Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: హాస్యనటుడు జెర్రీ లూయీస్‌

ఎమ్బీయస్‌: హాస్యనటుడు జెర్రీ లూయీస్‌

1950, 60 దశకాల్లో హాలీవుడ్‌లో ప్రఖ్యాతి పొందిన హాస్యనటుడు జెర్రీ లూయీస్‌ యీ ఆదివారం ఆగస్టు 20న తన 91వ యేట కన్నుమూశారు. అతను పోయినా, అతని తరహా హాస్యం మన దగ్గర జీవించే వుంది కాబట్టి దాని గురించి కాసిన్ని ముచ్చట్లు. ఎడ్డీ మర్ఫీ నటించిన ''ద నట్టీ ప్రొఫెసర్‌'' (1996) సినిమా చాలామందికి పరిచితమే. దానికి మూలం, అదే పేరుతో 1963లో వచ్చిన జెర్రీ లూయీస్‌ సినిమా. డాక్టర్‌ జెకిల్‌ అండ్‌ మిస్టర్‌ హైడ్‌ నవలకు ప్యారడీగా తయారైన యీ సినిమాలో ముఖ్యపాత్ర ధరించడంతో బాటు సహరచయితగా, దర్శకుడిగా, సహనిర్మాతగా వ్యవహరించాడు జెర్రీ.

కాస్త మందబుద్ధిగా వుండి, పిల్లచేష్టలు చేస్తూ, కొద్దిపాటి వెకిలితనం కూడా రంగరించిన పాత్రలతో పేరు తెచ్చుకున్న తెలుగు హాస్యనటులు వున్నారు. వారికి స్ఫూర్తి జెర్రీ అని చెప్పుకోవచ్చు. ఇలాటి హాస్యాన్ని విమర్శకులు మెచ్చరు. చౌకబారుగా వుందంటారు. కానీ వినోదం కోసమే థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు పడిపడి నవ్వుతారు. అతన్ని ఆత్మీయుడిగా భావిస్తారు. అందుకే సినిమాల్లోనే కాదు, టివిపై, రేడియోపై, రంగస్థలంపై కూడా జెర్రీ రాణించాడు. 5 దశాబ్దాలపాటు సాగిన కెరియర్‌లో 45 సినిమాలు వేశాడు. అనేక టీవీ షోలు యిచ్చాడు. అమెరికాలో అతని ప్రభ తగ్గిపోయిన తర్వాత కూడా ఫ్రాన్సు అతన్ని అక్కున చేర్చుకుంది. అతని అబ్సర్డ్‌ కామెడీని ఫ్రెంచ్‌ విమర్శకులు ప్రశంసిస్తూనే వున్నారు. 1984లో, 2006లో ఫ్రెంచ్‌ ప్రభుత్వం అతనికి ఘనమైన అవార్డులు యిచ్చి సత్కరించింది.

ఎందుకు విడిపోయారో వారెప్పుడూ బయటకు చెప్పలేదు. విడిపోయిన కొత్తల్లో జెర్రీకి ఏం చేయాలో బోధపడలేదు. అయితే అనుకోకుండా లాస్‌ వెగాస్‌లో స్టేజిపై ప్రదర్శన యివ్వవలసి వచ్చింది. జోక్స్‌ చెప్పడంతో పాటు పాటలు కూడా పాడాడు, పాతికేళ్లగా అలవాటు పోయినా! ఓ రికార్డింగ్‌ కంపెనీ వాటిని రికార్డులుగా అమ్మితే విపరీతంగా అమ్ముడుపోయాయి.  ఇక అక్కణ్నుంచి లైవ్‌షోలు చేయడం మొదలుపెట్టాడు. డీన్‌కు, యితనికి కలిపి ఎంత ఫీజు యిచ్చేవారో యితనొక్కడికే అంత యివ్వసాగారు. 

నటగాయకుడు కిశోర్‌ కుమార్‌ విషయంలో యిలాటిదే జరిగింది. ఒక దశలో నటించడానికి సినిమాలు చేతిలో లేకపోతే స్టేజి షోలు మొదలుపెట్టాడు. నిజానికి అతనికి స్జేజి ఫియర్‌. బలవంతంమీద వేదిక ఎక్కి షో చేస్తే హిట్టయింది. ఆ ధైర్యంతో మరిన్ని షోలు చేశాడు. అప్పుడు నిర్మాతలు అతన్ని గుర్తించి, గాయకుడిగా ఛాన్సులివ్వసాగారు. కెరియర్‌ మళ్లీ మొదలైంది. అలాగే జెర్రీ కూడా 1957 నుంచి విడిగా టీవీ షోలు యివ్వసాగాడు. న్యూయార్క్‌ క్లబ్బులో కూడా ప్రదర్శనలు యిచ్చాడు. పారమౌంట్‌ స్టూడియో వాళ్లు యితన్ని సోలో హీరోగా పెట్టి ''ద డెలికేట్‌ డెలిన్‌క్వెన్ట్‌'' (1957)లో సినిమా తీసింది.

అది హిట్‌ కావడంతో వరుసగా సినిమాలు తీశారు. 1960 క్రిస్‌మస్‌ నాటికి జెర్రీ సినిమా ఏదీ రిలీజుకు సిద్ధంగా లేదు. దాంతో తనే ఒక నెల వ్యవధిలో ''ద బెల్‌బాయ్‌'' (1960) అనే సినిమా తీశాడు. సహరచయిత, దర్శకుడు అతనే. ఆ సినిమా హిట్‌ కావడంతో యితరుల సినిమాల్లో నటిస్తూ, సొంతంగా కూడా సినిమాలు తీశాడు. అలా సొంతంగా తీసిన సినిమాయే పైన ఉదహరించిన ''ద నట్టీ ప్రొఫెసర్‌''. ఇలా 1970 వరకు అతని కెరియర్‌ ఉజ్జ్వలంగా వెలిగింది. ఆ తర్వాత వెనకబడ్డాడు. అవతల డీన్‌ కూడా విడిగా నిలదొక్కుకుని పైకి వచ్చాడు.

జన్మతః యూదుడైన జెర్రీ నాజీ కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో జీవితంపై 1972లో తీసిన ''ద డే క్లౌన్‌ క్రైడ్‌'' అనే సినిమా తను ఆశించిన మేరకు రూపొందలేదని అనుకుని దాన్ని విడుదల చేయలేదు. 11 సం||ల గ్యాప్‌ తర్వాత ''హార్డ్‌లీ వర్కింగ్‌'' (1981) అనే సినిమాతో మళ్లీ నటించసాగాడు. దాని డైరక్షన్‌ కూడా అతనిదే. విమర్శకులు తిట్టిపోసినా, అది 50 మిలియన్‌ డాలర్లు ఆర్జించింది. తర్వాత ''ద కింగ్‌ ఆఫ్‌ కామెడీ'' (1983)లో అతను టివి హోస్ట్‌గా నటించాడు. అతనంటే వెర్రి అభిమానం వున్న అభిమానులుగా రాబర్డ్‌ డి నీరో, శాండ్రా బెర్న్‌హార్డ్‌ నటించారు. ఆ తర్వాత కూడా టీవీ షోల్లో  పాల్గొనడంతో బాటు సినిమాల్లో కూడా వేశాడు. 2016లో విడుదలైన ''మాక్స్‌ రోజ్‌'' అతని ఆఖరి సినిమా. అతను మానవతావాది కూడా. కండరాల వ్యాధిపై రిసెర్చికి నిధులు సమకూర్చడానికి షోలు చేశాడు. 

జెర్రీ లూయీస్‌ అతి ధోరణిని ఫ్రెంచ్‌వారు మెచ్చుకున్నా, ఇంగ్లండు, అమెరికాలో దాన్ని వెక్కిరించేవారు. తెలుగునాట కూడా సున్నితమైన హాస్యం కనుమరుగవుతోందని విమర్శకులు నొచ్చుకుంటూనే వున్నారు. కానీ లెంపకాయల హాస్యాన్ని చూసి సాధారణ ప్రేక్షకుడు నవ్వుతూనే వున్నాడు. అందుకే మన హాస్యంలో 'అతి' ఎక్కువైంది. ఈ ధోరణి చూసినపుడు జెర్రీయే గుర్తుకు వస్తాడు. ఎటొచ్చీ అతను 1960ల్లో చేసిన హాస్యాన్ని మనవాళ్లు అర్ధశతాబ్ది తర్వాతా కొనసాగిస్తున్నారు. (1.డీన్‌ మార్టిన్‌తో.., 2.''ద నట్టీ ప్రొఫెసర్‌''లో స్టెల్లా స్టీవ్స్‌తో జెర్రీ) 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?