Advertisement

Advertisement


Home > Articles - MBS

కార్గిల్‌ యుద్ధంపై కమిటీ రిపోర్టు కథ

కార్గిల్‌ యుద్ధంలో (మే-జులై, 1999) మనం విజయం సాధించి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు జరిగాయి. అదొక యుద్ధమే కాదనీ, కాస్త పెద్ద తగాదా (స్కిర్మిష్‌) మాత్రమే అనీ కొందరు పరిశీలకులు అంటారు. ఆ యుద్ధం గురించి నిజానిజాలు వెలికి తీయడానికి వాజపేయి ప్రభుత్వం 1999లో ఒక విచారణ కమిటీ వేసింది. ఆ యుద్ధానికి ముందు వాజపేయి లాహోర్‌కు బస్సులో వెళ్లడం, నవాజ్‌ షరీఫ్‌ ఆయనకు ఘనస్వాగతం పలకడం అన్నీ జరిగాయి. బస్సు యాత్ర జరిగిన 3 నెలలకే కార్గిల్‌ యుద్ధం జరిగింది. వాజపేయి లాహోర్‌ వెళ్లడానికి ముందు నవాజ్‌ షరీఫ్‌ను యింటర్వ్యూ చేసిన శేఖర్‌ గుప్తా అనే ప్రముఖ జర్నలిస్టును ఆ కమిటీ పిలిచి మూడు గంటలపాటు ప్రశ్నించింది. ముఖ్యంగా నవాజ్‌ షరీఫ్‌తో జరిగిన ఇంటర్వ్యూ గురించి తరచి తరచి అడిగింది. కమిటీకి చైర్మన్‌గా డా|| కె.సుబ్రహ్మణ్యం వ్యవహరించారు. 1999 నవంబరులో శేఖర్‌ కమిటీని కలవడానికి వెళ్లినపుడు చైర్మన్‌తో బాటు మరో యిద్దరు కమిటీ సభ్యులు మాజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ కె కె హజారి, బిజి వర్గీస్‌ అనే పత్రికా సంపాదకుడు వున్నారు. కమిటీలో మరో సభ్యుడైన ఐఎఫ్‌ఎస్‌ అధికారి సతీశ్‌ చంద్ర ఆ రోజు లేరు.  కార్గిల్‌ యుద్ధం ఎలా నడిచింది, దానికి మీడియాలో ఎలా కవరేజి వచ్చింది అని అడిగినపుడు ''మన సైనికుల సామర్థ్యం గురించి యుద్ధంలో పాల్గొన్న మన సైనికాధికారులను అడిగితే సగటు భారతీయ సైనికుడి కంటె సగటు పాకిస్తానీ సైనికుడికి నైపుణ్యం, ఆయుధ సంపత్తి ఎక్కువగా వున్నాయని నాకు చెప్పారు. ఇలా చెప్పినవాళ్లలో యిద్దరు బ్రిగేడియర్లు కూడా వున్నారు.'' అన్నాడు శేఖర్‌. అది వినగానే సుబ్రహ్మణ్యం ''ఇలాటివి పిచ్చాపాటీ కబుర్లలో చెప్పవచ్చు కానీ, యీ సందర్భాల్లో చెప్పకూడదు'' అని మందలించాడు. ''ఏం? ఎందుకు?'' అన్నాడు శేఖర్‌. ఆయన యితని కేసి జాలిగా చూసి భుజం తట్టి ''నువ్వింకా చాలా విషయాలు తెలుసుకోవాలి.'' అన్నాడు. 

పదిహేను రోజుల తర్వాత ఏడు పేజీల రిపోర్టు వచ్చింది. 'కమిటీ ముందు మీరిచ్చిన స్టేటుమెంటును మా ఆఫీసర్సు రికార్డు చేశారు. దీనిని ధృవీకరిస్తూ, కింద సంతకం చేయండి.' అంటూ! అవన్నీ శేఖర్‌ చెప్పిన మాటలే, కానీ అర్థం మారిపోయేట్లు తెలివిగా దిద్దేశారు. ఉదాహరణకి - పాకిస్తాన్‌ సైనికుల నైపుణ్యం గురించి శేఖర్‌ చెప్పినదానిలో సైనికాధికారుల ప్రస్తావన ఎత్తేసి, అది శేఖర్‌ వ్యక్తిగత అభిప్రాయంగా చూపారు. ఇంకో సంగతేమిటంటే లాహోర్‌ యాత్రకు ముందు వాజపేయి శేఖర్‌తో మాట్లాడుతూ 'నువ్వు నవాజ్‌ షరీఫ్‌కు చెప్పి అతని చేత నన్ను అధికారికంగా ఆహ్వానింపచేస్తే నేను తప్పకుండా లాహోర్‌ వెళతాను' అన్నారు. ఆ ముక్క శేఖర్‌ నవాజ్‌కు చెపితే 'వాజపేయి రాదలచుకుంటే మాత్రం ఆయన జీవితంలో మర్చిపోలేనంత ఘనస్వాగతం ఏర్పాటు చేస్తాను' అన్నాడు నవాజ్‌. అంటే డైరక్టుగా ఆహ్వానించినట్లు కాదు కదా! కానీ రిపోర్టులో మాటలు అటూయిటూ మార్చి, నవాజ్‌ షరీఫ్‌ శేఖర్‌ ద్వారా ఆహ్వానాన్ని పంపాడని రాశారు. శేఖర్‌ యివన్నీ దిద్ది, ఓ వారం రోజుల్లో తిప్పి పంపాడు. ఈ సారి సుబ్రహ్మణ్యం నుండి కబురూ కాకరకాయ లేదు. కొన్ని వారాలు పోయాక ఒక ఆఫీసరు ఫోన్‌ చేసి 'కమిటీ వారు మీ స్టేటుమెంటును ఉపయోగించుకోదలచుకోలేదు' అని చెప్పాడు. అంటే అర్థమేమిటి? ఈ కమిటీలు అప్రియమైన వాస్తవాలను సమాధి చేయడానికే తప్ప తప్పొప్పులను సమీక్షించుకుని భవిష్యత్తులో ఆ పొరపాట్లు జరగకుండా చూడడానికి కాదన్నమాట. అందుకే 1965, 1971 నాటి యుద్ధాల గురించి అధికారికమైన చరిత్ర యిప్పటిదాకా వెలువడలేదు. ఈ విషయంపై ఫిర్యాదు చేసినదెవరో తెలుసా? కార్గిల్‌ రివ్యూ కమిటీయే. తమాషా ఏమిటంటే అది కూడా తన రిపోర్టును బయటపెట్టలేదు.  

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?