Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: రాకుమారి కృష్ణకుమారి - 2/3

 ఎమ్బీయస్‌: రాకుమారి కృష్ణకుమారి - 2/3

మన సినిమా తారల్లో ఎవరికీ యింత నేపథ్యం లేదని మీకూ అర్థమయి వుంటుంది. ఉన్నత విద్యావంతుడైన తండ్రి, అనేక వూళ్లు తిరిగి చూసిన అనుభవం - ఇవొకటే కాదు కృష్ణకుమారి పెట్టుబడి. తండ్రి పెంచిన తీరు కూడా విలక్షణమే! కృష్ణకుమారి తండ్రిదంతా ఇంగ్లీషు పద్ధతే! ఇంట్లో కూడా ఇంగ్లీషు వంటకాలు, టేబుల్‌ మ్యానర్స్‌. ఇంగ్లీషు ట్యూటర్స్‌ను పెట్టి పిల్లలకు ఇంగ్లీషు నేర్పించడం. బట్టలు దగ్గర్నుండి వెస్టర్న్‌ టైపే. కృష్ణకుమారికి సరిగ్గా చీర కట్టడం కూడా వచ్చేది కాదు. ఆవిడ సినిమాల్లోకి వచ్చాక నాగేశ్వరరావుగారితో 'భార్యాభర్తలు'లో వేసేటప్పుడు ఆయన మందలించి చీర ఎలా కట్టుకోవాలో చూపించారు. ఆయన ఏళ్ల తరబడి స్టేజ్‌ మీద స్త్రీపాత్రలు వేసేవారు కదా. ఆడవాళ్ల కట్టూ బొట్టూ ఆయనకు తెలుసు. పాశ్చాత్య పద్ధతుల్లో పెరిగిన కృష్ణకుమారికి తెలియదు.

 వాళ్ల కుటుంబం రాజమండ్రి వచ్చాక అక్క ('షావుకారు' జానకిగారు) తో బాటు రైల్వే కాన్వెంటులో చదువుకుంది. చదువుతో బాటు ఇద్దరూ జగన్నాధ శర్మ అనే ఆయన వద్ద భరతనాట్యం నేర్చుకున్నారు.  ఆయన తర్వాత మద్రాసు వెళ్లిపోయాడు. వెంకాజీగారికి డైరక్టర్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ పోస్టు రావడంతో వీళ్లూ అనుకోకుండా మద్రాసు చేరారు. జగన్నాధ శర్మగారి వద్ద శిష్యరికం కొనసాగింది. దానితో బాటు రేడియో అన్నయ్య, అక్కయ్య న్యాయపతి రాఘవరావుగారు, కామేశ్వరమ్మగారు నడిపే బాలానంద సంఘంలో జానకి, కృష్ణకుమారి సభ్యులుగా చేరారు. కల్చరల్‌ యాక్టివిటీస్‌ యిలా సాగుతూండగానే దుర్గాబాయమ్మగారు నడిపే ఆంధ్రమహిళా సభలో మెట్రిక్‌లో జేరారు.

ఆవిడ జానకిని చలాకీపిల్ల అని మెచ్చుకుంటూనే, కృష్ణకుమారిని 'మూగమ్మాయ్‌' అని పిలిచేది. ఎందుకంటే ఐదేళ్లు పెద్దదైన జానకి అందరితో హుషారుగా తిరిగేది. చిన్నవయసులోనే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితం భగ్నమయితే, స్వతంత్రంగా బతకడానికి అలవాటు పడి, బిడ్డ తల్లయాక సినిమాల్లో చేరి జీవితమంతా స్వేచ్ఛగా, తను అనుకున్న రీతిలో బతికిన మహిళ ఆమె. కానీ కృష్ణకుమారికి సిగ్గు ఎక్కువ. అక్కగారి పక్కన డాన్సు చేస్తూండేది. ఒక బెంగుళూరు పెద్దాయన మద్రాసు వచ్చి వీళ్లిద్దరి డాన్సూ చూసి బెంగుళూరులో వీళ్ల డాన్సు ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు. ఆ తరువాత మద్రాసులో..! బాలానంద సంఘంద్వారా రేడియో నాటకాలు వేశారు.

ఇక్కడ యిలా నడుస్తూండగానే తండ్రికి అసాం నుండి ఆఫర్‌ వచ్చింది. మన హీరోయిన్‌ అక్కడకి వెళ్లి సెంట్‌ మేరీస్‌ కాన్వెంట్‌లో చదువుకునేది. వెంకాజీగారికి షిల్లాంగ్‌ క్లబ్‌ అనే ఎలిట్‌ క్లబ్‌లో సభ్యత్వం వుండేది. అక్కడ యీమె డాన్సు ప్రోగ్రాంలు  యిచ్చేది.  వాటి గురించి షిల్లాంగ్‌ టైమ్స్‌లో రిపోర్టులు వచ్చేవి. ఇంతలోనే జానకికి పెళ్లి కావడం, భర్తతో పొరపొచ్చాలు రావడం జరిగింది. ఆవిడ అసాంలో పుట్టింటికి వచ్చేసింది. మెట్రిక్‌ పూర్తి చేసింది. ఇంతలోనే పెద్ద భూకంపం రావడం, భయపడి వెంకాజీగారు ఫ్యామిలీని మద్రాసుకి తరలించి డబ్బు పంపేవారు. 'కృష్ణకుమారికి డాన్సు యిష్టం కదా, కంటిన్యూ చేయమను. నాకు డైరక్టరు సి.పుల్లయ్యగారు బాగా తెలుసు. వారిని కలిసి తనకు డాన్సు నేర్చుకునే ఏర్పాట్లు చేయవలసినది.' అని చెప్పి పంపారు.

సి.పుల్లయ్యగారు జెమినీ స్టూడియోలో డైరక్టరుగా వుండే రోజులవి. జెమినీలో చోప్డా, దండాయుధ పిళ్లయ్‌ వద్ద డాన్సు నేర్చుకుంది కృష్ణకుమారి. ఈ డాన్సు నేర్చుకునే టైములోనో ఏమో, కస్తూరి శివరావు గారు ఈమెను చూశారు. శివరావు అప్పట్లో టాప్‌ కమెడియన్‌. 'అగ్నిమంత్రం' అనే జానపద సినిమా తీద్దామనుకుంటున్నారు. కృష్ణకుమారిని హీరోయిన్‌ చేద్దామనుకున్నారు. బౌనా అనే స్టిల్‌ ఫోటోగ్రాఫర్‌ను పిలిచి స్టిల్స్‌ తీయించారు. స్టిల్స్‌ అందరికీ చూపిస్తూ 'చక్కటి ఫీచర్స్‌ కదా, మా కొత్త హీరోయిన్‌!' అని చెప్పుకునేవారు. ఆయన సినిమా తయారవ్వలేదు. అలాగే జెమినీవాళ్లు 'వీరకుమార్‌' అనే సినిమాలో నాట్యతారగా ఛాన్సు యిద్దామనుకున్నారు కానీ ఆ సినిమా కూడా తయారవ్వలేదు. ఇది ఇలా వుండగానే ఇంకో జానపద సినిమా 'మంత్రదండం' లో ఓ చిన్నవేషం వచ్చింది.

ఆ రోజుల్లోనే కృష్ణకుమారి ఓ సారి సినిమాకు వెళ్లింది. పక్కనున్న అమ్మాయి ఈమెను చాలాసేపు పరిశీలనగా చూసి, దగ్గరకు వచ్చి పేరేమిటని అడిగి తెలుసుకుంది. అడ్రసు అడిగింది. ఇంకో రెండు రోజులకి కృష్ణకుమారి యింటిముందు ఓ పెద్ద కారు ఆగింది. అవాళ సినిమాహాల్లో కనబడ్డ అమ్మాయి దిగింది. ఆమె పేరు భూమాదేవి. సౌందరరాజ అయ్యంగారి కూతురు. టిఎన్‌టి అనే బ్యానర్‌ మీద ఆయన 'నవ్వితే నవరత్నాలు' సినిమా ప్లాను చేస్తున్నారు. ఈ సినిమాకి ఆధారం సిండరిల్లా కథ. కథ తెలిసినదేగా, బీద అమ్మాయి, అమాయకురాలు.

మంత్రగత్తె వచ్చి మార్చేసరికి రాకుమారి అయిపోతుంది. కృష్ణకుమారిని చూడగానే నిర్మాత గారమ్మాయికి ఈమె అయితేనే ఆ పాత్రకు సరిపోతుంది అనిపించింది. అందుకని పాత్రే ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. వెంకాజీగార్ని అడిగారు. పిల్లల్ని సినిమాల్లోకి పంపకూడదనే చాదస్తాలు లేవాయనకు. 'గో ఎహెడ్‌' అన్నారు. ఆ విధంగా 'నవ్వితే నవరత్నాలు' ఆమె సంతకం చేసిన తొలి ఎగ్రిమెంట్‌.

కానీ 'మంత్రదండం' ముందు స్టార్టయింది. ఫస్ట్‌ షాట్‌లో కృష్ణకుమారి సోదెకత్తెలా వేసింది. రాణీ వేషం వేసినది హేమలత. ఆమె వద్దకు వచ్చి, ''రాణీ - నూనెలో చూసుకో - అయినవారిని కానుకో'' అనాలి. 'మొదటి డైలాగే నూనెతో ఏమిటండీ? శని కాకపోతే' అని కృష్ణకుమారి తల్లి ఫీలయ్యారు. ఈ సినిమాలు రెండూ అవుతూండగానే కృష్ణకుమారి మొహం చూసి ముచ్చటపడి గబగబా ఆఫర్లు వచ్చాయి. గోపీచంద్‌ గారు 'ప్రియురాలు', నటుడు ముక్కామల దర్శకత్వం వహించి నిర్మించిన 'మరదలు పెళ్లి', అలాగే 'చిన్నమ్మకథ' 'సత్యశోధనై' అనే తమిళ సినిమా, దాని కన్నడ వెర్షన్‌. గుబ్బి వీరణ్నగారి 'గుణసాగర్‌' అనే సినిమా తమిళంలో, కన్నడంలో రెండింటిలోనూ.. యిలా ఎన్నో ఆఫర్లు.

యివన్నీ మేనేజ్‌ చేయాలంటే 15 యేళ్ల కృష్ణకుమారికి సాధ్యమేనా? అందుకని వాళ్ల అన్న రాము అనే ఆయన హేండిల్‌ చేయడం మొదలెట్టాడు. ఆయనా తండ్రిలాగే ఖర్చుమనిషి. అటు తండ్రి చూస్తే హేండ్‌మేడ్‌ పేపర్‌ను ప్రమోట్‌ చేయాలంటూ దేశంలో అనేక చోట్ల ఎగ్జిబిషన్‌లు పెట్టి డబ్బు విస్తారంగా ఖర్చు పెట్టేశారు. రాబడి తగ్గసాగింది. ఇన్నాళ్లూ దర్జాగా బతికారు కాబట్టి వెనకేసుకున్నది ఏమీ లేదు. ఆదాయం మాట ఎలా వున్నా, ఖర్చు మాత్రం ఇదివరకటి లెవెలే!  కృష్ణకుమారికి స్టార్‌ లెవెల్‌ అంటూ వచ్చింది కాబట్టి ఓ కారు మేన్‌టేన్‌ చేయాల్సిన పని బడింది. నెలసరి ఆదాయం పెరచుకోవడానికి యింతకుముందు కొన్న ఆస్తులవీ అమ్మి వ్యాపారం పెడదామన్న ఆలోచన వచ్చింది. విజయా-వాహినీ స్టూడియో ప్రారంభమవుతోంది.

దానికి కాంటీన్‌ వుంటుంది కదా, ఆ కాంటీన్‌కి సరుకు సప్లయి చేసే కాంట్రాక్టు తీసుకున్నాడు కృష్ణకుమారి అన్న రాము. ఈ రాము గారి పెత్తనంలోనే కృష్ణకుమారి రెండు సంవత్సరాల కాలంలో 20 సినిమాల కాంట్రాక్ట్సు చేసింది. చేయడం అంటే తల్లీ, అన్నగారే సమస్తం చూసేవారు. ఈమెకి ఏమీ తెలియదు. మొహానికి రంగేసుకో అంటే వేసుకోవడం, డైరక్టరు చెప్పినట్టు డైలాగులు చెప్పడం..!

ఈ భోగం కొంతకాలమే! కృష్ణకుమారి ఎంత అందంగానైనా వుండవచ్చు, అభినయానికి లోటు చేయకపోవచ్చు. కానీ ఆమె నటించిన సినిమాలన్నీ ఫెయిలయ్యాయి. 1951లో రిలీజయిన మంత్రదండం, నవరత్నాలు, 1952 నాటి ఆడబ్రతుకు, చిన్నకోడలు, చిన్నమ్మ కథ, మరదలు పెళ్లి, ప్రియురాలు, - వీటిలో చిన్నకోడలు ఎన్నో హిట్‌ సినిమాలు తీసిన ప్రతిభా స్టూడియోవాళ్ల సినిమా. అదీ పోయింది. 1953లో లక్ష్మి, పిచ్చిపుల్లయ్య వచ్చాయి. పిచ్చిపుల్లయ్య అంటే ఎన్టీయార్‌గారి స్వంత బ్యానర్‌లో తీసిన ఫస్టు సినిమా. అదీ పోయింది.

1954లో పల్లెపడుచు, అంతా మనవాళ్లే, రాజగురువు, బంగారుపాప వచ్చాయి. బంగారుపాప అంటే బియన్‌ రెడ్డిగారు తీసిన సినిమా. టైటిల్‌ కృష్ణకుమారి పరంగానే పెట్టారు. జమున వేసినా ఇంచుమించు అతిథి పాత్ర లాటిది. ఆ సినిమా కూడా పోయింది. అంతా మనవాళ్లే లో  కృష్ణకుమారి వల్లం నరసింహారావు పక్కన వేసింది. మనిదన్‌, తిరింబిపార్‌ అనే తమిళ సినిమాల్లో కూడా వేసింది కానీ చిన్న పాత్రలే! వాటి జయాపజయాలు ఈమె మీద ఆధారపడలేదు.

కెరియర్‌ మొదట్లో ఇబ్బందులు పడ్డవాళ్లు చాలామంది వున్నారు కానీ యిలా డజను సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డవాళ్లు మాత్రం ఎవరూ లేరు. అందులో ఆవిడది రికార్డు! అప్పట్లో ఓ పత్రిక 'మీ తీర్పు' అని శీర్షిక పెట్టి 'కృష్ణకుమారి నటి కాగలదా?' అని పెద్ద డిస్కషన్‌ పెట్టింది. 'పేరుకే బంగారు పాప. జాతకం యిత్తడి జాతకం ' అన్నారు సినిమావాళ్లు. వేషాలు ఆగిపోయాయి. వీటికి తోడు ఇన్‌కమ్‌ టాక్స్‌వాళ్లు నోటీసు పంపారు - పదివేలు కట్టమని. కృష్ణకుమారి వాళ్ల అన్న రాముని అడిగింది. పదివేలు కట్టేయచ్చు కదా అని. డబ్బెక్కడ? అన్నాడతను. అదేమిటి? నీ స్టోర్సులో పెట్టావుగా? అందీవిడ. 'ఇంకెక్కడి స్టోర్స్‌? నష్టాలొచ్చి ఎప్పుడో మూసేశా' అన్నాడతను. బ్యాంక్‌లో చూస్తే బాలన్స్‌ నిల్‌. ఇన్‌కమ్‌టాక్సు వాళ్లు కారు పట్టుకుపోయారు. పరిస్థితి ఒక్కసారిగా తిరగబడడంతో తల్లికి ఆరోగ్యం దెబ్బ తింది.

కృష్ణకుమారి నేపథ్యం గురించి అంత వివరంగా ఎందుకు చెప్పానంటే యిలాటి పీరియడ్‌లో తట్టుకునే శక్తి ఆమెకు ఆ నేపథ్యం యిచ్చింది. మనకు దేవుడు బుద్ధి, వివేకాన్ని యిచ్చింది  విపరీత పరిస్థితులు వచ్చినపుడు ఎదుర్కొని యింకో మార్గంలో గమ్యాన్ని చేరాలనే! అంతేగానీ జీవితంనుండి పారిపోవాలని కాదు. వేషాలు రాలేదని ఆత్మహత్య చేసుకోవాలని కాదు. కష్టాలు చుట్టుముట్టినపుడు, అయినవాళ్లు మొహం చాటేస్తున్నపుడు కృష్ణకుమారి లైఫ్‌ను రీఆర్గనైజ్‌ చేసుకుంది. చిన్న యింట్లోకి మారింది. కథానాయిక పాత్రలు రాకపోతే హాస్యపాత్రకు సిద్ధపడింది.

హీరోయిన్‌ రోలే కావాలని బిగుసుకు కూచోలేదు. టాలెంటు వున్న మనిషి కాబట్టి హాస్యపాత్రల దగ్గిర ఆగిపోలేదు, సెకండ్‌ హీరోయిన్‌ వేషాలు వచ్చాయి. క్రమంగా టాప్‌ ర్యాంకింగ్‌ హీరోయిన్‌ అయిపోయింది. టాప్‌లో వుండగానే మోస్ట్‌ గ్రేస్‌ఫుల్‌గా రిటైరయిపోయింది. రిటైరవడానికి ఓ వ్యక్తిగత కారణం వుంది. అది తర్వాత చెప్పుకుందాం. హీరోయిన్‌గా రిటైరయ్యా మళ్లీ కొన్నాళ్లకి సరదాకోసం సినిమాల్లో వేయబోయారు కానీ పాత్రలు, వాతావరణం నచ్చలేదు. ఎందుకొచ్చిన అవస్థ అని హాయిగా అన్నీ మానేసి బెంగుళూరులో స్థిరపడిపోయారు. కూతురుకి పెళ్లి చేసేసి హాయిగా రిటైర్డ్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తూ హుందాగా కాలం గడుపుతున్నారు ప్రస్తుతం.

సరే, ఈవిడ హాస్యపాత్ర వేయడానికి సిద్ధపడినా, వేయించుకోవడానికే మరొకరు సిద్ధపడాలిగా! అలా సిద్ధపడినవారు ఎల్వీ ప్రసాద్‌గారు. కష్టం విలువ నెరిగిన మనిషి. కృష్ణకుమారిలో టాలెంట్‌ వున్నా సినీసీమలో వున్న సెంటిమెంటు కారణంగా ఆమె కష్టాల్లో పడిందని గ్రహించుకున్నారు. నిజానికి సినిమాల ఫెయిల్యూర్స్‌లో ఆమె పాత్ర ఏమీ లేదు.  పాత్రలను తన కిష్టం వచ్చినట్టు మార్చమనలేదు.

రచయితలు రాసినట్టు, డైరక్టర్లు చెప్పినట్టు నటించింది. సినిమా ఫెయిల్యూర్స్‌కు ఆమెను బాధ్యురాలిని చేయడం అమానుషం అనిపించింది ఆయనకు. 'ఇలవేలుపు' సినిమా తీస్తూ ఆయన ఆమెకు ఓ పాత్ర ఆఫర్‌ చేశారు. హాస్యపాత్ర! రేలంగి పక్కన! అలా యివ్వడం రేలంగికి సైతం నచ్చలేదు. సెంటిమెంటు ప్రభావం! 'ఏమిటి సార్‌, ఏనుగు పక్కన ఎలకను పెట్టారు?' అని ప్రసాద్‌గారికి ఫిర్యాదు చేశారు. అయినా ప్రసాద్‌గారి నిర్ణయం మారలేదు. ఇలా వేషం యివ్వడం ఒక యెత్తయితే కృష్ణకుమారి చేత తన కొత్త ఆఫీసు తెరిపించడం మరో యెత్తు. అందుకు ఎల్వీ ప్రసాద్‌గారికి హేట్సాఫ్‌. (సశేషం)

ఎమ్బీయస్‌: రాకుమారి కృష్ణకుమారి - 1/3

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?