాషియో అనే 16వ శతాబ్దపు ఇటాలియన్‌ రచయిత ''డికామెరాన్‌'' అనే శృంగార కథామాలిక రాశాడు. భార్యను లేదా భర్తను మోసం చేసే మన శుకసప్తతి కథల్లాటివి దానిలో కనబడతాయి. వాటితో బాటు బ్రహ్మచర్యం పాటించలేక అవస్త పడి, లైంగిక కార్యకలాపాల్లో మునిగితేలే క్రైస్తవ సన్యాసినుల, సన్యాసుల కథలు కూడా ఉంటాయి.

నన్‌లు వుండే ఓ కాన్వెంట్‌లోని సన్యాసినులు మూగవాడిగా నటించే తోటమాలితో చాటుమాటుగా ఎలా సుఖించారో తెలిపే కథను హ్యూ ఎంచుకుని దాన్ని తొలి సంచికలో వేశాడు. వీటితో బాటు ఫుట్‌బాల్‌పై ఒక కథనం, తన హైస్కూల్లో వుండగా అభిమానించిన డోర్సే బ్రదర్స్‌ అనే సంగీతకారులపై వ్యాసం వేశాడు. ఆర్థర్‌ కానన్‌ డయల్‌. ఏంబ్రోస్‌ బియర్స్‌ రాసిన కథలు కూడా వేశాడు. ఈ రెండిటికి కాపీరైటు తీరిపోయింది కాబట్టి డబ్బివ్వనక్కర లేకపోయింది. 

నిజానికి యిలా పాతకథలు వేసే బదులు, కొత్త రచయితల కథలు వేద్దామని హ్యూ అనుకున్నాడు. అయితే ఆ రచయితలు, వాళ్ల ఏజంట్లు అతని అభ్యర్థనను తిరస్కరించారు. జేమ్స్‌ తర్బర్‌ ఏజంట్లు 'మీ పత్రికకు గౌరవనీయమైనదని యింకా రుజువు కాలేదు' అన్నారు. ఎర్నెస్ట్‌ హెమింగ్వే ఏజంట్లు 'మీ పత్రిక కారెక్టరు యింకా తెలియరాలేదు' అన్నారు. జాన్‌ ఓ హారా ఏజంట్లు  ఏకంగా వెయ్యి డాలర్లు అడిగారు. తర్వాతి రోజుల్లో ప్లేబోయ్‌కు ప్రజామోదం లభించాక హ్యూ రచయితలకు అత్యధిక పారితోషికాలు యిచ్చి రాయించుకున్నాడు. పత్రికను మార్కెట్‌లోకి విడుదల చేసేముందే తన పంపిణీదారులతో హ్యూ స్పష్టంగా చెప్పాడు - 'నేను చేసేది ప్రయోగం మాత్రమే. దీనికి పబ్లిక్‌, న్యాయవ్యవస్థ ఎలా రియాక్ట్‌ అవుతారో తెలియదు' అని.

ఏవైనా న్యాయపరమైన చిక్కులు వస్తాయేమోనని తొలి సంచికలో పబ్లిషరుగా తన పేరు వేసుకోలేదు కూడా. ఈ ప్రయత్నాలు జరిగే సమయంలో హ్యూ భార్య మిల్డ్రెడ్‌ చాలా సహకరించింది. వాళ్ల చిన్న ఫ్లాట్‌లో ఎక్కడ పడితే అక్కడ నగ్నచిత్రాలు దొర్లుతూ వుండేవి. హ్యూతో పనిచేసే వాళ్లు ఆమె ఎదురుగానే ఆ బొమ్మల్లో అమ్మాయిల ఒంపుసొంపుల గురించి చర్చిస్తూ వుండేవారు. అదే వాళ్ల ఆఫీసు మరి. అక్కడే అందరి భోజనాలూ. ఆమె ఒడిలో చిన్న పిల్ల. మొదటి సంచిక ముద్రణ జరుగుతూన్నపుడు హ్యూ, అతనితో పాటు మరో యిద్దరు ప్రెస్‌కు వెళ్లి కూర్చున్నారు. పత్రికను పంపిణీ చేయడానికి ఒప్పుకున్నతను గతంలో హ్యూతో బాటు వాన్‌ రోజెన్‌లో పనిచేసినవాడే. అతను పత్రికను తిరగేసి 'ఇది అమ్ముడు పోతుందిలే' అన్నాడు.

'లే అంటే ఎలా? ఏ 10, 15 వేలో అమ్ముడుపోయి తక్కినవి వెనక్కి వచ్చేస్తే యిదే ఆఖరి సంచిక అవుతుంది. నేను దివాలా తీయాలి. వేరే ఉద్యోగం వెతుక్కోవాలి.' అనుకున్నాడు హ్యూ. కానీ రెండో సంచిక ఉంటుందనే ఆశాభావంతో పని కొనసాగించాడు. రెండో సంచిక సెంటర్‌స్ప్రెడ్‌కు పెద్దగా తెలియకపోయినా అందంగా ఉన్న అమ్మాయి న్యూడ్‌ ఫోటోలు కొన్నాడు. కాపీరైటు బాధ లేని పాత కథలు మరిన్ని పోగేశాడు. తన కార్టూన్లు ఎలాగో సంచులనిండా వున్నాయి.

తొలి సంచిక షికాగో న్యూస్‌ స్టాండ్స్‌లో వెలిసింది. అది ఎలా అమ్ముడుపోతోందో చూడాలనే కుతూహలంతో హ్యూ బుక్‌స్టాల్స్‌కు కాస్త దూరంలో నిల్చుని గమనిస్తూ ఉండేవాడు. ఎవరైనా తన పత్రికను చేతిలోకి తీసుకుని పేజీలు తిరగవేస్తూ వుంటే, అతను కొంటాడా లేదా అని ఆదుర్దాగా చూస్తూ వుండేవాడు. మధ్యమధ్యలో అక్కడకు వెళ్లి తన పత్రికను చేతిలోకి తీసుకుని దాన్ని అప్పుడే తొలిసారి చూసినట్లు నటిస్తూ, పేజీలు అటూయిటూ తిప్పి, వెనక్కి పెట్టేసేటప్పుడు ఆ పుస్తకాన్ని కాస్త ప్రముఖంగా కనబడేట్లు, పెద్ద పత్రికల సరసన అమర్చేవాడు.

ఒక వారం తర్వాత స్టాల్స్‌లో ప్లేబోయ్‌ పుస్తకాల బొత్తి తగ్గుతూన్నట్లు అనిపించి, అమ్ముడుపోతోందన్నమాట అనుకున్నాడు. రెండు వారాలు పోయేసరికి పంపిణీదారు ఫోన్‌ చేసి  దేశమంతా అమ్మకాలు బాగున్నాయని, రెండో సంచిక తయారు చేయమని చెప్పాడు. ఆ పాటికి ''టైమ్‌'', ''న్యూస్‌వీక్‌'' ''సాటర్‌డే రివ్యూ'' పత్రికల్లో కొత్త పత్రిక గురించి మంచి సమీక్షలు వచ్చాయి. కానీ బొకాషియో కథ కారణంగా చర్చి వారికి కోపం వచ్చింది. అది తొలిసారి ప్రచురించినపుడు బొకాషియోపై చర్చి ఎంతలా మండిపడిందో, యిప్పుడు హ్యూ మీదా అంతలా విరుచుకు పడింది. చర్చి ఛాన్సలరీ నుంచి హ్యూకు ఫోన్‌ వచ్చింది.

పత్రిక తొలిదశలో చర్చితో వైరం పెట్టుకుందామని అతననుకోలేదు. అందువలన షికాగోలోని స్టాల్స్‌ లోంచి పత్రిక కాపీలను వెనక్కి తీసుకుని తక్కిన వూళ్లల్లో పంపిణీ చేయమని డిస్ట్రిబ్యూటర్‌కు చెప్పాడు. నెల పూర్తయ్యేసరికి 50 వేల కాపీలు అమ్ముడుపోయాయి. రెండో సంచిక కవరు పేజీ మీద 1954 జనవరి అని వేసి హ్యూ విడుదల చేశాడు. దాని మీద పబ్లిషరుగా తన పేరు వేసుకున్నాడు. అదీ హిట్టయింది. నాలుగు సంచికలు వేసేసరికి హ్యూ వేరే ఆఫీసు తీసుకున్నాడు. 

పత్రిక సామాన్యజనానికి నచ్చింది కానీ స్థానిక ప్రభుత్వాధికారులకు, మతాధికారులకు యీ పత్రిక కంటగింపుగా మారింది. దాన్ని ఎలాగైనా అణచివేయాలని తమ వంతు ప్రయత్నాలు తాము చేసేవారు. షికాగో పోస్టాఫీసు ఉద్యోగులు ప్లేబోయ్‌ ఆఫీసుకు వచ్చే మనీఆర్డర్లు, చందా ఆర్డర్లు, ఎక్కువ కాపీలు కావాలంటూ వివిధ నగరాల ఏజంట్లు రాసే ఉత్తరాలను ఆలస్యంగా డెలివర్‌ చేసేవారు. చందాదారులకు తక్కువ పోస్టేజీతో బుక్‌పోస్టులో పంపే సౌకర్యం పత్రికలకు ఉంది కానీ దానికి పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ అనుమతి యివ్వాలి. ప్లేబోయ్‌ అసభ్యపత్రిక కాబట్టి ఆ సౌకర్యం యివ్వననేశాడాయన.

ఇక స్థానిక పోలీసులైతే ప్లేబోయ్‌ ఆఫీసు ఎదురుగా నో పార్కింగ్‌ బోర్డు పెట్టేసి, అక్కడకు వచ్చినవాళ్ల వాహనాలను పట్టుకుపోసాగారు, జరిమానాలు వేసేవారు. ఆ రోడ్డుకి ఎదురుగా నో పార్కింగ్‌ జోన్‌లో ఓ రోజు ఓ కారు పార్క్‌ చేసి వుంది. అది షికాగో ఆర్చిబిషప్‌ గారి కారు. 'మావాటి మీద అంత కఠినంగా వుంటారు కదా, మరి ఆ కారు మీద ఫైన్‌ వేయరేం?' అని అక్కడున్న పోలీసును అడిగాడు ఏన్సన్‌ మౌంట్‌ అనే ప్లేబోయ్‌ ఉద్యోగి. జోకులేస్తున్నావా? అన్నాడు పోలీసు. లేదు, కావాలంటే రాతపూర్వకంగా ఫిర్యాదు యిస్తాను అన్నాడితను. అడ్రసుతో సహా రాసియ్యి అన్నాడు పోలీసు.

వారం తర్వాత మఫ్టీలో వున్న ఓ యిద్దరు పోలీసులు అతనింటికి వచ్చి చితకబాదేశారు. అతను దీని గురించి ఫిర్యాదు చేద్దామా అని ఆలోచించి పోలీసులతో పెట్టుకోవడం యిష్టం లేక వూరుకున్నాడు. ఇలాటి కష్టాలు ప్లేబోయ్‌, దాని సిబ్బంది చాలానే పడ్డారు. వీటి మాట ఎలా వున్నా అమెరికాలో ఏ పత్రికా ఎదగనంత వేగంగా అది ఎదిగింది. 1954 డిసెంబరులో ప్రథమ వార్షికోత్సవ సంచిక వేసేనాటికి దాని సర్క్యులేషన్‌ 1,75,000 కాపీలు! ఈ కథను యిక్కడితో ఆపవచ్చు. ఒకసారి వ్యాపారం ఎస్టాబ్లిష్‌ అయ్యాక దాన్ని ఎలా నిలబెట్టుకున్నాడనేది వేరే కథ.

(ఫోటో - ప్లేబోయ్‌ తొలిసంచికతో హ్యూ, తొలిసంచిక సెంటర్‌స్ప్రెడ్‌) (సమాప్తం)

ఎమ్బీయస్‌: ''ప్లేబోయ్‌'' హ్యూ హెఫ్నర్‌ - 01

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?