Advertisement

Advertisement


Home > Articles - MBS

హుందాగా రిటైర్‌ కావడం ఎలాగంటే...

గాంధీ-నెహ్రూ కుటుంబపు వారసత్వ రాజకీయాలతోనే మన దేశానికి యీ గతి పట్టిందని వాపోతూ వుంటాం. నిజానికి దక్షిణాసియాలోని అనేక దేశాల్లో  (పాకిస్తాన్‌లో భుట్టో కుటుంబం, బంగ్లాదేశ్‌లో ముజిబుర్‌ రహమాన్‌ కుటుంబం వగైరాలు) యీ ధోరణి కనబడుతోంది. ఒక్కడు కష్టపడి నాయకుడైతే చాలు, వారసులకు రాజమార్గమే. తండ్రి చనిపోతే కొడుకు/కూతురు, భర్త చనిపోతే భార్య, భార్య చనిపోతే భర్త, అన్నగారు పోతే తమ్ముడు/చెల్లెలు... యిలా ఎవరో ఒకరు కుటుంబం పేరుతో తయారవుతారు. అంతిమంగా ప్రజలు ఆదరించాలన్న మాట నిజమే కానీ రాజకీయాల్లోకి ప్రవేశం అయితే సులభంగా జరుగుతోంది కదా.  జాతీయ స్థాయిలో కాంగ్రెసును నిందించిన ప్రాంతీయ పార్టీ నాయకుల మాటేమిటి? అందరూ తమ వారసులను తెచ్చినవారే కదా. కొన్నాళ్లు సాగాక, ప్రజలు  తమను తిరస్కరిస్తున్నారని గ్రహించినా వీళ్లు పార్టీని పట్టుకుని వదలకపోవడం చూస్తున్నాం. ఈ ఎన్నికలలో కాంగ్రెసును పాతాళస్థాయికి తెచ్చిన సోనియా, రాహుల్‌ గాంధీలు యింకా రాజకీయాల్లో కొనసాగాలా వద్దా అన్న ఆత్మవిమర్శ చేసుకుంటే వారు శ్రీలంక వైపు, ముఖ్యంగా చంద్రికా కుమారతుంగను చూడాలి.

చంద్రిక తండ్రి సోలమన్‌ బండారునాయకే శ్రీలంక ఫ్రీడమ్‌ పార్టీ స్థాపించి, 1956  ఎన్నికలలో నెగ్గి దేశప్రధాని అయ్యాడు. సోషలిస్టు తరహా విధానాలు అవలంబిస్తూ 1959లో ఒక బౌద్ధ సన్యాసి చేతిలో హత్యకు గురయ్యాడు. అప్పుడు పార్టీలో శూన్యత ఏర్పడి సంక్షోభం ఏర్పడడంతో అతని అనుచరుల కోరిక మేరకు అతని భార్య సిరిమావో పార్టీ పగ్గాలు చేపట్టి ఎన్నికల్లో నెగ్గి 1960లో ప్రధానమంత్రి అయింది. ఒకసారి ఓడిపోయినా 1970లో మళ్లీ ఎన్నికైంది. రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కుంది. భర్తలాగే ఆమె కూడా సోషలిస్టు విధానాలనే అవలంబించింది కానీ నియంతగా మారింది. ఆమె పెద్ద కూతురు సునేత్రకు రాజకీయాల్లో ఆసక్తి లేదు. కొడుకు అనూరకు ఆశలున్నాయి కానీ పనికి రాడనుకుంది. చిన్న కూతురు చంద్రిక పార్టీలో చేరి భూసంస్కరణల అమలులో సహకరించింది. ఒక సినిమా నటుణ్ని పెళ్లాడాక తల్లి పార్టీ విడిచి, అతని పార్టీలో చేరింది. అయితే అతను ఒక కమ్యూనిస్టు చేతిలో హత్యకు గురి కావడంతో రాజకీయాలు వదిలేసి విదేశాలకు వెళ్లిపోయింది. 

పదేళ్ల తర్వాత తల్లి రాజకీయాల్లో దెబ్బ తిని వున్న సమయంలో వచ్చి ఆమె పార్టీలో చేరి తల్లిని మించిన తనయగా ఎదిగింది. 1994 ఎన్నికల్లో నెగ్గి అధ్యక్షపదవి చేపట్టింది. రెండోసారి కూడా నెగ్గి 2005 వరకు ఆ పదవిలో వుంది. అక్కణ్నుంచి రాజ్యాంగం మార్చి ప్రధాని అవుదామనుకుంటే ప్రతిపక్షం అడ్డుకుంది. నెగ్గిన ఏడాది తర్వాత గానీ ప్రమాణస్వీకారం చేయలేదు కాబట్టి అప్పణ్నుంచి లెక్క వేసి చూస్తే ఇంకో ఏడాది నేను పదవిలో వుండవచ్చు అని అంటే సుప్రీం కోర్టు అదేమీ లెక్కలోకి రాదంది. ప్రతిపక్షంతో పాటు స్వపక్షం కూడా తను దిగిపోవాలని కోరుకుంటోందని గ్రహించింది చంద్రిక. అప్పటిదాకా తనకు పార్టీలో ప్రత్యర్థిగా నిలిచిన మహేంద్ర రాజపక్షకు పార్టీ పగ్గాలు అప్పగించి రాజకీయాల్లోంచి తప్పుకుంది. 'హత్యా రాజకీయాల వలన నాన్నను, భర్తను పోగొట్టుకున్నాను.   1999లో ఎల్‌టిటిఇ నన్ను కూడా చంపబోయింది. చావు తప్పి కన్ను లొట్టబోయింది. మీరు బతికి బావుండాలంటే రాజకీయాలకు దూరంగా వుండండి' అని తన పిల్లలకు నూరిపోసింది. ఆమె రిటైరయ్యే నాటికి ఆమె కూతురు యశోధర ఇంగ్లండులో డాక్టరు. కొడుకు విముక్తి వెటర్నరీ డాక్టరీ చదువుతున్నాడు. 

రాజకీయాల్లోంచి తప్పుకున్నాక చంద్రిక పార్టీ వ్యవహారాలు పట్టించుకోలేదు. రాజపక్షె తన చుట్టాలు పక్కాలతో పార్టీని, ప్రభుత్వాన్ని నింపేస్తూన్నా ప్రతిఘటించలేదు. తన పాత అనుచరుల ద్వారా కష్టాలు కలిగించలేదు. పార్టీ కష్టకాలంలో కూడా సలహాలు యివ్వలేదు. ప్రజాజీవితం నుండి తప్పుకుని 69 ఏళ్ల వయసులో హుందాగా జీవిస్తోంది. ఆమె జీవితం నుండి సోనియా, రాహుల్‌ గాంధీలు నేర్చుకోవాల్సినది చాలా వుందనిపిస్తోంది కదా! 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?